Friday, March 23, 2012

శ్రీనందననామ సంవత్సర శుభాకాంక్షలు

"ఎన్నాళ్ళో వేచిన ఉదయం" అనట్టు, మొత్తానికి సచిన్ నూరు వందలు పూర్తి చేయటంతో దేశమంతా ఊపిరి పీల్చుకుంది. ముఖంపుస్తకంలో చెప్పినట్టు పెట్రోలు ధరతో పోటీ పడి చివరికి పెట్రోలుకన్నా ముందే వంద పూర్తి చేశాడు. నిన్నటి దాకా సచిన్ని తిట్టిన చానళ్ళు అన్నీ, వంద కొట్టేసరికి దేవుడు అని పోగిడాయి. మొత్తంగా చెప్పాలంటే వందకు ముందు బరువు, వంద కొట్టాక  ప్రభువు అనమాట.

ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం తప్పినా, రెండో సంవత్సరంలో చేరతాము కదా. అలానే మనోళ్ళు క్రికెట్లో ఒకటి రెండు సిరీస్లు ఓడినా, క్రికెట్ చూడటం మానలేము కదా. ఆ క్రికెట్ మ్యాచ్ మధ్యలో "ఎయిర్ టెల్" వాణిజ్య ప్రకటనలు చూస్తున్నాను. మీకు గుర్తుంటే, అందులో ఒక జంట ఇంట్లో ఎప్పుడూ ఫోను మాట్లాడుకుంటూనే ఉంటారు. భార్య పాపం ఎప్పుడూ భర్తని, "నీది మంచి ఫోను కాదు, నా దాంట్లో నెట్వర్క్ బాగుంటుంది, ఎంత సేపు మాట్లాడినా ఉచితమే, లిఫ్ట్లో నీ ఫోను పనిచేయదు" అని ఎప్పుడూ నస పెడుతూనే ఉంటుంది.  నాకే గనక అలాంటి పెళ్ళాం ఉంటే, వెంటనే విడాకులు ఇచ్చేయాలి అన్నంత కోపం వస్తుంది. 

స్నేహితుడి పెళ్లి కోసమని భీమవరం వెళ్ళాను. నాకు చాలా మంది స్నేహితులు చెప్పారు, ఉభయ గోదావరి జిల్లాలు, ఆ జిల్లాలోని పొలాలు చాలా అందంగా ఉంటాయి అని. చాలా చిత్రాలలో చూసి నేను కుడా చాలా అందమైన ప్రదేశం అనుకుని వెళ్లాను. కాని చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే "అందం" అనే పదం అస్సలు సరిపోదు. అంత అద్భుతంగా ఉన్నాయి. వీలు దొరికితే మళ్లీ మళ్లీ వెళ్ళాలని ఉంది.

దారి వెంట కారులో వెళ్తుంటే, నున్నని రహదారులు, ఆ రహదారులను ఓదారుస్తూ, వాటి వెంట పారే కాలువలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, పచ్చని వరి పైర్లు., తాటి చెట్లు, వాటి కల్లు  ఇలా ఒకటేమిటి ప్రతిదీ అధ్బుతమే. మా ఊరి రహదారులు కుడా అంత అందంగా ఉంటె ఎంత బాగుంటుందో అనిపించింది. మా ఊరి రహదారుల వెంట పేడ ముద్దలు తప్ప పైరులు తక్కువ.

చూస్తూ చూస్తూ అప్పుడే శ్రీఖర నామ సంవత్సరం కుడా అయిపోయింది. మొన్ననే దేశం నలుమూలల నుండి పెద్ద పెద్ద పండితులు నా దగ్గరకు వచ్చి, "రామానంద స్వామి, వచ్చే సంవత్సరానికి ఏ పేరు పెడితే బాగుంటుందో మీరే చెప్పాలి" అని తెగ బతిమిలాడారు. వాళ్ళని ఇబ్బంది పెట్టటం ఎందుకని, సరే నా పేరు మీద ఏదో ఒకటి పెట్టుకోండి అని అన్నాను. "అదేదో మీరే సెలవివ్వండి స్వామి" అని వాళ్ళన్నారు. రామానందలో నుండి నంద అనే పదం తీసి "నందన" నామ సంవత్సరం అని పెట్టుకోపోండి అని చెప్పి పంపేశాను. కాబట్టి కొత్త సంవత్సరం పేరు "శ్రీ నందననామ" సంవత్సరం అనమాట.

