Friday, August 26, 2011

జీవిత సారం-1 (ఎండాకాలంలో మామిడి కాయ)


జీవితం గురించి మీకు కొన్ని గొప్ప సత్యాలు చెప్పాలని ఈ రోజు ఈ రామానంద స్వామి నిర్ణయించుకున్నాడు. అస్సలు జీవితం అంటే ఏంటి?

ఉద్యోగం వస్తుంది. నాలుగు రాళ్ళు సంపాదించి, నాలుగు సంవత్సరాలు దాటితే పెళ్లి చేస్తారు. చేశారు కదా అని సరిపెట్టుకోకుండా పిల్లల్ని కనాలి. వాళ్ళని పెంచి పెద్ద చేయాలి. వాళ్ళని బడిలో చేర్చాలి. ఎక్కువ మార్కులు, తక్కువ ర్యాంకులు వచ్చేలా చూడాలి. ఆ పిల్లలికి కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి పెళ్లిలు చేయాలి. ఇంతలోపు ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి. మొత్తానికి జీవితం అంటే ఇది అని మనోళ్ళు బాగా అర్ధం చెప్పారు.

సాదారణంగా మనకు ఖర్చు పెట్టాలి అన్నప్పుడు సంపాదన ఉండదు. సంపాదించే అప్పుడు ఖర్చు పెట్టే సమయం ఉండదు. కుకట్ పల్లిలో నుంచొని కోఠి వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి ఖచితంగా సికింద్రాబాద్ వెళ్ళే బస్సు వస్తుంది. నిజంగా చెప్పాలంటే కోఠి వెళ్ళే బస్సు తప్ప మిగితా దారుల్లో వెళ్ళాల్సినవన్నీ వస్తాయి. ఇదే జీవితం అంటే. మనం కోరుకున్నది మనకు దక్కదు. మనకు దొరికింది మనకి నచ్చదు. మళ్లీ నిజం చెప్పాలంటే మనకు దొరికింది తప్ప మిగిలినవన్నీ మనకు నచ్చుతాయి.

ఉదాహరణకు మా ఊర్లో గుప్త అని నా స్నేహితుడొకడు ఉన్నాడు. వాడు ఎప్పుడూ "మీకేమిరా, హైదరాబాద్లో హాయిగా ప్రతి నెల ఒకటో తారీకు పాతిక వేలు తీసుకుంటారు. మా భాదలు మీకేమి తెల్సు?" అని అంటుంటాడు. కానీ నిజానికి వాడు నెలకి నాకన్నా పదింతలు అలవోకగా, చొక్కాకి చెమట పట్టకుండా సంపాదిస్తాడనే విషయం మా ఊరిలో కుక్కకి కూడా తెలుసు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, హాయిగా ఊరికి పోయి ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని. ఇదే జీవితం.

సాదారణంగా మామిడి కాయలు ఏ కాలంలో వస్తాయి? ఎండాకాలంలో, మండుటి ఎండకు రోకళ్ళు పగిలే సమయంలో కదా! ఆ వేడికి తోడు మామిడి కాయలు తింటే ఇంకా వేడి చేస్తుంది. అలాగని తినకుండా ఉండగలమా? తిని ఆ వేడికి విరుగుడుగా మజ్జిగ తాగుతాం. ఎండాకాలం మజ్జిగ దొరకటం కూడా కష్టం, ఇది ఇంకో సమస్య. ప్రతి ఎండాకాలం నాకు ఎదురయ్యే సమస్యల్లో ఇది ఒకటి.

