Wednesday, October 31, 2012

మూడో అడుగు

అక్టోబరు 31 2010, మొదటి సారిగా నేను బ్లాగిన రోజు. ఈ బ్లాగు రాయటం మొదలెట్టి రెండు సంవత్సరాలు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. ఇది వరకే ఆరంభ శూరత్వంలో చెప్పినట్టు, నాకున్న ఆరంభ శూరత్వానికి రెండేళ్ళ పాటు రాస్తాను అని అనుకోలేదు.రెండేళ్ళలో ఇప్పుడు రాస్తున్న దానితో కలిపి ఎనభై రెండు టపాలు. అంటే శతకానికి చాలా దగ్గర అనమాట!!!

ఎన్ని రాశానన్న దానికన్నా, ఎంత రాశానన్న దానికన్నా, ఎమి రాశానో చూసుకుంటే సంతృప్తిగానే అనిపిస్తుంది. నేనేదో "ఆంధ్ర మహాభారతాన్ని" తెలుగులోకి రాసినట్టు చెప్తున్నానని మీకు అనిపిస్తే క్షమించాలి. ఈ సంధర్భంగా, నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ ధన్యవాదాలు, శిష్యులందరికీ అశీస్సులు తెలియజేసుకుంటున్నాను.  ఈ బ్లాగు ద్వారా కొన్ని పరిచయాలు, స్నేహాలు ఎర్పడ్డాయి. జయంత్, కృష్ణా, నాగార్జున ఇలా..., చాలా మంచి స్నేహితులు ఏర్పడ్డారు.

మీకు ఈ సందర్భంగా ఒక శుభవార్త చెప్పాలి. ఇక మీదట నేను శీర్షికలు రాయటం ఆపేస్తున్నాను అనుకుండేరు!! అదేమీ కాదు. తొండ ముదిరి ఊసరవల్లి అయ్యినట్టు, చిన్న చిన్న శీర్షికలతో మొదలుపెట్టి, నవల రాసే దాకా వచ్చాను. రెండు మూడు నెలలు కింద, పైన కూర్చొని ఎలాగోలా ఒక నవల పూర్తి చేశాను. 

ఒక సాఫ్ట్ వేర్ కార్యాలయంలో, కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక అబ్బాయికి, అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కధను, నాకు తోచినంతలో చూపించే ప్రయత్నం చేశాను. వంద కాగితాలకు సరిపడా రాశాను. తీరా రాశాక అనుమానం వచ్చింది, అస్సలు ఇది ఎవరికైనా అర్ధం అవుతుందా? అని. ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు చూపించాను. వాళ్ళు మొహమాటం కొద్దీ అద్భుతంగా ఉందని కాకుండా నికచ్చిగా కొన్ని మార్పులు చెప్పారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చివరకు కధను ఒక కొల్లిక్కి తెచ్చాను. ఇంకొ నెల రెండు నెలలలొ దానిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ నవల చదివాక, అందరూ నన్ను "నవలా రచయిత అనంతరామయ్య" అని పిలవటం మాత్రం మర్చిపోకండే!!!!

ఈ బ్లాగు రాయటంలో మూడో అడుగు వేస్తూ.... సెలవు 

Saturday, October 6, 2012

పెళ్లి చూపులు

ప్రేమంటే కాదో ఫ్యాషన్, పెళ్ళికి అది స్టార్టింగ్ స్టేషన్ అని అన్నాడో సినీ కవి. ప్రేమించే మనస్సు ఉన్నవాళ్ళకి ఇది సరిగ్గా సరిపోతుంది, కానీ ప్రేమించే స్తోమత లేని నా లాంటి వాళ్ళ పెళ్ళికి స్టార్టింగ్ స్టేషన్ ఏంటి??? ఆలోచించండి? మీకు తట్టే ఒకే ఒక్క స్టేషన్ పేరు, పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపుల గురించే నేనిప్పుడు చర్చించబోతున్నాను.  

ఒక అబ్బాయికిగానీ, అమ్మాయికిగానీ పెళ్లి చేసేయాలి అని ఇంట్లో వాళ్ళు ఒక బలహీన క్షణాన అనుకుంటారు. వరసైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ గొడవా లేకుండా కానిచ్చేస్తారు. వీళ్ళతో మనకు ఎలాంటి సమస్య లేదు. అలా ఎవరూ లేకపోతే, పిల్లలకు పెళ్లి చేయాలి  అన్న విషయాన్ని చుట్టపక్కాలకు దండోరా వేస్తారు, ఆంగ్లంలో వృత్తం పెద్దది అయితే, ఫలానా వాళ్ళ సంబంధం ఉందని చెప్తారు. ముందు ఫోటో చూపించి, ఆ తరువాత జాతకాలు చూపించి, నచ్చితే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. 

