Monday, February 25, 2013

బాలు, నీకు ఖాయం జైలు

బాల సుబ్రహ్మణ్యాన్ని జైలులో పెట్టాలని నేను బలంగా కోరుకుంటున్నాను. దానికి కారణం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. బుదవారం టి.వి లో వచ్చే పాటల కార్యక్రమాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అంతా బాగానే ఉంటుంది కానీ, వాళ్ళు ఇచ్చే మార్కులే, వేలల్లో ఉండటం కొంచం అతి అనిపిస్తూ ఉంటుంది. 

ఒక రోజు అదే కార్యక్రమం చూస్తుంటే "రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే పాట పాడారు. గురువుగారి పాట, అందునా జాతీయ బహుమతి గెలిచిన పాట కావటంతో జాగ్రత్తగా విన్నాను. కొన్ని నోడ్స్ డైరెక్ట్ గా హిట్ చేయలేదు. శృతి కొన్ని చోట్ల షార్ప్ అయ్యింది. టెంపో అక్కడక్కడ మిస్ అయ్యింది. అతి కోకీల అక్కాయి చెప్పినట్టు ఇంకొంచం పెప్పీగా ఉండచ్చు. సరే ఇలాంటి చిన్న చిన్న తప్పులు మినహాయిస్తే మొత్తానికి బాగానే పాడారు. 

కాకపోతే ఆ పాట మొదలైన కాసేపటికే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడవటం మొదలు పెట్టారు. అది చూసి నాకు ఆశ్చర్యమేసింది. ఒకటి రెండు కన్నీటి చుక్కలు రాలిస్తే ఏమో అనుకోవచ్చు, కానీ ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసరికి నాకు మొదట నవ్వొచ్చింది. అస్సలు ఒక పాట అంతలా ఎక్కిళ్ళు పెట్టి ఏడిపించగలదా?? మీరు ఎప్పుడైనా పాటకి ఏడ్చారా?  

మనస్సు కొంచం బాగోలేక (నేను మనిషినే, నాకు కూడా మనోభావాలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు దెబ్బ తింటుంటాయి)  యూట్యూబ్ లో, ఇదే కార్యక్రమం చూస్తుంటే, బాలుగారు సినిమాలో పాడిన "హాయి హాయి వెన్నెలమ్మ హాయి" అనే  పాట పాడటం విన్నాను. ఇదివరకు ఈ పాటను, అతి కోకిల అక్కాయి(ఎవరో అర్ధం కాకపోతే నేనేమి చేయలేను) బాలు గారితో చేసిన  ఒక కార్యక్రమంలో, బాలుగారు ఈ పాట పాడగా విన్నాను. వెంటనే బాలుగారు సినిమాలో పాడిన పాటను దిగుమతి చేసుకొని విన్నాను, విన్నాను, అలా వింటూనే ఉన్నాను. మీరు కూడా ఒకసారి తప్పక వినాలి.  ఇది వరకే వినుంటే నా అజ్ఞానాన్ని మన్నించాలి. 

ముఖ్యంగా ఆ పాట , బాధలో ఉన్న ఎవరికైనా సేద తీర్చగల పాట.  

హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి,  హాయి హాయి..., హాయి..., హాయి...,
తియ్య తియ్యనైన పాట పాడనీయి, బాధ పోనీ రానీ హాయి 
చురుకుమనే మంటకు మందును పూయమని 
చిటికెలలో కలతను మాయము చేయమని 
చలువ కురిపించని  ఇలా ఇలా ఈ నా పాటని 

ఎంత బాగా రాశారు శాస్త్రిగారు?? బాధ కలిగించే మంటకు మందును పూసి, చిటికెలో కలతను మాయము చేయమని, అబ్బబ్బబ్బబా  పాట వింటుంటేనే బాధ ఎటుపోయిందో అర్ధం కాలేదు.  ఇదే అనుకుంటే చరణాలు మరీను. 

కనులు తుడిచేలా, ఊరడించి ఊసులాడే భాషే రాదులే 
కుదురు కలిగేలా, సేవ జేసి సేద తీర్చే ఆశే నాదిలే 
వెంటనే నీ మది, పొందని నెమ్మది
అని తలచే ఎద సడిని పదమై పలికి మంత్రం వేయని
ఈ పాటని ఈ పాటికి ఓ ఐదు వందల సార్లు వినుంటా!! వెయ్యికి పరుగులు తీస్తున్నా!! ఈ బాల సుబ్రహ్మణ్యం మనల్ని పనులు చేసుకోనివ్వడా?? వేటూరి గారితో అయితే ఒక రోజు అనుకున్నా, ఇతగాడి గురించి రాయాల్సి వస్తే, నిముషానికి అరవై పాటలు గుర్తుకొస్తాయి. అందుకే గుండె అనే జైలులో మనందరికీ ఎప్పుడో బందీ అయిపోయాడు. 

