Thursday, December 22, 2016

నువ్వు ... నువ్వు ...కొవ్వే... నువ్వు

లవ్వు , నవ్వు లేని మనిషి ఉంటాడేమో కానీ, కొవ్వు లేని మనిషి ఉండడు. అస్సలు ఏమీ చేయకుండానే వచ్చేది ఈ కొవ్వు. ఈ కొవ్వును, దాని ద్వారా వచ్చే బరువును ఎలా తగ్గించుకోవాలో అని, తెగ ఇబ్బంది పడిపోతుంటాం. Gym కి వెళ్ళటం, ఉపవాసాలు ఉండి కడుపు మాడ్చుకోవటం లాంటివి చేస్తూ ఉంటాం. డబ్బులు కట్టి జిమ్ వెళ్ళటమే ఒక ఎత్తు ఐతే, ఈ మధ్య అంత కన్నా వింత ఒకటి చూశా. ముందు మనం $500 కట్టి చేరాలి. మండలం రోజుల్లో, వాళ్ళు చెప్పినంత బరువు తగ్గితే, మన డబ్బులు మనకు వెనక్కి ఇచ్చేస్తారుట! మన మీద ఎంత నమ్మకం ఉంటే అలాంటివి పుట్టుకు వస్తాయి. ప్రతి సంవత్సరం, జనవరి ఒకటిన New year జరుపుకున్నా, జరుపుకోకపోయినా, resolution అన్న పేరుతో అందరం Gymల వైపు పరుగులు పెడతాం. కొవ్వు మానదు కానీ, మనం మానేస్తాము, అది వేరే విషయం. అలాంటి కొవ్వుని తలుచుకుంటూ, ఈ పాట పాడుకుంటూ ఇలా కానిచ్చేద్దాం.

ఎంత కొవ్వు ఎక్కి కొట్టుకోక పొతే మాత్రం, నేను ఇంత మంచి పాటను ఖూనీ చేస్తాను చెప్పండి.

నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ  (2)

నాలోనే కొవ్వు, నాతోనే కొవ్వు, నా చుట్టూ కొవ్వు, నేనంతా కొవ్వు
నా నడుము పైన కొవ్వు ,నా మెడవంపున కొవ్వు, నా గుండె మీద కొవ్వు, ఒళ్ళంతా కొవ్వు
చేతుల్లో కొవ్వూ... చెంపల్లో కొవ్వు... చంపేసే కొవ్వూ
నిద్దర్లో కొవ్వూ... పొద్దుల్లో కొవ్వు... ప్రతి నిమిషం కొవ్వూ
నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ 

చరణం : 1

నా మనసును వేధించే బద్దకమే కొవ్వు, నా వయసును మార్చేసే మాయే ఈ కొవ్వు
పైకే బరువనిపించే ఆకారం కొవ్వు, బైట పడాలనిపించే పిచ్చిదనం కొవ్వు
నా ప్రతి యుద్దం నువ్వు  నా పస్తే నువ్వు,  నా ఉప వాసం నువ్వూ ... కొవ్వూ
మెత్తని జామే తెచ్చే తొలి జిగురే కొవ్వు, నచ్చే కష్టం నువ్వు  ... నువ్వు ... కొవ్వూ

నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ 

చరణం : 2

నా సిగ్గును రెట్టించే కౌగిలివే కొవ్వు, నా వన్నీ దోచుకునే ఆకలివే కొవ్వు
ముని పంటితొ నే తింటే మిగిలేదీ కొవ్వు, నా నడకను మార్చేసే మొదరష్టానివి కొవ్వు
తీరని దాహం నువ్వూ నా మోహం నువ్వూ, తప్పని స్నేహం నువ్వూ ... కొవ్వూ
తీయని లడ్డే చేసే అన్యాయం కొవ్వూ, చాలా సులభం నువ్వు ... కొవ్వూ ...

నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ 

చరణం : 3

ఏమార్చేస్తు కొవ్వు మురిపిస్తుంటే కొవ్వు, నే కొరుకోని నా మరోఖర్మ కొవ్వు
భయపెట్టిస్తూ కొవ్వు కవ్విస్తుంటే కొవ్వు, నాకే తెలియని నా ముద్దు పేరు కొవ్వు
నా కోపం నువ్వు ఆక్రోశం నువ్వు, నేనంతే కొవ్వూ ...
నా పంతం కొవ్వు నా సొంతం కొవ్వు,నా అంతం కొవ్వూ ...

నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ (2)

Monday, September 19, 2016

ఒక ఏకాంత సమయాన....

అర్ధ రాత్రి నిద్రలో నన్ను తట్టి లేపింది. 

