Wednesday, February 22, 2012

పరుగే బంగారమాయనా

అమెరికాలో డాక్టర్ చదవాల్సిన నా స్నేహితుడు, అద్దంకిలో ఉదయాన్నే ఆదుర్దాగా ఐదు గంటలకే లేచి, అటు ఇటు పరిగెట్టటం మొదలెట్టాడు. సూర్య భగవానుడు నడినెత్తి మీదకి వస్తేకానీ లేవని, ఆ మహాత్ముడిని పరగడపున చూసేసరికి, ఒక్కింత ఆశ్చర్యమేసింది. ఇంతకీ వీడు ఎందుకు పరిగెడుతున్నాడు? ప్రకృతి ఏమైనా పిలుస్తుందా అనుకుంటే, ఆ సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిని ఇంట్లోనే అఘోరిస్తాడు, తప్పించి ఇలా బజారున పడడు. అయితే వీడిని పిలుస్తుంది ప్రకృతి కాక మరేమిటి?

నాలో ఆతృత మొదలయ్యి, వాడిని చాటుగా వెంబడించటం మొదలుపెట్టా. శివాలయం వైపు వడివడిగా వెళ్ళటం మొదలు పెట్టాడు. రాత్రులు దయ్యాల చిత్రాలు చూసి, భయపడి భక్తి పెరిగిందేమో, శివాలయం దారి పట్టాడు అనుకుంటే, మనోడికి స్నానం చేసే అలవాటు కాదు సరి కదా, పన్నెండు కొడితే కాని పళ్ళు అయినా తోమడు. అలాంటప్పుడు గుళ్ళోకి వెళ్ళటానికి శాస్త్రాలు ఒప్పుకోవు కదా అనుకోనేలోపే రామాలయం దాటేసాడు. హమ్మయ  దేవుడికి ఏమి కాలేదు అని ఊపిరి పీల్చుకున్నాను. పైన శివాలయం వైపుకి వెళ్ళాడు అని చెప్పి, కింద రామాలయం దాటాడు అని రాశాను. ఇది ఎంత మంది గమనించారో???

సరే శివాలయం దాటి, నేరుగా గుండ్లకమ్మ నది వైపు వాడి ఓదార్పు యాత్రను మరల్చాడు. చేసేది సంవత్సరానికి ఒకసారి, కాస్త బాగా చేయాలి, అందుచేత నదిలోకి వెళ్తున్నాడేమో అనుకోవటానికి లేదండోయ్. నదిలో కాళ్ళు కడుక్కోవటానికే నీళ్ళు లేవు. వీడు పుట్టాక మా ఊర్లో వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలా ఆలోచించే లోపు, గాంధి బొమ్మ ప్రక్క వీదిలోకి తిరిగాడు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం.

ఆ వీదిలోకి మాములుగా అయితే చచ్చినా వెళ్ళేవాడు కాదు. ఆ వీదిలో మనోడి అత్తగారిల్లు ఉంది. ఈ డాక్టరు గారిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ అత్తకి పిచ్చి. వీడి మరదలకి వీడంటే పిచ్చి. వీడికి ఆ విషయం గుర్తొస్తే పెరుగుతుంది పిచ్చి. పాపం అత్త కూతురికి అందం తప్ప అన్నీ ఎక్కువే. అత్త కంట పడకుండా , దూకుడులో మహేష్ పరిగెత్తినట్టు పరిగెత్తాడు. వాడితో పాటు నేను కుడా నా వేగాన్ని పెంచాను.

ఆ దారిన పరిగెడుతూ పరిగెడుతూ 'దడ' చిత్రం ప్రదర్శిస్తున్న చిత్రాలయం కనిపించటంతో దడ పుట్టి కుడి ప్రక్క సందులోకి తిరిగాడు. దడ చిత్రం చూసిన ప్రభావం, ఆ దరిదాపులకు వెళ్ళాలన్నా భయమాయే. ఆ ముందుకు వెళ్తే వంద సంవత్సరాలనాటి బావి ఒకటి ఉంది. నిన్న సాయంత్రమే నా బ్లాగు చదువుతాను అని చెప్పాడు. కొంపతీసి అది చదివి, జీవితం మీద విరక్తి పుట్టి బావిలో దూకి చస్తాడేమో అనుకున్నా. కానీ వీడు చంపే రకం కానీ చచ్చే రకం కాదు. అందుకే వీడిని మా ఊరి మెహర్ రమేష్ అంటారు. కాకపోతే వారు చిత్రాలతో చంపితే వీరు చేష్టలతో చంపుతారు. 

