Sunday, March 27, 2011

మెదడు తినే మందు బాబులు

            ఈ మధ్య చాల మందికి(దాదాపు అందరికి) మందు తాగటం ఒక గొప్ప అలవాటు అయింది. అదేంటో మందు తాగటం అలవాటు లేదంటే "ఇంకా ఎదగలేదా?", "మందు తాగటం కూడా రాదా?" అని అడుగుతున్నారు.  మొన్న మధ్య నా స్నేహితుడొకడు చాల కాలం తరువాత కలిశాడు. మాటల సంధర్బంలో "ఏరా ఇప్పటికైనా తాగటం మొదలు పెట్టావా, లేక ఇంకా పప్పు లాగ అలానే ఉన్నావా?" అని అడిగాడు. 

            మనం గమనిస్తే భోజనం చేయటానికి వెళ్ళేవాడు, పక్కనున్న వాడిని "రారా భోజనం చేద్దాం" అని మాత్రం అడగడు. కాని మందు తాగటానికి వెళ్ళేవాడు మాత్రం ఖచితంగా "రారా మామ, పోయి కాస్త మందు కొట్టి వద్దాం" అని మాత్రం అడుగుతాడు. సరే ఇక అసలు విషయానికి వద్దాం. మందు తాగటం తందనాలాడటం పక్కన పెడితే, నా స్నేహితులలో  కొంత మంది మందు బాబులు ఉన్నారు.  వాళ్ళు ఎప్పుడూ తాగుతూ ఉంటారో? లేక తాగినప్పుడే నేను గుర్తుకు వస్తానో? తెలియదు.

ఎప్పుడు నాకు ఫోను చేసినా తాగటం తప్ప ఇంకో దాని గురించి మాట్లాడారు. ఉదాహరణకు మొన్న ఒక స్నేహితుడు ఫోన్ చేసాడు., ఆ సంభాషణ ఇలా సాగింది.., 

    నేను:        ఏరా? ఎలా ఉన్నావు?    
స్నేహితుడు: ఏముంది రా, ఇప్పుడే అలా బజార్కి వెళ్ళాను, మా స్నేహితుడు ఒకడు కలిశాడు, హయిగా తాగి వచ్చాము.

    నేను:        ఏంటి విశేషాలు?              
స్నేహితుడు: మొన్న మన సురేష్ కలిశాడు రా, ఇద్దరం కలిసి మన కే.బి. రెస్టారెంట్లో తాగము రా., అబ్బో కేక అనుకో. 

    నేను:        ఎలా ఉన్నాడు రా? వాడిని కలిసి చాలా రోజులైంది.          
స్నేహితుడు: వాడికేమి రా, ఎత్తినది దించకుండా తాగాడు. అబో నాలుగు బుడ్డీలు తాగాములే., అయినా తాగనోడివి నీకెందుకు రా మందు గురించి?  

    నేను:        (నేను మందు గురించి ఎప్పుడు అడిగాను?) ఇంకా??             
స్నేహితుడు: ఎప్పుడొస్తావు రా ఒంగోలు? ఇంతవరకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు మందు ఇప్పించలేదు రా.,

    నేను:         రేపు సింగరకొండ తిరునాళ్ళకి వస్తాను లేరా.           
స్నేహితుడు:  మీ S/W వాళ్ళు అందరూ బాగా తాగుతారట కదరా? నువ్వు కూడా మొదలు పెట్టు, కలిసి పండగ చేద్దాం. (తా చెడ్డ కోతి వనమంతా చేరచిందంటే ఇదే)

    నేను:          ఒరేయ్, మీ పక్క వీదిలో ఆ అమ్మాయి ఏమి చేస్తున్నది రా? (కొంపతీసి అ అమ్మాయి కూడా తాగుతున్నది అని చెప్తాడేమో  అనుకున్న)
స్నేహితుడు: ఆ బాగానే ఉంది రా.,ఒంగోలు వచ్చే ముందు ఫోను చెయ్.

            ఇలా ఫోనులోనే కాదు కలిసినప్పుడు కూడా ఇంతే, మందు రామాయణం తప్ప ఇంకొకటి ఉండదు. ఇంకొకడైతే హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు వాడికి తెలుసు. ఫలానా బాలానగర్లో ఓ చిరునామా అడిగితె, "అదా., ఆ రెస్టారెంట్ పక్క వీదిలోనే., పోయినా నెలే అక్కడ తాగింది." అని చెప్తాడు. 

