Saturday, December 31, 2011

మేధావి రావికాము

 ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో "రావికాము" అని నా స్నేహితుడు ఒకడు ఉండే వాడు. స్నేహితుడు అనటం కన్నా తోటి విద్యార్ది అంటే బాగుంటుంది. మంచి తెలివిగల్లవాడు. దిక్కుమాలిన తెలివితేటలు వాడి సొంతం. పుస్తకాలతో తప్ప మనుషులతో పెద్దగా మాట్లాడాడు. ఒక వేళ ఎవరితోనైనా మాట్లాడాడు అంటే, అది ఖచ్చితంగా చదువుకి సంభందించిన విషయమే అయ్యి ఉంటుంది.

మాకు పాఠం చెప్పే వారందిరికీ వీడంటే ప్రాణం. వాడికేదైనా జ్వరం వచ్చి బడికి రాకపోతే రోజు పాఠం చెప్పటం ఆపేశేవారు. అందరూ వాడిని మరో అబ్దుల్ కలాం అనుకునేవారు! ఇలా పగలనకా రాత్రనకా చదివితే మార్కులు రాక మాయరోగం వస్తుందా? మొదటి సంవత్సరం పరీక్షలలో, అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి.

రెండవ సంవత్సరంలో అందరూ కొత్తగా మొదటి సంవత్సరం చేరిన పిల్లల్ని పరిచయం చేసుకొని ఆట పట్టిస్తూ ర్యాగింగ్ చేస్తుంటే, వీడు మాత్రం, వాళ్ళకు చదువులో వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తుండేవాడు. అందరూ సినిమాలు చూస్తుంటే, వీడు సి/సి++ చూసేవాడు . అందరూ వచ్చే పోయే అమ్మాయిలను చూస్తుంటే వీడు అర్థమాటిక్స్ చూసేవాడు. అందరూ స్వాతి, సాక్షి చదువుతుంటే, వీడు శాటిలైట్ గురించి చదివేవాడు, అందరూ పేకాట ఆడుతుంటే వీడు పేపర్ ప్రశెంటేషన్ చేస్తుండేవాడు. చదువు జీవితంలో ఒక భాగమే తప్ప చదువే జీవితం కాదురా అని వాడికి ఎన్ని సార్లు చెప్పినా వాడు మారలేదు.

ఇక మూడో సంవత్సరం వచ్చేసరికి వీడిలో కొంచం మార్పు వచ్చింది. తనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలని, ఒక నలుగురు అమ్మాయిలని ఎంచుకొని వాళ్ళకే పంచటం (జ్ఞానం) మొదలు పెట్టాడు. పొద్దస్తమానం వాళ్ళతోనే మాట్లాడటం, జ్ఞానాన్ని పంచటంతో, తనకి జన జీవన స్రవంతిలో ఉన్న ఆ కొద్ది అనుభందం కుడా తెగిపోయింది.

ఇలా నాలుగు సంవత్సరాలు చదివినందుకు బంగారు పతకం రాక పోయినప్పటికినీ, బంగారు బాతు లాంటి ఒక కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. మొన్నా మధ్యన ఎవరో స్నేహితుడు చెప్పాడు, "రావికాము హైదరబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు రా, వీలు అయితే కలువు" అని. పోనిలే ఎంతైనా నాలుగేళ్ళు కలిసి చదివాము కదా అని దూరవాణి పరికరంతో పలకరించా, కాని అటు నుంచి సరిగ్గా సమాధానం రాలేదు. నేనేదో వాడి దయా దాక్షణ్యాల మీద బ్రతుకుతున్నట్టు మాట్లాడాడు. నాకు వేలకువేలు అప్పు ఇచ్చిన గుప్తాగారు కుడా నాతో ఎప్పుడు అలా మాట్లాడలేదు.

