Saturday, September 15, 2012

భళే బెంగుళూరు

ఒక నెల క్రితం, ఒక పని మీద, ఒక వారం, ఒక్కడినే, బెంగుళూరు వెళ్లాను.  ఇది వరకు వెళ్ళినా ఒకటి రెండు రోజులకన్నా ఉన్నది లేదు. ఈ సారి మాత్రం కొంచం బెంగుళూరుని అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాను. ఎప్పుడు వెళ్ళినా కానీ అదేదో పాటలో "క్లైమేట్ అంతా నాలాగ లవ్ లో పడిపోయిందేమో అన్నట్టుందే" చెప్పినట్టు, అధ్బుతంగా ఉంటుంది. ఆ హళ్లీలు, పాళ్యాలు ఎంత ముద్దొస్తాయో. 

నేను ఎప్పుడు అక్కడ దిగినా, అదేదో వేరే రాష్ట్రానికి వెళ్ళిన భావనే రాదు, ఏదో తిరుపతి వెళ్లినట్టు, వరంగల్ వెళ్లినట్టు లేదంటే కాకినాడ వెళ్లినట్టు ఉంటుంది. దారి వెంట కనపడే కన్నడ అక్షరాలూ సైతం, చిన్నపిల్లలు చిన్న చిన్న తప్పులతో రాసిన తెలుగులానే అనిపిస్తుంది. అక్కడ మనుషులు, వారి పద్దతులు కూడా మనకు దగ్గరగా అనిపించాయి.

స్నేహితులంతా తలొక చోట ఉండటంతో రోజుకు ఒక ప్రదేశానికి తిరగాల్సి వచ్చింది. నా లాంటి కవి పుంగవుడు కర్ణాటకాలో కదంతొక్కటానికి కాలుమోపాడు, కార్పెట్లు పరచకపోయినా కనీసం కారు కూడా ఏర్పాటు చేయక, కకృతి చూపించారు కసాయిగాళ్ళు. కళాకారులు కారులు లేకపోయినా కాలి నడకన వెళతారని అలానే నడక మొదలుపెట్టాను, కానీ దూరం ఎక్కువ అవ్వటంతో బస్సు ఎక్కక తప్పింది కాదు.

మనకు లాగే అక్కడ కూడా బస్సులో ముందు సగ భాగం స్త్రీలకి, వెనక సగం పురుషులకి కేటాయించారు. చెన్నైలో ఇందుకు బిన్నంగా ఉంటుందనుకోండి అది వేరే విషయం.  కిటికీ దగ్గర కూర్చుంటే, ఒకతను వచ్చి ఈ బస్సు జాంబర్ హళ్ళికి వెళ్తుందా అని తెలుగులో అడిగే సరికి ఆశ్చర్యపోయాను. నేను, తెలియదు అని  తెలుగులోనే సమాధానం ఇచ్చాను. కండక్టరుకి పది రూపాయల కాగితం ఇచ్చాను. ఏడు రూపాయల టికెట్టు ఇచ్చి, వెళ్ళిపోయాడు. మూడు రూపాయల చిల్లర అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు, చిన్నపిల్లాడిని చేసి చిల్లర నొక్కేశాడు. అద్దంలోంచి బయటకు చూస్తే దారి పొడవునా తెలుగు చిత్రాల బొమ్మలే కనిపించాయి.

హైదరాబాద్ లో సగం ప్రయాణం బస్సుకి వేలాడుతూ జరుగుతుంది. ఇక్కడ మాత్రం సినిమా మొదలవగానే హాల్లో తలుపులు వేసేసినట్టు, బస్సు మొదలవగానే తలుపులు వేసేశారు. ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. బస్సు దిగగానే నా స్నేహితుడిని అడిగాను, వాడు ఏ మాత్రం పట్టించుకోకుండా, " ఇక్కడ టికెట్టు చేతికి ఇవ్వటమే ఎక్కువరా, దగ్గరి దూరాలకైతే టికెట్టు కూడా ఇవ్వరు" అని చెప్పటంతో అవాక్కయ్యాను.

ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే, బెంగుళూరులో దాదాపు నాలుగు, అయిదు ప్రదేశాలకు వెళ్ళాను. ప్రతి చోటా, మనుషులు ఎంత మంది ఉన్నారో, కుక్కలు కూడా అంతే సంఖ్యలో ఉన్నాయి. దీని గురించి నాని అని ఒక మిత్రుడు ఏమి చెప్పాడంటే "అన్నా, బెంగుళూరు విశేషం ఏమిటంటే, నువ్వు ఎక్కడైనా నించొని, కళ్ళు మూసుకొని ఒక రాయి తీసుకొని విసిరితే, ఆ రాయి ఖచ్చితంగా ఒక కుక్కకు అయినా తగులుతుంది , లేదంటే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి అయినా తగులుతుంది" అని. సాటి  సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా వినటానికి బాగా లేకపోయినా, వాడు చెప్పింది నిజమనే అనిపించింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, బెంగుళూరులో ఇల్లు అద్దెకు కావాలంటే పది నెలల అద్దె ముందుగానే చెల్లించాలట!!! ఎంత దారుణం, ఇదే హైదరాబాద్ లో అయితే, ఒక నెల అద్దె కడితే చాలు. 

బెంగుళూరుకి ఎలాగైనా ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాను. అందుకే దాని మీద ఒక పాట రాశాను. మాహానుబావుడు ఘంటసాల గారి పాటని కూనీ చేయటం మహాపాపం అని తెలిసినప్పటికినీ, "పాపి చిరాయుహు" కదా అని పాటను పాడు చేశాను .  ఈ పాటని బెంగుళూరులో ఉంటున్న స్నేహితులందరికీ అంకితం చేస్తున్నాను.

భళే బెంగుళూరు, పచ్చనైన ఊరు
వసంతాలు పూచే ప్రతి రోజు

ఊరిలోని మనుషులకన్నా, శునకాలే  ఇక్కడ మిన్న,
మాతృభాష కన్నడ కన్నా, పరభాషే ఎక్కడ విన్న,
కెంప గౌడ నగరం అంతా, నేను చుట్టి వచ్చానంటా .

సగం ఊరు మొత్తం అంతా, సాఫ్ట్ వేరు ఆక్రమణంతా,
అద్దెకి ఇల్లు కావాలంటే, ఆస్తి అడ్వాన్సు ఇవ్వాలంతే. 
రాయలోరి చరిత్ర చెప్పును, దీని ఖ్యాతి తెలియాలన్నా, 


Friday, September 7, 2012

తొందర పడకు

" తొందర పడకు సుందర వదనా " అని ఆటోల మీద చూస్తూనే ఉంటాము. ప్రతి మనిషికి తొందర అనేది ఉంటుంది. అది సహజం. ఉదాహరణకు, కొత్త చిత్రం విడుదల అయ్యింది అంటే, ఆ సినిమా రశీదుల (టికెట్) కోసం ఒకటి రెండు రోజుల ముందుగానే తొందరపడి మరీ వెళతాము. లేదంటే ఆ చిత్రం ప్రదర్శిస్తున్న చోట కొండవీటి చాంతాడంత (అది ఎంత ఉంటుందో నాకు తెలియదు) వరుసలో  గంటసేపు అయినా, ఎండని సైతం లెక్క చేయకుండా నిలబడతాం. ఆలస్యం అయితే ఒకటి రెండు దృశ్యాలైనా అయిపోతాయేమో అన్న ఆదుర్దాతో అరగంట ముందుగానే చిత్రాలయానికి వెళ్తాము. ఒక చిత్రం చూడటానికి అంతంత సమయం వృద్దా చేసి, చివరకు ఆ చిత్రం అయిపోయాక కూడా ఒక్కళ్ళు ఆగరు. ఎవరికీ వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలని ఉరకులు పరుగులు పెడుతుంటారు. చిన్నప్పుడు బడికి కూడా అంతే కదా, ఉదయం ఆలస్యంగా వెళ్ళినా, బడిలో చివరి గంట కొట్టటమే ఆలస్యం అన్నట్టు తొందరపడతాం.

