ఏ పండగ వచ్చినా, అందరూ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకి వెళ్లుతుంటారు. అక్కడ ఒక పది రోజులు హాయిగా ఆడి, పాడి, కావాల్సిన పిండి వంటలు చేయించుకుని తిని వస్తుంటారు. నా చిన్నతనంలో మా అమ్మమ్మ,తాతయ్యల దగ్గర చేసిన అల్లరి నేను ఎప్పటికి మర్చిపోలేను. చేసిన అల్లరికి అమ్మ తన్నబోతే అమ్మమ్మ ఎన్ని సార్లు కాపడిందో లెక్కలేదు.
మనకు బాగా ఇష్టం అయిన వారు ఎవరంటే అమ్మ, నాన్న అని చెబుతాం., సరే అందరూ అలా చెప్పాలని లేదుగా? కొంతమంది ఫలానా అమ్మాయనో/అబ్బాయనో, లేక పొతే బాలకృష్ణ, చిరంజీవి అనో చెబుతారు. కానీ మనల్ని ఇష్టపడే వాళ్లలో, మన అమ్మానాన్నలతో సమానంగా ప్రేమించేది ఎవరంటే అమ్మమ్మ, తాతయ్య. దీనికి చిన్న ఉదాహరణ, పోయినా సారి ఇంటికి వెళ్ళినప్పుడు, అందరూ "ఏంటిరా చిక్కి పోయావ్? భోజనం సరిగ్గా ఉండటంలేదా?" అని అడిగారు. మా అమ్మ నాన్న అయితే " వేళకు భోజనం చెయ్, బాగా పండ్లు తిను, సమయానికి నిద్రపో" అని సలహాలు ఇచ్చారు. కొంత మంది వెటకారంగా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ మా అమ్మమ్మ మాత్రం "నేను హైదరాబాద్ వచ్చి నీకు వండి పెడతాను" అని అన్నది. అది అమ్మమ్మ ప్రేమ అంటే. దేవుడు తానూ అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు., అప్పుడప్పుడు అమ్మ అలసిపోతుందేమో అని అమ్మమ్మని సృష్టించి ఉంటాడు.
ఇక తాతయ్యలంటారా ., సముద్రం లాగా పైకి కనపడరు కానీ, లోపల సముద్రం ఎంత లోతుందో మన మీద అంత ప్రేముంటుంది. మనకు పేరు పెట్టటం దగ్గర నుండి పెళ్లి వరకు ప్రతిదీ వాళ్ల చలవతోనే కదా జరిగేది. మా పెదనాన్న, మనవడు నిద్ర పట్టక ఏడుస్తుంటే తెల్లవార్లూ వాడిని బుజాన వేసుకొని నిద్రబుచ్చే పనిలోనే ఉంటాడు. వాళ్ల గురించి ఎంత చెప్పిన తక్కువే.
వాళ్ళకి మనం ఎప్పటికి ఋణపడి ఉంటాం. వాళ్ళకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. మనం సంతోషంగా ఉండాలనే తప్ప వాళ్ళు మన నుంచి ఏమి ఆశిస్తారు చెప్పండి. అందుకే వీలునప్పుడల్లా వాళ్లతో ఒక్కసారి ప్రేమగా మాట్లాడండి. కనీసం వారానికోసారి ఫోను చేయండి. వాళ్ళ దీవెనలే మనకు శ్రీరామారక్ష.
I agree with you on the point, and also appreciate the narration of this point. Its indeed touching!
ReplyDeleteThanx a lot babaigaru.,
ReplyDelete