Tuesday, May 22, 2012

ప్రత్యక్ష ప్రసారం

కొన్ని దూరం నుంచి చూస్తే బాగుంటాయి, కొన్ని దగ్గర నుంచి చూస్తే బాగుంటాయి. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూడు, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం......... వేటాడేస్తది. ఈ మాట జూ. ఎన్. టి. ఆర్ చెప్పినా పెడచెవిన పెట్టాను. నేనేదో పులితో ఆట ఆడాను అని కాదండోయి, అలాంటి అనుభవమే నాకు ఎదురయ్యింది.

చిన్నపటి నుంచి కడుపు నొప్పి, కాలు నొప్పి అని అబద్దం చెప్పి, బడి ఎగ్గొట్టి మరీ టి.వి.లో క్రికెట్ చూసేవాడిని. ఏనాడు ఏడింటికన్నా ముందు నిద్రలేవని నేను, క్రికెట్ ఉన్నప్పుడు తెల్లవారుజామున మూడింటికే లేచిన రొజులు ఉన్నాయి. ఇలా టి.వి. లో చూడటమే తప్ప, ఏనాడూ ప్రత్యక్షంగా మైదానానికి వెళ్లి చూడలేదు. ఆ కోరిక ఎప్పటికి తీరుతుందా అని ఎదురు చూసిన నాకు ఐ.పి.ఎల్  ద్వారా ఒక అవకాశం వచ్చింది. డెక్కన్ తో రాజస్థాన్ ఆడే ఆటకు వెళ్లాలని నిర్ణయించుకున్నా.

ఎనిమిదింటికి మొదలయ్యే ఆట కోసం, అయిదింటికే మైదానానికి చేరాను. ప్రేక్షకులు ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నరు. కాసేపటికి ఇరు జట్ల క్రీడాకారులు వచ్చి వ్యాయామాలు చేసారు. ఇంకాసేపటికి నా కష్టాలతో పాటు ఆట కూడా మొదలయ్యింది. ఒకపక్క ఉక్కపోత,  అస్సలు మైదానంలో ఎమి జరుగుతుందో, జనాలు ఎందుకు అరుస్తున్నారో అర్ధం చేసుకునేలోపు సగం ఆట అయిపోయింది. అయ్యో సగం ఆట అయ్యింది అనుకునే లోపు ఆట పూర్తి అయ్యింది.

 పులితో ఆడుకోవటం అంటే ఇదేనేమో. హాయిగా ఇంట్లో కూర్చొని చూడటమే ఉత్తమం అని అర్ధం అయ్యింది.  నాలుగు గంటలకే నాకు పిచ్చి ఎక్కిపోయింది.  అలాంటిది రొజంతా అర్ధం కాకుండా చూడాలంటే, ఎంత ఓపిక కావాలీ, ఎంత తీరిక కావాలి.  అలా ఒక రొజు అయితే పర్వాలేదు, టెస్టులకు అయిదు రోజులు వరుసగా వెళ్లటం అంటే సాహసమనే చెప్పాలి.

నేను వెళ్లిన వేళా విశేషం, అప్పటిదాకా గెలుపంటే తెలియని డెక్కన్ జట్టు అనూహ్య విజయం సాదించింది. "నేను వెళ్లానంటే, డెక్కన్ తప్పక గెలుస్తుందిరా"అని హరీష్ కి చెప్తే, "నీ పిచ్చి కాకపొతే కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగు రావటం, డెక్కన్ కి గెలుపు రావటం అంత సులభం కాదురా" అన్నాడు. నేను వెళ్లాక కూడా గెలవకపోతే, "ఎమో గుఱ్ఱం ఎగరావచ్చు? డెక్కనె క్రికెట్ గెలవవచ్చు" అని అనాల్సి వచ్చేది. 

