Wednesday, April 25, 2012

అందంగా ఆంగ్లం

ఈ శీర్షిక కొన్ని వేల రూపాయలు ఖరీదు చేస్తుంది. కాని నేను మంచోడిని కాబట్టి, చచ్చే చవకగా, ఉచితంగా అందిస్తున్నాను. షరతులు వర్తించవు. కావాలంటే చూసుకోండి, పైన ఎక్కడా కూడా చుక్క పెట్టలేదు. ఇంతకూ ఏమిటా వేలకి వేలు ఖరీదు చేసే అంశం అనుకుంటున్నారా?? ఆ విషయం చెప్పే ముందు, మనం తీసుకుందాం చిన్న బ్రేక్. 

బ్రేక్ తర్వాత మళ్లీ స్వాగతం. చాలా మంది ఆంగ్లం సరిగ్గా మాట్లాడాలి అని వేలకు వేలకు పోసి నేర్చుకుంటారు. వేలతో పాటు కొన్ని నెలల కాలాన్ని వృధా చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ శీర్షికని ఉచితంగా అంకితం ఇస్తున్నా. కేవలం పది నిముషాలలో పైసా ఖర్చు లేకుండా ఆంగ్లం నేర్చుకోండి. ఇవాల్టికి ముందుగా కొన్ని ముఖ్యమైన పదాలు నేర్పుతాను. వాటితో మీరు ఆంగ్లంలో అందంగా మాట్లాడచ్చు.

మొదటగా 'U know'. ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ విషయం గురించి మీకు తెలియక పోయినా మాట్లాడాలి అంటే ఈ పదం బాగా ఉపయోగ పడుతుంది. ప్రతి పది మాటలకి ఒకసారి 'U know' అని వేసుకోవచ్చు. మీకు ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే, క్రికెట్  అయిపోయిన తర్వాత, బహుమతి ప్రధాన కార్యక్రమంలో మన  ఆటగాళ్ళు మాట్లాడేది  వింటే మీకే అర్ధం అవుతుంది, ఈ పదం ఎంత బాగా ఉపయోగించచ్చో అని. నాతో మాట్లాడేప్పుడు చాలా మంది 'U know' అని వాడుతుంటారు. "నాకు తెలిస్తే ఇంకా నువ్వేందిరా చెప్పేది" అని మనసులో అనుకుంటా.

రెండవది 'I mean'. నీకు ఇంగ్లీష్ మాట్లాడటం రావటంలేదు, సమయానికి ఆ పదాలు గుర్తుకు రావటంలేదు అన్నప్పుడు 'I mean' అని వాడుకోవచ్చు. చెప్పిందే మళ్లీ చెప్పేవాళ్ళకి ఈ పదం మహబాగా ఉపయోగ పడుతుంది.

మీరు ఆంగ్లంలో అబద్దం ఆడాలి అనుకున్నారు. కాని ఎదుటి వాళ్ళు నమ్మరేమో అన్న అనుమానం వచ్చిందంటే, అలాంటి సందర్భంలో ఉపయోగ పడే పదం 'actually'. అలా అని చెప్పి మిగితా సమయంలో వాడ కూడదు అని ఏమి లేదు. ఎండాకాలం ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు మంచినీళ్ళు తాగినట్టు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పదం వాడుకోవచ్చు. 

నేను ఇది వరకే చెప్పినట్టు, ఔచ్, ఊప్స్, లాంటి చిన్న చిన్న పదాలైతే, పోకిరిలో మహేష్ బుల్లెట్లు వాడినట్టు మీరుకూడా ఎవరికీ లెక్క చెప్పకుండా విచ్చల విడిగా వాడుకోవచ్చు. ఇలాంటి పదాలు ఒక పది పదిహేను నేర్చుకుంటే సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే. 

