Saturday, June 23, 2012

శునకానందం


ఒక ఇంట్లో మూడు సంవత్సరాల బాబు, బంతి ఆట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ఎదురుగా   ఉన్న గడపను తట్టుకొని కింద పడ్డాడు. నొప్పితో పెద్ద పెట్టున ఏడుపు మొదలుపెట్టాడు.  ఆ ఏడుపు విని ఆ బాబు వాళ్ళ నీలాకాశం పరుగు పరుగున వచ్చాడు (అమ్మంటే వర్షించే మేఘం, నాన్నంటే నీలాకాశం అని తండ్రుల దినం రోజు టివి9 లో చెప్పారులే).  పడిపోయిన కొడుకుని లేపి, ఓదార్చటానికి ప్రయత్నించాడు. ఆ తండ్రికి ఓదార్పులో,  'అన్న' అంత అనుభవం లేకపోవటంతో, ఆ బాబు ఎంతకీ ఏడుపు ఆపలేదు.

అంతలో వాళ్ళ నాన్నకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఆ పిల్లాడిని గడప దగ్గరకు తీసుకువెళ్ళి, "ఈ గడప తగిలే కదా నువ్వు పడ్డది, దీనిని బాగా తందాం", అని ఆ గడపని ఒక కర్ర తీసుకొని తన్నాడు. దీనితో ఆ పిల్లాడు ఏడుపు ఆపేసి నవ్వటం మొదలెట్టాడు. ఈ విషయాన్ని బాగా జీర్ణం చేసుకున్న ఆ పిల్లాడు, తనకు కలిగిన ఆనందం కన్నా, ఎదుటి వాళ్ళ బాదల్లోనే ఎక్కువ ఆనందాన్ని పొందటం అలవాటు చేసుకున్నాడు. ఇదేదో సినిమాలో చూసిన సన్నివేశంలా అనిపిస్తున్నది కదూ, ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే.

ఇలాంటి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక, నాలా సంఘ విద్రోహ శక్తులుగా మారి అందరినీ తిడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కనపడే చోటు "ముఖం పుస్తకం". ఈ రోజుల్లో మంచినీళ్ళ కన్నా జనం ఎక్కువగా వాడుతున్నది కులాన్ని. కులానికి ఒక రాజకీయ వ్యవస్థ, కులానికి ఒక నాయకుడు, కులానికి ఒక కధానాయకుడు అంతెందుకు కులానికో దేవుడు  ఉన్నాడు. ఆఖరికి ఈ పిచ్చ అమెరికాలో కూడా ఉన్నది అని,  మొన్ననే ఆంధ్రజ్యోతిలో ఆర్కే చెప్పగా విన్నాను. ఈ కులానికి ఉన్న అందమైన పేరు సామాజిక వర్గం.

ఇహ ... ఈ  శునకానందం అనేది ఒక విచిత్రమైన జబ్బు. దీని లక్షణాలు ఏంటంటే?  ఈ జబ్బు వచ్చిన వాళ్ళు  తమ అభిమాన  కధానాయకుల మీద ప్రేమ  కన్నా, గిట్టని కధానాయకుల మీద కోపం ఎక్కువ. అప్పుడప్పుడు వార్తల్లో ఇదే విషయం మీద తన్నుకొని తలలు పగల గొట్టుకొనే వాళ్ళ గురించి వింటుంటాం.

కొంత మంది ఉంటారు..... మా హీరో సినిమాకి ఇన్ని కోట్లు వచ్చాయి, ప్లాపు అయినా పాతిక కోట్లు వసూలు చేసింది, అని చంకలు గుద్దుకుంటారు, వీళ్ళకేదో డబ్బులు వస్తునట్టు. అందులో తప్పు ఏమి లేదు. ఎవరి అభిమానం వాళ్ళది. 

ఇంకొంతమంది తమ  సామాజిక వర్గం కాని కధానాయకుల  గురించి నీచంగా రాయటం, వాళ్ళ బొమ్మలే గాక వాళ్ళ కుటుంబ సభ్యుల బొమ్మలను కూడా చెండాలంగా మార్చటం లాంటివి చేస్తుంటారు. వీళ్ళే మన ఈ "శునకానందం" అనే శీర్షికకు కధానాయకులు. ఏ చదువు చట్టుబండలు లేని వాళ్ళు ఇలా చేస్తే ఏమో అనుకోవచ్చు, కానీ చదువుకున్న వాళ్ళు కుడా ఇలా చేస్తే, ఇంక ఆ చదువుకి అర్ధం ఏముంది?? ఇలాంటి వాళ్ళ వల్లనే ముఖం పుస్తకం మీద ముఖం మొత్తింది.