Wednesday, March 16, 2011

కాబోయే పెళ్లి కొడుకు

నా స్నేహితుడికి పెళ్లి చూపులు అని చెప్పగానే, నాకు ఆశ్చర్యమేసింది. వయసులో నాకన్నా సంవత్సరం చిన్నవాడు., వాడికి అప్పుడే పెళ్లి చూపులు. చూపులే కదా అనుకుంటే ఏకంగా నిశ్చతార్ధం దాకా వెళ్ళాడు. ఇంతకీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి అంటే, " అసలు ఏమి జరిగిందో గుర్తులేదు రా చెప్పటానికి.," అని అమాయకంగా చెప్పాడు.

 అసలు నా స్నేహితుడు అని చెప్పటం కాదు కాని, వాడు ఎంత అమాయకుడు అంటే "ఇలియానా అందంగా ఉంటుంది కదరా"  అని అడిగితె, "ఆ దేశం ఎక్కడ ఉంది అనంతరాము?"  అని అడిగే అంత అమాయకుడు. అలాంటి పసి కందుకు పెళ్లి అనే సరికి నిజంగానే ఆశ్చర్యమేసింది. మొదట్లో నమ్మలా., అందునా మా ఊరికి అల్లుడిగా వస్తున్నాడనే సరికి ఇంకా ఆశ్చర్యమేసింది. ఇది నిజమని నమ్మటానికి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి ఖాయం చేసుకున్నా. ఇంకా తన గురించి చెప్పాలంటే, 
  1. అందగాడు, మహేష్ బాబు లాగా అందంగా తెల్లగా ఉంటాడు( ఇద్దరు ఒకే రోజున పుట్టారు).
  2. మంచి మనసు(పని మనుషులని కూడా అక్క చెల్లెళ్ళు అని భావించే అంత).
  3. మంచి చదువు. మంచి బుద్ది.
  4. ఆరు పలకల దేహం లేక పోయినా  సంవత్సరానికి ఆరు లక్షల జీతం సంపాదిస్తున్నాడు. 
  5. అమ్మనాన్నలకు ఒక్కగానొక్క  వర ప్రసాదం. 
  6. ఆస్తి కుడా జాస్తి, 
  7. చెడు అలవాటులంటారా?  అస్సలు దానోడు కాదు.
  8. దైవ భక్తీ కూడా మెండు.  

"తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండదు" అని సామిత., అలాంటిది అందరిని ఏదో ఒక రకంగా తిట్టే వీడు స్నేహితుడిని ఇంత పోగుడుతున్నాడు., వాడికేమన్న డబ్బులు  బాకీ ఉన్నాడా అనుకుంటున్నారేమో., కానే కాదు, ఎందుకంటే ఇవి పొగడ్తలు కాదు. ఇన్నాళ్ళ మా స్నేహంలో నేను తెలుసుకున్న నిజాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా కన్నా మంచి వాడు.

కాని "ఇక మునుపటి లాగా కాకుండా మాతో తక్కువ మాట్లాడుతావేమో రా?"  అని అంటే నవ్వి ఊరుకున్నాడే తప్ప ఖండించలేదు. నాకు అప్పుడే అర్ధం అయింది. వీడు ఇక మీదట అమాయకుడు కాదు అని. మా స్నేహితులు అందరిలోనూ తనదే మొదటి పెళ్లి కాబట్టి, అందరం కలుసుకుందామని నిర్ణయించుకున్నాం. ఆ రోజు ఖర్చు అంత వాడి మీదే వేస్తే పోతుంది కదా. అందునా కొత్త పెళ్లి కొడుకు కాబట్టి కాదని అనలేడు. చాల రోజుల తర్వాత చిన్ననాటి స్నేహితులందరం కలుస్తాము అనే ఆత్రుత అందరిలోనూ ఉన్నది.  

ఇంతకీ ఎవరా స్నేహితుడు అనుకుంటున్నారా? సమాధానం కోసం వేచి ఉండండి. వివరాలు నిశ్చతార్ధం తర్వాత.  

