Saturday, May 10, 2014

అమ్మవారి సాక్షిగా, నా ఆస్తిని పంచుకున్నారు

క్రొత్తగా పెళ్ళైతే చేసే మొదటి పని .... గుళ్లని, పుణ్య క్షేత్రాలని దర్శించటం. అందులో భాగంగానే, పెళ్లి అయిన మూడో రోజు, సతీ సమేతంగా విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లాను. ఏమి అదృష్టమో తెలియదు, వెళ్ళిన ప్రతి సారీ, అమ్మ వారి దర్శనం నిముషాలలో దొరుకుతుంది. ఈ సారి కూడా అలానే 100/- టికెట్టుతో పావు గంటలో దర్శనం చక్కగా అయ్యింది. భవ సాగరాన్ని బాగా ఈదేలా చూడమని అమ్మని వేడుకున్నాను. జనం కూడా పెద్దగా లేకపోవటంతో ప్రశాంతంగా బయటకి వచ్చాను. ప్రశాంతతను కోల్పోయాను.

అమ్మవారి దర్శనం అవ్వగానే... స్వామి వారి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయ్యాక, పెద్ద పెద్ద విభూతి బొట్టు పెట్టుకున్న పంతులుగారు అడిగారు, "క్రొత్తగా పెళ్లి అయ్యిందా?" అని. అవునన్నాను. ఆ మాటకు ఆయన కళ్ళల్లో అమితమైన ఆనందాన్ని గమనించాను. నాకు పెళ్లి అయితే ఇతనికేంటా అంత ఆనందం అని అనుమానం వచ్చింది. నా నుదుటున, రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టి, పేరు, గోత్రం అడిగి మంత్రాలు చదవటం మొదలు పెట్టాడు. ఒక నిముషం చదివి, ఒక అయిదు వందల నోటు తీసి... నీకు పిల్లలు పుట్టాలని పది మందికి భోజనాలు సమర్పించు అన్నాడు. నాకు ఏమీ అర్ధం కాలేదు. నా పేరు మీద అతనే 500 తీశాడేమో అనుకున్నా. ఒక 500 ఇవ్వు అనట్టు సైగ చేసాడు. నేను ఇచ్చాను అనటం కన్నా, అతను లాక్కున్నాడు అంటే బాగుంటుంది. తీర్ధం తీసుకొని బయటకు వచ్చాను.

అమ్మవారు, అయ్యవార్ల దర్శనం అయిపోయింది కదా అని వచ్చిన దారిలోనే బయటకి వెళ్లబోయాను. మధ్యలో ఒకామె నిలబడి.. అటు వైపు ఇంకా గుళ్ళు ఉన్నాయి, అటు నుండి వెళ్ళాలి అన్నది. అక్కడ వరుసగా నాలుగు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. మొదట వినాయక మందిరంలో పూజారిగారు  , అవే ప్రశ్నలు అడిగారు. తీర్ధం ఇచ్చాక ఒక వంద నోటు తీసి నాకు చూపించి, ఇందాక గుళ్ళో చెప్పినట్టే చెప్పి వంద లాకున్నాడు. ఇలా మిగితా మందిరాలలో కూడా వంద కాగితం చూపించటం, నా దగ్గర వంద లాగటం జరిగింది.

ఆ నాలుగు ముగించుకొని బయటకు వచ్చాక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందన్నారు. అక్కడ పంతులుగారికి కాసిన్ని ఎక్కువ మంత్రాలు వచ్చులాగుంది... ఎక్కువ సేపు చదివి, 500 నోటు బయటకు తీసి, నన్ను ఒక 500 ఇవ్వమన్నట్టు సైగ చేశాడు. నా జేబులో చూస్తే వంద కాగితం మాత్రమే ఉన్నది. చేసేది లేక, నా దగ్గర ఉన్న ఆఖరి వంద కాగితం కూడా పళ్ళెం లో పెట్టి ఇచ్చాను. "నేను 500 అడిగితే, 100 కాగితం ఇస్తావా? నాకు గిట్టుబాటు కాదు. నీ లాంటి వాళ్ళు గుళ్ళకు ఎందుకు వస్తారో?" అన్నట్టు నా వైపు, నీచంగా చూశాడు. చేసేది లేక తల దించుకొని బయటకు వచ్చాను. ఆ విధంగా పంతుళ్ళందరూ కలిసి అమ్మవారి సాక్షిగా, నా ఆస్తిని పంచుకున్నారు.

నాకు మొదలే గుళ్లకు వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా చిరాకు. ఇలాంటి సంఘటనలు చూసి ఆ చిరాకు పదింతలు అవుతున్నది. దోచుకోవటం అంటే మరీ ఇలానా??? దీనికి పరిష్కారం లేదా???