Thursday, June 13, 2019

మధ్యతరగతి టూత్ పేస్ట్.....

"మధ్యతరగతి టూత్ పేస్ట్", మీరు చదివింది నిజమే. మధ్యతరగతి టూత్ పేస్ట్ అంటే అదేదో తక్కువ రకం టూత్ పేస్ట్ అని నా ఉద్దేశ్యం కాదు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు, కారం, గసగసాలు, గోరింట ఉన్నంత మాత్రాన అది ఎగువ తరగతి అని కాదు. ముందు మీరు 'ఆమె' సినిమాలోని  ఈ వీడియో చూసి , మళ్ళీ ఇక్కడకు రండి.

ఇప్పుడు అర్ధం అయ్యి ఉండాలి మధ్యతరగతి టూత్ పేస్ట్ అంటే ఏమిటో? పేస్టుని వేస్ట్ చేయకూడదు. పేస్టుని ప్రసాదంలా వాడుకోవాలి. ప్రతి రోజు బఠాణీ అంత టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకోమని దంత వైద్యులు సలహా. కానీ మనకు ప్రకటనల్లో అంతకు అయిదారు రెట్లు వేసుకోమని చూపిస్తుంటారు. మొదట్లో అయిదారు రేట్లే వేసుకుంటాము. ట్యూబ్ చివరికి వచ్చే సరికి, దానిని తొక్కి పెట్టి నార తీస్తాం. అదో మధ్య తరగతి ఆర్టు.

చిన్న వయస్సులో అలా ట్యూబ్ చివరికి వచ్చాక, నేను ఎంత పిండినా, నా చిట్టి చేతుల బలానికి ఆ పేస్టు బయటకు వచ్చేది కాదు. మా నాన్నగారో, అమ్మగారో పేస్టు వేస్తే కానీ పళ్ళు తోముకోలేక పోయేవాడిని. అప్పట్లో పళ్ళు రెండు పూట్ల తోమాలి అన్న రూలు లేదు కాబట్టి, ఒక్క పేస్టు ట్యూబ్ ఎక్కువ రోజులే వచ్చేది కాబోలు. మూత కూడా సన్నగా ఉండేది. ఈ మధ్య వచ్చే వాటికి మూత చాలా పెద్దదిగా ఉండటం, పేస్ట్ కంపెనీల దోపిడీ తత్వానికి నిదర్శనం.

మధ్య తరగతి మీద ఎలాగైనా గెలవాలి అన్న తాపత్రయం వాళ్ళది. కార్పొరేట్ కంపెనీలు, అవి తయారు చేసే వస్తువులపై కన్నా, అవి కొనే మనుషుల మీద బాగా పరిశోధనలు చేశాయి. ఇలాంటి విషయాల గురించి చాలా పుస్తకాలే ప్రచురితం అయ్యాయి. ఎలాంటి వస్తువులను ఎలా, ఎక్కడ, ఎంతకు అమ్మితే, ఎక్కువ కొంటారో వారికి బాగా తెలుసు. అలాంటి కంపెనీల కారణంగా, మనం వాడే వస్తువులలో చాలా వరకు, వాటి సామర్ధ్యం ఇంకా మిగిలి ఉన్నా కూడా, కొత్తగా వచ్చిన వాటిని కొంటున్నాము. కాదు మనం కొనేలా చేస్తున్నాయి. లేదా మన అవసరానికి మించి వస్తువులను వాడుతున్నాం అనిపిస్తున్నది (అవసరానికి , స్థోమతకు తేడా గమనించగలరు. స్థోమత ఉన్నంత మాత్రాన అవసరం ఉందని కాదు) 

సెల్ ఫోనులు, కారులు, టి.వి లు లాంటివి కొన్ని ఉదాహరణలు. 2010 లో కొన్న ఫోను, 2019 వరకు పని చేస్తుంది. కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఫోను మారుస్తాం. టి.వీలు కూడా అలానే మారుస్తూ ఉంటాం. మన మధ్య తరగతి టూత్ పేస్ట్ చెప్పిన పాఠాన్ని మనం మర్చిపోతున్నాం అనిపిస్తున్నది. ఈ పైనున్న ఫోటోను చూస్తే నాకు రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి 
  1. 'If it ain't broken, don't fix it' అన్న విషయాన్ని కొద్దిగా మార్చి, 'If it ain't broken, don't replace / buy it', అని ప్రతి విషయంలో గుర్తు పెట్టుకోవాలి. 
  2. 'Take only what you need, not what you want' - ఎంత అవసరమో అంత వాడాలి, ఎంత కావాలో అంత కాదు. 
చాలా మటుకు బడులలో జీవితానికి చాలా అవసరం అయిన విషయాలు చెప్పరు /నేర్పరు. తల్లిదండ్రులను చూసి నెట్టుకు రావటమే. అందులో ముఖ్యంగా, జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండటం, ఆర్ధిక నిర్వహణ (Financial Management) లాంటి వాటి ప్రస్థావనే ఉండదు. తీరా పాతికేళ్ళు నిండాక ఈ రెండు ఒక్కసారే చేయాలంటే ఎంత కష్టమో, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. 

