Friday, September 30, 2011

పైనోళ్ళ గోల

ఈ మధ్య చాలా మంది స్నేహితులు అడుగుతున్నారు., "ఏంటిరా.. నీ గోల? అస్సలు ఇలా రాయాలని ఎందుకు అనిపించింది?" అని. దానికి వివరంగా సమాధానం ఇద్దామని, ఈ శీర్షిక రాస్తున్నాను.

అది అప్రేల్ 2010 చదువు అయిపోయి రెండు సంవత్సరాలు గాలికి, దూలికి, అమీర్పేట రోడ్ల మీద తిరిగి... తిరిగి... చివరకి ఒకప్పటి లింగరాజు గారి ఇలాకలో చేరాను. మొదటి రోజు కార్యాలయముకి వెళ్ళిన నాకు, ఆ భవంతులు చూసి ఆశ్చర్యం కలిగింది. సరే ఇప్పుడా ముచ్చట ఎందుకు కాని అస్సలు విషయానికి వస్తా.

నాతో పాటు చేరిన వాళ్ళలో డెబ్బయి అయిదు శాతం మంది ఉత్తర భారత దేశం నుండి వచ్చిన వాళ్లే. ఒక్కడికి పొట్ట పొడిస్తే తెలుగు ముక్క రాదు. నాకు తెలుగు తప్ప ఇంకో భాష రాదు. అక్కడ వాళ్ళందరూ हुई, है (హుయి, హై) అని అంటుంటే, నేను కుయ్, కై లాడకుండా కూర్చున్నాను. అంతలోపు నలుగురు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యి నన్ను రక్షించారనుకోండి. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
ఆ రోజు నుండి కార్యాలయంలో ఏ విషయం చర్చకు వచ్చినా హిందీలోనే మొదలెట్టే వాళ్ళు. "ఒరేయ్ బాబు నాకు హిందీ రాదు, కనీసం ఆంగ్లంలో ఏడవండిరా!!" అని అన్నా, నా మొర ఆలకించేవాడు లేకపోయ. పైగా, "హిందీ జాతీయ భాష, అది రాకుండా ఎలా బ్రతుకుతున్నారు ఇన్ని రోజులు?" అని ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళు. "నాకే కాదు మా ఊర్లో ఎవ్వరికీ హిందీ రాదురా బాబు" అంటే వినరే? అప్పుడు అనిపించింది, అదే లింగరాజు గారు ఆ పెట్టే కార్యలయమేదో అద్దంకిలో పెడితే, తిక్క కుదిరేది తింగరి పీనుగలకి, అని. హైదరాబాద్లో అందరికీ హిందీ వచ్చు కాబట్టి బతికిపోతున్నారు.

నార్తోళ్ళు, నార్తోళ్ళు అని తెలుగు వాళ్ళం తిట్టుకుంటుంటే వాళ్ళకి అర్ధం అయ్యేది. అందుకే వాళ్ళకి మేము పెట్టిన పేరు "పైనోళ్లు". అంటే దేశానికి పై భాగం నుంచి వచ్చిన వాళ్లని. ఏ మాటకామాట పైనుంచి వచ్చిన అమ్మాయిలు మాత్రం, సున్నం కొట్టిన గోడల్లాగా, కాల్గేట్ పేస్టులాగా, కాకి రెట్టలాగా, తెల్లగా, చాలా అందంగా ఉంటారు. అన్నింటికన్నా వాళ్ళు అందంగా మాట్లాడే మాట ఏంటో తెలుసా "భయ్యా" అని, ఆ పిలుపులో వైబ్రేషన్ ఉంటుంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పైనోళ్ళంతా చూడటానికి అంతర్జాతీయ మేదావులలాగా ఉంటారు. వాళ్ళు ప్రవర్తించే తీరు కుడా, కంప్యూటర్ కనిపెట్టింది మేమే అనట్లు ఉంటుంది. కానీ పొట్ట పొడిస్తే ఏ ఒక్కడికీ(ఒకరిద్దరు మినహా) హిందీ తప్ప, మిగితా అక్షరం ముక్క రాదు.