తను : "పెళ్ళైనా కూడా నాతోనే ఎక్కువ సేపు గడుపుతున్నావు, మీ ఆవిడ ఏమీ అనుకోదా ?" అని నా కళ్ళల్లోకి చూస్తూ అమాయకంగా అడిగింది. నేను తనని నా చేతిలోకి తీసుకుంటూ 

నేను : "నువ్వు లేకుండా నాకు రోజు గడవదు. ఎవరేమి అనుకున్నా సరే, నిన్ను వదిలి నేను ఉండలేను".

తను : "ఏదో మాట వరసకు అంటావే గానీ, కొన్ని రోజులకే నన్ను కాదని వేరొకదాని దగ్గరకు వెళ్తావు. నా దగ్గరకు కూడా  అలానే వచ్చావు కదా" 

నేను : "పాత వాటిని ఎందుకు గుర్తు చేస్తావు?  నేనే తప్పు చేశాను. తను  నా నుండి జారి పోకుండా చూసుకోవాల్సింది. నీ విషయంలో మాత్రం అలా జరగనివ్వను."

తను : రేపు నన్ను కూడా వదిలేయవని ఏంటి నమ్మకం ?

నేను : నేను ఈ క్షణం లోనే బతుకుతాను. నిన్నటి గురించి చింతించను, రేపటి గురించి కలలు కనటంలో తప్పు లేదు.

అంటూ తనని గట్టిగా పట్టుకున్నాను. నేను గట్టిగా దగ్గరకు తీసుకునే సరికి ఒణికిపోయింది. నాతో ఏమీ మాట్లాడకుండా నా వైపే చూస్తూ ఉన్నది. అది అలకని నాకు తెలుసు. 

నేను : నీకు తెలుసు కదా, నువ్వంటే నాకు ఎంత ప్రేమో? నా నుంచి  నువ్వు ఎక్కడ దూరంగా పోతావో అని నేను అనుక్షణం ఎంత భయపడతానో? అయినా నన్ను అర్ధం చేసుకోక పొతే ఎలా ? నీకు గుర్తిందా, గత ఏడాది మనం 'లాస్ వేగాస్' వెళ్ళినప్పుడు, నువ్వు అరగంట కనపడకపోయే సరికి ఏడ్చినంత పని చేశాను. 

తను : అవును, నన్ను మర్చిపోయింది కాకుండా సిగ్గు లేకుండా ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నావు చూడు

అని బుంగ మూతి పెట్టుకు కూర్చుంది. కాసేపు తాను ఏమీ మాట్లాడలేదు. తన గురించి మీకు ఒక నిజం చెప్పాలి. తనలో అందం, ఎంతటి  వాడిని అయినా తనకు దాసోహం చేసేస్తుంది. ముట్టుకుంటే కందిపోతుందా అన్నట్టు ఉంటుంది. తననుండి దూరంగా వెళ్ళాలి అనుకున్న మరుక్షణమే, తను నా ఒడిలో ప్రత్యక్షం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తను నాకో బలహీనత అయ్యింది. తన గురించి మా ఆవిడతో అప్పుడప్పుడు గొడవ కూడా జరుగుతూ ఉంటుంది. "ఎందుకు ఎప్పుడూ ఆ వెధవ ఫోను చూస్తూ కూర్చుంటావు" అని అప్పుడప్పుడు మా ఆవిడ తిడుతూ ఉంటుంది. 

ఐ ఫోను 7 కొత్తగా కొంటున్న వాళ్లకి ఈ టపా అంకితం .... 

Wednesday, September 7, 2016

లుంగీలోని గొప్పతనం తెలుసుకో (పురుషులకు మాత్రమే)

ఈ టపా  కేవలం పురుషులకు మాత్రమే! మహిళలు ఇక్కడితో ఆపేయాల్సిందిగా కోరుతున్నాను. 

"చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో" అని చీర విలువ గురించి చాలా చక్కగా చెప్పారు, కవి చంద్రబోసు.  కానీ లుంగీ మాత్రం ఏమి పాపం చేసింది? లుంగీ మీద ఎందుకీ సీత కన్ను? చీరతో లుంగీకి కొన్ని వేల సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కానీ లుంగీకి మాత్రం, చీరకు వచ్చినంత  గుర్తింపు రాలేదన్నది సత్యం. అందుకే ఆ లోటుని కొంతైనా భర్తీ చేయటానికి ఈ పాట రాశాను. మీరు కూడా లుంగీ గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలని కోరుకుంటున్నా... లుంగీలోని గొప్పతనం తెలుసుకో
ఈ లుంగీ కట్టి మగతనం పెంచుకో

