Friday, November 18, 2011

జీవిత సారం 4 ("ప" గుణింతం)

యువనేత మీద రాసిన శీర్షిక చదివి, ఒక అజ్ఞాత, యువనేత వీరాభిమాని నాకో వాఖ్య పంపాడు. "నీకెందుకురా రాజకీయాల గురించి, ఎప్పటి లాగా నీ డబ్బా కొట్టుకో, మా యువనేత గురించి కాదు" అని పంపాడు. నేను రాసిన దానికి, పాపం అతని మనోభావాలు దెబ్బ తినట్టు ఉన్నాయి. నా శీర్షికలలో నా డబ్బా కొట్టుకోక, ఊర్లో వాళ్ళందరినీ పొగడటానికి, సన్మానం చేయటానికి ఇదేమన్నా రవీంద్ర భారతినా?? ఏదైతేనేం, ఆ అజ్ఞాత యువనేత అభిమానికి నా ప్రగాడ ఓదార్పు తెలియజేస్తూ ఈ శీర్షిక మొదలు పెడుతున్నాను.

దరిద్రపు చలన చిత్రాలు, అని మనం అప్పుడప్పుడు తిట్టుకుంటాం కానీ, వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకి, కధానాయిక పాపని పట్ట పగలు, నడి రోడ్డులో, నలుగురు ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు మన కధానాయకుడు అమెరికాలో ఉన్నపటికీ, అరనిముషంలో అద్దంకి వచ్చి కధానాయిక పాపని కాపాడి, గీతలో(లైన్లో) పెడతాడు. కధానాయకుడు వచ్చి కాపాడతాడని మనకి కూడా తెలుసు. అయినప్పటికీ పిచ్చి ముఖాలు వేసుకుని మన కధానాయకుడి కోసం ఎదురు చూస్తామా! లేదా! 

జీవితం కూడా అంతే. కొన్ని జరగక ఆగవని మనకు తెలుసు, అవి జరిగేదాకా మనం చూస్తూ ఉంటాము. కొన్ని జరగవని తెలుసు, అయినా ప్రయత్నిస్తాం. కధానాయకుడు కాపాడతాడని తెలుసు, కానీ ఎలా కాపాడతాడు అనేది మనం చూసే అంశం. అలానే మనం పెరిగి, పెద్దయ్యి, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, పెంచి ., ఏదో ఒక రోజుకి పోతాం.  అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు, అని మనకు తెలుసు. కానీ ఎలా పుట్టి ఎలా పెరిగి ఎలా చచ్చాం అనేది ముఖ్యం. అందుకే రామానంద స్వామి ఏమంటాడంటే "జీవితం అనేది "ప" గుణింతం. పుట్టుక అనే 'పు'తో మొదలు అయ్యి పాడె అనే 'పా'తో ముగుస్తుంది". ఇంకా విడమర్చి చెప్పాలంటే కడుపులో పిండంతో మొదలుపెట్టి తద్దినపు పిండంతో అయిపోతుంది(కాస్త నాటుగా అనిపించినా, ఇది కాదనలేని సత్యం).      

ఈ మధ్య స్నేహితులు, చుట్టాలు అంతా పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. అంత వరకు బాగానే ఉంది. కానీ కొంత మంది వెటకారంగా, " నీకేమి రా? మాటలతో అమ్మాయిలని పడేస్తావ్! ఎంత మంది అమ్మాయిలని దారిలో పెట్టావ్?" అని ఏడిపించుకు తింటున్నారు. నేను అన్ని చదువు చదువుకోలేదు, అని చెప్పినా వినటంలేదు. నేనేదో ఇక్కడ అమ్మాయిలని పడేసే వ్యాపరం పెట్టినట్టు హింసిస్తున్నారు. నేను ఎంత తిన్నా లావు రాను, వాళ్ళకు ఎంత చెప్పినా సిగ్గు రాదు అని వదిలేశా!!   మా మల్లి మామ కుడా "నీకేమి రా నాగచైతన్య అంత అందంగా ఉంటావు" అంటాడు. మా సుబ్బన్న చెప్పినట్టు, యవ్వనం పవర్ ప్లేలో ఉనప్పుడు పంది కుడా అందంగా ఉంటుంది. ఆఖరికి మా నాన్న కూడా, నేను పెద్ద జేఫ్ఫాని అని నిశ్చయించుకునట్టున్నాడు. అందుకే ఈ మధ్య పదే పదే చెప్తున్నాడు, "నాకు చెప్పి పెళ్లి చేసుకోవద్దురా! నేను చెప్పినప్పుడు, చెప్పిన అమ్మాయిని చేసుకో!" అని.  