ఇక్కడ మీకు ఒక తమాషా సంఘటన చెప్పాలి. అప్పుడు క్రికెట్ ప్రపంచ పోటీలు జరుగుతున్నాయి. అదే సమయానికి మా కార్యాలయం వారి ఆర్దిక లావాదేవీలను కొన్నాళ్ళు నిలిపివేయాలని, న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ నెల జీతాలు సమయానికి అందకపోవచ్చు అని చెప్పారు. మనోళ్ళు క్రికెట్లో ఇరగదీస్తున్నారని, మా కార్యాలయంలో పెద్ద పెద్ద తెరలు వేసి మరీ క్రికెట్ ఆటను చూపించారు. నాకు టి.వి. లేదు గనుక నేను కూడా వెళ్ళాను. అక్కడ పైనోళ్ళంతా "జీతేగా బయి జీతేగా, ఇండియా జీతేగా" అని పెద్దగా అరుస్తున్నారు. నెననుకున్ననూ.., "మాకు జీతాలు ఇవ్వండి, ఇండియా గెలుస్తుంది" అని అరుస్తున్నరేమో అని అనుకున్నా. తర్వాత ఎవడో స్నేహితుడిని అడిగితే వాడు నవ్వలేక, ఏడవలేక, దాని అర్ధం చెప్పాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.

ఇలా ఆ పయినోళ్ళ దెబ్బకి హిందీ మాట్లాడలేక, ఆంగ్లంలో మాట్లాడి, మాట్లాడి, తెలుగు మర్చిపోతానేమో అని భయమేసింది. అందుకే ఇలా రాయడం మొదలెట్టా. పనిలో పని నా కసి కూడా తీర్చుకుంటున్నాను.

Friday, September 23, 2011

ఊరించే ఊహవా - పాట

మొన్నామధ్య, స్నేహితుడొకడు ముఖ-పుస్తకంలో తమిళ పాట ఒకటి పంపాడు. చాలా బాగా నచ్చిన కారణంగా, వెంటనే ఆ పాటని తెలుగులో రాసుకున్నాను. తీరా తర్వాత తెలిసింది ఏంటంటే! ఇది వరకే ఆ పాట తెలుగులో ఉన్నది అని. మీకు తెలుసు, నేను అనువాద అరవ చిత్రాలు అస్సలు చూడనని. నేను విన్న పాట తెలుగులోకి అనువదింపబడిన "నువ్వు నేను ప్రేమ" అనే చిత్రంలో "ప్రేమించే ప్రేమవా" అనే పాట అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ పాట తర్వాత తెలుగులో విన్నపటికినీ నాకు అంతగా నచ్చలేదు. అందుకే నేను రాసుకున్న పాటని మీకోసం.

ఒక పాప, తన ప్రియుడి కోసం ఈ విధంగా పాడుకుంటుంది, అనమాట !!!

ఒక విన్నపం: పాటలు పాడే అమ్మాయిలు ఎవరైనా ఈ పాట పాడి, నాకు పంపిస్తే, ఆ పాటని కుడా ప్రచురిస్తాను.

పల్లవి:
ఊరించే ఊహవా? ఊహలకే ఊపిరివా?
నా ప్రాణం ప్రాయం నీకేగా
నే నీలా మారే నేడే......

చరణం:
చల్లని సాగర తీరం, హాయిగా వీచే పవనం,
మెల మెల్లగ తాకే అలలతో ఆడాలోయి ..... ఓ ఓ ..
చక్కని చెక్కిలి గిల్లి, పూమాటల మల్లిక అల్లి
నువ్వు చేసే అల్లరి చెప్పేలా లేదే.... మనసే
తూగి, రమ్మంటున్న సాగి, తికమక తీరం తాకే ....
|| పల్లవి||

చరణం:
వెన్నెల రాత్రులు వచ్చి, మన కోసం మల్లెలు తెచ్చి
తమకం వచ్చి, తాపం హేచ్చిందే
గుండెల బరువులు పెరిగి, గుడి గంటల మాదిరి మ్రోగి,
మన తనువులు జరిగి, తగువులు రావాలే... , సొగసే
కోరి.., నీ కౌగిల్లో చేరి, సరిగమ రాగం పాడే....
||పల్లవి||

Sunday, September 18, 2011

జీవిత సారం 2 (అమ్మాయి, జీవితం రెండూ రెండే)

జీవిత సారం 1 లో మీకు జీవితం గురించి, దానికి ఆవకాయతో ఉన్న అనుభందం గురించి చెప్పాను. దానికి కొనసాగింపు ఈ శీర్షికలో చెప్పబోతున్నాను. 
  