వెటకారమనే దారంతో చేసింది లుంగీ
ఆనందమనే రంగులనే అద్దింది లుంగీ
సౌకర్యమనే మగ్గంపై నేసింది లుంగీ


మడిపంచతో  నువ్వు పూజచేస్తే
గుడి వదిలి దిగివచ్చును దేవుడు
పంచకట్టుతో పొలం పనులు చేస్తే
సిరిలక్ష్మిని కురిపించును పంటలు
ఎగుడు కట్టుతో పడకటింట చేరితే
గుండె జారి పోతుంది అమ్మడు 
దొర కట్టుతో నువ్వు నడిచెళుతుంటే
దండాలే పెడతారు అందరూ

అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది
జలుబులో ఉన్నప్పుడు నీ  ముక్కును తుడిచేది 
చిన్న లుంగీ అంచులోన ఆహ్లాదం ఉన్నది


పసిపాపలా నిదురపోయినప్పుడు మన లుంగీ ఎగరేను హాయిగా 
తుమ్మెదై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ లుంగీగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడక ఉక్కపోసినప్పుడు ఆలుంగీనే నీ పాలిట వింజామర
వారమైనా బట్టలు ఉతకనప్పుడు ఆ లుంగీనే నీ ఒంటికి  గొడుగు

విదేశాలలో సైతం నిగర్వంగ ఎగిరేది 
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
ఎజెండాలు లేని  జెండాగా మిగిలింది Sunday, August 21, 2016

Olympics లో మనకు పతకాలు రావాలంటే

నరేంద్ర మోడీ, నాకు రాత్రి ఫోను చేశారు. మన దేశానికి Olympics లో ఎక్కువ పతకాలు రావటం లేదని చాలా బాధ పడ్డారు. "మనకు Olympics లో ఎక్కువ పతకాలు రావాలంటే ఏమి చేయాలి?" అని నన్ను అడిగారు. ఎప్పుడూ "చైనాని ఎలా ఎదుర్కోవాలి? పాకిస్థాన్ ని ఎలా నియంత్రించాలి? అమెరికాతో ఎలా ఉండాలి ?" అని ద్వైపాక్షిక విషయాలే అడిగేవారు తప్ప, ఇల్లాంటివి ఎప్పుడూ అడగలేదు పాపం. సరే, పెద్దాయన నోరు తెరిచి అడిగాడు, అది కూడా దేశం కోసం...., కాదనలేక, సరేనని కొన్ని చిట్కాలు చెప్పాను. కొన్ని కొత్త పోటీలను Olympics లో కలిపితే, మనకు మంచి అవకాశం ఉంటుంది. అవి....

1.సలహాలు ఇవ్వటం  :  "ఏదైనా పని చేయరా" అంటే, భోజనం చేయటం కూడా సరిగ్గా రాని నా లాంటి వాడు కూడా, ఇలా బ్లాగులు రాస్తూ , వాళ్ళు అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగోదు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి ఎదవ సోది  పోటీలు Olympics లో పెడితే, మొత్తం పతకాలన్నీ  మనకే

2. ఫోటోలకు లైకు షేరు : అడ్డమైన ఫోటోలకి, పనికి మాలిన చెత్తకి , పొలోమంటూ లైకులు కొట్టి, షేర్లు  చేసే పోటీలు Olympics లో పెడితే , పతకాలన్నీ మనకే

3. కుల / మత / ప్రాంతీయ పిచ్చ Olympics లో రాక రాక ఒక పతకం వస్తే, ఆ అమ్మాయి మా రాష్ట్రం, కాదు మా కులం అని కొట్టుకు చస్తున్నారు. ఇలాంటి పిచ్చిని Olympicsలో పెడితే పతకాలన్నీ మనకే

4. దేశద్రోహం : అస్సలు దేశ ద్రోహం Olympics లో ఉంటే, పోటీ కూడా లేకుండా పతకాలు తెస్తారు.

5. లంచం తీసుకోవటం : అన్ని దేశాలు పోటీ పడ్డప్పటికీ.., మనకు ఏ మాత్రం ఇబ్బంది లేదు. గ్రామ స్థాయి నుండి కూడా మనకు దీనిలో మంచి పునాది లో ఉంది.

6. బట్టీ పట్టటం : దిక్కులు చూడకుండా చదవటంలో మన తరువాతే ఎవరైనా. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు తలకి ఎక్కించుకోవటం లాంటి పోటీలు గనుక పెడితే,  నాసామి రంగ, బంగారు, వెండి పతకాలేమిటి, ఇత్తడి, సత్తు పతకాలు కూడా మనకే వస్తాయి అనటంలో నాకే సందేహం లేదు.

