Monday, January 31, 2011

ముచ్చటగా మూడో పాట

ఈ పాట "రబ్ నే బనా ది జోడి" అనే చిత్రం లో "తుహి తో జన్నత్ మేరి" అనే పాట. ఇంతకు ముందు పాట రవ్వంత నయం. ఈ పాట కొత్తగా పెళ్లి అయిన జంట పాడుకునే పాట. ప్రేమ, తొక్క, తోలు అంటే ఏదో రాయచ్చు. కానీ పెళ్లి గురించి నాకేం తెలుసు. బ్రహ్మచారిని. అయినా సరే పాట రాయాలి అని మొదలు పెట్టా. పల్లవిలో ఒకరికొకరు ప్రమాణం చేసుకునట్టు రాశాను. పెళ్లి అయిన తర్వాత తమ తమ భావాలను, వాళ్ళలో పెళ్లి తీసుకొచ్చిన మార్పును , భాగస్వామికి తెలియజేయటం మొదటి చరణంలో చూడ వచ్చు.
పల్లవి ||
            నీ మీద ప్రేమే నన్ను లాగిందిలా, నీతోనే జీవితమంటూ కోరిందిలా
           ఏడడుగుల బంధం, ఏకమవ్వాలి గమ్యం,
            నా ప్రాణం కన్నా, ఇక నువ్వే గా మిన్న,
            మనసే ఓ మందిరమాయే నిన్నే పూజిస్తా, వలపే నవ నందనమాయే నీతో జతకొస్తా
                                                                                           ||నీ మీద||

చరణం||
            నన్నే నేను నీలో చూశాను, దాచుకో గుండెలో ప్రేమగా,
            నాకే నేను కొత్తగున్నాను, అందమైన ఊహలో తేలగా,
            సుడి గుండాలే రాని, ఎన్ని గ్రహణాలే కాని  కలిసుంటాను, కలకాలం ఉంటాను,
                                                                                          ||  మనసే ఓ||

చరణం||
            నాలో తాపం, దూకే జలపాతం, వెచ్చనైన హాయినే పంచనా,
            నా వయ్యారం, నీకే సొంతం, అంతులేని అమృతం ఇవ్వనా,
            నిండు నూరేళ్ళ కాలం, సాగాలి అన్యోన్యం, మరు జన్మలోను కావాలి నీ తోడూ
                                                                                         ||  మనసే ఓ|


      

Thursday, January 27, 2011

అస్సలు అమ్మాయిలు ఇళ్ళల్లో ఏమి చేస్తుంటారు?


నేను నా కార్యాలయానికి చేరుకోవటానికి ఇరవై నిముషాలు పడుతుంది. నేను సాదారణంగా త్రిచక్ర వాహనం లో వెళ్తుంటాను. చక్రాలు మూడే కానీ అందులో ఏడు ఎనిమిది మందిని ఎక్కిస్తాడు. పాపం లేక పొతే పెరిగిన ధరలకు వాహనాన్నే కాదు ఇంటి బండిని కూడా తోలలేడు.అంత మంది ఎక్కితే, కూర్చోవటానికే  చోటు ఉండదు. ఎలాగోలా సర్దుకుని కూర్చోవటమే కష్టం. ఐతే అప్పుడప్పుడు కొంత మంది అమ్మాయిలూ వింతగా ఉంటారు. ఉదాహరణకు ఒక రోజు యదావిదిగా కార్యాలయానికి బయలుదేరాను. అంతలో ఒక అమ్మాయి మొహం నిండా ఒక కిలో అవి, ఇవి పూసుకొని, ఒక సంచి బుజాన వేసుకుని, ఇంకో పుస్తకం చేతిలో పెట్టుకొని నేను ఉన్న బండిలో ఎక్కింది.ఎక్కి ఎక్కగానే పుస్తకం తీసి చదవటం మొదలు పెట్టింది.       నాకు ఒక్కసారిగా మతి పోయింది. ఒక ప్రక్క కూర్చోవాటానికే గతి లేదు, పైగా ఆ గతుకుల బండి ఉయాల ఊగినట్టు ఊగుతోంది. ఒక పక్క గోల, ఇంకోపక్క పెద్దగా పాటలు, అయినా ఆ పాప చెక్కు చెదరని ఏకాగ్రతతో, అకుంటిత దీక్షతో,  అలుపెరగని పోరులా చదువుతుంది. నాకు అప్పుడు అనిపించింది "ఇక్కడే ఇలా చదువుతుంటే, అస్సలు అమ్మాయిలు ఇళ్ళల్లో ఏమి చేస్తుంటారు?", అని. ఇలా చదివితే ప్రతి ఒకళ్ళు ఒక వివేకానంద అవుతారు అనిపించింది. ఇంకా సమయానికి వర్షాలు కురుస్తున్నాయి అంటే దానికి ఇలాంటి అమ్మాయిలే కారణం అనుకున్న. ఇంతలో ఏదో మోగింది. చూస్తె తన ఫోను. ఆమెకో సందేశం వచ్చింది. నా బోటి అమాయకుడు ఎవడో పంపి ఉంటాడు., పనా? పాటా? ఇక చూడు నేను బండి దిగిందాక, ఒకటే గోల. ఆ మాత్రం దానికి పుస్తకం తీయటం ఎందుకు? మూయటం ఎందుకు? అప్పుడు అనిపించింది., 2012 కలియుగం అంతం అంటే కాదా మరి? ఇంతకీ వీడికి ఎందుకు ఇంత కడుపు మంట అని అనుకుంటున్నారా? ఆ అమ్మాయికి సందేశం పంపింది నేను కాదు కదా. అందుకని.

