Friday, August 19, 2011

వధువు కావలెను

"వంశమా దానాలి తోకా?" అని వినప్పుడల్లా నాకు మా ముత్తాత ముత్తాత శ్రీ వెంకటప్పయ గారు గుర్తుకొస్తారు. అసలు మా వంశము గురించి చెప్పాలంటే, పది శీర్షికలు తక్కువ కావనుకోండి. కంగారు పడకండి మీ కోసం బాగా తగ్గించి చెప్తా. మా వంశ వృక్షంలో ఒక కొమ్మను మీకిప్పుడు చూపిస్తాను

కీ. శే. శ్రీ అద్దంకి వెంకటప్పయ్య గారు
కీ. శే. శ్రీ అద్దంకి వెంకట నారసింహయ్య గారు
కీ. శే. శ్రీ అద్దంకి రామయ్య గారు
కీ. శే. శ్రీ అద్దంకి వెంకట నారసింహయ్య గారు
కీ. శే. శ్రీ అద్దంకి రామారావు గారు (మా తాతగారు)
శ్రీ అద్దంకి వేంకటేశ్వర రావు గారు
శ్రీ శ్రీ శ్రీ అద్దంకి అనంతరామయ్య గారు

ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, పెళ్ళికి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి అని అంటారు కదా, ఎవరైనా అమ్మాయిల తల్లి తండ్రులకి పనికొస్తుందేమో అని, మా ఏడు తరాల గురించి అలా మొదలు పెట్టా. ఇప్పటికైనా పెళ్లి సంభందాలు చూడటం మొదలు పెట్టక పొతే నేను కూడా మన యువరాజు(క్రికెటర్ కాదు) లాగా 45 సంవత్సరాలు వచ్చినా కూడా ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని భయం పట్టుకుంది. ఇప్పటికే నా స్నేహితులలో చాలా మంది వాళ్ళ వాళ్ళ శక్తీ కొలదీ పెళ్లిల్లు చేసేసుకున్నారు. కొంతమంది రేపో మాపో అంటున్నారు.

ఇప్పుడూ..... నాకు పెద్దగా కోరికలు, షరతులు లేవు. పోనీ పెళ్లి విషయం మా ఇంట్లో వాళ్ళకి వదిలేద్దామంటే, మొన్ననే జీ తెలుగులో బొమ్మరిల్లు చిత్రం నాలుగు వేల సారి చూసాను. పెళ్లి విషయంలో మాత్రం రాజీ పడకూడదు అని సిద్దార్దన్న ఆంగ్లం లో  చెప్పిన సన్నివేశం గుండెకు సచిన్ కొట్టిన బంతిలా అతుక్కు పోయింది.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సౌందర్య లహరి స్వప్న సుందరీ...... అని పాటలో చెప్పలేను కానీ, ఏదో నా శైలిలో

వధువు కావలెను

టీ.వి. అతిగా(కుదిరితే అస్సలు) చూడని అమ్మాయి అయ్యుండాలి.
ఫోను తక్కువగా (రోజుకి ఒక పది నిముషాలు మించకుండా) మాట్లాడే అమ్మాయి అయ్యుండాలి.
పూర్వాశ్రమంలో పద్దతిగా ఉండి ఉండాలి(అంటే ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు).
చదువులో తక్కువ మార్కులు వచ్చుండాలి( అతిగా చదివే వాళ్ళకి మనం ఆమడ దూరం కదా).
సంగీత పరిజ్ఞానం ఉంటే మంచిది, బాగా పాడగలిగితే ఇంకా మంచిది.
తెలుగు వచ్చినప్పటికినీ తెగులు వచ్చిన కోడి లాగా మొహం పెట్టి ఆంగ్లంలో మాట్లాడకూడదు.
రంగు, నా కన్నా కొంచం తెల్లగా ఉండాలి (ఛాయ తక్కువ అయినా కళగా ఉండాలి).
బజారన్నా, షికారన్నా పిచ్చి ఉండ కూడదు.
బాబాలన్నా, వారు చేసే అనుగ్రహ భషణాలన్నా అస్సలు ఆశక్తి ఉండకూడదు
( ఇలా అయితే జన్మలో పెళ్లి కాదని అనుకుంటున్నారా? ఆశ పడటంలో తప్పు లేదు కదా)

పైన చెప్పినవన్నీ, కోరిక చిట్టాలో కేవలం పదోవంతు మాత్రమే. మిగితావన్నీ నేరుగా పెళ్లి చూపులలోనే తేల్చుకుంటా! కాబట్టి త్వరపడండి, మీకు ఎవరికైనా పై లక్షణాలతో చక్కని అందమైన పెళ్ళికాని అమ్మాయి కనపడితే నాకు చెప్పండి. మంచి సంభందం చూపించిన మహానుభావులకు, నా పెళ్ళిలో బహుమతి తీసుకురాక పోయినా భోజనం పెట్టిస్తా. అయిదు రోజుల పెళ్ళా? అరగంట పెళ్ళా అనేది అమ్మాయి ఖాయం అయిన తర్వాత ఆలోచిస్తా. 


ముఖ్య గమనిక : నిన్ననే కందిరీగ చిత్రం చూశాను . అప్పుడు అనిపించింది ఏంటంటే, ఒక వేళ ఆ చిత్రంలో మాదిరి ఎవరైనా ఒక్కతే కూతురు అయ్యుండి, ఒక 300, 400 కోట్లు ఆస్తి వుంటే పైన చెప్పిన షరతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
అయినా టి.వి చూస్తే తప్పేంటి చెప్పండి?
ఇవాళ రేపు ఫోను ఎంత ముఖ్యమైన పరికరం, అలాంటప్పుడు దానిని వాడక పొతే ఎలా?
పెళ్లి కాకముందు తెల్సి తెలియని వయసులో చేసినవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
సంగీతం అంటారా టి.వి., ఫోను, ఐ పాడ్, ఇవన్నీ ఉండనే ఉన్నాయి.
అమ్మాయి రంగు ఏమైనా కొరుక్కు తింటామా? మనసు ముఖ్యంగాని!!!
ఆడవాళ్లన్న తరువాత బజారు, షికార్లకి, గుళ్ళకి పోకపోతే కాలక్షేపం ఎలా అవుతుంది చెప్పండి?  


ప్రస్తుతానికి సెలవు......, ఎక్కడున్నావమ్మా ఓ పెళ్లి కూతురా! ఏమి అనుకోనమ్మా నీ చిరునామా? అర్ధం కాని లోకంలో అంతే లేని అంతర్జాలంలో, ఎప్పుడు కనిపిస్తావో, నన్నెప్పుడు పెళ్ళాడతావో???.... లాల లా లా లా లా

8 comments:

 1. Naveen Kumar Gollapudi8/20/11, 12:37 AM

  Bagundi raa..Prasalu baga kudiray.. Malli form loki vachhav..

  ReplyDelete
 2. Nuvvu keka...ram anniyyyaa....

  ReplyDelete
 3. pina requirements chusi yuvi kanna pelli avvuddi kani niku avvademoanukunna kinda gamanika chusi inka confirmga neeku pilla dorakadu anukunna

  ReplyDelete
 4. @siva: ee seershikalo yuvaraaju ante cricketer yuvi kaadanna,

  ReplyDelete