Thursday, March 10, 2011

అమీర్పేట్ కొత్తల్లో

         2006 జూన్, పరీక్షలు రాసి, హైదరాబాద్ వచ్చాను. అంతకుముందు ఎన్నో సార్లు వచ్చినా కానీ,   అప్పుడు మాత్రం సెలవుల్లో రెండు నెలలు ఉండి ఏదో ఒక కంప్యూటర్ భాష నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించాలని కసిగా వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది చెప్పారు, అమీర్పేటలో బాగా నేర్పిస్తారు. చాలా సంస్థలు ఉంటాయి అని.    మొదటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు తెలిసిన స్నేహితుడితో అమీర్పేట్ బయలుదేరాను. 

         వీదులన్ని తిరునాళ్ళ మాదిరి బాగా రద్దీగా ఉన్నాయి. వచ్చే పోయే బస్సులనిండా జనాలు కిక్కిరిసి ఉన్నారు. నా స్నేహితుడు ఏవో రెండు అంకెలు చెప్పి ఆ అంకెగల బస్సు ఎక్కాలని చెప్పాడు. రెండు నిముషాల తర్వాత ఆ బస్సు రానే వచ్చింది. అస్సలే కిక్కిరిసి ఉంది. దిగే వాళ్లు దిగుతున్నారు ఎక్కే వాళ్లు ఎక్కుతున్నారు. అందరు దిగిన తరువాత ఎక్కుదాంలె అని నేను మిన్నకుండి పోయాను. అంతలో అది కదిలింది, నా స్నేహితుడు చక్కగా బస్సులో దూరి వెళ్ళిపోయాడు. సరే కాళీ బస్సు రాకుండా ఉంటుందా అని ఎదురు చూశాను. అంతలో నా స్నేహితుడికి ఫోన్ చేశాను, ఎక్కడికి రావాలి అని, తను మైత్రివనం దగ్గర ఉంటాను అన్నాడు. ఎంత సేపు చూసిన కాళీ బస్సు రాదాయ. సరే ఎలాగోలా చివరకి ఒక బస్సు పట్టుకొని మైత్రివనం దిగాను. దిగటం కూడా అందరిని తోసుకొని, ఎలాగోలా దూకేశా. ఎదురుగ నించున వాడిని మైత్రివనం ఎక్కడ అని అడిగాను. వాడితో పాటు అక్కడ ఒకళ్ళిద్దరు నన్ను వింతగా చూశారు,  తీరా చూస్తె ఆ వెనకనున్న భవంతి మీద తాటికాయంత అక్షరాలతో మైత్రివనం అని రాసుంది.

         ఇంతలో నా మిత్రుడికి ఫోను చేస్తే ఒక ఇరవై నిముషాలు పడుతుంది అన్నాడు. ఒక్కడినే దిక్కులు చూస్తూ నించున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా గుంపులు గుంపులుగా తెగ తిరుగుతున్నారు, ప్రతి ఒకళ్ళ చేతిలో ఒక ఫోను మాత్రం ఖచితంగా ఉంది. కొన్ని జంటలయితే బండి మీద వెళ్తూ కుడా తెగ ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగినోళ్ళకి వింత కాకపోవచ్చు, కానీ అద్దంకి నుంచి వచ్చిన నాకు అంతా కొత్తగా, వింతగా, చెత్తగా అనిపించింది. చాలా మంది అమ్మాయిలు ముసుగు వేసుకుని ఉన్నారు. నాకు తీవ్రవాదులు ఏమో అని భయం వేసింది.


              ఇంతలో నా మిత్రుడు రానే వచ్చాడు. "ఏంటిరా అమ్మాయిలంతా ముసుగులు వేసుకుని తిరుగుతున్నారు?" అని అడిగాను.  "చలికాలం అయితే ఒళ్ళు పగలకుండా, ఎండాకాలం అయితే పేలకుండా, కందిపోకుండా, వాన కాలం అయితే తడవకుండా ఆ ముసుగు వేసుకుంటారు" అని చెప్పాడు. ఇంకా ఆ ముసుగు వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని నాకు ఈ మధ్యనే తెలిసింది.