ఇంతకీ నేను ఏ బాధలో ఉండి ఈ పాటను విన్నానో అని ఎవరికైనా తెలుసుకోవాలనుందా??? చెప్పిన ముఖ్యమైన విషయాలన్నింటిని వదిలేసి, ఇటువంటి అనవసరమైన విషయాలను అడిగేవాళ్ళని ఏమంటారో, జల్సా సినిమాలో ఇంకో సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో చెప్పారు.   


Sunday, February 3, 2013

వేటూరిగారితో ఒక రోజు

ఉదయాన్నే నిద్రలేచి మేడ మీద నిలబడి చూస్తే, మొత్తం పొగ మంచుతో కప్పేసి ఉంది. చలికాలం ఒంటికి చలి కోటు ఉండనే ఉన్నది. ఆ మంచు చూసి, నా గదిలోకి వెళ్లి ఒక శాలువా కప్పుకొని బయటకు వచ్చి "ఆమని పాడవే హాయిగా., మూగవై పోకు ఈ వేళా" అని ఎవ్వరికీ వినపడకుండా మూగగా పాడుకున్నాను. కార్యాలయానికి పోయే కాలం దగ్గర పడటంతో స్నానానికి వెళ్లాను. నీళ్ళను చూడగానే గోదావరి, గోదావరి సినిమా, ఆ సినిమాలో పాటలు వెనువెంటనే గుర్తుకు వచ్చేశాయి.

స్నానం చేసి పూజకి కూర్చొని "అస్త్రాయ ఫట్" అనే మంత్రం దగ్గరకు వచ్చే సరికి "నంది కొండ వాగుల్లో" పాట గుర్తుకొచ్చి తెగ ఇబ్బంది పెట్టేసింది. ఇంటి బయటకు రాగానే, ఇంటి ముందు "నందివర్దన" చెట్టుకి రాలి పడిపోయిన పూలను చూసి "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?" అని అడిగాను.

కార్యాలయంలోకి రాగానే "సునేత్ర" అని నా స్నేహితుడు ఎదురు పడ్డాడు. అదేదో విచిత్రం పేరులో మాత్రమే వీడి కళ్ళు బాగుంటాయి. కళ్ళజోడు తీస్తే ఏమీ కనపడదు. ఉద్యోగం చేయటానికి కలకత్తా నుంచి కళ్ళేసుకొని వచ్చాడు. వాడిని చూడగానే, "యమహా నగరి, కలకత్తా పూరి" అని చిరు త్యాగరాజు లాగా పాడుకున్నా. కంప్యూటర్ తీసి చూస్తె, స్నేహితుడు ఒకడు తన పెళ్లి శుభలేఖ పంపాడు, "శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో" పాత పాట  అని పాడుకున్నా. ఇంతలో ఒకమ్మాయి పుట్టిన రోజని చాక్లెట్లు తీసుకు వచ్చింది., అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజనుకున్నాను.

మెల్లగా పనిలో మునిగిపోయాను. కాసేపటికి కొంత మంది పైనోళ్ళు హిందీలో ఏదో గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. వెంటనే నాకు "ఇదేదో గోలగా ఉంది" అనిపించింది. కాసేపటికి వేణు అని నా స్నెహితుడు ఫొను చేశాడు, "వేణువై వచ్చాను భువనానికి..." అనే పాట గుర్తొచ్చింది.

భోజనానికి వెళ్ళేసరికి వంకాయ కూర స్వాగతం పలికింది. "ఆహా ఎమి రుచి, అనరా మైమరచి, తాజా కూరలలొ రాజా ఎవరంటే?? ఇంకా చెప్పాలా?? వంకాయేనండి". అన్నం తిని చల్లగాలి పీల్చుకోవటానికి కార్యలయం బయటకి వచ్చాను. ఒక అందమైన అమ్మాయి ఎదురుపడింది. తనను ఎక్కడో చూసినట్టు గుర్తు, "బహుశా తనని బందరులో చూసి ఉంటా!"

సాయంత్రం కార్యాలయం నుండి బయలుదేరి వస్తుంటే, అస్తమిస్తున్న ఎర్రని సూర్యుడిని చూడగానే "అకాశాన  సూర్యుడుండడు సంధ్య వేళకే" అని అర్ధం అయ్యింది.ఆ రోజు పౌర్ణమి తర్వత రెండో రోజు అనుకుంటా, వెన్నెల ధార కురుస్తున్నది. "ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మ","మౌలమేలనోయి ఈ మరపు రాని రేయి","వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా?","మల్లెలు పూసే, వెన్నెల కాసే","కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి"ఇలా ఎన్నో పాడుకున్నాను.ఇలా ఒక రోజులో, వేటూరిగారి కలం నుండి జాలువారిన ఎన్నో పాటలు గుర్తుకు వచ్చాయి.