మొన్నామధ్య ఇంజనీరింగ్ స్నేహితులందరం మరలా ఒకసారి కలుద్దాం అనుకుని, జయప్రకాష్ అనే స్నేహితుడు రావికాముకి ఫోను చేసి, అందరం కలుద్దాం అంటే, నాకు అంత సమయంలేదు. పూనే-హైదరాబాద్ తిరుగుతూ ఉంటాను కుదరదు అని అన్నాడు. ఎంత జీతం వస్తుంది రా అని అడిగితే, తెలుగు చిత్రాల కధానాయికని వయస్సు అడిగినట్టు మాట దాటేశాడే తప్ప విషయం చెప్పలేదు. బహుశా అప్పు అడుగుతామేమో అని భయపడుంటాడు., ఎదవ!!  "సరే రా, ఏ రోజు కలుద్దామో ఫోను చేస్తాం, వీలయితే కలువు" అని జయప్రకాష్ అన్నదానికి, " కాళీగా ఉంటేనే ఫోనులో మాట్లాడతాను, లేదంటే లేదు" అని చెప్పాడట. వీడిని బతిమిలాడే బదులు, బాలయ్య బాబుని బతిమిలాడితే, మనకు సినిమా కోసం డేట్స్ ఇస్తాడేమో.

ఈ శీర్షికని వేదికగా చేసుకుని నేను చెప్పొచ్చేది ఏంటంటే? "ఒరేయ్ రావికాము, కనీసం ఈ శీర్షిక చదివిన తర్వాత అయినా జన జీవన స్రవంతిలో కలువురా!! మన స్నేహితులందరికీ నిన్ను క్షమించేంత గొప్ప మనస్సు ఉంది. నీ రాక కోసం ఎదురు చూస్తూ....."

ఇట్లు,

నీ స్నేహితులు కావాలనుకుంటున్న ఒకప్పటి నీ తోటి విద్యార్దులు,  

Wednesday, December 21, 2011

ఔచ్.., ఊప్స్..,

 జీవిత సారం 4 చివరి భాగంలో అమ్మాయిలని ప్రత్యేకంగా ఖండిస్తాను అని చెప్పాను. ఆరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి, విశ్వసనీయతతో, ఈ శీర్షిక రాస్తున్నాను. మొన్న కార్యాలయంలో స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఒక పాప, నా పక్క నుంచి పోతూ పొతూ, కాలికి ఏదో తట్టుకొని ముందుకు పడబోయింది. అంతలోని పక్కనున్న బల్లని పట్టుకొని "ఔచ్" అని పెద్దగా అరిచింది. చూడటానికి తెలుగు అమ్మాయిలానే ఉన్నది, ఈ ఔఛ్ ఏంటబ్బా?? అని నా మనసులో అనుకుని, నా పక్కన ఉన్నవాడిని అడిగా., ఆ శబ్దానికి అర్ధం ఏంటని?

"ఈ మధ్య కొంతమంది ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అమ్మా, అయ్యా అనటం మానేశారురా. 'ఔచ్' అని మాత్రమే అంటున్నారు", అని ఒక స్నేహితుడు చెప్పాడు. అమ్మని మమ్మీ చేసి, ఎప్పుడో అమ్మా అని పిలవటం మానేశారు. కనీసం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కుడా అమ్మా అని అంటే నామూషి అయిపోయింది. ఇలాంటి వాళ్ళందరినీ మంచి నాటు కట్టె తీసుకొని నాలుగు దెబ్బలు తగిలిస్తే కానీ అమ్మా అయ్యా అని అనరనుకుంటా. అంటారో లేక అప్పుడు కుడా "ఔచో... ఔచో..." అని అరుస్తారో??  

 ఇలాంటి పదాలే ఇంకొన్ని వచ్చాయి. ఉదాహరణకి 'ఊప్స్'. ఎవరికైనా ఎదుటి వారికి బాద కలిగితే మనం సహజంగా "అయ్యో అలా జరిగిందా పాపం, అయితే పెరుగన్నం పెట్టి ఓదార్చాలి", అని మనసులో అనుకుంటాము. కానీ ఈ మధ్య అయ్యో అంటే నామూషి వేసి, అందరూ ఊప్స్ అంటున్నారు.