ఆంగ్లం అంటే గుర్తొచ్చింది, ఉదయం నువ్వు-నేను చిత్రం చూశాను. ఆ చిత్రం ఇవాల్టి రోజున తీసుంటే, అందులో పాటలు మార్చి"బెంగుళూరు బుల్లా మేము బాంగిల్స్ వాళ్ళం కాదా? నీ హ్యాండ్ షో లేదా , మా బ్యాంగిల్ 'పుట్ట'లేదా? బెంగుళూరే బుల్లా మాది బాంగిల్స్ వాళ్ళమే బుల్లా మేము" అని రాస్తారేమో.

ఇంకా మీకు ఎక్కువ ఆంగ్లం మాట్లాడాలి అనుకుంటే, డబ్బులు కట్టక తప్పదు. ఎంతో కాదు, కేవలం 5000  రూపాయలు కడితే పాలన్న కన్నా బాగా మాట్లాడేట్టు ఆంగ్లం నేర్పిస్తా.  షరతులు వర్తించవు. కావాలంటే చూడండి 5000 మీద చుక్క పెట్టలేదు. గమనిక: 5000లతో ఆంగ్లం నేర్చుకున్న వాళ్లకు, అదనంగా తెలుగు కుడా నేర్పబడును, అది కుడా పూర్తి ఉచితంగా. త్వరపడండి, అందమైన అమ్మాయిలకు ప్రత్యేక శ్రద్ద తీసుకోనబడును, రాయితీ కుడా ఇవ్వబడును.

Sunday, April 8, 2012

ఎండాకాలం

మార్చి అయిపోతుంది అంటేనే, భయం పుట్టుకొస్తుంది. అప్రైసల్  ఇచ్చే సమయం. అప్పటి దాకా మా నుంచి పనిని మాత్రమె ఆశించే మా దొరలు, ఇప్పటి నుండి ఒక నెల రోజులు మా నుండి తప్పులు ఆశిస్తారు. అందుకనే నేను కుడా పని లేకపోయినా బ్లాగు రాయటం తగ్గించా. అలాగైనా, అంతా నేను పని చేస్తున్నాను అనుకుంటారు.

మనిషికి ఎప్పుడూ సుఖాలే ఇస్తే, తననే మర్చిపోతాడని దేవుడు అనుకోని ఎండాకాలాన్నిసృష్టించి ఉంటాడు. అంతటి మహత్తరమైన  ఎండాకాలం రానే వచ్చింది. రెండేళ్లలో మొదటిసారి, వారానికి పది రోజులు కార్యాలయం ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది(చక్కగా ఎ. సి.లో ఉండి ఎండను తప్పించుకోవచ్చు). అప్పటికీ మా దొరగారిని అడిగా, శని ఆదివారాలు కుడా కార్యాలయానికి వస్తాను అని. దానికి ఆయన ఎంతగానో మురిసిపోయి, "నీకు ఐదు రోజులకు జీతం ఇవ్వటమే దండగ, శని ఆది వారాలు కూడా మేపటం కుదరదు" అని ప్రశంసించారు. ఎంచక్కా కార్యాలయాలన్నీ వారానికి చలికాలం నాలుగు రోజులు, ఎండాకాలం ఏడు రోజులు ఉంటే, ఎంత బాగుంటుంది.

పుండు మీద కారం చల్లినట్టు, ఈ ఎండాకాలంలోనే జనాలు తెగ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ సోమ్మేమి పోయింది, రూపాయి పెట్టి ఫోను చేసి, "పెళ్ళికి తప్పకుండా రావాలి, నువ్వు రాకపోతే పెళ్ళిలో ఎవరికీ అప్పడాలు వెయ్యను, సాంబారు పోయను"అని చెప్తున్నారు. ఇందులో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. మొదటి రకం వాళ్ళు వారం మధ్యలో పెళ్లి పెట్టుకున్నది కాక, "ముందుగానే చెప్తున్నా, రెండు రోజులు సెలవు పెట్టి మరీ రావాలి " అని ఆప్యాయంగా చెప్తారు. ఇలా అందరి పెళ్ళిళ్ళకి సెలవు పెడితే, రేపు నా పెళ్ళికి సెలవు దొరకని పరిస్తితి వస్తుంది. ఇంక రెండో రకం వాళ్ళని ఏమి చేసిన తప్పులేదు. హాయిగా ఏ బుధవారమో, గురువారమో పెళ్లి అయితే, సెలవు దొరకలేదని తప్పించుకోవచ్చు, ఆ అవకాశం ఇవ్వకుండా, "నీ కోసమే శని, ఆదివారాలు చూసుకొని ముహూర్తం పెట్టించాము, తప్పకుండా రావాలి" అంటారు.    ఇలానే ఒక స్నేహితుడి పెళ్ళికి వెళ్లి, వడ దెబ్బకు వారం రోజులు అడ్డం పడ్డాను. వాడు మాత్రం హాయిగా ఊటీ పోయాడు.

