Friday, June 28, 2013

తెలుగు పద్యమా? నా తలకాయా?

చిన్నప్పుడు పద్యం నేర్చుకోవటం అనేది చాలా చిరాకుగా ఉండేది. ఉన్న నాలుగు పాదాలని, నలభై సార్లు, అప్పటికీ కంఠస్తము కాకపోతే నాలుగు వందల సార్లు చదివి మరీ పిడి వేయాల్సి వచ్చేది. కొన్ని పద్యాలు ఇట్టే వచ్చేసేవి, కొన్ని ఆట్టే ఇబ్బంది పెట్టేవి. వేమన శతకం, సుమతీ శతకం, సుభాషిత రత్నాలు, ఇప్పుడు గుర్తు లేవు కానీ, అప్పట్లో బాగానే చదవాల్సి వచ్చింది.

అందరూ లెక్కల్లో వందకు వంద మార్కులు రావాలి, లెక్కలు వస్తేనే ఇంజనీర్ అవ్వగలం అని ఒకటికి పది సార్లు చెప్పే వారు. బడిలో చెప్పింది చాలక, ఇంటికి వచ్చాక సాయంత్రం పూట, ఇంకో గంట, కుదిరితే రెండు గంటలు మళ్ళీ లెక్కలు చెప్పించేవారు. అంతెందుకు, మీ జీవితం మొత్తంలో ఎంసెట్ ర్యాంకు ఎంతా? అని అడిగే వాళ్ళు ఉంటారు కానీ, ఎప్పుడైనా, ఎవ్వరైనా (తల్లి తండ్రులతో సహా), తెలుగులో ఎన్ని మార్కులు అని ఎప్పుడైనా అడిగారా? (నన్ను మాత్రం ఎవ్వరూ అడగలేదు)

ఇప్పుడు నాకో సంగతి గుర్తుకు వస్తున్నది. ఎనిమిదో తరగతిలో అనుకుంటా, ఒక ప్రక్క మా తెలుగు పంతులుగారు, కీ.శే. పాండు రంగారావు గారు, పాఠం చదువుతూ, నోట్స్ రాసుకోమని చెప్పారు. అంతా గురువుగారు చెప్పింది రాసుకుంటూ ఉంటే, నా స్నేహితుడు అజయ్, నేను, చెప్పింది రాయకుండా, "ఆంగ్ల పద వినోదం" ఆడుతూ కూర్చున్నాము. కాసేపటికే ఇద్దరం గురువుగారికి దొరికిపోయాము. "ఆంగ్ల పద వినోదం", అందునా తెలుగు తరగతిలో, మాస్టారుకి మండి పోయింది. ఇద్దరినీ ఇరగదీసి వదిలిపెట్టారు. 
 
ఆ తరువాత తరువాత, పద్యం అంటే ఇష్టం, పద్యం నేర్చుకోవాలి అన్న ఆతృత పెరిగాయి. క్లిష్ట సమాసాలలో ఉండే పద్యాలను గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే గొప్పగా ఉండేది. ఆ తరువాత గురువుగారు గణ విభజన చక్కగా నేర్పించారు. ఏదో రావాల్సిన మార్కుల కోసం చదివకుండా, సరదాగా చదవటంతో, ఎంతో కొంత ఇప్పటికీ గుర్తుంది. అస్సలు ఒక పద్యంలోని పాదానికి గణ విభజన చేసి, ఆ పద్యం ఏ చందస్సులో ఉందో తెలుసుకోవటమే గగనం అయ్యేది. అలాంటిది స్వంతంగా ఒక పద్యం రాయటం అంటే మాటలా? పద్యం రాయటమే అనుకుంటే, అవధానాలలో అప్పటికప్పుడు పద్యం చెప్పటమంటే......

యుట్యూబ్లో అవధానం చూస్తుంటే, అందులో చెప్పిన పద్యం అర్ధం చేసుకోవటానికే  అరగంట పట్టింది. అలాంటిది ఆశువుగా అర నిముషంలో అవధానులవారు పద్యం చెప్తుంటే, ఆశ్చర్యమేసింది. అలా చెప్పాలంటే ఎంత ధారణ కావాలి? ఎంత నేర్పు కావాలి? జావా ఏముంది, కుక్కని అమీర్ పెట్ లో అప్పగిస్తే, నాలుగు నెలల్లో నేర్పుతారు. అదే మనకు(నాకు) సరిగ్గా రావటం లేదు, ఇంక తెలుగేమి వస్తుంది, నా తలకాయి. నా లాంటి కోతులు కుక్క, ముక్క, చెక్క, రెక్క అని ప్రాసతో నాలుగు ముక్కలు రాసేసుకొని, మాకు మేమే అదేదో గొప్ప కవిత్వము అనుకొని మురిసి పోతుంటాము (ఇది ఎవ్వరినీ ఉద్దేశించి అన్న మాటలు కావు, కేవలం నా అభిప్రాయం మాత్రమే). 

ఇంకొన్ని రోజులు పోతే గొడవే ఉండదు. తెలుగు వచ్చిన వాడే ఉండడు., ఇంక అవధానం చేసే వారు ఉన్నా అది అర్ధం చేసుకునే వాళ్ళు అస్సలే ఉండరు. పొరపాటున ఎవరితో అయినా 'అవధానం' అని అంటే, "అవయవ దానమా? చచ్చాక చేస్తాములే పో" అని అంటారేమో. చాదస్తం అంటే అనండి కానీ, నాకు మళ్ళీ చందస్సు పూర్తిగా నేర్చుకోవాలని ఉంది. మొన్న మా పిన్నిగారి అమ్మాయికి ఛందస్సు నేర్పే భారాన్ని నా భుజాలపై వేశారు. నాకు వచ్చిందేదో, తనకు ఎక్కించటానికి ప్రయత్నించాను. ఖర్మ ఏంటంటే తెలుగు ఛందస్సుని ఆంగ్ల పదాలతో నేర్పాల్సి రావటం. తప్పు పిల్లలది కాదు. చక్కగా చెప్పేవాళ్ళు ఉంటే, ఆనందంగా నేర్చుకుంటారు. 

"శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు" అంటారు, అదేంటో నా పేరులో అనంతం అయితే ఉంది కానీ, నాకున్న దరిద్రాలకి ఒక్క ఉపాయం కూడా తట్టటంలేదు, క్షణం తీరిక దొరకటం లేదు. ఎలాగోలా మొదలు పెట్టాలి. నాకు నేర్పించాలి అని ఎవ్వరికైనా అనిపిస్తే నేర్పించగలరు. లేదు, ఇలా నేర్చుకోవచ్చు అని సలహాలు ఏమైనా ఉంటే తప్పక ఇవ్వగలరు. చచ్చే లోపు ఒక్క తెలుగు పద్యం రాయాలి అని బతుకుతూ........  సెలవు