7. గొప్పలు పోవటం : మనకు మనమే డబ్బా కొట్టుకునే పోటీలన్న మాట! ఎందుకు పనికిరాని నాలాంటి వాడు కూడా Face book తీసి, నేను తోపుని, నేను తురుముని , ఉరుముని, ఉమ్ముని అని గొప్పలు పోతుంటారు. వీటిల్లో కూడా మనకు మనమే సాటి, మనకు ఎవరూ లేరు పోటీ (చూశారా తెలియకుండానే మొదలు పెట్టేశాను )

8. ఖండించటం : ఏదైనా విషయాన్ని ఖండించటం, అది కూడా fire star Solemn Raju లాగా different different modulations లో ఖండించటం మనకు నోటితో పెట్టిన విద్య.

ఈ లెక్కన మనకు తక్కువలో తక్కువ పాతిక పతకాలు రావటం మాత్రం ఖాయం.

Saturday, August 13, 2016

న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి

పాటలను కంపు చేసే పోటీలే గనుక ఒలంపిక్స్ లో పెడితే, మన దేశానికి బంగారు పతకం మాత్రం, నా ద్వారా ఖాయం అని తెలియజేసుకుంటున్నాను. 'యమహా నగరి , కలకత్తా పూరి' పాటను , అమెరికా స్టైల్ లో కంపు చేయటం జరిగింది.

న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి

న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి
యమహొ న్యూ జర్సీ … గోల్డెన్ వారధి

న్యూయార్క్ సిటీ , వాషింగ్ టన్ పూరి
ఒక రామ బంటు నీ రుచినే మరిగెను మరి  ...3

మైకేల్ జాక్ పుట్టిన చోటా బీట్ ఇట్ ఆడిన చోట పాడనా తెలుగులో
జన్నీఫర్ పాడిన పాటె, మాడోన ఆడిన ఆట ఆడనీ
ఎందరో వలస వచ్చారీ దేశం బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదలి పోరా
ఒకరితొ ఒకరికి ముఖపరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో ||న్యూయార్క్ సిటీ||

ఓ సుందర్ పిచ్చయ్ అయినా - సత్యా నాదెండ్ల అయినా
పాడని ఈ పాటని
రోజంతా రజనీ కిందా రాత్రంతా సూర్యుడికిందా సాగనీ..
పదగురు దేశమే కాని దేశం, ఒక్కరొక్కొక్క వేషం
డాలరే చేసె మైకం తెలుసుకోరా
మంచుకు  నెలవట చెమటకు సెలవట
తిథులకు లేటుట అతిథులు లేరట
తోచక చేసే ఎద నస లో ||న్యూయార్క్ సిటీ||

లాస్ ఏంజల్స్ రంగులు అన్నీ , లాస్ వేగాస్ ఒంపులు కొన్ని చూడని  
కాసినో ఆటలు అన్నీ, లాంగ్ డ్రైవ్ తో అందాలన్నీ చూడనీ
వినుగురూ…
జిమీ హెండ్రిక్స్ గిటారా, టేలర్ స్విఫ్ట్ కిథారా
N R I కుమారా.  కదిలి రారా..
జనగణమనముల స్వరపద వనముల హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ శుకపికముఖసుఖ రవళులతో..
|| న్యూయార్క్ సిటీ ||

Monday, July 4, 2016

తాను-నేను

పాటని కంపు చేయటం అంటే నా తరువాతే ఎవరైనా......
తాను-నేను
సిమ్ - ఫోను
తాను-నేను
గాలి - ఫ్యాను 
తాను-నేను
డబ్బు - పన్ను
తాను-నేను
ఇంకు పెన్ను

స్విచ్ తానైతే బల్బె నేను
శునకం - బోను తాను-నేను
నలుపు - కాకి 
పూరీ  - పానీ  
తాను-నేను
ఉమెనూ - వైను

ఇంగ్లీష్ నేను గ్రామర్ తాను
పొలమే నేను ట్రాక్టర్ తాను 
సైకిల్ నేను చైనే  తాను 
బావి నేను బొక్కెన్ తాను

నేను తాను సమ్మర్  బీరు  
తాగేసేయ్ నీ రమ్ము జిన్ను

Thursday, June 23, 2016

నిద్దర చాలని బద్దకం


ఉదయం : 

నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం

రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం

వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం

సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం

మౌనంగా… ధ్యానంలో ఉందీ.. మాగాణం..