ఎండాకాలం ఎండలతో పోటి పడుతూ చెమట, చిరాకు, విద్యుత్ చార్జీలు, విద్యుత్ కోతలు పెరిగాయి. వీటి అన్నింటి కన్నా నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నది, కొబ్బరి బోండాల ధరలు. నవంబరు నెలలో పన్నెండు రూపాయలతో మొదలయిన దాని ప్రస్థానం, జనవరికి పద్నాలుగు, మార్చికి పదహారుగా పెరిగి, ప్రస్తుతానికి ఇరవయి దరిదాపులకి వచ్చింది. ఆ కొబ్బరి బొండాం చూసినప్పుడల్లా, ఆ బొండాం నాతొ ఒక మాట చెప్తుంది. "నాకో కొంచం రేటు ఉంది, కానీ దానికో లెక్క ఉంది" అని. అయినా బొండాలు మాట్లాడటం ఎంటిరా నీ తలకాయి అనుకుంటున్నారా?? ఏమ్చేస్తాం, నా తలకాయంత లేదు, ఇరవయి రూపాయలంటే కొనలేక, అలా అని కొనకుండా ఉండలేక నరకం అనుభవిస్తున్నా, బొమ్మరిల్లులో సిద్దార్థ బాబు లాగా.

అస్సలు ఎండాకాలంలో కొబ్బరి బోండాన్ని మించినది లేదు. అందుకే పూర్వము మన పెద్దలు "సర్వ ఫలానాం నారికేళం ప్రధానం" అని అన్నారు. అర్ధం కాలేదా??? అయితే తెలుగులో చెప్తాను, ఫలం అంటే ఫ్రూట్స్, నారికేళం అంటే కోకోనట్, "అన్ని ఫల్లాలోకి కొబ్బరి ప్రధానం అయినది" అని దానర్ధం. కొబ్బరి గురించి ఎంత చెప్పినా తక్కువే., ఉదాహరణకు తాటి చెట్టు కింద నించొని పాలు తాగినా కల్లు అనే అనుకుంటారు. అదే కొబ్బరి చెట్టు కింద కూర్చొని పురుగులు మందు తాగండి, పాపం పిచ్చి ఎదవ, దాహం వేసి కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు అని అనుకుంటారు. నా మాట  అబద్దం అనుకుంటే ప్రయత్నించి చూడండి.

ఇప్పుడంటే ఎండాకాలం అని తిట్టుకుంటున్నాను కానీ, మహేష్ బాబు సినిమా కోసం అమ్మాయిలూ ఎదురు చూసినట్టు, ఆ రోజుల్లో ఎండాకాలం కోసం జూన్ నుంచే ఎదురు చూసేవాళ్ళం, మార్చికి కానీ ఎండాకాలం వచ్చేది కాదు.  ఒంటి పూట మాత్రమె బడి పెట్టేవాళ్ళు. ఎప్పుడెప్పుడు పరీక్షలు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు సెలవలు వస్తాయా? అని కలలు కనే వాళ్ళం. ఆ ముచ్చట చెప్పాలంటే, తీరికగా ఇంకో శీర్షికలో కలుద్దాం. అప్పటి వరకు నాకు  అప్రైసల్ బాగా రావాలని, మీరంతా సర్వమత ప్రార్ధనలు లాంటివి చేస్తారని ఆశిస్తూ.., సెలవు ...