సంవత్సరం అంటే గుర్తొచ్చింది, మొన్న మల్లి మామకి ఫోను చేస్తే, టి.వి.9 ని, నా అంత బాగా బూతులు రాక పోవటంతో , నన్ను అడిగి మరీ బండ బూతులు తిట్టాడు. తీరా విషయం ఏమిటంటే, "ఒక రోజు ఆ ఛానల్ లో 2012  లొ కలియుగం అంతం అవుతుంది, ప్రళయం వస్తుంది అని చెప్పటం విని, ఎలాగూ ప్రళయం వస్తుంది కదా, ఇంకొక సంవత్సరమే కదా అని పెళ్లి చేసుకున్నాను రా, రెండు రోజులు క్రితం అదంతా ఉత్తిదే, ఇప్పుడప్పుడల్లా ప్రళయం లేదు, అని చెప్పాడు. అందుకే నాకు అంత కోపం వస్తున్నది"  అని చెప్పాడు. తన కోపంలో కుడా న్యాయం ఉంది మరి. పెళ్ళికి ముందు జాంపండు లాగా ఉండేవాడు. పెళ్లి అయ్యాక జీడిపప్పు అయ్యాడు.  అందుకనే నేను ఎవరి మాటలు వినకుండా 2012 లో కలియుగానికి అంతం కాకపొతే, అప్పుడు 2013 లో నా సుఖానికి అంతం(పెళ్లి) అని నిర్ణయించుకున్నా.

"శ్రీ నందననామ" సంవత్సరంలో చదువుకునే వాళ్ళకి మార్కులు రావాలని, చదువు అయిపోయిన వాళ్లకి ఉద్యోగాలు రావాలని. ఉద్యోగాలు వచ్చిన వాళ్లకు పెళ్లి కావాలని, పెళ్లి అయిన వాళ్ళకు ప్రశాంతత కలగాలని, కోరుకుంటూ, ఈ సంవత్సరానికి సెలవు తీసుకుందాం. పనిలో పనిగా నాలుగు ముక్కలు రాశాను. చదివి  తరించండి.

వీడింది 'శ్రీఖర'తో  సంభందం
మొదలవుతోంది నందనంతో అనుభందం
సదా ఉండాలి ఈ ఏడు ఆనందం 
దినమొక పండుగ చందం

ఈ సంవత్సరమయినా, "హ్యాపి ఉగాది", "ఉగాది బ్రింగ్స్ పాస్పరౌస్, మట్టి,మశానం" అని కాకుండా చక్కగా తెలుగులో శుభాకాంక్షలు తెలుపుతారని ఆశిస్తూ..... సెలవు.
 

Sunday, March 4, 2012

సాఫ్ట్ వేర్ కింగ్


ఈ మధ్య రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. పిల్లి పిల్లల్ని మార్చినట్టు, కధానాయిక పాపలు బట్టలు మార్చినట్టు., మా కార్యాలయ భవనాల్ని మార్చారు. ఆరు నెలల్లో మూడు భావనాలని మార్చారు. విసుగు పుట్టి నేనే ఉద్యోగం మారాలి అనుకుంటున్నా.

గత వారం "లవ్ ఫైల్యూర్" అనే తెలుగు/ అరవ చిత్రం చూశాను. కధానాయకుడు, కధానాయకురాలు, దర్శకుడు, సంగీత దర్శకుడు ఇలా ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు లేరు. తమిళంలో  మాత్రం ఈ చిత్రానికి "కాదిలిల్ సోధప్పువదు ఎప్పడి" అని తమిళంలోనే పేరు పెట్టారు. తెలుగులో మాత్రం ఆంగ్ల పేరు పెట్టారు.

ఈ చిత్రంలో విషయం ఏంటంటే, అమ్మాయిలని ఎలా ఐతే ఖండించాలో అలానే ఖండించాడు. నేను, తమ్ముడు వంశీ కలిసి చూశాము. వయసులో చిన్నవాడు అయినా, అమ్మాయిల విషయంలో నాకన్నా చాలా చాలా పెద్దవాడు. అక్కడ తెర మీద అమ్మాయిలని తిడుతున్నప్పుడల్లా మా తమ్ముడు కళ్ళలో వెలుగు చూస్తాంటే..., ఎన్ని కోట్లు ఇచ్చినా వస్తాదా?? 

ఈ చిత్రం విడుదల కాక మునుపు, దీని పాటలు విడుదల చేశారు. అందులో ఒక పర్టికులర్ పాటకు నాకు ఒక ప్రత్యేకమైన అనుభందం ఉంది, ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. రోజు ఉదయాన్నే నిద్రపోవటానికి ఆఫీసుకి కారులో వెళ్తూ ఉండే వాడిని. 92.7 సంగతి మీకు తెల్సిందే కదా., కొత్త పాట దేనినీ ఒక పట్టాన వదిలిపెట్టడు. ఒక్కోసారి రోజుకి వందసార్లు పాట వినిపిస్తారు. నేను ఎఫ్.ఎం ని అలా... నాకు కార్యాలయంలో పని అలా ఉండేది. ఒకసారి లవ్ ఫైల్యూర్ చిత్రంలో "ఇంతజారే.. ఇంతజారే" అనే పాటను వేయగానే, నేను ఠక్కున క్యాచ్ చేసి "ఇంత జారే ఇంత జారే అంటే ఏంటి జారేది?" అని మా క్యాబు చోదకుడిని(డ్రైవర్) అడిగాను. అతను కుడా అలర్ట్ అయ్యి బ్రేక్ వేశాడు( నవ్వు ఆపుకోలేక). నా జోక్కి అంత వాల్యూ ఇచ్చేవాడు. 

