Thursday, March 10, 2011

అమీర్పేట్ కొత్తల్లో

         2006 జూన్, పరీక్షలు రాసి, హైదరాబాద్ వచ్చాను. అంతకుముందు ఎన్నో సార్లు వచ్చినా కానీ,   అప్పుడు మాత్రం సెలవుల్లో రెండు నెలలు ఉండి ఏదో ఒక కంప్యూటర్ భాష నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించాలని కసిగా వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది చెప్పారు, అమీర్పేటలో బాగా నేర్పిస్తారు. చాలా సంస్థలు ఉంటాయి అని.    మొదటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు తెలిసిన స్నేహితుడితో అమీర్పేట్ బయలుదేరాను. 

         వీదులన్ని తిరునాళ్ళ మాదిరి బాగా రద్దీగా ఉన్నాయి. వచ్చే పోయే బస్సులనిండా జనాలు కిక్కిరిసి ఉన్నారు. నా స్నేహితుడు ఏవో రెండు అంకెలు చెప్పి ఆ అంకెగల బస్సు ఎక్కాలని చెప్పాడు. రెండు నిముషాల తర్వాత ఆ బస్సు రానే వచ్చింది. అస్సలే కిక్కిరిసి ఉంది. దిగే వాళ్లు దిగుతున్నారు ఎక్కే వాళ్లు ఎక్కుతున్నారు. అందరు దిగిన తరువాత ఎక్కుదాంలె అని నేను మిన్నకుండి పోయాను. అంతలో అది కదిలింది, నా స్నేహితుడు చక్కగా బస్సులో దూరి వెళ్ళిపోయాడు. సరే కాళీ బస్సు రాకుండా ఉంటుందా అని ఎదురు చూశాను. అంతలో నా స్నేహితుడికి ఫోన్ చేశాను, ఎక్కడికి రావాలి అని, తను మైత్రివనం దగ్గర ఉంటాను అన్నాడు. ఎంత సేపు చూసిన కాళీ బస్సు రాదాయ. సరే ఎలాగోలా చివరకి ఒక బస్సు పట్టుకొని మైత్రివనం దిగాను. దిగటం కూడా అందరిని తోసుకొని, ఎలాగోలా దూకేశా. ఎదురుగ నించున వాడిని మైత్రివనం ఎక్కడ అని అడిగాను. వాడితో పాటు అక్కడ ఒకళ్ళిద్దరు నన్ను వింతగా చూశారు,  తీరా చూస్తె ఆ వెనకనున్న భవంతి మీద తాటికాయంత అక్షరాలతో మైత్రివనం అని రాసుంది.

         ఇంతలో నా మిత్రుడికి ఫోను చేస్తే ఒక ఇరవై నిముషాలు పడుతుంది అన్నాడు. ఒక్కడినే దిక్కులు చూస్తూ నించున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా గుంపులు గుంపులుగా తెగ తిరుగుతున్నారు, ప్రతి ఒకళ్ళ చేతిలో ఒక ఫోను మాత్రం ఖచితంగా ఉంది. కొన్ని జంటలయితే బండి మీద వెళ్తూ కుడా తెగ ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగినోళ్ళకి వింత కాకపోవచ్చు, కానీ అద్దంకి నుంచి వచ్చిన నాకు అంతా కొత్తగా, వింతగా, చెత్తగా అనిపించింది. చాలా మంది అమ్మాయిలు ముసుగు వేసుకుని ఉన్నారు. నాకు తీవ్రవాదులు ఏమో అని భయం వేసింది.


              ఇంతలో నా మిత్రుడు రానే వచ్చాడు. "ఏంటిరా అమ్మాయిలంతా ముసుగులు వేసుకుని తిరుగుతున్నారు?" అని అడిగాను.  "చలికాలం అయితే ఒళ్ళు పగలకుండా, ఎండాకాలం అయితే పేలకుండా, కందిపోకుండా, వాన కాలం అయితే తడవకుండా ఆ ముసుగు వేసుకుంటారు" అని చెప్పాడు. ఇంకా ఆ ముసుగు వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని నాకు ఈ మధ్యనే తెలిసింది.

                    ఆ పక్క వీదిలోకి వెళ్తే బెత్తెడు మందాన కాగితాలు పడేసి ఉన్నాయ్. ఒక పది మంది ఇరువైపులా నించొని ఆ కాగితాలు పంచుతున్నారు. అందరి దగ్గర తీసుకుని జాగ్రత్తగా దాచిపెట్టాను. ఆ పక్కనే, శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో దారికి ఇరువైపులా వజ్రాలు రాసులుగా పోసి అమినట్టు , దారికి ఇరుప్రక్కలా అన్ని రకాల కంప్యుటర్ పుస్తకాలు అముతున్నారు. ప్రపంచంలో నలుమూలల ఉన్న S/W ఇంజినీర్లలో చాల మంది ఇక్కడ నేర్చుకునే వెళ్ళారట!!!  ఆకాసంలో చుక్కల కన్నా ఆ వీదిలో బాన్నర్లు  ఎక్కువ ఉన్నాయి.




                  ఒక రెండు మూడు సంస్థలు తిరిగి చివరకు ఒక చోట చేరదామని నిశ్చయించుకున్నాను. వెళ్ళిన ప్రతి సంస్థలో మనకు కావాల్సిన వివరాలు అందించటానికి అ, ఆ, ఇ, ఈలు  కుడా రాని అందమైన అమ్మాయిలని ఉంచారు. వెళ్ళిన ప్రతి వాళ్ళకి మర్యాదగా కలం, కాగితం ఇచ్చి వివరాలు తీసుకున్నారు. మనకు ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతకి కావాలంటే అంతకు చెప్తారట!!!  తీరా తర్వాత చూస్తె ఒకొక్క తరగతి గదిలో 400 మంది ఉన్నారు. ఆఖరికి అక్కడికి కూడా అందరు జంటలు జంటలు గానే వచ్చారు. తరగతి గది కూడా మా ఊర్లో గొడ్లసావిడి లాగా ఉంది. రెండు రోజులు వెళ్లి మానేసాను. ప్రాణం హాయిగా అనిపించింది. మొత్తానికి అదొక విచిత్రమైన అనూభూతిగా మిగిలిపోయింది.        


1 comment:

  1. ammayila musugula meeda tv9lo prachurinchina oka video choodandi

    http://www.youtube.com/watch?v=fja138FpIWU&feature=player_embedded#at=35

    ReplyDelete