మన ముఖ్యమంత్రి గారి మాటలయినా అప్పుడప్పుడు అర్ధం అవుతాయేమో కానీ, అమ్మాయిలు ఎవరిని ఇష్టపడతారో మాత్రం తల నేలకేసి బాదుకున్న అర్ధం కాదు. ఒకడు అంటాడు, బాగా ఎత్తున్న అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇష్టం అని. ఆరడుగులున్న వాడిని అడిగితె, అమ్మాయిలకి తెల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం అని. సరే తెల్లగా ఉన్నోడిని అడిగితె, అమ్మాయిలు బాగా జుట్టు ఉన్నవాడిని ఇష్టపడతారు అని. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడిని అడిగితే, వాడు కూడా ఇంకేదో కారణం చెప్తున్నాడు. సరే, ఈ విషయం మీద కూలంకుషంగా, ఇంకో శీర్షికలో ఖండించుకుందాం. అంతవరకూ ఆశీస్సులు..

12 comments:

  1. "నీకేమి రా నాగచైతన్య అంత అందంగా ఉంటావు"
    మీమల్లిమామ తిట్టాడా, పొగిడాడా?

    ReplyDelete
  2. Naaku cheppi pelli cheskovaddu ra., nenu cheppinappudu chesko! :D

    -Jayanth

    ReplyDelete
  3. @ అజ్ఞాత: మా మామ పొగిడాడనే అనుకుంటున్నా
    @ జయంత్: :D

    ReplyDelete
  4. @గురుజీ : నిజమే మీ మామ పొగిడాడు.. కాకపోతే మిమ్మల్ని పొగిడాడ లేక నాగ చైతన్య ని పొగిడాడ అన్నదే చర్చనీయాంశం...

    ReplyDelete
  5. నాతో పోల్చి, నాగ చైతన్యానే పొగిడాడు :P

    ReplyDelete
  6. అంతే అంతే .. అలా అనుకోకపోతే ఈ రొజుల్లో బ్రతకలేములే గురుజీ.. నాగ చైతన్య కూడా వాడి గురించి అలాగే అనుకోని మన ప్రాణాలు తీస్తున్నాడు

    ReplyDelete
  7. thanks for understanding, but your stories are really nice to read.

    ReplyDelete
  8. నాగచైతన్య .. హ హ హ.

    ReplyDelete
  9. @నారాయణస్వామి: ఆ నవ్వుకి అర్దం ఏంటో తెలుసుకొవచ్చా???

    ReplyDelete
  10. @నారాయణ స్వామి గారికి :D

    ReplyDelete
  11. హమ్మా! ఎంత కుట్ర? ఆగండాగండి నేను కూడా ఒక టపా టపటపా వ్రాసేస్తాను! అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలని ఇష్టపడతారు అనే అంశం మీద! (నిజానికి వాళ్లకి కూడా తెలియదనుకోండి! అది వేరే విషయం!)

    ReplyDelete
    Replies
    1. @రసఞ : ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నారన్న మాట. మీ సమాధాన టపా కొసం ఎదురుచూస్తుంటాము. కానివ్వండి .

      Delete