  మా కార్యాలయం మొత్తం ఐదు అంతస్తుల భవనం. నేను పని చేసేది నాలుగో అంతస్తులో. రోజూ ఉదయాన్నే లిఫ్ట్లో నాతో పాటుగా చాలా మంది అందమైన అమ్మాయిలు ఎక్కుతారు. రెండవ అంతస్తులో కొంతమంది, మూడో అంతస్తులో మరి కొంతమంది దిగుతారు. నన్ను నాలుగో అంతస్తులో దించి, మిగిలిన ఒకరిద్దరు అందమైన అమ్మాయిలు ఐదో అంతస్తులోకి వెళ్తారు. నాతో నాలుగో అంతస్తులోకి మాత్రం, నలుగురు ఐదుగురు పిల్లల తల్లులు, నాలుగు ఐదు సార్లు పెళ్లిలు ఐన వాళ్ళు వస్తుంటారు (నా ఉదేశ్యం పెళ్ళయి నాలుగు ఐదు సంవత్సరాలు అయినోళ్ళు అని). జీవితంలో ఇలాంటివన్నీ సహజం.

    ఉదాహరణకు, ఒక రోజు రాత్రి పదిన్నరకు మా సుబ్బన్న సికింద్రాబాద్లో రైలు అందుకోవాలి అంటేనూ, ఈ హైదరాబాదులోని దారులలో రద్దీని(ట్రాఫిక్) నమ్మలేము అని ఎనిమిదున్నరకే కుకట్ పల్లిలో బస్సు ఎక్కించా. జీవితం.... తొమ్మిది గంట కొట్టే సరికి సికింద్రాబాద్ చేరినట్టు ఫోను చేశాడు. పదిన్నరకు రావాల్సిన రైలు ఆ రోజు పన్నెండింటికి వచ్చిందట!! పాపం సుబ్బన్న, మూడు గంటలు ఏంచేయాలో తోచక అవస్తపడ్డాడు. అదే ఆలస్యంగా బయలుదేరుంటే ఖచితంగా ఆ రైలు పదిన్నరకు వచ్చేది. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరాము  అనుకోండి, మనం వెళ్ళిన ప్రతి కూడలి(జంక్షన్) దగ్గరా, ఎరుపు రంగు (రెడ్ సిగ్నల్) దర్శనమిస్తుంది. 

పరీక్ష ముందు రోజు(మాత్రమే) శ్రద్దగా చదవటం మనందరికీ అలవాటు. ఆ రోజు ఏదైతే ప్రశ్న కష్టంగా ఉండి వదిలేస్తామో, అదే ప్రశ్న, ప్రశ్నాపత్రంలో  తాటి కాయంత అక్షరాలతో, సబరిమలయిలో సంక్రాంతి పర్వదినాన "మకర జ్యోతి" కనిపించినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనం ఏమ్చేస్తాం? మకర జ్యోతికి పెట్టినట్టు, ప్రశ్నాపత్రంకి   కూడా దండం పెట్టుకోని, మనకు తోచిన జవాబు రాసి వస్తామనుకోండి, అది వేరే విషయం.

ఎవడో చెప్పాడు, పన్నీరు ఎక్కువ తింటే ఒళ్ళు వస్తుందని. ఆ రోజునుండి పన్నీరు తినని రొజు లేదు. అయినా పొట్ట తప్పిస్తే ఒళ్ళు రావటంలేదు. మా స్నేహితుడొకడు ఒళ్ళు తగ్గాలని రోజుకి ఒకసారే మితంగా భోజనం చేస్తున్నాడు. ఒళ్ళు నీరసపడటం తప్పించి సన్నపడటంలేదు. 