Monday, January 24, 2011

రెండో పాట, మీ కోసం,


            కుక్క చెప్పు రుచి మరిగినట్టు, ఒక పాట రాసే సరికి, ఇంకా ఇంకా రాయాలి అనిపిస్తున్నది. అందుకే ఇంకో హిందీ పాట తీసుకున్న. "తుం మిలే" అనే చిత్రంలో "దిల్ ఇబాదత్" అనే ఏడుపుగొడ్డు పాట చాల బాగా నచ్చింది. పాట రాయడం మొదలు పెట్టా. కలం, కాగితం తో పాటు కసి, పట్టుదలతో కూర్చున్న. పాట ఏడుపుగొడ్డు పాట. అంటే ప్రేమికులు విడిపోయారు. ప్రియుడు తన ప్రియురాలిని తలచుకుంటూ, తిట్టుకుంటూ పాడాల్సిన పాట. అసలు మనం అమ్మాయిలు, ప్రేమ ఇలాంటి వాటిని ఎప్పుడు చూడలేదాయ. అసలు మనం దానోళ్ళం కాదాయ. కానీ పాట మాత్రం రాయాలన్న కసి. సరే ఎలాగోలా కాగితం మీద రాయటం మొదలు పెట్టా.

             మొత్తానికి ఒకడు ఆ పిల్లను ప్రేమించి జీవితం సగం సంకనాకి పోయింది అని పాడుకునే పాట.  ఎంత ఆలోచించిన ఒక్క అక్షరం కూడా తట్టటం లేదు. అప్పుడు అర్ధం అయింది, ఒక పాట రాయాలంటే కావాల్సింది కసి కాదు కళ అని. వెంటనే నన్ను నేను ఒక విరహ ప్రేమికుడిగా ఊహించుకున్న, అలా రాయటం మొదలు పెట్టా. ఏదో నాకున్న పరిజ్ఞానంతో ఎలాగోలా మొత్తానికి పాట పూర్తి చేశా. 