ఒక శనివారం తెల్లవారు జామున పది గంటలకు పలహారం తినాలని, ఇంటి ప్రక్కన ఉన్న హృదయ టిఫిన్స్ కి వెళ్లాను. అక్కడ ఒక ప్రక్కన ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూర్చొని పలహారం తింటున్నారు. ఆ అమ్మాయి ఒక చెంచాతో ఆ అబ్బాయి నోట్లో ప్రేమగా ఉప్మా పెడుతున్నది. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ, ఏమి తింటున్నారో కుడా తెలియకుండా తింటూనే ఉన్నారు (వాళ్ళు తింటుంటే నీకెందుకురా అని అడగచ్చు, నోరు పలహారం చేస్తుంటే  కళ్ళు కాళీగా ఏమి చేస్తుంటాయి చెప్పండి?). ఇంతలో ఒక పెద్దాయన హడావుడిగా వచ్చాడు. ఒక దోస అడిగాడు. అక్కడ, పని చేసే వాళ్ళు తక్కువ, పలహారం చేసేవాళ్ళు ఎక్కువ.

ఐదు నిమిషాలు అయినా కానీ దోస రాలేదు. పెద్దాయన కొంచం అసహనంతో "ఎంత సేపు బాబు?" అని అడిగాడు. పాపం, పెద్దాయనకి తొందరెక్కువ, పనివాళ్ళకి ఒత్తిడి ఎక్కువ. ఒక వైపు పెద్దాయన కోపం, ఇంకోవైపు వాళ్ళ ప్రేమతో వాతావారణం సమతూకంగా ఉంది. ఇంతలోపు పెద్దాయనకి దోస వచ్చింది. ఆయన కళ్ళలో ఆనందం వ్యక్తం అయ్యింది. బహుశా వాళ్ళమ్మాయి పెళ్లి చేసినప్పుడు కూడా అంత ఆనందించి ఉండడు. ఇంతలో ప్రేమించుకుంటున్న అమ్మాయి ఒక్క ఉదుటున అక్కడ పని చేసే వాడి దగ్గరకు వచ్చి, " నేను దోస చెప్పి పావుగంట అయ్యింది, మాకు ఇవ్వకుండా మా వెనక వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారేంటి?" అని చంద్రముఖిలో జ్యోతిక అడిగినట్టు అడిగింది. అప్పటిదాకా లేని తొందర, ఒక్కసారిగా ఎందుకు వచ్చింది? ఆమెకి ఇవ్వలేదని కాదు, పెద్దాయనకి ఇచ్చారని.

అస్సలు మనిషనే వాడికి తొందర పనికి రాదు అని నాకు తెలిసేలా చేసింది ద్రావిడ్. ఎప్పుడూ , అస్సలు తొందర అనేది లేకుండా ఆడతాడు. మనం గమనిస్తే  కొన్ని విషయాలలో తొందరపడే వాళ్లకి లోకంలో మర్యాద ఉండదు. ఉదాహరణకు ఎవరైనా తొందరగా చనిపోతే, అయ్యో పాపం అంటారు. అదే తొందరతో తొమ్మిదో నెలకంటే ముందుగానే పుట్టారనుకోండి, నెల తక్కువ వెధవ అని తిడతారు. ఇదే తొందరపాటుతో ఆరు నెలలు ఆగలేక చంద్రబాబుగారు 2004లో ముందస్తు ఎన్నికలు అన్నాడు, పది ఏళ్ళు వెనకపడిపోయాడు.

 ఇదే విషయం మా కార్యాలయ యాజమాన్యానికి కుడా బాగా తెలిసినట్టున్నది, జీతాలు పెంచమంటే, తొందరపడటం మంచిది కాదు అని నాలుగు నెలల నుంచి నాన్చుతూ ఉన్నారు. ఇవన్నీ ఏమో కానీ, పాలు మాత్రం తొందరగా వేడి మీద  ఉన్నప్పుడే తాగాలి. చల్లారిపోతే బాగుండదు. కాబట్టి నేను ఆ పనిలో ఉంటాను................