Wednesday, August 10, 2011

దయ్యాలకు గుడి కట్టిస్తాం

వారంతం(మీ భాషలో weekend) ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తామా!! తీరా శని, ఆదివారాలు వస్తే చాలు ఏంచేయాలో తోచి చావదు. మొదటి రెండు వారాలు ఏదో నాలుగు రాళ్ళు జీతం రూపంలో వస్తాయి కాబట్టి సినిమాలని, షికార్లని గడిచిపోతాయి. మొన్న ఆదివారం నేను మా తమ్ముడు వంశీ, చెల్లెలు స్వాతి ( మా బాబయిగారి పిల్లలు, మీ భాషలో అయితే cousin అనండి, కాకరకాయి అనండి అది మీ ఇష్టం, నాకు మాత్రం తమ్ముడు అంటేనే, అదొక తృప్తి) కలిసి ఏదో ఒక చిత్రానికి వెళ్దామని బజారున పడ్డాం.

కూకట్ పల్లిలో ఒక చిత్రాలయానికి వెళ్ళాం. తొందరగా వెళ్ళటం మూలాన అప్పటికే అనుమతి చీటీలన్ని(టికెట్) అమ్ముడు పోయాయి. మా ఊర్లో అయితే నేరుగా అనుమతి చీటీ కొనుక్కొని చూడచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఒక వారం ముందే తీసుకోవాలి కదా, ఇక తప్పేది లేక తత్కాల్లో(బ్లాక్ టికెట్ అనమాట) ప్రయత్నించాము. 50 రూపాయల అనుమతి చీటీ కేవలం 120 రూపాయలకే అమ్ముతున్నాడు ఒక దొర. ఎంత బ్రతిమిలాడిన తగ్గే ప్రశ్నే లేదన్నాడు. ఎన్ని లోక్పాల్ చట్టాలు వస్తే వీడు మారతాడు చెప్పండి? ఇంకా లోక్పాల్ చట్టం రాలేదు కాబట్టి చేసేది లేక వాడు అడిగినంత ఇచ్చి ముగ్గురం ఆ చిత్రానికి వెళ్ళాము.

ఆ చిత్రం పేరు "కాంచన". మొదటి నుండి కూడా దయ్యాలతో మనకు పరిచయం పెద్దగా లేదాయే. "లారెన్స్ ఇరగదీశాడురా" అని ఎవరో చెప్పగా విన్నాను. మొత్తానికి బాగానే తీశాడు. పాత తీర్ధమే కొత్త శంఖంలో పోసినప్పటికినీ ఒకసారి చూడచ్చు. మనలో మన మాట, ఈ మధ్య హైదరాబాద్లో కొంత మంది అమ్మాయిలని చూసిన కారణం చేతనేమో ఆ చిత్రంలో దయ్యాన్ని చూచినా పెద్దగా భయం వేయలేదు.

ఇక అసలు విషయానికి వస్తే నాకు చిన్నపటి నుండి దెయ్యాల మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అందులో మొదటి సందేహం, దెయ్యాలు పగటి పూట ఏమ్చేస్తుంటాయి? మా s/w ఇంజనీర్ల మాదిరి రాత్రంతా మేలుకుని ఉండటం మూలాన విశ్రాంతి తీసుకుంటాయి కాబోలు.

మీరు గమనించారో లేదో దయ్యాలకు రాజకీయ నాయకుల చాలా దగ్గర సంభందం ఉందండోయ్! ఇద్దరూ సాదారణంగా తెలుపు రంగు దుస్తుల్లనే వేసుకుంటారు. ఇద్దరూ జనాలకు కనిపించకుండానే ఏడిపిస్తుంటారు. దయ్యాలు కూడా రాజకీయనాయకుల్లాగా పని తొందరగా చేయవు. ఉదాహరణకు దయ్యం పగ పట్టి ఒకడిని చంపాలి అనుకో. నేరుగా పోయి చంపదు. వాడి ముందు నుంచి నాలుగు సార్లు, వెనక నుంచి నాలుగు సార్లు ప్రత్యక్షమయ్యి భయపెడతాయి. రెండు మూడు హెచ్చరికలు చేసి సినిమా చివరికి కాని చంపవు.

అయినా భయపడటానికి డబ్బులు ఎదురు ఇచ్చి మరీ చలన చిత్రాలు చూడాలా? నా చిత్ర పఠం ఒకసారి చూస్తే కావలసినంత భయం కలుగుతుంది కదా.
నా శీర్షికలు దయ్యాలు కుడా చదివే పక్షంలో, నాదో చిన్న సలహా, మీ పగలు అన్ని తీర్చుకున్న పైకి వెళ్లబోయే ముందు మా అందరి కోసం , కాస్త ఆ పాకిస్తాన్ తీవ్రవాదులని, జి టి.వి, మా టి.వి.లో జనాలకు పిచ్చి ఎక్కించే గీమ్కార్ అన్నియ్యని, అర్ధరాత్రి పిచ్చి పిచ్చి సందేశాలు పంపే ఎదవలని ఒక చూపు చూస్తే, ఇక మీదట దయ్యాలకు కూడా గుడి కట్టిస్తాం.

ఇకపోతే కాంచన దయ్యంగారికి ఒక కవిత అంకితం చేద్దామనుకుంటున్నాను
నిన్ను చూడటానికే వచ్చాను కాంచన
దుర్మార్గులు చేశారు నిన్ను వంచన
దాంతో చేరావు నువ్వు లారేన్సు పంచన
కూర్చోబెట్టాలనుకున్నావ్ ముని వేళ్ళ అంచున
కానీ సినిమా చూసిన వాళ్లకి ఏంటీ నరక యాతన
మళ్లీ మళ్లీ కనిపించావంటే నీ పైన ఆన

అబ్బో రాస్తూ రాస్తూ గడియారం చూసుకోలేదు అప్పుడే అర్ధరాత్రి 12 గంటలు అవుతున్నది. ఎప్పుడు లేదు, ఉనట్టుంది దూరంగా నక్క కూతలు వినిపిస్తున్నాయి. కిటికీ తలుపులు కొట్టుకున్తున్నఎంటి?? గాలి ఏంటి ఇలా వీస్తున్నది. కొంపతీసి నా కవితకి మెచ్చుకొని కాంచన కానీ రాలేదు సరి కదా?? అయినా నాకేమి భయం లేదు. ఇదిగో మీకో సంగతి తెలుసా? నాది కుంభ రాసి. ఆ రాసి వాళ్ళకి దయ్యం గొడవే లేదు. అందునా ధనిష్టా నక్షత్రం నాలుగో పాదం. ఏదన్న రాత్రి పుట నా నుంచి ఫోన్ వస్తే, అందులో గట్టిగ కేకలు వినిపిస్తే, కాస్త మా ఇంటి దాక వచ్చి వెళ్లండే.

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య..................

2 comments:

  1. Nenu navvu aapukoledkunda undalekapoyanu...idi chadivina tarvata....?The sentance "మనలో మన మాట, ఈ మధ్య హైదరాబాద్లో కొంత మంది అమ్మాయిలని చూసిన కారణం చేతనేమో ఆ చిత్రంలో దయ్యాన్ని చూచినా పెద్దగా భయం వేయలేదు." is keka.....

    ReplyDelete