నేను ఇచ్చిన ప్రొత్సాహంతోనే, డెక్కన్ పోరగాళ్లు వస్తూ వస్తూ తమతో పాటు తోడుగా ఐ.పి.ఎల్ నుండి ఇంకో రెండు జట్లను వారి వారి ఇళ్లకు చేర్చారు. పాపం మాల్యా మామాకి ఇప్పుడు ఓదార్పు యాత్ర ఎంతైనా అవసరం. ఈ ఎన్నికలు, కేసులు అన్ని అయిపోయాక తప్పకుండా ఆ ఓదర్పు యాత్రకు ఏర్పాటు చేయాలి.   

ఎక్కడ కూర్చుంటే టి.వి.లో బాగా కనిపిస్తామని ఆలొచించాను. ఆరు కొట్టినా, నాలుగు కొట్టినా ముందుగా కనిపించే ఉల్లాసవనితల ( చీరలు కట్టని చీర్లీడర్స్) వెనుక మనం కూర్చుంటే టి.వి.లో ఎక్కువ సార్లు కనిపించే అవకాశం ఉంటుందని, వాళ్ల వెనుక కళ్లు మూసుకొని కూర్చున్నాను. 

నేను కనిపిస్తానేమో అని, నా స్నేహితులు టి.వి లకు అత్తుక్కు పోయారు. కొంతమంది "ఆట మొత్తం చూశాను, ఎక్కడ కూర్చున్నావురా? కాస్త కనపడేట్టు కూర్చోవాల్సింది" అన్నారు. కొంతమంది నా మీద ప్రేమతో, "నువ్వు కనిపించావురా, పచ్చ చొక్కా కదా"అని ఒకళ్లు ,"ఎర్ర చొక్కా కదా" అని ఇంకొకళ్లు ఇలా ఎవరికి నచ్చిన రంగు వాళ్లు చెప్పేశారు. "అస్సలు చొక్కా లేకుండా ఎగిరితే ఖచ్చితంగా చూపించేవారు" అని కూడా సలహా ఇచ్చారు. మీలో ఇంకెవరికైనా, ఇంకేదైనా రంగు చొక్కాలో కనిపిస్తే, ఖచ్చితంగా నేనే అని నమ్మండి.  

ముగించే ముందు ఓ మాట, నాకు పది రోజుల క్రితం ఒక బహుమతి వచ్చింది. దానిని సమర్పించిన నా స్నేహితుడు భీమినేని వంశీకి, దానిని అమేరికాలో కష్టపడి కొన్న శివన్నకి, దానిని అక్కడ నుంచి జాగ్రత్తగా తీసుకువచ్చిన అనుపమగారికి, తెప్పించిన సోమంచికి, పేరు పేరునా దన్యవాదాలు తెలియజేస్తూ ఈ శీర్షికను ఇక్కడితో ముగిస్తున్నాను .

Sunday, May 13, 2012

గోదావరి

ఒక చలనచిత్రాన్ని చూస్తే, మనస్సు తేలిక పడాలి, సేద తీరాలి. ఇతర ఆలోచనలని అన్నింటిని కాసేపు మర్చిపోయి హాయిగా ఆనందింపచేయగలగాలి. నేను చూసిన వాటిల్లో అలాంటి చిత్రం "గోదావరి". ఈ చిత్రం చూసిన ప్రతి సారి, తెలియని సంతోషం కలుగుతుంది.


ఈ చిత్రంలోని పాటల గురించి ముందుగా నేను చెప్పదల్చుకున్నాను. అర ముక్క ఆంగ్లం కూడా  లేని ఆరు అచ్చ తెలుగు పాటలు. వేటూరి గారంటే మాటలా?? అస్సలు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు.


మొదటి పాట, "ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి", అంత  అందంగా బాలు గారు గాక వేరెవరు పాడగలరు? కళ్లు మూసుకొని ఆ పాట వింటే చాలు, ఆ దృశ్యం అంతా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. "సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోశ్యం, వేసే అట్లు వేయంగానె లాభసాటి భేరం", "ఇళ్లే ఓడలయి పోతున్న ఇంటి పనుల దౄశ్యం", ఇలా ఆ పడవలో జరిగేదంతా వేటూరిగారు కళ్లకు కట్టినట్టు చెప్పారు.      