ఇక పొతే, చాలామంది ఛి, ఛా అనటం మానేశారు. అలా అనాల్సి వచ్చిన ప్రతిసారి, దానికి బదులుగా వాడుతున్న ఇంకో పదం 'షిట్', 'బుల్ షిట్'. మొన్న కార్యాలయంలో అన్నం తినటానికి వెళ్లి, తిని వస్తూ వస్తూ, నా గుర్తింపు బిళ్ళ మర్చిపోయి వచ్చా. కొంత దూరం వచ్చాక గుర్తొచ్చి, 'షిట్' అని తెలుగులో అన్నాను( తెలుగులో ఏమంటారో మీకు తెలుసు కదా). దానితో ప్రక్కన ఉన్న వాళ్ళంతా, "సభ్యతా సంస్కారం లేదా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు?" అని తిట్టారు. అదే వాళ్ళు ఆంగ్లంలో అందంగా 'షిట్', 'బుల్ షిట్', 'రామ్ షిట్' అని ఎన్నన్నా అందంగానే ఉంటుంది.      

 ఇదే నాకు అస్సలు అర్ధం కానీ విషయం. ఆంగ్లంలో మాట్లాడితే అది ఒక దర్జా, ధర్పం. అదే అచ్చతెలుగులో మాట్లాడితే మాత్రం, సభ్యత, సంస్కారం, సంధి, సమాసం అన్నీ గుర్తుకు వస్తాయి. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి, తప్పైనా, చెప్పక తప్పక చెప్తున్నాను., ఎఫ్ మూడు చుక్కలు, ఎ రెండు చుక్కలు (అంటే ఏంటో మీకు తెలుసు , నాకు తెలుసు) అనే పదాలు కూడా మనం ఆంగ్లంలో చక్కగా ఎ సిగ్గు ఎగ్గు లేకుండా వాడతాం. అవి ఎంత పెద్ద బూతులో మీకు నేను చెపాల్సిన అవసరం లేదనుకుంట!!!

ఇదే విషయం మీద చర్చిస్తుంటే హరీష్ ఒక మాట అన్నాడు. ఆంగ్లంలో మాటలు చాల సులువుగా అనేయగలం, ఉదాహరణకు 'సారి' అనే పదం మనం నోటి నుంచి చెప్తాం. అదే తెలుగులో 'క్షమించండి' అని అంత సులువుగా అనగలమా?? ఈ మధ్య చాల మందిలో నేను గమనించింది ఏంటంటే, కోపంలో ఉన్నప్పుడు, బాదలో ఉనప్పుడు, తాగి ఉనప్పుడు, తెలుగు కన్నా ఆంగ్లమే ఎక్కువ వస్తుంది అని. దానికి కారణం ఏంటో ఎవరైనా చెప్పగలిగితే సంతోషిస్తా. ఏంటో అమ్మాయిలని ఖండించాలని చివరకు ఆంగ్లం మీదకు వెళ్ళిపోయాను. ఇంకో శీర్షికలో చూద్దాం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొరవా, ఖండిచాలనుకుంటే శీర్షికలు కొరవా?? 



Saturday, December 10, 2011

జీవిత సారం 5 ( రామాయణ ధూమపానం)

మొన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, "అనంతరామా , నా గుర్తుగా నీకో బహుమతి ఇస్తున్నా, జాగ్రత్తగా నీ దగ్గరే ఈ బహుమతిని ఉంచుకో" అని చెప్పి, నా చేతిలో అందంగా, రంగు కాగితాలతో అలంకరించిన బహుమతి ఒకటి పెట్టింది. కకృత్తిగా కాకుండా, మెల్లగా తీసి చూస్తే, అందులో ఒక అందమైన బూడిద చిప్ప (యాష్ ట్రే) ఉంది. "ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ బూడిద చిప్ప ఎందుకు తెచ్చావ్??" అని అడిగితే, "నువ్వు చుట్ట, బీడీ కాల్చి ఇందులో బూడిద తడుతుంటే, నేను గుర్తుకు వచ్చి, నువ్వు అవి కాల్చటం ఆపేయాలి" అని అన్నది. అస్సలు నాకు అవి కాల్చే అలవాటే లేదని చెప్పాను. దానికి తను, "నేను ప్రేమతో బహుమతి కొంటే, అలవాటు లేదంటావా?? వారం రోజుల్లో అలవాటు చేసుకుని మరీ మానేయాలి" అని చెప్పింది. ఈ మధ్య చిత్రాలు చూసి అమ్మాయిలు చెడిపోతున్నారు అనుకోండి(నేను ఖుషి చిత్రం చూడలేదు., నమ్మండి).