అదేంటో నేను ఏ చిత్రం మొదటి రోజున చూసినా, ఆ చిత్రం ఖచ్చితంగా సోది చిత్రాల జాబితాలో చిరస్తాయిగా నిలిచిపోతుంది. ఆదివారం క్రికెట్ ఉంది, టెండూల్కర్ ఆట చూద్దామని కూర్చుంటామా! ఆ రోజే ఏదో ముఖ్యమైన పనున్నట్టు మన టెండూల్కర్ అన్న ఇలా వచ్చి అలా పోతాడు. అప్పటికీ నాన్న తిడుతూనే ఉంటారు, "నువ్వు చూడమాకురా వాళ్ళు సరిగ్గా ఆడరు" అని. అన్నట్టుగానే నేను చూడటం మొదలుపెట్టగానే మనోళ్ళు ఒక క్రమశిక్షణతో, ఒక  వరుస క్రమంలో అవుట్ అవుతుంటారు. 

ఇంతెందుకు, నిన్నటి దాకా వానాకాలం, వర్షం పడుతుందేమో అని గొడుగు తీసుకెళ్తే, భరించలేనంత ఎండ కాసేది. అదే బట్టలు ఉతికి ఆరేస్తే మాత్రం, దిక్కుమాలిన వర్షం ముంచుకొచ్చింది. జీవితం!!!!!!!! ఇది చూసిన మా పక్కింటి ఆవిడ, ప్రొద్దున్నే వచ్చి "బాబు అనంతరాము, ఈ రోజు ఒడియాలు, మిరపకాయలు ఎండ  పెట్టుకోవాలి  అనుకుంటున్నా, నువ్వు మాత్రం బట్టలు ఉత్తకుండా, కాస్త గొడుగు తీసుకొని అలా బజారుకి వెళ్లిరా బాబు ", అని బతిమిలాడింది.        

అందుకనే ఈ రామానంద స్వామి ఏమంటాడంటే "అమ్మాయి, జీవితం రెండూ రెండే, వాటి మాట మనం వినాల్సిందే తప్ప, మన మాటలు అవి వినవు గాక వినవు".  రాబోయే శీర్షికలలో జీవితం సారం గురించి మరింత చెబుతాను., అప్పటి దాకా, ఈ రామానంద స్వామి ఆశీస్సులు మీకు సదా ఉంటాయని తెలియజేస్తున్నాను..... సశేషం...  

Wednesday, September 7, 2011

నేను మెచ్చిన నటుడు

రోజు ఎవరి గురించి అయినా, రెండు ముక్కలు మంచిగా వ్రాయాలి అని నిశ్చయించుకున్నాను. ఎవరిని పొగడాలి అనుకుంటుంటే నా దూరవాణి పరికరానికి ఒక సందేశం వచ్చింది. అందులో ఒక కధానాయకుడి మీద అతి నీచంగా రాసిన సందేశం. సందేశం పక్కకు పెట్టి విషయానికి వద్దాం.

కధానాయకుడు, మాట వినగానే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తీ అతను. తన నటనతో సింహం కడుపున సింహమే పుడుతుంది అని నిరూపించాడు.

నాకు అప్పుడు ఎనిమిదేళ్ళ వయసు అనుకుంటా., మా ఊర్లో ఉన్న భూతాల దీవిలో (సినిమా హాల్ని ముద్దుగా అలా పిలుచుకుంటాం) విడుదలయిన ఒక కొత్త చిత్రం, బాగుందంటేను వెళ్ళాను. కధానాయకుడు చేసిన కత్తి విన్యాసం, గుర్రపు స్వారీ నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిత్రంలో ఒక పాటలో చాలా సంగీత గమకాలూ ఉన్నాయి, దానికి అనుగుణంగా తను చేసిన నటన నాకు ఇంకా బాగా నచ్చాయి. చిత్రం ఇప్పటికి ఎన్ని సార్లు చూసానో నాకే గుర్తు లేదు. చిత్రం పేరు "భైరవ ద్వీపం", పాట "శ్రీ తుంబుర నారద నాదామృతం", ఈపాటికి అర్ధం అయ్యి ఉంటుంది కధానాయకుడు మా బాలయ్య బాబు అని?

ఇంతకు ముందు చిరంజీవిని నమ్మకుంటే వేలు చితికింది (చిరంజీవి, చితికిన వేలు), బాలయ్య బాబు అంటే ఇంకేమి చితుకుతుందో ని మొదట్లో కాస్త బయపడ్డాను.