                    ఆ పక్క వీదిలోకి వెళ్తే బెత్తెడు మందాన కాగితాలు పడేసి ఉన్నాయ్. ఒక పది మంది ఇరువైపులా నించొని ఆ కాగితాలు పంచుతున్నారు. అందరి దగ్గర తీసుకుని జాగ్రత్తగా దాచిపెట్టాను. ఆ పక్కనే, శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో దారికి ఇరువైపులా వజ్రాలు రాసులుగా పోసి అమినట్టు , దారికి ఇరుప్రక్కలా అన్ని రకాల కంప్యుటర్ పుస్తకాలు అముతున్నారు. ప్రపంచంలో నలుమూలల ఉన్న S/W ఇంజినీర్లలో చాల మంది ఇక్కడ నేర్చుకునే వెళ్ళారట!!!  ఆకాసంలో చుక్కల కన్నా ఆ వీదిలో బాన్నర్లు  ఎక్కువ ఉన్నాయి.




                  ఒక రెండు మూడు సంస్థలు తిరిగి చివరకు ఒక చోట చేరదామని నిశ్చయించుకున్నాను. వెళ్ళిన ప్రతి సంస్థలో మనకు కావాల్సిన వివరాలు అందించటానికి అ, ఆ, ఇ, ఈలు  కుడా రాని అందమైన అమ్మాయిలని ఉంచారు. వెళ్ళిన ప్రతి వాళ్ళకి మర్యాదగా కలం, కాగితం ఇచ్చి వివరాలు తీసుకున్నారు. మనకు ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతకి కావాలంటే అంతకు చెప్తారట!!!  తీరా తర్వాత చూస్తె ఒకొక్క తరగతి గదిలో 400 మంది ఉన్నారు. ఆఖరికి అక్కడికి కూడా అందరు జంటలు జంటలు గానే వచ్చారు. తరగతి గది కూడా మా ఊర్లో గొడ్లసావిడి లాగా ఉంది. రెండు రోజులు వెళ్లి మానేసాను. ప్రాణం హాయిగా అనిపించింది. మొత్తానికి అదొక విచిత్రమైన అనూభూతిగా మిగిలిపోయింది.        


Tuesday, March 8, 2011

అమ్మమ్మ, తాతయ్య

           ఏ పండగ వచ్చినా, అందరూ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకి వెళ్లుతుంటారు. అక్కడ ఒక పది రోజులు హాయిగా ఆడి, పాడి, కావాల్సిన పిండి వంటలు చేయించుకుని తిని వస్తుంటారు. నా చిన్నతనంలో మా అమ్మమ్మ,తాతయ్యల దగ్గర చేసిన అల్లరి నేను ఎప్పటికి మర్చిపోలేను. చేసిన అల్లరికి అమ్మ తన్నబోతే అమ్మమ్మ ఎన్ని సార్లు కాపడిందో లెక్కలేదు.   

          మనకు బాగా ఇష్టం అయిన వారు ఎవరంటే అమ్మ, నాన్న అని చెబుతాం.,  సరే అందరూ అలా చెప్పాలని లేదుగా? కొంతమంది ఫలానా అమ్మాయనో/అబ్బాయనో, లేక పొతే బాలకృష్ణ, చిరంజీవి అనో చెబుతారు. కానీ మనల్ని ఇష్టపడే వాళ్లలో, మన అమ్మానాన్నలతో సమానంగా ప్రేమించేది ఎవరంటే  అమ్మమ్మ, తాతయ్య.  దీనికి చిన్న ఉదాహరణ, పోయినా సారి ఇంటికి వెళ్ళినప్పుడు, అందరూ "ఏంటిరా చిక్కి పోయావ్? భోజనం సరిగ్గా ఉండటంలేదా?" అని అడిగారు. మా అమ్మ నాన్న అయితే " వేళకు భోజనం చెయ్, బాగా పండ్లు తిను, సమయానికి నిద్రపో" అని సలహాలు ఇచ్చారు. కొంత మంది వెటకారంగా  పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ మా అమ్మమ్మ మాత్రం "నేను హైదరాబాద్ వచ్చి నీకు వండి పెడతాను" అని అన్నది. అది అమ్మమ్మ ప్రేమ అంటే. దేవుడు తానూ అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు., అప్పుడప్పుడు అమ్మ అలసిపోతుందేమో అని అమ్మమ్మని సృష్టించి ఉంటాడు. 