సాయంత్రం :


నిద్దర కొచ్చిన  బద్దకమల్లే ఆవలించిందీ ఆకాశం

సెహ్వాగ్ కొట్టిన సిక్సరు బంతై తిరిగెళుతుంది రవిబింబం

వెలుతురు మూస్తూ దిగివెళ్తున్నది గాల్లో గువ్వల పరివారం

కురులే విప్పిన దయ్యం లాగా స్వాగతమందీ నల్లదనం

మౌనంగా… నీరసంలో ఉందీ.. ఈ నగరం..
Friday, June 3, 2016

తరలి రాద తనే వసంతం, తన దరికిరాని రాని వనాల కోసం

"తరలి రాద తనే వసంతం, తన దరికిరాని రాని వనాల కోసం" అని ఆ మహానుభావుడు పాడింది ఎన్ని సార్లు విన్నానో! బహుశా ఆ మాట నిజం చేయటానికేనెమో, ఆ పాటల వసంతమే నా దగ్గరకు వచ్చింది. సినిమా భాష లో చెప్పాలి అంటే ...
ఎవరి గొంతు వింటే దేశ ప్రజల మనస్సు ఆనందంతో పులకరిస్తుందో
ఎవరు పాడితే మేఘాలు సైతం గర్జించి వర్షిస్తాయో
ఎవరి పాట వింటే, చావాలనుకునే వాడు కూడా బ్రతకాలి అనుకుంటాడో 
ఎవరి పాట వింటే, ఏడ్చే పిల్లలు కూడా హాయిగా నిద్ర పోతారో 
ఆ బాల సుబ్రహ్మణ్యం..., ఆంధ్రప్రదేశ్ ను వదిలి ఈ అమెరికాకు ఎందుకు వచ్చాడో తెలుసా
ఎందుకొస్తేనేమి? నా పని జరిగింది. ఎప్పుడో రాసుకున్నట్టు ఆయన్ని చూస్తేనే జీవితానికి చాలు అనుకునే వాడిని, అలాంటిది ఏకంగా ఆయనని కలవటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో ఫొటో దిగటం అంతా కలలా జరిగిపోయింది. కాకపోతే ఫోటో ఆధారం ఉంది కాబట్టి కల కాదు నిజమని నమ్ముతున్నాను. 

Wednesday, June 1, 2016

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన

పెళ్ళికి ముందు :

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన... రాగాలు తీసే ని వల్లేనా... 
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న... ఈ మాయలన్ని నీ వల్లేనా...

వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐన వెన్నలే... అది నీ అల్లరేనా...
ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన ....

పెళ్ళి తరువాత :

యోగాలు చేస్తున్నా, కంగారు పడుతున్నా, ఈ బాధలన్నీ నీ వల్లేనా...
ఏ హాయి లేకుండా నే రగిలిపోతున్న, ప్రాణాలు తీసే నీ వల్లేనా...

వెళ్ళే దారిలో అంతా వెన్నెలే, అయినా చీకటే ... అది నా కర్మయేనా ...
ఓ చెట్టు నీడనైన లేనే పైన కాకి రెట్ట

--- ఓ సంసారి ఉవాచ

Wednesday, May 25, 2016

వెళ్ళిపోవె శ్యామల

ప్రేమించేటప్పుడు.....

నువ్వు పక్కనుంటే బాగుంటాదే, 
నీ పక్కనుంటే బాగుంటాదే
నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే 
వెళ్ళిపోకె శ్యామల, వెళ్ళమాకె శ్యామల 
నువ్వు వెళ్ళిపోతే శ్యామల, ఊపిరాడదంట లోపల 
ఎక్కి ఎక్కి ఏడవ లేదే ఎదవ మగ పుటక, గుండె పెరికినట్టుందే నువ్వే వెళ్ళినాక

పెళ్ళికి తరువాత......

నువ్వు వెళ్ళిపోతే బాగుంటాదే 
నీ పీడ పోతే బాగుంటాదే
నువ్వు దూది పెట్టి రుద్దినా దురదగుంటాదే 
చక్కేరేసి పెట్టినా చేదుగుంటాదే 
అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే 
వెళ్ళిపోవె శ్యామల, ఇక్కడుండమాకె శ్యామల 
నువ్వు వెళ్ళిపోతే శ్యామల, నాకు పండగంట లోపల 
ఎక్కి ఎక్కి ఏడవ లేదే ఎదవ మగ పుటక, చేసేదేముంటుందే నిన్ను పెళ్లి చేసుకున్నాక 
వెళ్ళిపోవె శ్యామల, ఇక్కడుండమాకె శ్యామల

--- ఓ సంసారి ఉవాచ