Saturday, December 14, 2013

శునకానందం

చిన్నప్పుడు మా ఇంట్లో ఒక కుక్క ఉండేది. దాని పేరు 'రాజు'. కుక్క పేరు 'రాజు' ఏంటి అనుకుంటున్నారా? అడవికి రాజు ఎవరు? సింహం. గ్రామానికి సింహం ఎవరు? కుక్క. మరి కుక్కకి 'రాజు'అని పేరు పెడితే తప్పేంటి?? అది చచ్చిపోయి ఇవాల్టికి సరిగ్గా 20 సంవత్సరాలు అయ్యింది. 'రాజు' ఆల్సేషనూ కాదు, సెన్సేషనూ  కాదు. 24 గంటలూ ఇంటి బయట తిరుగుతూ ఉండేది. సాటి కుక్కలతో ఆడుకోవటానికి కూడా వెళ్ళేది కాదు.రోజూ మా బామ్మ, నాకు అన్నం పెట్టాక, దానికి కూడా అన్నం పెట్టేది.

కాకపోతే రాజులోని ప్రత్యేకత ఏంటంటే? రాత్రుళ్ళు మనకి తెలిసిన వాళ్ళు వస్తే బాగా అరిచేది, తెలియని వాళ్ళు వస్తే, అరవటం కాదు కదా, కనీసం మొరిగేది కూడా కాదు. నాకు ఊహ తెలిసే సరికే అది బాగా ముసలి కుక్క కావటంతో, కొన్నాళ్ళకు చనిపోయింది. ఇందాకేదో తమాషాగా అన్నాను తప్పించి, అది చనిపోయిన రోజు నిజానికి నాకు గుర్తు లేదు. ఎన్నని గుర్తుంచుకుంటాము? అస్సలే నా జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అందుకే అప్పుడప్పుడు రాసిన దాని గురించే మళ్ళీ మళ్ళీ రాస్తుంటాను.  నాకు మాత్రం కుక్కలంటే మహా భయం. అవి కరుస్తాయని ఒక కారణం అయితే, కరిస్తే పత్యం ఉండాల్సి రావటం ఇంకో కారణం. 

రెండేళ్ళ తరువాత, ఒక చిన్న కుక్క పిల్లని ఎవరో తీసుకు వచ్చి ఇచ్చారు, పెంచుకోమని. అది డాబర్ మాన్ జాతికి చెందినది అని చెప్పారు. దాని జాతిలోనే మాన్ అని ఉంది కదా అని మానవత్వంతో దానిని పెంచాలని నిర్ణయించుకున్నాను. నాలుగు రోజుల తరువాత తెలిసింది, నేను పెట్టే తిండి దానికి చాలదని, ఇంకా బలమైన ఆహారం పెట్టాలని, కుదిరితే మాంసాహారం పెట్టాలని. ఇంట్లో అందరం శాకాహారులం అయ్యుండి, అదొక్కటే మాంసాహారం ఎందుకని దానిని వేరెవరికో ఇచ్చేశాను.  ఆ తర్వాత, ఇప్పటి వరకు మళ్ళీ కుక్కల జోలికి వెళ్ళలేదు. 

నా స్నేహితుడొకడికి కుక్కలంటే ప్రాణం. ఇంట్లో నా అంత ఎత్తు కుక్కని పెంచుకుంటున్నాడు. నేను వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా, వెంటనే వచ్చి నాకటం మొదలుపెడుతుంది. నాకు మాత్రం చచ్చే చిరాకుగా, భయంగా ఉంటుంది. నా స్నేహితుడు మాత్రం దానిని బాగా ముద్దు చేస్తాడు. వాళ్ళ అన్యోన్యతను చూసి అప్పుడప్పుడు నేను కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది. దాని కల్ముషం లేని ప్రేమ చూస్తే (దూరం నుంచి) ముచ్చట వేసేది. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కలు చనిపోతే, ఎంతో విల విలలాడి పోయేవాడు. పాపం దిగులుతో రెండు రోజులు భోజనం కూడా చేసేవాడు కాదు. దాని అంత్యక్రియలు కూడా బాగా జరిపించే వాడు. కుక్క, కుక్క చావు చావకుండా చూసేవాడు. నిజమే, కొంత మంది మనుషులు కుక్క చావు చచ్చారు అంటారు కదా, అలానే ఆ కుక్క మనిషి చావు చచ్చింది అనమాట!!!

మా ఇంటి ప్రక్కన శ్రీను, చక్రి అని ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. చిన్నోడు శ్రీనుకి 4 ఏళ్ళు, పెద్దోడు చక్రికి 6 ఏళ్ళు. పిల్లలు గొడవ చేయటంతో వాళ్ళ నాన్న ఒక చిన్న కుక్క పిల్లని ఇంటికి తీసుకు వచ్చాడు. నాలుగు రోజులు బాగానే జరిగింది. ఐదో రోజు చిన్నోడు ఉన్నట్టుండి ఏడుపుకి లేచాడు. వాడిని ఓదార్చటం ఎవ్వరి వల్లా కాలేదు. స్పెషలిస్ట్ ని పిలుద్దాము అనుకొనే లోపు, "కుక్క కరిచింది" అని ఏడుస్తూ చెప్పాడు. అది ఊర కుక్క  అయినప్పటికీ ఊరికే కరవదు కదా అని అనుమానం వచ్చింది. "ఎందుకు కరిచింది రా?" అని గట్టిగా అడిగితే, "దాని తోక అటూ ఇటూ ఊగుతున్నదని, ఒక సారి లాగాను. మళ్ళీ తోక ఊపింది. ఈ సారి ఇంకా గట్టిగా లాగాను, కరిచింది" అని ఏడుస్తూ చెప్తుంటే మా అందరికీ నవ్వు ఆగలేదు. 

చివరగా, చిన్నప్పుడు ఒక పద్యం చదివినట్టు గుర్తు "కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి " అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సింహాసనం మీద కుక్కని కూర్చోబెడితే, కనీసం విశ్వాసంతో అయినా మంచిగా పని చేస్తుందేమో!!!