ఇలానే నాలుగేళ్ల క్రితం ఒకసారి ఎండాకాలంలో అతిగా మామిడి కాయలు తిన్న పుణ్యం చేత నోరంతా పూసింది. రెండు రోజులు నోరు తెరవాలన్నా మంట పుట్టింది. ఆ దెబ్బకు మామిడి అన్న మాట వింటేనే మండుకొచ్చింది. కాలేజికి వెళ్లి సాయంత్రం అయిదు గంట కొట్టేసరికి ఇంటికి వచ్చాను. నోరు పూసిన కారణం చేత మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయక బాగా ఆకలి వేస్తుంది. ఎండాకాలం మామిడి కాయలు రావటం చేత, ఇంట్లో అప్పుడే ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్నారు. ఎర్రగా ఆ ఆవకాయని చూస్తే ఎవరికి నోరు ఊరదు చెప్పండి. వేడి వేడి అన్నంలో కాస్త ఆవకాయ, నెయ్యి కలిపి తింటే....... అబ్బో అబ్బో., కానీ నోరు పూసింది గనుక, చేసేది లేక నిరాస, నిస్పృహలతో , ఆకలిరాజ్యం చిత్రంలో కమల్ బాబు లాగా, మంచి నీళ్ళు తాగి కడుపు నింపుకున్నాను.

మంచినీళ్లతో కడుపు నింపుకుని ఉసూరుమంటూ రేడియో పాటలు విందామని కూర్చున్నాను. "పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా" అనే పాట వచ్చింది. అసలే నోరు పూసి ఆవకాయ చూసి నేనేడుస్తుంటే ఈ పాట ఒకటి

పూసింది పూసింది నోరంతా
వాచ్చింది నా ఎడమ చెంపంతా --(2)
అవకాయి ముక్కలనే ఆ ముక్కలనే
చూస్తే నోరూరే ........

ఇప్పటికే జీవితం గురించి చాలా ఎక్కువ చెప్పేశాను(ఆవకాయ గురించి చెప్పి, జీవితం అంటావే అని కసురుకోకండి ) ఇంతకన్నా చెప్తే మీరు అర్ధం చేసుకోలేరు. మరో శీర్షికలో జీవిత సారం మీద ఈ ప్రవాహాన్ని కొనసాగిస్తా. అంత వరకు ఈ రామానంద స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్తూ ... సెలవు ..
--- సశేషం -----


Friday, August 19, 2011

వధువు కావలెను

"వంశమా దానాలి తోకా?" అని వినప్పుడల్లా నాకు మా ముత్తాత ముత్తాత శ్రీ వెంకటప్పయ గారు గుర్తుకొస్తారు. అసలు మా వంశము గురించి చెప్పాలంటే, పది శీర్షికలు తక్కువ కావనుకోండి. కంగారు పడకండి మీ కోసం బాగా తగ్గించి చెప్తా. మా వంశ వృక్షంలో ఒక కొమ్మను మీకిప్పుడు చూపిస్తాను

కీ. శే. శ్రీ అద్దంకి వెంకటప్పయ్య గారు
కీ. శే. శ్రీ అద్దంకి వెంకట నారసింహయ్య గారు
కీ. శే. శ్రీ అద్దంకి రామయ్య గారు
కీ. శే. శ్రీ అద్దంకి వెంకట నారసింహయ్య గారు
కీ. శే. శ్రీ అద్దంకి రామారావు గారు (మా తాతగారు)
శ్రీ అద్దంకి వేంకటేశ్వర రావు గారు
శ్రీ శ్రీ శ్రీ అద్దంకి అనంతరామయ్య గారు

ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, పెళ్ళికి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి అని అంటారు కదా, ఎవరైనా అమ్మాయిల తల్లి తండ్రులకి పనికొస్తుందేమో అని, మా ఏడు తరాల గురించి అలా మొదలు పెట్టా. ఇప్పటికైనా పెళ్లి సంభందాలు చూడటం మొదలు పెట్టక పొతే నేను కూడా మన యువరాజు(క్రికెటర్ కాదు) లాగా 45 సంవత్సరాలు వచ్చినా కూడా ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని భయం పట్టుకుంది. ఇప్పటికే నా స్నేహితులలో చాలా మంది వాళ్ళ వాళ్ళ శక్తీ కొలదీ పెళ్లిల్లు చేసేసుకున్నారు. కొంతమంది రేపో మాపో అంటున్నారు.