తప్పులుంటే సరిదిద్దండి, అర్ధమే లేదనుకుంటే క్షమించండి( ఎక్కడో వినట్టు ఉన్నదా?)పల్లవి||

  మనసులోని మమతలన్ని మాయమైపోయెను, నీవు లేని లోకమే శూన్యం అంటే నమ్మవా?
  విడిచినాను ప్రియతమా నా పంచప్రాణాలను, నీవు లేని లోకమే శూన్యం అంటే నమ్మవా?
  విధి ఆడిన ఆటలో, వికటించిన ప్రేమలో, విషమంతా గొంతులో, విలపించా మనసులో 
  నువ్వు రాసిన లేఖలు, నువ్వు చేసిన బాసలు, నువ్వు పలికిన ఊసులు, చెరిగాయి ఆ గుర్తులు
                                                                                                      ||మనసులోని||
చరణం||
   నీ ప్రేమ జ్ఞాపకాలే నా గుండెకు గాయం చేస్తే , భరించలేనే నేనిక,
   నువ్వు లేని ఈ దినమే, క్షణమే ఒక యుగం అవుతుంటే, కాలంతో పయనం ఇంకెలా?
   మన స్నేహం కల అని, జరిగిందో కల్లని, మరిచావా ప్రేయసి, నేనేమౌతానని 
   ఈ వలపనే అసత్యం, అది మరవటం అసాధ్యం, తెలిసింది ఈ నిజం, నాకెందుకి శాపం.
                                                                                                     ||మనసులోని||              
చరణం||
    మన మధ్య దూరం మొత్తం, వేవేల అడుగులు చేస్తే, మరిచుండలేనే ప్రాణమా
    మన మనసుల వారది అంతా, టైటానిక్ పడవ అవుతుంటే, నది సంద్రంలోనే మునుగుతా
    నది ఒడ్డులో చేపలా, నది రేవులో నావలా, ఓ కొలిమిలో కట్టెలా, నీ ప్రేమలో నేనున్నా
    అయినా నీ మనసులో ఇంత చోటే  లేదని, వేశావె  శిక్షని నేనెల మనగలనని
                                                                                                     ||మనసులోని||                  


Tuesday, January 18, 2011

ఈ పాట ఎవరికి అంకితం అవుతుందో ఏమో???

 ఈ మధ్య హిందీ లో ఒక పాట నాకు చాలా బాగా నచ్చింది. "పీలు తేరే నీలే నీలే" అనే ఈ పాట "Once upon a time in Mumbai" అనే చిత్రం లో ఉంది. నాకేమో హిందీ రాదు. ఆ పాట అర్ధం కాదు. అందుకని, నేనే తెలుగలో ఆ పాటను రాసుకున్న. అతి త్వరలో ఈ పాటని మా శ్రీ రామ చంద్ర చేత పాడించాలని ఉంది.

పల్లవి||  ప్రేమ నీ హృదయంలో ఓ చోటే కావాలి ,
            ప్రేమ నా జన్మంతా ను తోడై వుండాలి
            ప్రేమ ను నా సొంతం అవ్వాలి .......

            నాలో ప్రేమ పొంగిందే, నీతో ప్రణయం అంటుందే
            హృదయం జివ్వుమంటుందే ప్రేమ ...

            నీ వలపే తలపైందే, నీ చెలిమే వరమంటుందే
            నాలోన నీవే నాకు నేనే లేనులే...


చరణం|| పెదవి పై నీ పేరునే అంటూనే ఉంటానే ఆపేస్తే ఏమ్తోచదే
            మనసు పై నీ బొమ్మనే ముద్రించి ఉంచానే, మౌనంగా మురిసానులే
            ప్రేమ నా శ్వాసే నువ్వై జీవించా నేడే, ప్రేమ నా వలపే నీతో ఆశించా రావే
                                                                                            ||నాలో ప్రేమ పొంగిందే||

 చరణం||వానలో ఓ గొడుగులా నిన్నంటి ఉంటానే, నిను వీడి నే పోనులే
            కలలో నిన్ను మరువనే, నా నిద్రంతా నువ్వు ఉన్న కలకోసమే
            ప్రేమ ఈ సంధ్య సమయం నీతో గడపాలి, ప్రేమ నా పల్లవికే ను చరణం కావాలి....
                                                                                          ||నాలో ప్రేమ పొంగిందే||
   