ఇలా వీదుల వెంట పరిగెట్టే బదులు ఏ గుడిలోనో ప్రదక్షణం చేస్తే కనీసం పుణ్యం అయినా దక్కేది. "నిప్పు త్రొక్కిన  కుక్కలా ఎంత సేపు పరిగెడతావురా, నాకు కూడా కాళ్లు నొప్పులు పుడుతున్నాయి" అని అనుకుంటుండగా ఊరి పొలిమేర దాటబోతున్నాడు. కొంపతీసి సమాజం మీద ద్వేషం పుట్టి, అది కసిగా మారి, అఘోరాలతో మమేకం అవ్వటానికి, స్మశానాన్ని వేదికగా చేసుకున్నాడా అనుకునే లోపు, ఎందుకో బుద్ధి మార్చుకొని తిరిగి ఊరి మీద పడ్డాడు.

ఓపిక నశించి, పరిగెత్తుకుంటూ వాడి దగ్గరకు పోయి, "ఏమైందిరా, ఈ పరుగుకి ఏ ప్రారబ్ధం కారణం?" అని అడిగాను. విషయం ఏంటంటే., సుశీల.., ఆ పాప అంటే మనోడికి ప్రాణం. పది పన్నెండు సంవత్సరాల ప్రేమ. మొన్న పనికిమాలిన పద్నాలుగో తారీఖు నాడు., చివరికి తన ప్రేమను వ్యక్తం చేశాడు. డాక్టర్ల చేతిరాతే కాదు శరీరతీరు కుడా అందంగా ఉండదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. తినటం చదవటం తప్ప ఇంకొకటి తెలియకపోవటం చేత మనోడికి బాన పొట్ట ఏర్పడింది. నుంచుంటే వాడి కాళ్లు వాడు చూసుకొని పది సంవత్సరాలు అయ్యింది. ఆ కారణం చేత ఆ అమ్మాయి కాదన్నది. ఎలాగైనా సరే వాడి కాళ్ళ మీద వాడు నిలబడి, అలా నుంచొని వాడి కాళ్లని తనివి తీరా చూసుకోవాలని వాడి ఆశట!! ఆరు పలకల దేహం రాకపోయినా అందమైన రూపు రావాలని వాడి ప్రయత్నం. చూడాలి ఏమి జరుగుతుందో.  

Monday, February 6, 2012

'చిత్ర' హింస

మొత్తానికి ఎంటెక్ చదువు'కొనటం' పూర్తి అయ్యింది. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. "వేలకు వేలు పోశాము, మంచి మార్కులు రాకపోయినా పరవాలేదు, కనీసం పరీక్షలలో తప్పకుండా, పూర్తి చేసి పుణ్యం కట్టుకోరా" అని మా నాన్న తెగ మెచ్చుకొనేవారు. చివరికి మా నాన్న కళ్లలో ఆనందం కోసం అయినా పూర్తి చేయాలని, కంకణం కట్టుకోకుండానే పూర్తి చేశా. నా స్నేహితులు చాలా మంది అడిగారు, "ఎందుకు పనికొస్తుందిరా నీ ఎంటెక్?" అని. చుట్టపక్కాలు కొంతమంది "ఆఫీసులో జీతం ఏమైనా పెంచుతారా??" అని అడిగారు. 

"రేపు పెళ్ళికి శుభలేఖలో వేయించుకోవచ్చు" అని కొంతమంది, "ఇప్పుడలా వేయించటంలేదు. అదంతా పాత కాలపు పద్దతి" అని ఇంకొంత మంది, ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఖండించారు. ప్రస్తుతానికి ఆ విషయం అలా ప్రక్కన పెడదాం. మొన్ననే 'బిజినెస్ మాన్' అనే తెలుగు చిత్రం చూశాను, అరడజను బూతులు, డజను హత్యలు ఉన్నపటికినీ చిత్రం మొత్తం మీద బాగుంది. మహేష్ బాబు చాలా బాగా చేశాడు. అయినా మహేష్ బాబు అందగాడు, మహా అందగాడు, రాజకుమారుడు అంటారు., మీసాలు తీసేసి, రెండు చొక్కాలు వేసుకొని, నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నేను కుడా ఎత్తు అడుగు తక్కువైనా, అంతకన్నాఅందంగానే ఉంటాను. పోనీలే మహేష్ బాబు దారికి అడ్డం రావటం ఎందుకులే అని, నేనే చిత్రాలలోకి రాలేదు.