ఇప్పుడూ..... నాకు పెద్దగా కోరికలు, షరతులు లేవు. పోనీ పెళ్లి విషయం మా ఇంట్లో వాళ్ళకి వదిలేద్దామంటే, మొన్ననే జీ తెలుగులో బొమ్మరిల్లు చిత్రం నాలుగు వేల సారి చూసాను. పెళ్లి విషయంలో మాత్రం రాజీ పడకూడదు అని సిద్దార్దన్న ఆంగ్లం లో  చెప్పిన సన్నివేశం గుండెకు సచిన్ కొట్టిన బంతిలా అతుక్కు పోయింది.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సౌందర్య లహరి స్వప్న సుందరీ...... అని పాటలో చెప్పలేను కానీ, ఏదో నా శైలిలో

వధువు కావలెను

టీ.వి. అతిగా(కుదిరితే అస్సలు) చూడని అమ్మాయి అయ్యుండాలి.
ఫోను తక్కువగా (రోజుకి ఒక పది నిముషాలు మించకుండా) మాట్లాడే అమ్మాయి అయ్యుండాలి.
పూర్వాశ్రమంలో పద్దతిగా ఉండి ఉండాలి(అంటే ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు).
చదువులో తక్కువ మార్కులు వచ్చుండాలి( అతిగా చదివే వాళ్ళకి మనం ఆమడ దూరం కదా).
సంగీత పరిజ్ఞానం ఉంటే మంచిది, బాగా పాడగలిగితే ఇంకా మంచిది.
తెలుగు వచ్చినప్పటికినీ తెగులు వచ్చిన కోడి లాగా మొహం పెట్టి ఆంగ్లంలో మాట్లాడకూడదు.
రంగు, నా కన్నా కొంచం తెల్లగా ఉండాలి (ఛాయ తక్కువ అయినా కళగా ఉండాలి).
బజారన్నా, షికారన్నా పిచ్చి ఉండ కూడదు.
బాబాలన్నా, వారు చేసే అనుగ్రహ భషణాలన్నా అస్సలు ఆశక్తి ఉండకూడదు
( ఇలా అయితే జన్మలో పెళ్లి కాదని అనుకుంటున్నారా? ఆశ పడటంలో తప్పు లేదు కదా)

పైన చెప్పినవన్నీ, కోరిక చిట్టాలో కేవలం పదోవంతు మాత్రమే. మిగితావన్నీ నేరుగా పెళ్లి చూపులలోనే తేల్చుకుంటా! కాబట్టి త్వరపడండి, మీకు ఎవరికైనా పై లక్షణాలతో చక్కని అందమైన పెళ్ళికాని అమ్మాయి కనపడితే నాకు చెప్పండి. మంచి సంభందం చూపించిన మహానుభావులకు, నా పెళ్ళిలో బహుమతి తీసుకురాక పోయినా భోజనం పెట్టిస్తా. అయిదు రోజుల పెళ్ళా? అరగంట పెళ్ళా అనేది అమ్మాయి ఖాయం అయిన తర్వాత ఆలోచిస్తా. 


ముఖ్య గమనిక : నిన్ననే కందిరీగ చిత్రం చూశాను . అప్పుడు అనిపించింది ఏంటంటే, ఒక వేళ ఆ చిత్రంలో మాదిరి ఎవరైనా ఒక్కతే కూతురు అయ్యుండి, ఒక 300, 400 కోట్లు ఆస్తి వుంటే పైన చెప్పిన షరతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
అయినా టి.వి చూస్తే తప్పేంటి చెప్పండి?
ఇవాళ రేపు ఫోను ఎంత ముఖ్యమైన పరికరం, అలాంటప్పుడు దానిని వాడక పొతే ఎలా?
పెళ్లి కాకముందు తెల్సి తెలియని వయసులో చేసినవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
సంగీతం అంటారా టి.వి., ఫోను, ఐ పాడ్, ఇవన్నీ ఉండనే ఉన్నాయి.
అమ్మాయి రంగు ఏమైనా కొరుక్కు తింటామా? మనసు ముఖ్యంగాని!!!
ఆడవాళ్లన్న తరువాత బజారు, షికార్లకి, గుళ్ళకి పోకపోతే కాలక్షేపం ఎలా అవుతుంది చెప్పండి?  


