Friday, June 24, 2011

చిరంజీవి, చితికిన వేలు

అద్దంకికి ఈశాన్యం దిశగా ఒక చిన్న గ్రామం. పేరు కశ్యాపురం. అది మా స్వగ్రామం. నా బాల్యంలో ఒక అధ్యాయం అక్కడే జరిగింది. సెలవ రోజులన్నీ ఆహ్లాదకరంగా గడిచి పోయేవి. అక్కడ జరిగిన ఎన్నో చిన్న చిన్న సంఘటనలు, నా మీద చెరగని ముద్ర వేశాయి.

మా ఇంటి ముందు ఒక బాదం చెట్టు, వెనక ఒక బాదం చెట్టు ఉండేవి. ముందు ఉన్న చెట్టుకి పచ్చని కాయలు, వెనక ఉన్న చెట్టుకి ఎర్రని కాయలు కాసేవి, రెండూ రుచిగా ఉండేవి. ఇంటి వెనుక బావి. ఇరుకు ఇరుకు గదుల్లో కన్నా, బావి దగ్గర స్నానం..., ఆహా!!!! ఆ హాయేవేరు. ఇంకా ఇంటి వెనకాల పొలం, ఆ పొలం గట్ల మీద ఉదయాన్నే విహాయర యాత్రకు వెళ్ళడం(దానినే ముద్దుగా లండన్ అని కూడా అనొచ్చు :P) మర్చిపోలేని అనుభూతి.

మా ఊరి చివర ఒక పెద్ద చెరువు, దాని ఒడ్డున పెద్ద మర్రి చెట్టు, దాని నిండా తేనె తెట్టెలు, ఆ చెట్టుకి కొంచెం దూరంలో ఒక చిన్న ప్రభుత్వ పాఠశాల. దాని ముందు రెండు చింత చెట్లు, మంచినీటి కోసం వేసిన చేతి గొట్టం(ఆంగ్లంలో బోరింగ్) ఉంది. ఊరంతటికి అదే ఆధారం. సెలవలు అన్నీ అక్కడే ఆటపాటలతో గడిచిపోయేవి. "ఇప్పుడు నీ బాల్యం గురించి తెలుసుకొవటానికి నువ్వేమైనా మహాత్మా గాంధీవా లేక మైనంపాటి శ్రీరామచంద్రవా?" అనే కాదా మీ అనుమానం. సరె, ఇక అసలు విషయానికి వద్దాం.

మా అక్కలిద్దరికి నేనంటే ఎంతో ప్రేమ. మా పెదనాన్నగారికి ఇద్దరూ అడ్డపిల్లలు అవ్వటం చేత, నేనంటే కాస్త గారాబం ఎక్కువ. అలా సెలవలు జరుగుతూ ఉండగా ఉండగా, ఒక సాయంత్రం, మా అక్కలిద్దరూ నన్ను తీసుకొని మంచి నీళ్ల కోసమని అక్కడకి వచ్చారు. ఆటలలో ఉండగా, ఎవడో చలన చిత్రాల ప్రస్తావన తీసుకు వచ్చాడు. చిన్నతనం కదా, "నేను చిరంజీవి అభిమానిని నాకేమి కాదు, మీరంతా ఎదవలు" అని ఏదో నాలుగు కూతలు కూశాను. అవతలి వాడు ఇంకా రెచ్చగొట్టాడు. నేను రెచ్చి పోయి "నేను ఏమి చేసినా తిరుగులేదు" అని ఆ చేతి గొట్టంలో ఎడమచేయి చిటికిన వేలు పెట్టాను.

వాడెవడో? నా మీద ఎందుకు అంత కోపమో? తెలియదు కానీ, మొత్తానికి నా వేలు చితగొట్టాడు. నా ఎడమచేయి చిటికిన వేలు ఆవకాయ పచ్చడి అయింది. రక్తం గుండ్లకమ్మ నది పారినట్టు పారింది. చిటికిన వేలు కాస్త చితికిన వేలు అయింది. మా అక్కలిద్దరి మోహంలో నెత్తురు చుక్క లేదు.

మా పెద్దనాన్నగారు "శ్రీ వేంకటరామయ్య" గారు మా ఊర్లో వైద్యం చేస్తుంటారు. జలుబొచ్చినా, జ్వరమొచ్చినా అన్నింటికీ ఆయనే దిక్కు. పరుగు పరుగున ఆయన దగ్గర నన్ను ప్రవేశ పెట్టారు.

ఇంతలో మా పెదనాన్న నా చేతిని శుబ్రంగా కడిగి, కట్టు కట్టాడు. అయినా నా ఏడుపులోని శృతి ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడు మా పెదనాన్న" ఆఫ్ట్రాల్ ఏలు విరిగితే ఏడుస్తారా ఎక్కడైనా? అద్దంకి వాళ్ళు వేలే కాదు, ఏది విరిగిన ఏడవకూడదు రా" అని నా చేత ఏడుపు ఆపించటానికి తెగ ప్రయత్నించాడు.

వేలికి కట్టుతో నన్ను చూసేసరికి ఇంట్లో అంతా కంగారు పడ్డారు . నా వీరగాధని అందరికి విన్నవించిన పిదప నొప్పి భరించలేక, మళ్లీ ఏడుపు మొదలు పెట్టా. నా ఏడుపు ఆపటానికి, నాకు ఇష్టం అయిన వేరుశనగ ముద్దలు, కొబ్బరుండలు ఇలా ఏది అడిగితె అది కొని ఇచ్చారు. పాపం నన్ను తీసుకెళ్ళి అజాగ్రత్తగా ఉన్నందుకు మా ఆమ్మ, మా ఆక్కలిద్దరినీ ఘనంగా సన్మానించింది. ఆ సన్మానానికి వాళ్ళిద్దరూ ఏడ్చిన ఏడ్పులో నేను ఏడ్చినది పదో వొంతు మాత్రమే అంటే అర్ధం చేసుకోండి, వాళ్ళను ఎంత బాగా ఉతికి ఆరేసిందో.

ఇదండీ నా చిటికిన వేలి, చితికిన గాధ. "చిరంజీవి, చితికిన వేలు" అనే కధ, కశ్యాపురం చేరింది. మనం మన పనుల్లోకి వెళ్దాం .

7 comments:

  1. uruko babu ongole vallu edava kodadu annattu....addanki vallu edi virigina edavakudadaa?? ha ha ..good

    ReplyDelete
  2. neeku velu okkate chitikindhi..chiranjeevi ki anni chitikipoyayi..ayina nuvvu nagarjuna nagarjuna ani egiri vadivi kadha ra school lo..

    ReplyDelete
  3. ...అయినా నా ఏడుపులోని శృతి ఏ మాత్రం తగ్గలేదు...
    Chala bagundi

    ReplyDelete
  4. @ అరుణ్ గారు : నా ఏడుపు మీకు చాలా బాగుందా? మనుషుల్లొ మానవత్వం తగ్గిపొయిందండి :P

    ReplyDelete
  5. నాకు బాగుంటుంది.. కానీ ఇంతవరకు చూసే అవకాశమే రాలేదు.. :( ... ఎప్పుడు చూస్తానో ఎమో !!

    ReplyDelete