Friday, January 7, 2011

S/W ఇంజనీర్ మనోభావాలు

"మా మనోభావాలు దెబ్బ తిన్నాయి", ఈ మాట మనం కనీసం రోజుకి ఒకసారి వింటూఉంటాం. మనోభావాలు అంటే ఆషామాషి  వ్యవహారం కాదు. మనోభావాలు దెబ్బ తీస్తే చాల విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మనోభావాల కారణంగా ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు చరిత్రలో అనేకం.,  ప్రతి వ్యక్తికీ మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలు దెబ్బతింటే తట్టుకోవటం ఎంతటి వాడికైనా కష్టం. ఎన్ని సినిమాలు కేవలం మనోభావాలు దెబ్బ తిన్న కారణంగా గొడవలు జరిగాయో మనం చూస్తున్నాం.  కాకపోతే ఈ మనోభావాలు ఒకొక్కరికి ఒక్కోలా ఉంటాయి. నా మనోభావాలు కూడా చాల సార్లు దెబ్బ తిన్నాయ్. 

 మీలో చాల మంది "కిక్" సినిమా చూసే ఉంటారు.  అందులో రవితేజ మొదట s/w ఇంజనీర్. లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా కిక్ లేని కారణంగా వదిలేస్తాడు. తర్వాత చిన్న పిల్లలు కోసం కోట్ల రూపాయల్ని చెమట పట్టకుండా, చొక్కా మడత పడకుండా కొట్టేస్తాడు. ఆ తర్వాత ఇలియానా కోసం పోలీసు అవుతాడు. అవ్వాలి కుడా., ఆ మాత్రం చేయకపోతే తెలుగు సినిమా హీరో ఎలా అవుతాడు? ఇక్కడ ఒక ఉద్యోగం రావటానికే చస్తుంటే మన కదనాయకుడికి వద్దన్నా ఉద్యోగాలు. ఉద్యోగం ఎందుకు మానేశాడు అంటే., "లక్షలు లక్షలు జీతం ఇస్తున్నారు కదా అని ఆ డబ్బా కంపూటర్ల ముందు గంటలు తరబడి టిక్కి టిక్కు మని  కూర్చోవటం నా వల్ల కాదు" అంటాడు మనోడు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు నా పీక మీద నా కాలు వేసుకొని తొక్కోని చచ్చిపోదాం అన్నంత కోపం వచ్చింది. ఇక్కడ ఒక వైపు ఆ S/W ఉద్యోగమే రాక అమీర్పేట్లో సంవత్సరాలు తరబడి విశ్వప్రయత్నం చేస్తుంటే., డబ్బా కంపూటర్లు, తొక్కలో ఉద్యోగం అంటాడా? పోకిరిలో బ్రహ్మానందం, సింహ లో ఆలి ఇలా ప్రతి సినిమాలో S/W ఇంజనీర్ల మనోభావాలతో ఆడుకున్నారు.


అప్పుడప్పుడు నాకు భాదేస్తుంది. ఈ రోజుల్లో S/W ఇంజనీర్లకు విలువ లేకుండా పోయింది. ప్రతి కుక్క S/W ఇంజనీర్ అవుతుంది., ప్రతి కుక్క అమెరికా పోతుంటే విలువ ఎక్కడుంది అని అంటున్నారు. పోనీ ఒకవేళ ఈ ఉద్యోగం మనేదాం అనుకుంటే, ఇంతకన్నా మంచి ఉద్యోగం నాకు తెలిసి అయితే లేదు. ప్రపంచం మొత్తం మన తట్టు చూస్తూ వుందంటే దానికి కారణం మనం IT రంగంలో చూపిస్తున్న పురోగతి వల్లే కానీ, పైన చెప్పిన వెధవ సినిమాల వల్ల కాదు కదా., ఇలాంటి వాళ్ళ ఏడుపు వల్ల దిష్టి తగిలి ఇప్పటికి రెండు సార్లు పడి లేచింది. పడినప్పుడు ప్రతి వాడు వెటకారంగా అడిగేవాడే, "ఏరా S/W పడింది అంటగా?" కనీసం పిల్లని ఇవ్వటానికి కూడా ఎవరూ ముందుకి రాలేదు. అదే పరిస్తితి  బాగుంటే పిలిచి పిల్లని ఇస్తున్నారు(నా గురించి కాదు, ఉదాహరణగా చెప్పా.,).
.....సశేషం.....