ప్రస్తుతానికి సెలవు......, ఎక్కడున్నావమ్మా ఓ పెళ్లి కూతురా! ఏమి అనుకోనమ్మా నీ చిరునామా? అర్ధం కాని లోకంలో అంతే లేని అంతర్జాలంలో, ఎప్పుడు కనిపిస్తావో, నన్నెప్పుడు పెళ్ళాడతావో???.... లాల లా లా లా లా

Wednesday, August 10, 2011

దయ్యాలకు గుడి కట్టిస్తాం

వారంతం(మీ భాషలో weekend) ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తామా!! తీరా శని, ఆదివారాలు వస్తే చాలు ఏంచేయాలో తోచి చావదు. మొదటి రెండు వారాలు ఏదో నాలుగు రాళ్ళు జీతం రూపంలో వస్తాయి కాబట్టి సినిమాలని, షికార్లని గడిచిపోతాయి. మొన్న ఆదివారం నేను మా తమ్ముడు వంశీ, చెల్లెలు స్వాతి ( మా బాబయిగారి పిల్లలు, మీ భాషలో అయితే cousin అనండి, కాకరకాయి అనండి అది మీ ఇష్టం, నాకు మాత్రం తమ్ముడు అంటేనే, అదొక తృప్తి) కలిసి ఏదో ఒక చిత్రానికి వెళ్దామని బజారున పడ్డాం.

కూకట్ పల్లిలో ఒక చిత్రాలయానికి వెళ్ళాం. తొందరగా వెళ్ళటం మూలాన అప్పటికే అనుమతి చీటీలన్ని(టికెట్) అమ్ముడు పోయాయి. మా ఊర్లో అయితే నేరుగా అనుమతి చీటీ కొనుక్కొని చూడచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఒక వారం ముందే తీసుకోవాలి కదా, ఇక తప్పేది లేక తత్కాల్లో(బ్లాక్ టికెట్ అనమాట) ప్రయత్నించాము. 50 రూపాయల అనుమతి చీటీ కేవలం 120 రూపాయలకే అమ్ముతున్నాడు ఒక దొర. ఎంత బ్రతిమిలాడిన తగ్గే ప్రశ్నే లేదన్నాడు. ఎన్ని లోక్పాల్ చట్టాలు వస్తే వీడు మారతాడు చెప్పండి? ఇంకా లోక్పాల్ చట్టం రాలేదు కాబట్టి చేసేది లేక వాడు అడిగినంత ఇచ్చి ముగ్గురం ఆ చిత్రానికి వెళ్ళాము.

ఆ చిత్రం పేరు "కాంచన". మొదటి నుండి కూడా దయ్యాలతో మనకు పరిచయం పెద్దగా లేదాయే. "లారెన్స్ ఇరగదీశాడురా" అని ఎవరో చెప్పగా విన్నాను. మొత్తానికి బాగానే తీశాడు. పాత తీర్ధమే కొత్త శంఖంలో పోసినప్పటికినీ ఒకసారి చూడచ్చు. మనలో మన మాట, ఈ మధ్య హైదరాబాద్లో కొంత మంది అమ్మాయిలని చూసిన కారణం చేతనేమో ఆ చిత్రంలో దయ్యాన్ని చూచినా పెద్దగా భయం వేయలేదు.

ఇక అసలు విషయానికి వస్తే నాకు చిన్నపటి నుండి దెయ్యాల మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అందులో మొదటి సందేహం, దెయ్యాలు పగటి పూట ఏమ్చేస్తుంటాయి? మా s/w ఇంజనీర్ల మాదిరి రాత్రంతా మేలుకుని ఉండటం మూలాన విశ్రాంతి తీసుకుంటాయి కాబోలు.