తర్వాత నుంచి బాలయ్యకి నేను అభిమానిని అయిపోయాను. కత్తి పట్టి జానపదం చేసినా, గద పట్టి పౌరాణికం తీసిన, పంచ కట్టి సాంఘిక చిత్రాలు చేసినా, తోడ కొట్టి రచ్చ రచ్చ చేసినా, ఇలా ఒకటేమిటి అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేసిన, చేయగలిగిన అతి కొద్ది మంది నటులలో బాలయ్య బాబు ఒకడు.


ఉదాహరణకు పైన చెప్పినట్టు కత్తి పట్టి భైరవ ద్వీపంలో చేసినా నటన నిజంగా అభినందనీయం. నాకు ఇంకా బాగా నచ్చిన మరో చిత్రం "ఆదిత్య 369". ఇందులో ఒక వైపు కుర్రాడిగా ఇంకోవైపు శ్రీ కృష్ణ దేవరాయునిగా అతను చేసిన ద్విపాత్రాభినయం నిజంగా అద్భుతం. నారి నారి నడుమ మురారి చిత్రంలో ఇద్దరి భామల మధ్యన ముద్దుల బాలయ్య చేసిన అల్లరి ఎవరు మర్చిపోతారు చెప్పండి. బొబ్బలి సింహం నుంచి నిన్నటి సింహ వరకు పేరుతొ వచ్చిన చిత్రాలన్నీ ఒకరకంగా తెలుగు చిత్ర పరిశ్రమకే ఊరట కలిగించాయనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పొతే నాకు నచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి.

చిత్రాల గురించి కాసేపు పక్కన పెడితే, ఒక మనిషిగా తను ఏంటి అని ఆలోచిస్తే, నాకు నచ్చిన మొదటి విషయం, అతను మాట్లాడే తెలుగు. కార్యక్రమంలో అయినా అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడతాడు. ఎవరో చెప్పగా విన్నాను, చిత్ర పరిశ్రమలో ఎవరికీ సమస్య వచ్చినా, ఎంతో బాధ్యతగా, సమస్యని తీరుస్తాడు అని. ఇంకో విషయం, ఒకటి రెండు చిత్రాలు విజయవంతం అవ్వగానే, దర్శకుడికే సూచనలు ఇస్తున్న కధానాయకులు ఉన్న రోజులలో, అన్ని విజయాలు సాధించినా దర్శకుడి పనికి నాడు అడ్డు రాకుండా, దర్శకుడు చెప్పినట్టు చేస్తాడు, అని మా తోటి అభిమాన సోదరులు చెప్పగా విన్నాను.

ఒక కధానాయకుడిగా విజయం సాదించటం చాలా సాధారణమైన విషయం, కానీ, తండ్రికి తగ్గ తనయుడిగా(అంచనాలను అందుకుంటూ) మంచి మనిషిగా పేరు తెచ్చుకోవటం అనేది చాలా కష్టం అని నా అభిప్రాయం. మన కధానాయకుడి మీద అభిమానం ఉంటే ప్రదర్శించటం తప్పు లేదు కానీ, అవతల వాళ్ళని తిట్టటం మంచి పద్దతి కాదు. ఈ మధ్య మొహం పుస్తకంలో బాలయ్య మీద బుద్ది లేని రాతలు, చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పైశాచిక చేష్టలని మనం అస్సలు ప్రోత్సహించకూడదు.

నాలుగు చిత్రాలు అపజయం పొందినంత మాత్రాన కదానయకుడిని తిడితే ఎలా? సింహం రెండు రోజులు పస్తులున్నా సింహమే కానీ కుక్క అవ్వదు కదా? మా బాలయ్య బాబు ఎప్పటికీ సింహమే.

నందిని గెలిచి, ఇంకొద్ది రోజుల్లో మళ్లీ "శ్రీరామా రాజ్యం" చిత్రంతో మన ముందుకు రాబోతున్న బాలయ్య బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలానే మరిన్ని చిత్రాలు తీసి అలరించాలని ఆశిస్తూ
ఒక అభిమాని.
(అతి ముఖ్య గమనిక: ఇదంతా చదివి ఫలానా వంశానికి నేను వీరాభిమానిని అనుకోకండి. ఫలానా వంశం కోసం నేను నా ప్రాణం ఇవ్వను. అలాంటి వాళ్ళకి నా ఓదార్పును తెలియజేస్తున్నాను.)