ఉదాహరణకు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, పాతికేళ్ళు ఖర్చుపెట్టి ఎంటెక్ దాకా చదివాడు. తనకు తన సామాజిక వర్గం అంటే ప్రాణం. తనవంతు సామాజిక బాధ్యతగా, మిగిలిన కదానాయకులందరినీ తిడుతూ ముఖం పుస్తకంలో చిత్రాలు పెడుతుంటాడు. అప్పటికీ ఒకసారి చెప్పి చూసా, "నీకు ఇష్టం కాబట్టి నీ కదానాయకుడిని నువ్వు పొగుడు, ఎవరూ వద్దనరు, మిగితా వాళ్ళ మీద పది ఏడవటం ఎందుకురా?" అని. కడుపుకి అన్నం తింటుంటే కదా వినటానికి. ఇలాంటి చేష్టల వల్ల ఇతరులకి ఎంత బాధగా ఉంటుందో కదా.  కాబట్టి, ఇకపై పిల్లలు గడప తట్టుకొని పడితే, గడపను కొట్టకండి. ఓ చాక్లెట్, లేదా ఓ బిస్కెట్ కొని పెట్టండి.

ఇప్పుడు ఈ సోదంతా చెప్పటానికి గల కారణం, ఇదే విషయం మీద నేను ఒక చిన్న పల్లవి రాశాను. అది మీకు అంకితమిస్తున్నాను. "ఊసరవెల్లి" చిత్రంలో "నేనంటే నాకూ చాలానే ఇష్టం" అనే పాట రాగంలో.......

చిరు అంటే నాకు చాలానే ఇష్టం, బాలయ్యంటే ఇంకా ఇష్టం,
ఏ సినిమా అయినా చూస్తాను మొత్తం, హీరో ఎవరయితే నాకేం నష్టం,
గద పట్టి పిసికేసే ఏ చిన్ని కద అయినా, బాలయ్య లేకుండా మరి ఆడునా?
చిరు స్టెప్పు వేయించే ఏ చిన్ని ట్యూన్ అయినా చిరంజీవి లేకుండా పాడునా?

శునకానందం అనే శీర్షిక సమాప్తం 

Thursday, June 7, 2012

కుశల ప్రశ్న

"కావాలి ప్రశ్నలకే జవాబులు" అని అన్నాడో సినీ కవి. చాలా ప్రశ్నలకు జవాబుకన్నా ఓపిక కావాలి. జీవితంలోని ప్రతి అంకంలో  మనకు కొన్ని ప్రశ్నలు పదే పదే ఎదురు పడుతుంటాయి. ఉదాహరణకు "బాబు, ఏ తరగతి చదువుతున్నావు?", "పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి?","ఎంసెట్ ఎంత ర్యాంకు వచ్చింది?", "ఇంజనీరింగ్ ఎక్కడ చదువుతున్నావు?", "ఏమిచేస్తున్నావు? ఉద్యోగం ఏమైనా వచ్చిందా?", "ఎక్కడ పని చేస్తున్నావు?, జీతం ఎంత వస్తుంది?", "పెళ్లి ఎప్పుడు?", "పెళ్లి చేసుకుంటున్నావా? కట్నం ఎంత?", "పిల్లలు ఎంత మంది?", "పిల్లలు ఏ బడిలో చదువుతున్నారు? ఏ తరగతిలో చదువుతున్నారు", ఇలా చెప్పుకుంటూ పొతే ఈ కుశల ప్రశ్నలకి అంతే లేదు.

ఇలాంటి సాదారణ ప్రశ్నలు కాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు గుండు చేయించుకుని ఎవరికైనా ఎదురుపడితే, "ఎక్కడిది ఈ గుండు? తిరుపతికి వెళ్ళావా?" అని అడుగుతారు. మనం అవును/ కాదు అని చెప్పేలోపే "ప్రసాదం ఏది?" అని కూడా అడుగుతారు. కొత్త చొక్కా వేసుకున్న రోజు పుట్టిన రోజా అని, గడ్డం పెంచితే ప్రేమ  విఫలమయ్యిందా అని ప్రశ్నిస్తూ ఉంటారు. చాలా వరకు మనం వేసే ప్రశ్నలు ఎదుటి వారిని తెగ ఇబ్బంది పెడుతుంటాయి, బాద కలిగిస్తాయి.