మీరు గమనించారో లేదో దయ్యాలకు రాజకీయ నాయకుల చాలా దగ్గర సంభందం ఉందండోయ్! ఇద్దరూ సాదారణంగా తెలుపు రంగు దుస్తుల్లనే వేసుకుంటారు. ఇద్దరూ జనాలకు కనిపించకుండానే ఏడిపిస్తుంటారు. దయ్యాలు కూడా రాజకీయనాయకుల్లాగా పని తొందరగా చేయవు. ఉదాహరణకు దయ్యం పగ పట్టి ఒకడిని చంపాలి అనుకో. నేరుగా పోయి చంపదు. వాడి ముందు నుంచి నాలుగు సార్లు, వెనక నుంచి నాలుగు సార్లు ప్రత్యక్షమయ్యి భయపెడతాయి. రెండు మూడు హెచ్చరికలు చేసి సినిమా చివరికి కాని చంపవు.

అయినా భయపడటానికి డబ్బులు ఎదురు ఇచ్చి మరీ చలన చిత్రాలు చూడాలా? నా చిత్ర పఠం ఒకసారి చూస్తే కావలసినంత భయం కలుగుతుంది కదా.
నా శీర్షికలు దయ్యాలు కుడా చదివే పక్షంలో, నాదో చిన్న సలహా, మీ పగలు అన్ని తీర్చుకున్న పైకి వెళ్లబోయే ముందు మా అందరి కోసం , కాస్త ఆ పాకిస్తాన్ తీవ్రవాదులని, జి టి.వి, మా టి.వి.లో జనాలకు పిచ్చి ఎక్కించే గీమ్కార్ అన్నియ్యని, అర్ధరాత్రి పిచ్చి పిచ్చి సందేశాలు పంపే ఎదవలని ఒక చూపు చూస్తే, ఇక మీదట దయ్యాలకు కూడా గుడి కట్టిస్తాం.

ఇకపోతే కాంచన దయ్యంగారికి ఒక కవిత అంకితం చేద్దామనుకుంటున్నాను
నిన్ను చూడటానికే వచ్చాను కాంచన
దుర్మార్గులు చేశారు నిన్ను వంచన
దాంతో చేరావు నువ్వు లారేన్సు పంచన
కూర్చోబెట్టాలనుకున్నావ్ ముని వేళ్ళ అంచున
కానీ సినిమా చూసిన వాళ్లకి ఏంటీ నరక యాతన
మళ్లీ మళ్లీ కనిపించావంటే నీ పైన ఆన

అబ్బో రాస్తూ రాస్తూ గడియారం చూసుకోలేదు అప్పుడే అర్ధరాత్రి 12 గంటలు అవుతున్నది. ఎప్పుడు లేదు, ఉనట్టుంది దూరంగా నక్క కూతలు వినిపిస్తున్నాయి. కిటికీ తలుపులు కొట్టుకున్తున్నఎంటి?? గాలి ఏంటి ఇలా వీస్తున్నది. కొంపతీసి నా కవితకి మెచ్చుకొని కాంచన కానీ రాలేదు సరి కదా?? అయినా నాకేమి భయం లేదు. ఇదిగో మీకో సంగతి తెలుసా? నాది కుంభ రాసి. ఆ రాసి వాళ్ళకి దయ్యం గొడవే లేదు. అందునా ధనిష్టా నక్షత్రం నాలుగో పాదం. ఏదన్న రాత్రి పుట నా నుంచి ఫోన్ వస్తే, అందులో గట్టిగ కేకలు వినిపిస్తే, కాస్త మా ఇంటి దాక వచ్చి వెళ్లండే.

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య..................

Saturday, August 6, 2011

ముందస్తు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశానికి స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అయ్యిందట!!! సంతోషం. ఇక జనాలంతా మొహం పుస్తకంలో(facebook), ఆర్కుట్లోతమ దేశ భక్తిని చాటడానికి సిద్దపడుతున్నారు. మొన్న ఆ మధ్య మనోళ్ళు క్రికెట్ గెలిచినప్పుడు వచ్చి పోయిన దేశభక్తీ మళ్లీ ఈవిదంగా మన ముందుకు రావటం ఆనందకరం.