ధూమపానం అంటే గుర్తొచ్చింది., అమ్మానాన్నలు రోజుకి వంద సార్లు చెప్పినా విననోడు., ప్రేమించే అమ్మాయికి ఇష్టం లేదని, తనకి ఆ పొగ వల్ల దగ్గు వచ్చిందని, క్షణంలో ధూమపానం మానేస్తాడు., అది ప్రేమకు ఉన్న శక్తీ, బలం, బొంగు, భోషాణం. అస్సలు వీళ్ళందరి చేతా రామాయణం చదివించాలి. తండ్రి మాటకు కట్టుబడి అరణ్యాలకి వెళ్ళిన రాముని కధ విని కనీసం అప్పుడప్పుడన్నాఅమ్మానాన్నలు చెప్పిన మాట వింటారేమో. అస్సలు రామాయణం చదివినా, విన్నా, మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. అయినా ఈ రోజుల్లో అలా ఎవరు ఉండగలరు? ఉదాహరణకు, రామాయణం మనకు ఏమని చెప్తుంది? ధర్మం కోసం, భార్యనైన వదిలేయమని చెప్పింది. కాని, ఈ రోజుల్లో భార్య కోసం ధర్మాన్ని వదిలేస్తున్నారు. భార్య కోసం కాదు కాదు, బలపం కోసం కూడా ధర్మాన్ని తప్పుతున్నాము. 

ఇదే విషయాన్ని మొన్న శ్రీరామరాజ్యం చిత్రంలో బాలయ్య బాబు చెప్పాడు. కానీ ఎంత మంది ఆ చిత్రాన్ని చూశారు? అదే వందమందిని నరకటం, అరడజను అశ్లీల పాటలు ఉంటే మాత్రం, ఒకటికి నాలుగు సార్లు చూస్తారు, ఇంకో నలుగురిని చూడమని చెప్తారు. నిన్న, ఒకానొక సందర్భంలో బాలయ్యబాబు కూడా అదే చెప్పాడు, యువత శ్రీరామా రాజ్యం చిత్రం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని. అస్సలు రామాయణం మనకున్న గొప్ప సంపద. రాయాలంటే శీర్షికలు చాలవు, తీయాలంటే చిత్రాలు చాలవు. రామాయణం మీద శీర్షికలు రాయాలనే ఉంది కానీ., అంత వయసు, పరిజ్ఞానం లేదని రాయటంలేదు. అయినా రామాయణం గురించి రాస్తే, ఇవాళ రేపు ఎవరు చదువుతున్నారు?

రామాయణం గురించి తర్వాత చెప్తాను, దూమపానం చేసిన వాళ్ళని చూస్తే, నాకు ఎప్పుడూ ఒకటే గుర్తొస్తుంది. వెలిగించిన చుట్ట, బీడీ, ఇవన్ని మన జీవితంలో చేసే తప్పులు లాంటివి. పొగ లోనికి పీల్చి, దర్జాగా బయటికి గిర్రు గిర్రున వదులుతారు. కాని చివరికి మిగిలేది, బయట బూడిద, లోపల జబ్బు. అలానే జీవితంలో తప్పు చేసేప్పుడు దర్జాగానే ఉంటుంది., కాని చివరికి మిగిలేది ఎమీ ఉండదు, బూడిద తప్ప. నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో వెంకటేష్  బాబు "దూమపానం చేస్తే దగ్గు వస్తుంది తప్ప బలం రాదు" అని చెప్తే ఎంత మంది విన్నారు? చివరగా ఈ రామానంద స్వామి ఏమంటాడంటే, ధూమపానం, అగరబత్తి రెండిటి నుంచి వచ్చేది పోగే, రెండూ మనల్ని దేవుడి దగ్గరకి చేర్చేవే, అగరబత్తిని నమ్ముకుంటే అరవైకి కానీ పోలేరు., ధూమపానాన్ని నమ్ముకొని ముప్పైకే దేవుడి దర్శనం దొరుకుతుంది. ప్రోగ తాగని వాడు దున్నపోతయి  పుడతారు, అన్న సామెతని నమ్మి, ధూమపానం చేయండి, దేవుడిని శీఘ్రంగా దర్శించుకోండి.