చివరిగా, జీవితం అనేది మధ్యతరగతి టూత్ పేస్ట్ ట్యూబ్ లాంటిది. మొదట్లో చాలా జీవితం ఉందనుకొని విచ్చలవిడిగా ఖర్చు పెడితే, చివరకు వేళ్ళు నొప్పులు పుట్టేలా పిసుక్కోవాలి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

నేను పళ్ళు తోముకునే సమయం అయ్యింది, పోయి పేస్ట్ పిసికే పనిలో ఉంటా....  

ముఖ్య మనవి : ఇది ఎదో తోచక రాసుకున్న సోది. దీనిని ఇక్కడితోనే వదిలేయండి. ఈ చెత్తంతా whatsapp లో కాపీ అయ్యి , అది చివరకు ఎవరూ పట్టించుకోని ఫామిలీ గ్రూపులలో తిరిగటం నాకు ఇష్టం లేదు. 


Tuesday, June 4, 2019

బాలుడితో ఒక రోజు

బాగా బ్రతికిన రోజుల్లో (పెళ్ళి కాక ముందు అని  ఉద్దేశం కాదు), వేటూరి గారి తో ఒక రోజంతా గడిపాను. అలాగే ఇవాళ బాలుడి పుట్టిన రోజు కాబట్టి, ఇవాళ అంతా ఆయన పాటలతోనే గడుపుదామని నిర్ణయించుకున్నా .  అస్సలు వేటూరి గారి మీద రాసిందే, పేరు మారిస్తే బాలు గారికి కూడా సరిపోతుంది. దాదాపు అందులో అన్ని పాటలు ఆయన పాడినవే. కానీ అందులో వాడిన పాటలు ఇక్కడ వాడలేదు. 

"ఈ ఉషా కిరణాలు, తిమిర స౦హరణాలు" అంటూ సూర్యుడు నిద్ర లేపాడు. నిద్ర లేవగానే ఒళ్ళు విరవటం ఎంత సహజమో, ఫోను చూడటం కూడా అంతే సహజం. "కొడితే కొట్టాలి రా six కొట్టాలి" అన్నట్టు క్రికెట్ world cup ఆడుతున్నారు.ఆ వార్తల కోసం వెతికాను.  "రాజాధి రాజాను నేను రా, ఇక వైజాగ్ వైభోగం చూడరా" అన్నట్టు మోడీ,జగన్ ఇద్దరూ తమ మంత్రి వర్గాన్ని విస్తరిస్తున్నారన్న వార్తను చదివాను. 

"ఇది తైలం పెట్టి, తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత" అని పాడుకుంటూ స్నానం ముగించాను (రోజు ఇంట్లోనో, ఆఫీసులోనో ఎవరో ఒకరు ఉంటారనుకోండి, అది వేరే విషయం) 


"చల్తీగా నామ్ గాడీ .." అనుకుంటూ (చలాకి వన్నె లేడి ఎవరని అడక్కండి), ఆఫీసుకి సైకిల్ మీద బయలుదేరాను. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు దారి అంట పచ్చని చెట్లతో నిండి ఉండటంతో  ,"అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం" అని అనుకున్నాను.  అలా సైకిల్ మీద trail లో వెళుతూ ఉండగా, ఒక ప్రక్కగా పరిగెడుతూ ఉన్న ఒక అమ్మాయి , వెనుక ముందు చూసుకోకుండా , ఒక్క ఉదుటున నా సైకిల్ ముందుకు వచ్చింది. ప్రమాదం జరగ లేదు కానీ, మనసులో  'కన్యాకుమారి కనపడదా దారి, కయ్యాలమారి పడతావే జారి' అనుకున్నాను. "అందమా, నీ పేరేమిటి అందమా" అని అడుగుదామనుకున్నాను. తెలుసుకొని మాత్రం, ఏమి పీకగలను అనుకోని, అడగలేదు. 

మేము రోజు కూలీలం అయితే, మా మేనేజర్ ఒక ముఠా మేస్తిరి. అతగాడిని చూడగానే "ఈ పేటకు నేనే మేస్తిరీ .." అన్న పాట గుర్తొచ్చింది. జీతం కాస్త పెంచవయ్యా బాబు అని, "విన్నపాలు వినవలె  వింత వింతలూ " అంటూ ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా వినలేదు మా ముఠా మేస్తిరి. "అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా" అన్నట్టుగా, కుదరదు అని అదే పాట పాడాడు. "నను బ్రోవమని" ఇంకెవరికి చెప్పుకోవాలో.   ఈ మూడు నెలలు కాలేజీలకు సెలవలు అవ్వటం మూలాన, ఇంజనీరింగ్ చదువుతన్న కుర్రాళ్ళు ఇంటర్న్షిప్ కోసం ఆఫీసుకి వచ్చారు.  వాళ్ళని చూడగానే "కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు, వెరెక్కి ఉన్నోళ్ళు" గుర్తొచ్చింది.  