అస్సలు ఇంతకీ ఏమి జారిందో అని రెండు రోజులు మధనపడిన తరువాత, నా స్నేహితుడి అడిగితే, "అది తెలుగులో రాసిన "ఇంత జారే" కాదురా, "ఇంతిజారే(इन्तिजारे )" అనే హిందీ పదం. అదే మ్యాజిక్. ఓ.కే  ఇలా చిన్న చిన్న తప్పులు చేయటం సహజమేరా! మేము అలా తప్పులు చేసి తెలుసుకున్న వాళ్లమే. బట్ ఈ సరి విన్నప్పుడు మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్స్ యు తండ్రి" అని చెప్పాడు.

ఇలా పని మానేసి శీర్షికలు రాస్తున్నానని కార్యాలయంలో మా దొరగారికి తెలిసి పెద్ద గొడవ చేశారు. నన్ను పిలిచి " రామా! నువ్వు ఎంచుకున్న ప్రాజెక్ట్ ఏంటి, రాస్తున్న కోడ్ ఏంటి? నీ మాడ్యుల్ ఏ నెంబరు? నువ్వు చేస్తున్నది ఏ నెంబరు? సి, సి ++, జావా లాంగ్వేజస్., ఎస్క్యుఎల్, పిఎల్ ఎస్క్యుఎల్ డేటా బేశస్., ఆ సాఫ్ట్ వేర్స్ విలువ తెలుసా నీకు? డు యు క్నో ది వాల్యూ ఆఫ్ ది సాఫ్ట్ వేర్. టెస్టర్కి , డవలప్పర్కి మధ్య కప్లింగ్, వేర్ ఈస్ ద కప్లింగ్. ఐ వాంట్ కప్లింగ్. యస్. నేనేమంటానంటే, టెస్టర్ అనే వాడు కోడ్ ఒక రకంగా రాస్తాడు, డవలప్పర్ అనే వాడు కోడ్ ఇంకో రకంగా రాస్తాడు. ఒక్కొక్క రోల్ కి ఒక్కొక్క నిర్దిష్టమైన శైలి ఉంటుంది, స్కిల్లు ఉంటుంది, ఏడుపు ఉంటుంది. నీ బ్లాగ్ మీద పెట్టిన శ్రద్దలో సగం నీ పని మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐ యాం టెల్లింగ్ దట్. ఒక్కోసారి సాఫ్ట్ వేర్ ఇండస్ట్రికి మళ్లీ రేసిషన్ వస్తుందేమో అని భయమేస్తుంది. నీ శీర్షికలతో, పాటలతో మానేజర్స్ నమ్మకాన్ని కిల్ చేయకు. దయ చేసి అప్రయిసల్ ఇవ్వాలనుకునే మా లాంటి మానేజర్స్ ని డిస్సపాయింట్ చేయకు. డోంట్ డిస్సపాయింట్ అస్, అండర్ స్టాండ్? మిమ్మల్ని ఎక్కడికో పంపించాలి అనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (ఆన్ సైట్ కా), కనీసం అప్రయిసల్ ముందు అయినా పని చెయ్, మంచి రేటింగ్ ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాము, ఆల్ ద బెస్ట్." అని అన్నారు.

శనివారం సెలవు కదా అని ప్రసాద్ చిత్రాలయానికి వెళ్తే., అక్కడ ఒక అమ్మాయి పలకరించి, "నమస్కారం అండి" అన్నది. నేను కుడా "ఆ నమస్కారం, కూర్చో, పేరేంటి?" అని అడిగాను, జా౦బతి అని చెప్పింది. దానికి 
నేను: "బ్యూటిఫుల్ నేమ్, పేరులోనే జావ ఉంది. సీ జాంబవతి, టు బి ఫ్రాంక్, మనకు సి, సి++, జావ, రసం, సాంబారు   ఏమీ తెలియవు. బట్ ఐ యామ్ టాప్ మోస్ట్ సాఫ్ట్ వేర్ డవలప్పర్ హియర్, ఎలాగా? గూగుల్ నుంచి కోడ్ దొబ్బేయటం వల్ల. ఇప్పటికీ మా మానేజర్ గారు అంటుంటారు "ఒరేయ్ రాము నీకు కొంచం ముందు ఉద్యోగం వచ్చుంటే మేమంతా కష్టాల్లో పడేవాళ్ళం రా" అని,   సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది వెతకటం, ముఖ్యంగా గూగుల్లో వెతకటం. డవలప్పర్కి గూగుల్కి మధ్య ఉన్న రిలేషన్ షిప్, భార్యాభర్తల సంభందం లాంటిది. డోంట్ మిస్టేక్ మీ, అంత అండర్ స్టాండింగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం. ఉఫ్............." ఇలా చెప్పుకుంటూ పొతే నా రాతలకి అడ్డు అదుపు ఉండదు కానీ., ఇంకో శీర్షికలో కలుద్దాం. అంత వరకు సెలవు.