ఈ మధ్య కాలంలో అయితే, అబ్బాయినీ, అమ్మాయినీ ఏదో ఒక రెస్టారెంటులోనో , లేదంటే ఏదైనా ఉద్యానవనంలోనో కలవమంటారు. వాళ్ళు కలిసి, మాట్లాడుకొని, ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని (చేసుకున్నాము అనుకోని) ఏదో ఒక విషయం తెల్చుతారు. వీళ్ళతో కూడా ఎటువంటి సమస్యా లేదు. 

ఇప్పుడు తరతరాలుగా చూస్తున్న పెళ్లి చూపుల దగ్గరకు వెళ్దాం. సినిమాలలో చూపించినట్టు, ఏదో ఒక శనివారమో, లేదో ఆదివారమో, అమ్మాయి ఇంటికి (ఉంటే సొంత కారులో లేదంటే అద్దె కారులో) వెళ్తారు. ముందు తిను బండారాలు రావటం, తర్వాత అమ్మాయి రావటం ఇలా, సినిమాల్లో చూపించినట్టే జరిగిపోతుంది. మధ్య మధ్యలో నా లాంటి వాళ్ళు వేసే కుళ్ళు జోకులు కూడా వినపడుతుంటాయి. ఎవరో ఒక పెద్ద మనిషి కలగ చేసుకొని, అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోనివ్వండి అని చెప్తారు. ఇద్దరికీ కాసేపు ఏకాంతాన్ని ప్రసాదిస్తారు. 

ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అప్పటిదాకా  ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయిని, పది నిముషాలు మాట్లాడి నచ్చిందో లేదో చెప్పటం సాధ్యమేనా? అలాగని గంటలు గంటలు మాట్లాడాలి అని అడగలేము కదా. అస్సలు ఆ పది నిముషాలు అయినా ఏమి మాట్లాడాలి? అందునా నా లాంటి భయస్తుడు, నోట్లో నాలుక లేని అమాయకుడు ఏమని మాట్లాడగలడు చెప్పండి? ఎలాగూ పెళ్లి చూపులకు ముందుగానే ఇద్దరి వివరాలు చెప్పేస్తారు. ఇంకా అడగటానికి ఏముంటుంది? తెలిసి కూడా అడిగితే పిచ్చి అనుకుంటారు. అలాగని అడగకుండా కూర్చుంటే మెతక అంటారు.

పోనీ పాటలు పాడటం వచ్చా? వంట చేయటం వచ్చా? లాంటి ప్రశ్నలు సినిమాలల్లో బాగుంటాయి కానీ, నిజ జీవితంలో బాగుండవు అని నా అభిప్రాయం. పోనీ మీ అలావాట్లు ఏంటి? అని అడిగితే, నిజాలు చెప్తారు అన్న నమ్మకం ఏమీ లేదు కదా? నేనైతే చెప్పను, అస్సలు అలా చెప్పగలిగే మంచి అలవాట్లు కూడా లేవనుకోండి, అది వేరే విషయం. ఇంక లాభం లేదనుకొని, ఈ విషయంలో పెద్దల సలహా తీసుకుంటే మంచిదనిపించి, చాలా మందిని, చాలా పెళ్లి చూపులు అయిన వాళ్ళని వాకబు చేశాను. " రాత్రి తిన్న కూర పేరే గుర్తు లేదు, ఎప్పుడో జరిగిన పెళ్లి చూపులు ఎవడికి గుర్తుంటాయి?" అని కసురుకున్నారు. ఇంకొంత మంది, " పెళ్లి చూపులలో అబ్బాయిలు మాట్లాడే రోజులు ఎప్పుడో పోయినాయి, ఇప్పుడు కేవలం అమ్మాయిలు మాట్లాడితే వినటమే" అని చెప్పారు. కనీసం ఆ అమ్మాయిలు  ఏమి మాట్లాడతారో చెప్పమని అడిగాను. " నీ అదృష్టం బాగుంటే వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నట్టు చెప్తారు. ఇంకొంతమంది, వాళ్ళ వాళ్ళ స్థాయి ఏంటో చెప్తారు. అప్పుడు నీ స్థాయి ఏంటో ఆలోచించుకొని, పెళ్ళా? లేదంటే ఇంకో పెళ్లి చూపులా? అనే విషయం తేల్చుకోవాలి." అని చెప్పారు.

మీరు ఈ విషయం మీద ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే మిక్కిలి సంతోషిస్తాను. ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఈ విషయం మీద  ఇంకా ఆలోచించాల్సింది చాలా ఉంది. కాబట్టి ఇంకో శీర్షికలో చూద్దాం. నాకు పెళ్లి అయిందాకా ఈ కష్టాలు తప్పవు మరి.