చిన్నప్పుడు బడిలో అయితే జెండా ఎగురవేసి, నాలుగు దేశ భక్తీ గీతాలు పాడి, మా బడి ఎదురుగా ఉన్న కొండ ఎక్కిదిగేవాళ్ళం(ఎందుకు ఎక్కేవాళ్ళమో తెలియదు). ఆ రోజులే వేరు.

మా చిన్ననాటి స్నేహితుడు ఒకడున్నాడు. వాడి పేరు బాలకృష్ణ (నందమూరి అనుకోని కంగారు పడకండి, నాగసూరి బాలకృష్ణ). మా ఊరిలో వాళ్లది మందుల వ్యాపారం. మందులు అంటే జలుబుకి, జ్వరానికి వేసుకునే మందులు. అంతే తప్ప మత్తుకి, మజాకి వేసుకునేవి కాదని మనవి.

వాడి కింద ఇద్దరు గుమాస్తాలు పని చేస్తుంటారు. వీడు చెప్పిన ధరకి, ఆ గుమాస్తాలు మందులు అమ్మాలి. పది పైసల బిళ్లని రెండురూపాయలకి అమ్మమని గుమాస్తాలకి చెప్పాడే అనుకోండి(అనుకోండి, పాపం మంచి వాడు, అంత మోసం చేయడు), తప్పుగుమాస్తాదా?? లేక బాలకృష్ణ దా??

ఇప్పటి మన ప్రభుత్వం తీరు ఇలానే ఉంది. నిన్న మారన్ మామ, మొన్నకనిమొళి అక్క, అటు మొన్న రాజ బావ, వీళ్ళందరూ తప్పు చేసారు. మరి దాంట్లో పెద్దల హస్తం, పెద్దమ్మ హస్తం, మొత్తానికి "హస్తం" హస్తం లేదంటే నాకు నమ్మ బుద్ది కావటంలేదు. వాళ్ళెవరూ బయట పడకుండా పాపం మన తమిళ సోదరులకు మాత్రం అన్యాయం చేసారు. ఇదేమన్నా కాలువ పక్కన చిల్లరకొట్లో తిమ్మిరి బిళ్ళల దొంగతనమా? గుట్టు చప్పుడు కాకుండా ఒక్కడే చేయటానికి??

దేశంలో జనాభా, అవినీతి, దారిద్రం, ఎయిడ్స్ ఎంత వేగంగా పెరుగుతున్నాయో, మంచితనం, మానవత్వం, నిజాయితీ, అంతే వేగంగా తగ్గిపోతున్నాయి. ఏపూట ఎక్కడ పేలుళ్లు జరుగుతాయో అని భయం. ఇలాంటి పరిస్తితుల్లో వేడుకలు చేసుకోవటం నిజంగా బాధాకరమయిన విషయం.

దేశానికి స్వాతంత్ర వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఇంకా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు చాలా ఉన్నాయి. మన యువరాజుకి(క్రికెటర్ కాదు) 45 సంవత్సరాలు దాటినా పెళ్ళి కాలేదు, యువనేత ఇంకా ఓదార్చటం పూర్తి కాలేదు, బాబు గారు అదికారంలోకి రాలేదు, కిరణన్న భాష జనాలకు అర్ధం కావటం లేదు, చిరు మాయ్యకి ఏమి చేయాలో అర్ధం కావటం లేదు.

గీంకార్ అన్నయ్య టి.విలో కనపడటం ఆపలేదు, కుకట్ పల్లి- హైటెక్ సిటి దారి ఇంకా బాగు కాలేదు, పెట్రోల్ పొస్తే బండి వేగం ఏమో కానీ, పెట్రోల్ ధరల వేగం మాత్రం తగ్గటంలేదు, మొహం పుస్తకం (facebook) వాడే వాళ్లు తగ్గటం లేదు, ఆర్కుట్ వాడే వాళ్లు, నా శీర్షికలు చదివే వాళ్ళు కనపడటం లేదు,

చివరగా దరలన్నీ పెరిగినా, నా జీతం మాత్రం పెరగలేదు. నా గోల ఎప్పుడూ ఉండేదే కానీ, మీ అందరికీ మరొక్కసారి ముందస్తు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జైహింద్.