         ఇక తాతయ్యలంటారా ., సముద్రం లాగా పైకి కనపడరు కానీ, లోపల సముద్రం ఎంత లోతుందో మన మీద అంత ప్రేముంటుంది.  మనకు పేరు పెట్టటం దగ్గర నుండి పెళ్లి వరకు ప్రతిదీ వాళ్ల చలవతోనే కదా జరిగేది.  మా పెదనాన్న, మనవడు నిద్ర పట్టక ఏడుస్తుంటే తెల్లవార్లూ వాడిని బుజాన వేసుకొని నిద్రబుచ్చే పనిలోనే ఉంటాడు. వాళ్ల గురించి ఎంత చెప్పిన తక్కువే.

           వాళ్ళకి మనం ఎప్పటికి ఋణపడి ఉంటాం. వాళ్ళకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. మనం సంతోషంగా ఉండాలనే తప్ప వాళ్ళు మన నుంచి ఏమి ఆశిస్తారు చెప్పండి. అందుకే వీలునప్పుడల్లా వాళ్లతో ఒక్కసారి ప్రేమగా మాట్లాడండి. కనీసం వారానికోసారి ఫోను చేయండి. వాళ్ళ దీవెనలే మనకు శ్రీరామారక్ష.

Friday, March 4, 2011

జీవితమే ఒక రాజీ

జీవితంలో ప్రతిది మనం కోరుకునట్టు జరగదు. మన జీవితంలో మనం ఎన్నో విషయాల్లో రాజీ పడుతుంటాం. కానీ కొన్ని విషయాలలో సర్దుకుపోలేము. బొమ్మరిల్లు చిత్రం లో కధానాయకుడు సిద్దార్ద్ తను జీవితంలో పెళ్లి, ఉద్యోగం, రెండిటి విషయంలో రాజీ పడను అంటాడు. ఇప్పుడు సోది అంత ఎందుకు చెప్తున్నాను అంటే, పుట్టిన దగ్గర నుంచి ప్రతి విషయంలో రాజీ పడాల్సిన పరిస్తితి. చిన్నప్పుడు తల్లితండ్రులతో రాజీ, యవ్వనంలో అమ్మాయిలతో రాజీ, నడివయసులో బాధ్యతలతో రాజీ, వృధాప్యంలో పిల్లలతో, జబ్బులతో రాజీ., బతుకంతా రాజీనే..,

చదువుకునేటప్పుడు బడిలో ఆడుకోవాలని ఉన్నా గురువులకి బయపడి ఆడుకోలేము.
ఉద్యోగంలో చేరిన తర్వాత మన పైన అధికారికి బయపడి, తను చెప్పినట్టు రాజీ పడాలి.
పెళ్ళైన తర్వాత భార్య/ భర్త తమ భాగస్వామి చెపినట్టు రాజీ పడాలి,
మా మల్లి మామ లాంటి కొడుకులతో తండ్రులు రాజీ పడాలి, మా నాన్నలాంటి తండ్రులుంటే కొడుకులు రాజీ పడాలి,
చిరంజీవి వాళ్ళ బావ అల్లు అరవింద్ చెప్పినట్టు, బాలకృష్ణ వాళ్ళ బావ చంద్రబాబు చెపినట్టు
రాజశేఖర్ తన 'జీవిత' చెప్పినట్టు రాజీ పడాలి.
ప్రజా ప్రతినిధులు తమ అదినాయకులు చెప్పినట్టు నడుచుకొని రాజీ పడాలి
చిత్రాలలో కధానాయికతో కధానాయకుడు, కధనాయకుడితో దర్శకుడు, దర్శకుడితో నిర్మాత రాజీ పడాలి.


భాగవతం మనకు నేర్పిన వాటిల్లో అతి గొప్పది రాజి అనేది. ఐదు ఊర్లు ఇవ్వండి అని పాండవులు రాజీకి పంపితే కౌరవులు ఒప్పుకోలేదు. దాంతో యుద్ధం జరిగింది, అంతా పోయారు. నచ్చిన అమ్మాయి/అబ్బాయి దొరక్కపొతే మనం కూడా రాజీ పడి దొరికిన వాళ్లతో సంతోషంగా ఉండాలి. అలానే మనకు నచిన ఉద్యోగం రాకపోతే, వచ్చిన ఉద్యోగంతో రాజీ పడాలి. (అలా అని కావాల్సిన దాని కోసం పోరాడద్దు అని చెప్పటం నా ఉదేశ్యం కాదు.)