Sunday, December 27, 2015

అందని చందమామ (సీతా రాముడు - 2)

నిన్న అతడు సినిమా చూస్తున్నానా.... అస్సలు ఆ సినిమా చూస్తున్నంత సేపు తివిక్రమ్ మీద ఈర్ష , అసూయలతో చూశాను. అస్సలు ఆ సంభాషణలు ఎలా రాశాడా అని. అలా మెచ్చుకుంటూ ఉండగానే ఒక పాట వచ్చింది. ఆ సినిమాలో పాటలు, మాటలకు ఏ  మాత్రం తీసిపోవు. ముఖ్యంగా ఆ పాట "సిరివెన్నెల గారు" రాసినది. ఆయన మాటల మాంత్రికుడు అయితే... ఈయన పాటల భేతాళుడు...

సాదారణంగా అందంగా ఉన్న అమ్మాయి వెంట అబ్బాయిలు పడుతుంటారు. ప్రేమించమని గొడవ చేస్తుంటారు. అలాంటిది, ఒక అమ్మాయి, అబ్బాయి వెంట పడి, ప్రేమించమనటం చాలా అరుదు (ఏదో నా లాంటి అబ్బాయిల వెనుక అమ్మాయిలు తిరుగుతూ ఉండే వాళ్ళు.  అది గతం, పెళ్ళికి ముందు. ఇప్పుడు అంతా అయిపోయింది). సరే ఇంక పాట విషయానికి వస్తే.... ఒక అమ్మాయి, అబ్బాయిని ప్రేమించమని వెంటపడి మరీ అడిగే  సన్నివేశం. "నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన" లాంటి పాటలు శాస్త్రిగారు చాలానే రాశారు. ఉదాహరణకు వర్షం సినిమాలో "కోపమా నా పైన, ఆపవా ఇకనైనా" అనే పాట కూడా అదే కోవకు చెందినది. కానీ అలాంటి వాటన్నింటిలో నాకు నచ్చిన పాట "నువ్వు నాకు నచ్చావు" సినిమాలోది.  పాట మొత్తం పాప ప్లీజ్.... అనటం, బాబు నో అనటం.

"ఒక్క సారి చెప్ప లేవా, నువ్వు నచ్చావని" అని పాప, బాబుని అడిగే పాట. గుండె గుప్పెడే ఉన్నా, దాని ఊహ ఉప్పెనంత ఉంటుంది. అలాంటి దానిని ఒదిగి ఉంచకుండా వదిలేయి, ప్రేమించేయి " అని పల్లవిలో ప్రాధేయ పడుతుంది.  దానికి పాపం హీరో, "నా మానాన నేను మాడిపోయిన మసాలా దొశ తింటుంటే..." అని M S నారాయణ అతడు సినిమాలో అనట్టు "నిదుర పోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి?" అని అంటాడు.

మనిషి జీవితం అందమైన అబద్దం. అబద్దం అనేది లేకుండా రోజు గడవటం కష్టం అయిపొయింది (నా లాంటి వాళ్ళు మినహాయిస్తే ). అస్సలు ఈ అబద్దం అనేది మనకు గోరు ముద్దల దగ్గర నుండే మొదలు అవుతుంది. "చందమామ రావే, జాబిల్లి రావే" అని పాటతో పిల్లలకు ప్రతి తల్లి గోరు ముద్దలు తినిపిస్తుంది (ఈ రోజులల్లో గోరు ముద్దలు లేవు,  పాటలు లేవు. చేతిలో ఒక ఐపాడ్ లాంటి పలక ఒకటిచ్చి అన్నం తినిపిస్తున్నారు ఎంచక్కా,అది వేరే విషయం). చందమామ రాదని తల్లికి తెలుసు. అలా అని చెప్పి పిల్లలని పిలవద్దు అంటామా? అలాగే ప్రేమ కూడా, అందదు అని తెలిసినా ప్రేమించక తప్పదు అని హీరో అంటాడు.
అడ్డమైన కలలు వస్తున్నాయని నిద్రపోవటం మానేస్తామా? నిద్ర ఎంత సహజమో, ప్రేమ కూడా అంతే సహజం అంటూ అమ్మాయి మనస్సులో భావాన్ని అద్భుతంగా రాశారు శాస్త్రి గారు. "కలలన్నవి కలలని నమ్మనని, అవి కలవని పిలువకు కలవమని..." కలలు నిజాలు కావు, అవి ఉన్నాయని నన్ను నమ్మించే ప్రయత్నం చేయకు అని హీరో అంటాడు., పాటల్లో కౌంటర్ వేయటం అనేది శాస్త్రిగారికే చెల్లింది

అందమైన హరివిల్లులతో, వంతెనేసి చిరు జల్లులతో, చుక్కలన్ని దిగి వస్తుంటే, కరిగిపోని దూరం ఉందా?  అందమైన హరివిల్లులతో , ఆకాశం నుండి భూమికి నిచ్చెన వేసినట్టు, చినుకులు చుక్కలు లాగా దిగి వస్తుంటే ఎంతో దూరం కూడా కరిగిపోయింది, మన మధ్య దూరం కూడా అలానే కరగాలి. మనస్సుంటే మార్గం ఉంది కదా అని అమ్మాయి అంటే.....

అంతులేని అల్లరితో, అలుపు లేని అలజడితో, 24 గంటలు అదే పనిగా  కెరటాలు ఎగిరి పడుతూ ఉంటే, నాకోసమే అని ఆకాశం పడిపోతుందా? మన ప్రేమ కూడా అంతే, కలవటం కుదరదు అని అబ్బాయి అంటాడు. ప్రేమ గురించి , ఒకటి అనుకూలంగా , ఇంకొకటి వ్యతిరేకంగా , ఇంత  చక్కగా రాయటం మా సీతారాముడికే చెల్లింది. మీరు కూడా ఆ పాటను ఇక్కడ ఒకసారి వినండి