Tuesday, June 4, 2019

బాలుడితో ఒక రోజు

బాగా బ్రతికిన రోజుల్లో (పెళ్ళి కాక ముందు అని  ఉద్దేశం కాదు), వేటూరి గారి తో ఒక రోజంతా గడిపాను. అలాగే ఇవాళ బాలుడి పుట్టిన రోజు కాబట్టి, ఇవాళ అంతా ఆయన పాటలతోనే గడుపుదామని నిర్ణయించుకున్నా .  అస్సలు వేటూరి గారి మీద రాసిందే, పేరు మారిస్తే బాలు గారికి కూడా సరిపోతుంది. దాదాపు అందులో అన్ని పాటలు ఆయన పాడినవే. కానీ అందులో వాడిన పాటలు ఇక్కడ వాడలేదు. 

"ఈ ఉషా కిరణాలు, తిమిర స౦హరణాలు" అంటూ సూర్యుడు నిద్ర లేపాడు. నిద్ర లేవగానే ఒళ్ళు విరవటం ఎంత సహజమో, ఫోను చూడటం కూడా అంతే సహజం. "కొడితే కొట్టాలి రా six కొట్టాలి" అన్నట్టు క్రికెట్ world cup ఆడుతున్నారు.ఆ వార్తల కోసం వెతికాను.  "రాజాధి రాజాను నేను రా, ఇక వైజాగ్ వైభోగం చూడరా" అన్నట్టు మోడీ,జగన్ ఇద్దరూ తమ మంత్రి వర్గాన్ని విస్తరిస్తున్నారన్న వార్తను చదివాను. 

"ఇది తైలం పెట్టి, తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత" అని పాడుకుంటూ స్నానం ముగించాను (రోజు ఇంట్లోనో, ఆఫీసులోనో ఎవరో ఒకరు ఉంటారనుకోండి, అది వేరే విషయం) 


"చల్తీగా నామ్ గాడీ .." అనుకుంటూ (చలాకి వన్నె లేడి ఎవరని అడక్కండి), ఆఫీసుకి సైకిల్ మీద బయలుదేరాను. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు దారి అంట పచ్చని చెట్లతో నిండి ఉండటంతో  ,"అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం" అని అనుకున్నాను.  అలా సైకిల్ మీద trail లో వెళుతూ ఉండగా, ఒక ప్రక్కగా పరిగెడుతూ ఉన్న ఒక అమ్మాయి , వెనుక ముందు చూసుకోకుండా , ఒక్క ఉదుటున నా సైకిల్ ముందుకు వచ్చింది. ప్రమాదం జరగ లేదు కానీ, మనసులో  'కన్యాకుమారి కనపడదా దారి, కయ్యాలమారి పడతావే జారి' అనుకున్నాను. "అందమా, నీ పేరేమిటి అందమా" అని అడుగుదామనుకున్నాను. తెలుసుకొని మాత్రం, ఏమి పీకగలను అనుకోని, అడగలేదు. 

మేము రోజు కూలీలం అయితే, మా మేనేజర్ ఒక ముఠా మేస్తిరి. అతగాడిని చూడగానే "ఈ పేటకు నేనే మేస్తిరీ .." అన్న పాట గుర్తొచ్చింది. జీతం కాస్త పెంచవయ్యా బాబు అని, "విన్నపాలు వినవలె  వింత వింతలూ " అంటూ ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా వినలేదు మా ముఠా మేస్తిరి. "అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా" అన్నట్టుగా, కుదరదు అని అదే పాట పాడాడు. "నను బ్రోవమని" ఇంకెవరికి చెప్పుకోవాలో.   ఈ మూడు నెలలు కాలేజీలకు సెలవలు అవ్వటం మూలాన, ఇంజనీరింగ్ చదువుతన్న కుర్రాళ్ళు ఇంటర్న్షిప్ కోసం ఆఫీసుకి వచ్చారు.  వాళ్ళని చూడగానే "కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు, వెరెక్కి ఉన్నోళ్ళు" గుర్తొచ్చింది.  

నాతో పాటు పని చేసే అతను ఎదో సహాయం అడిగాడు, "అమలాపురం బుల్లోడా నీకేం కావాలా?" అని అడిగాను (నిజానికి ఆతగాడిది కాకినాడ, రెండు ప్రక్క ప్రక్కనే కదా , సర్దుకోండి). పని చేస్తుండగా, నాకే కొన్ని సందేహాలు వచ్చాయి. "నీ ప్రశ్నలు నీవే , ఎవ్వరూ బదులివ్వరుగా (గూగుల్ తప్ప )" అనుకోని గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నా. 

మధ్యాహ్నం పప్పులో ఉప్పు కొంచం తగ్గింది, "ఉప్పు లేని ఈ పప్పు కూడు, నేను లేని ఈ ఆంధ్రనాడు" అన్న ఉపేంద్ర గుర్తొచ్చాడు.  అలా బయటకు వచ్చి ఒక చెట్టు కింద నిలబడ్డాను. ఆకాశం వైపున చూసి, "మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా" అనుకున్నాను. తిన్న తర్వాత నిద్ర ముంచుకు వస్తుంటే పని చేయటం చాలా కష్టం. "జరుగుతున్నది జగన్నాటకం" అన్నట్టు, కాసేపు పనిచేస్తున్నట్టు నట్టించాను. "చెప్పనా చెప్పనా చిన్న మాట" అంటూ ఇంటికి వెళ్తానని చెప్పి , ఇంటికి చేరాను.  

"సూర్యుడే సెలవని , అలసిపోయాడు". "చుక్కల్లారా చుక్కల్లారా ఎక్కడమ్మా జాబిలీ" అని అడిగాను.  అమావాస్య దగ్గరలో ఉన్నదని గుర్తొచ్చి , "జాబిల్లి కోసం ఆకాశం" ఎంతగా ఎదురు చూస్తున్నదో అనిపించింది. "నమ్మకు నమ్మకు ఈ రేయిని" అని నన్ను నేను హెచ్చరించుకున్నాను. "ఈ రేయి తీయనిది" అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాను. 

ఇలాంటివి ఎన్ని రకాలుగా అయినా రాయొచ్చు. ఆయన పాడిన పాటలు అన్ని ఉన్నాయి మరి.

7 comments:

  1. జీతం కాస్త పెంచవయ్యా బాబు అని, "విన్నపాలు వినవలె వింత వింతలూ " అంటూ ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా వినలేదు మా ముఠా మేస్తిరి. 😃😃😃
    -Jayanth

    ReplyDelete
  2. బాగుంది రామ్ గారు...చిన్న correction...పచ్చదనమే & ఈ రేయి తీయనిది(remix) పాడింది హరిహరన్

    ReplyDelete
    Replies
    1. నిజమే గమనించుకోలేదు. తెలియజెసినందుకు ధన్యవాదాలు.

      Delete