నాకు నచ్చిన ఇంకో పాట,"అందంగా లేనా? అస్సలేం బాలేనా?"అని సునీత చాలా బాగా పాడింది. నచ్చిన వాడు తనని పట్టించుకోవటం లేదనే విరహంతో ఒక అమ్మాయి పాడుకునే పాటని, చాలా చక్కగా రాశారు గురువుగారు. గురువుగారు అని ఎందుకు అన్నానంటే, నేను వేటూరి గారికి ఎకలవ్య శిష్యుడిని (బొటన వేలు అడగటానికి ఆయన ఇప్పుడు లేరు కదా). గోదావరి ఒడ్డున, చల్లని సాయంత్రాన, ఎకాంత సమయంలో, చాలా చక్కగా తీశారు ఆ పాటను. నా దగ్గరికి అందమైన అమ్మాయి వచ్చి, ఇలా పాడితే ఎంత బాగుంటుందో. గాదావరే అక్కర్లేదు, మూసీ నది అయినా పర్వాలెదు, ముక్కు మూసుకుని నడుస్తా.  


ఇదే చిత్రంలో ఈ రెండిటికన్నా నాకు నచ్చింది, "రామ చక్కని సీతకి"అనే పాట. ఈ పాటను ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు. అస్సలు ఒక పాట రాసేప్పుడు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపించింది. ముఖ్యంగా మొదటి చరణంలో "ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే, ఎత్త గలడా సీత జడను, తాళి కట్టే వేళలోన", అలానే ఇంకో చరణంలో "ఎర్ర జాబిలి చెయ్యి గిల్లి రాముడేడని అడుగుతుంటే, చూడలేదని పెదవి చెప్పే, చెప్పలేమని కనులు చెప్పే, "నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడే" అని రాశారు. నిజమే కదా అప్పుడప్పుడు, కళ్లు మాట్లాడతాయి, పెదవులు చూస్తాయి. 

ఈ చిత్రంలో నచ్చిన ఇంకో అంశం, కమలినీ పాపకి గొంతుని అందించిన సునీతగారు. విచిత్రం ఎంటంటే, ఈ చిత్రలో సుమంత్ పేరు " రాం". కొన్ని సన్నివేశాలలో కమలినీ "రాం, రాం "అంటుంటే, ఒక్కోసారి నాకు ఏడుపు వచ్చేది. నన్ను ఏ అమ్మాయి కూడా అంత అందంగా పిలిచిన దాఖలాలు లేవు.

ఈ చిత్రం చూసి నాకు కూడా అలా గోదావరి మీద పడవలో షికారు చేయాలని, స్నేహితులతో కలిసి బద్రాచలం వెళ్లాను. చిత్రంలో చూసిన పడవనే ఎక్కాలి అనుకున్నా. తీరా చూస్తే, నాలుగు చెక్క ముక్కలకి మేకులు కొట్టి దానినే పడవ అని ఎక్కించారు. పదవ లెకపోతే పోయింది, కనీసం అమ్మాయి అయినా దొరికితే బాగుండు అనుకున్నాను. కానీ ఎమిలాభం? దరిద్రుడు ఎక్కడికో పోతే సముద్రం ఎండిపోయిందట! అందమైన పాప కాదు సరి కదా చేప కూడా కనపడక నిరాశతో శేఖర్ కమ్ములాని తిట్టుకుంటూ ఇంటికి వచ్చాను. అక్కడ దిగిన ఫొటోలు మాత్రం ముఖం పుస్తకంలో పెట్టుకోవటానికి పనికి వచ్చాయి.           

ఇక మీదట ఇలాంటి చక్కని పాటలు ఉన్న చిత్రాలు మరిన్ని వస్తాయని ఆశిస్తూ ఈ శీర్షికని ముగిస్తున్నాను.