నాతో పాటు పని చేసే అతను ఎదో సహాయం అడిగాడు, "అమలాపురం బుల్లోడా నీకేం కావాలా?" అని అడిగాను (నిజానికి ఆతగాడిది కాకినాడ, రెండు ప్రక్క ప్రక్కనే కదా , సర్దుకోండి). పని చేస్తుండగా, నాకే కొన్ని సందేహాలు వచ్చాయి. "నీ ప్రశ్నలు నీవే , ఎవ్వరూ బదులివ్వరుగా (గూగుల్ తప్ప )" అనుకోని గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నా. 

మధ్యాహ్నం పప్పులో ఉప్పు కొంచం తగ్గింది, "ఉప్పు లేని ఈ పప్పు కూడు, నేను లేని ఈ ఆంధ్రనాడు" అన్న ఉపేంద్ర గుర్తొచ్చాడు.  అలా బయటకు వచ్చి ఒక చెట్టు కింద నిలబడ్డాను. ఆకాశం వైపున చూసి, "మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా" అనుకున్నాను. తిన్న తర్వాత నిద్ర ముంచుకు వస్తుంటే పని చేయటం చాలా కష్టం. "జరుగుతున్నది జగన్నాటకం" అన్నట్టు, కాసేపు పనిచేస్తున్నట్టు నట్టించాను. "చెప్పనా చెప్పనా చిన్న మాట" అంటూ ఇంటికి వెళ్తానని చెప్పి , ఇంటికి చేరాను.  

"సూర్యుడే సెలవని , అలసిపోయాడు". "చుక్కల్లారా చుక్కల్లారా ఎక్కడమ్మా జాబిలీ" అని అడిగాను.  అమావాస్య దగ్గరలో ఉన్నదని గుర్తొచ్చి , "జాబిల్లి కోసం ఆకాశం" ఎంతగా ఎదురు చూస్తున్నదో అనిపించింది. "నమ్మకు నమ్మకు ఈ రేయిని" అని నన్ను నేను హెచ్చరించుకున్నాను. "ఈ రేయి తీయనిది" అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాను. 

ఇలాంటివి ఎన్ని రకాలుగా అయినా రాయొచ్చు. ఆయన పాడిన పాటలు అన్ని ఉన్నాయి మరి.

Saturday, June 1, 2019

పేకాట, పెళ్లి రెండూ ఒకటే!


అనుకోకుండా  ఈ సాలూరి వారి పాట, మళ్ళీ వినటం జరిగింది. వెంటనే కంపు చేయటం కూడా జరిగిపోయింది. 

పేకాట , పెళ్లి రెండూ ఒకటే! పెళ్ళాడినా , పేకాడినా, దెబ్బ తినటం మాత్రం ఖాయం అని తెలుసు. కానీ ఆడకుండా ఉండలేని బలహీనత. ఈ పాట, పెళ్లైన ప్రతి మగ మూగ జీవానికి అంకితం
                    
అయ్యయ్యో వీడికి పెళ్ళై పోయెనే 
అయయ్యో లైఫే ఖాళీ ఆయెనే
అయ్యయ్యో వీడికి పెళ్ళై పోయెనే 
అయయ్యో లైఫే ఖాళీ ఆయెనే
freedom అంతా పోయింది 
సర్వ నాశనం జరిగింది 
freedom అంతా పోయింది 
సర్వ నాశనం జరిగింది 
పెళ్లాం మేడలో తాళితో మొదలై 
                                        తిరుక్షవరమై పోతుంది                   ||అయ్యయ్యో|| 
x
ఏడు కొండలా ఎంకన్న బాబుకే
తప్పలేదు భాయీ
మ్యారేజ్  తిప్పలెన్నో భాయీ
నువు నన్ను ఆపలేదు భాయీ
అది నా తప్పుగాదురోయి 
తెలివి తక్కువగ
పీటలెక్కి నువ్వు దెబ్బ తింటివోయీ
                                         బాబూ నిబ్బరించవోయీ                ||అయ్యయ్యో|| 

కాశి యాత్రకే గమ్మున పోయిన 
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
కాశి యాత్రకే గమ్మున పోయిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
చక్కగ మోక్షం చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే
ఎం.ఎల్.ఏ దక్కేది
                                    మనకు అంతటి లక్కేదీ               ||అయ్యయ్యో|| 


గెలుపూ ఓటమి దైవాధీనం
అన్న మాట తప్పు 
ఆలితో ఆడి గెల్వలేవు 
బయటకు చెప్పి తిరుగలేవు 
ఇంట్లో కూడ ఉండ లేవు 

కోర్టునడిగితే దెబ్బతో 
నీకు విడాకులే వచ్చుఁ 
భరణం దెబ్బ తగలవచ్చుఁ 
                                    చివరకు బొచ్చె మిగలవచ్చు                ||అయ్యయ్యో||