విషయానికి వస్తే, చిత్రాలలో ఈ మధ్య హింస మరీ ఎక్కువ అయ్యింది. ఒక్కో చిత్రంలో కధానాయకుడు సగటున వంద నుంచి నూటయాభై మందిని చంపితే కాని చిత్రానికి 'శుభం' ముక్క పడటంలేదు (ఇప్పుడు వస్తున్న చిత్రాల చివర శుభం ముక్కలు చూపించటం కుడా ఆపి వేసినట్టున్నారు). కధానాయకుడు ఎంత కౄరంగా ప్రతి నాయకుడిని చంపితే, చిత్రం అంత బాగా ఆడుతుంది.

కొన్ని చిత్రాలలో కౄరమైన ప్రతి నాయకులను చూస్తే, నాకు మా కార్యాలయంలో, నా పై అధికారులు గుర్తొస్తారు. ఈ ప్రతినాయకులు ఉత్తి పుణ్యానికి తన వద్ద నమ్మకంగా పని చేస్తున్న వారిని సైతం చంపేస్తుంటారు. మా పై అధికారులు కుడా అంతే ఉత్తి పుణ్యానికి నన్ను తిడుతూ ఉంటారు, వీళ్ళను కూడా చిత్రాలలోకి పంపిస్తే బాగా రాణిస్తారు, మేము కుడా ప్రశాంతంగా మా పనులు మేము చేసుకుంటాము. ఈ రకంగా చిత్రాలలో చూపించే హింస, చూసే ప్రజల మీద చాలా చెడు ప్రభావం చూపిస్తుందని నా అభిప్రాయం.

ఉదాహరణకు, మా అన్నయగారి అబ్బాయి, మా అన్న దగ్గరికి వచ్చి, "నాన్న, నాకు ఒక తాడు, ఒక రైలు, రైలు పట్టాలు, ఒక పెద్ద బిల్డింగ్ కొనివ్వవా??", అని కసిగా అడిగాడు. నాలుగు, ఐదు సంవత్సరాలు ఉంటాయేమో బుడ్డోడికి, ఇవ్వన్ని ఎందుకురా? అని అడిగితే మహేష్ బాబు ఆట ఆడుకోవటానికి అని చెప్పాడు. వివరాలలోకి వెళ్తే, మావాడు 'అతడు' చిత్రాన్ని అరడజను సార్లు చూశాడు. మీకు గుర్తుంటే, అందులో మహేష్ బాబు ఒక ఎత్తైన మేడ మీద నుండి, తాడు సహాయంతో, వేగంగా కదిలే రైలు మీదకి దూకుతాడు. ఇప్పుడు అడిగినవన్నీ కొనిస్తే., మనోడు కుడా మహేష్ బాబు లాగా ఆ విన్యాసాన్ని చెయ్యాలని ఉవ్విల్లూరుతున్నాడు.

ఇంకోరోజు తుపాకి కొనివ్వమని గొడవచేస్తుంటే, ఒక చిన్న తుపాకి కొనిచ్చారు. కాసేపటికే కోపంగా వచ్చి, "నాన్న ఈ తుపాకితో కాలుస్తుంటే, ఎవ్వరికీ రక్తం కారటంలేదు. రక్తం కారే తుపాకి కొనివ్వవా?" అని గోల చేశాడు. ఇదంతా కేవలం చిత్రాల ప్రభావం కాక ఇంకేమిటి? మొన్న "భక్తి" ఛానల్ చూస్తుంటే అందులో ఒక బాబాగారు, "మనిషి సాటి మనిషి ప్రేమించాలి" అని చెప్పారు. ఆ విదంగా, హాయిగా, చిత్రాలలో కధానాయకుడు కుడా ప్రతినాయకులను (విలన్లను) ప్రేమిస్తే ఎంత బాగుంటుంది??  ఈ "'చిత్ర' హింస" ఎప్పటికి తగ్గుతుందో ఏంటో??