ఉదాహరణకు........, నాకు అప్పుడు ఏడు సంవత్సరాలు అనుకుంటా, ఒక రోజు మా అమ్మని భయపెడదామని, కుర్చీ మీదనుండి అమ్మ మీదకి దూకబోయాను, అమ్మకేమి తెలుసు? నేను ఇలాంటి సాహస కౄత్యాలు చేస్తున్నానని, తను పక్కకు పోయింది. అలా ఎగిరిన నేను, భూఆకర్షణ శక్తి వల్ల కిందకు పడ్డాను. ఆ దూకుడికి నా చెయ్యి విరిగి, మెలికలు తిరిగి పోయింది. 

మా వీధిలోని జనమంతా నా ఏడుపుకి, మా ఇంటి ముందుకు వచ్చారు. అప్పుడెప్పుడో అన్నగారు చనిపొయినప్పుడు వచ్చారు అంతమంది జనం, తరువాత నా చెయ్యి విరిగినప్పుడు వచ్చారు. ఒంగోలు తీసుకుపోయి పిండి కట్టు కట్టించారు. నా చెయ్యి విరగటానికి ప్రశ్నకి ఎమిటా సంభందం అంటారా??

చెయ్యికి కట్టు కట్టించి, ఇంటికి తీసుకువచ్చారు. చెయ్యి విరిగితే విరిగింది కానీ, ఆ వేళ  ఒక గొప్ప శుభవార్త విన్నాను. ఒక రెండు నెలలు బడికి వెళ్ళక్కర్లేదు అని. మొదటి రోజు మా పక్క వీధిలో ఉండే తెలిసిన వాళ్ళు ఒక అరడజను అరటి పండ్లు తీసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారో, అనుకునేలోపుగా, "బాబు చెయ్యి విరిగిందని విన్నాము, ఎలా ఉంది ఇప్పుడు?" అని అడిగారు. చెయ్యి విరిగితే ఎవరికైనా హాయిగా ఉంటుందా? అని మనస్సులో తిట్టుకున్నాను. అక్కడితో మొదలైయిన ప్రశ్నల పరపంపర "ఎలా విరిగింది, ఎక్కడ కట్టు కట్టించారు? కట్టు ఎన్ని రోజులు ఉంచాలి?" ఇలా సాగిపోయింది.

అలా రోజుకి కనీసం ఇద్దరు ముగ్గురు ఇంటికి రావటం, "అయ్యో బాబుకు చెయ్యి విరిగిందట!!" అని ఓదార్పు యాత్ర మొదలెట్టటం అలవాటు అయిపోయింది (చెంపలు నిమరటం, పెరుగాన్నాలు లేకుండానే). మూడో రోజు నుండి, ఇంటి బయట కూరగాయల వాడు వచ్చినా సరే, నా చెయ్యి చరిత్ర చెప్పటం మొదలు పెట్టాను. వాళ్ళు ప్రశ్న అడగటం, నేను అవే జవాబులు చెప్పటం, అలవాటయి పోయింది.  నా చెయ్యి విరిగిన బాధకన్నా, వాళ్ళ ప్రశ్నలతో బాధ రెట్టింపు అయ్యేది.

చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, " ప్రశ్నించటం మాని, ముందు ప్రేమించండి, అప్పుడు మీకు ఎలాంటి ప్రశ్నలు రావు" అని ఆర్యా చిత్రంలో అర్జున్ బాబు చెప్పినట్టు, మీరు ఎవరినైనా ప్రశ్నించే ముందు ప్రేమించక పోయినా పర్వాలేదు,కానీ ఒక నిముషం ఆలోచించండి. అస్సలు ఆ ప్రశ్నకి విలువ ఉందా? అది అవతలి వాళ్ళను బాద పెట్టకుండా ఉంటుందా? అని అలోచించి అడగండి.కొత్తగా పెళ్లై భాదల్లో ఉన్నోడిని,  ఏరా పెళ్లి చేసుకున్నావట  కదా అంటే ఎంత బాదగా ఉంటుంది? జగనన్న అంతటి వానికే తప్పలేదు ఈ ప్రశ్నల గోల. అప్పటికీ  ఇదే విషయాన్ని నేను లక్ష్మీ నారాయణ అన్నకి కుడా చెప్పాను. వింటే కదా? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు.