Sunday, January 29, 2012

జీవిత సారం 6 (మనస్సా తొక్కా!!)

నిన్న గుంటూరులో, హిందీ చిత్రాన్ని, తమిళంలో తీసి, తెలుగులోకి అనువదించిన ''స్నేహితుడు''అనే చిత్రాన్ని చూశాను. ఆ చిత్రాన్ని హిందీలో అక్కడక్కడ చూశాను కానీ పెద్దగా అర్దం కాలేదు. నిన్న ఆ చిత్రాన్ని తెలుగులో చూశాక, నేను ఇంజనీరింగ్ చదివిన రోజులు గుర్తుకు వచ్చాయి. ముఖ్యంగా ఆ చిత్రంలో "సైలెన్సర్" అనే పాత్ర, మా రావికాముగాడికి చాలా దగ్గరగా ఉంది. చిత్రం చూస్తున్నంత సేపు వాడే గుర్తొచ్చాడు. కదానాయకుడిని చూసినంత సేపూ, నన్ను నేను చూసుకున్నట్టే ఉందంటే నమ్మండి.

నా జీవితంలో కుడా ఇంజనీరింగ్ చదివిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆ చిత్రంలో చూపించినంత కాకపోయినా ఒక మాదిరిగా గడిచింది. ఆ సినిమాలో చెప్పినట్టు, ఇప్పటి రోజుల్లో కళాశాలలన్నీ మార్కుల మీద ర్యాంకుల మీద కుస్తీ పడుతున్నాయి తప్ప నా లాంటి ఆణిముత్యాలని తయారు చేయాలని ఒక్కళ్లు కుడా ప్రయత్నించటంలేదు. ఇప్పుడు నడుస్తున్న కళాశాలలో సగం ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం కట్టినవి, మరి కొన్ని జనాల దగ్గర డబ్బులు దండుకోవటానికి పుట్టినవి. అసలు పాఠాలు చెప్పే వాళ్ళకే (అందరు కాదు కొందరు), ఏమీ చెప్తున్నారో, దేని కోసం చెప్తున్నారో తెలియదు. ఏదో బుక్కున ఉన్నదానిని ముక్కున పట్టుకొని ఠక్కున పిల్లల ముందు కక్కుతున్నారు.

అస్సలు విషయానికి వస్తే, ఈ చిత్రంలో, "ఇంట్లో ఏది చెబితే అది కాకుండా,  మనస్సు ఏది చెబితే అది చేయాలి" అని సందేశం ఇచ్చారు. మరి ఆ రోజుల్లో నా  మనస్సు  నాకేమి చెప్పింది? అని బాగా ఆలోచించాను. ఏదో గొఱ్ఱెల మందలో, సాటి గొఱ్ఱెలతో పోటీగా ఒకే దారిలో పరిగెత్తాలన్న ఆలోచన తప్పించి, అస్సలు వేరే దారులు ఉంటాయి అనే స్పృహ కుడా లేకుండా పోయింది.

నిజానికి నాకు నా మనస్సు ఏమీ చెప్పలేదు. నా మనస్సు చెప్పిందల్లా ఏంటంటే "బాగా చదువు. మార్కులు రాకపోతే ఇంట్లో బామ్మ దగ్గర నుంచి వీదిలో బుడ్డోడి దాక అందరికీ సమాధానం చెప్పాలి" అని. మనందరికీ అస్సలు మన  మనస్సు ఏది కోరుకుంటుందో? మన మనస్సుకి ఏది కావాలో, ఏది వద్దో ఆలోచించే సమయమే ఉంటే, ఆ సమయంలో ఇంకో రెండు ఎంసెట్ ప్రశ్నలు చదివించే వారు. పదో తరగతిలో 500 రావాలి, తరువాత మంచి ఎంసెట్ ర్యాంకు రావాలి, తరువాత ఇంజనీరింగ్ లో మంచి మార్కులు, ఆ పైన మంచి s/w కంపెనీలో కంప్యుటర్ ఇంజనీర్ అవ్వాలి. ఇది కాకుండా ఇంకో ఆలోచన కుడా రాకుండా రుద్ది పారేశారు. అస్సలు ఉద్యోగమంటే కంప్యుటర్ ఇంజనీర్ ఒక్కటే అనట్టు పెరిగాము. అంతేలే...., ఎంత కాదన్నా

చరణాలు ఎన్ని ఉన్నా రామచరణ్ ఒక్కడే కదా
కిరణాలు ఎన్ని ఉన్నా కుమార్ రెడ్డి ఒక్కడే కదా 
జిల్లాలు మారినా ఓదార్పు మారునా??? మధురమే సుధా గానం .........  

చివరకు ఇప్పుడు ఆ చిత్రం చూసి, జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, పరిస్తితి బాగా చీకేసిన ఐస్ పుల్ల లాగా, మామిడి టెంకెలాగా మిగిలాము అనిపిస్తుంది. నేను ఇది వరకు చెప్పినట్టు  చివరకి ఇలా బ్లాగులు రాసుకొని బాదపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. పోనీ ఇప్పుడు ఏదైనా చేయాలంటే, ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. ఇకనో ఇప్పుడో పెళ్లి అని కూడా అంటున్నారు. ఇక ఈ శేష జీవితాన్ని ఆ కంప్యూటర్లతో, కంపు పట్టే బ్లాగులతో గడిపేయటమే.

ఇక చేసేది ఏమీ లేక, నిజం చెప్పాలంటే చేతగాక దానిని కప్పి పుచ్చుకోవటం కోసం అని, "జీవితం మన చేతుల్లో లేదు, అది ఎటు నడిపిస్తే అటు పోవటమే అని" వేదాంతం చెప్పుకోవటమే. కాని జీవితంలో సాదించాలన్న కసి, పట్టుదలతో పాటు, ఈ రామానంద స్వామి ఆశీస్సులు కుడా ఉంటే ఎన్ని అడ్డంకులు ఉన్నా ఏదో ఒకరాజు మనం కోరుకున్న తీరానికి తప్పకుండా చేరుతాము! తప్పకుండా చేరుతాము!  

Thursday, January 19, 2012

ఆరంభ శూరత్వం

ఆంధ్రులు ఆరంభశూరులు అని ఎక్కడో చదివాను. నాకు మాత్రం, ఆ నానుడి నన్ను చూసే వచ్చిందేమో అనిపిస్తుంది. ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే., ఒకసారి మనసేసుకొని ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లి వచ్చాను. అప్పుడు నా అనుమానానికి బలం చేకూర్చే ఎన్నో సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి. వివరాలలోకి వెళితే...

నాకు అప్పుడు ఎనిమిదేళ్ళు ఉంటాయనుకుంటా, కరాటే నేర్చుకుంటే కండలు తిరుగుతాయి అని, ఇంట్లో గొడవ చేసి మరీ కరాటే చేరాను. నా ఉత్సాహం చూసి, కరాటే నేర్చుకునేవాళ్ళు వాడేటువంటి దుస్తులు కుడా కుట్టించారు. ఇక చూడండి, ఏది కనిపిస్తే దానికేసి చేతులు గుద్దటం, తన్నటం చేసేవాడిని. 

అలా క్రమం తప్పకుండ ఒక వారం రోజుల పాటు నేర్చుకున్నానంటే నమ్మండి. ఎనిమిదో రోజు నాకనిపించింది, ఆ కరాటే చేసే గంట కుడా చదివితే ఇంకా మంచి మార్కులు వస్తాయి కదా అని. అప్పటి నుంచి మళ్లీ కరాటే జోలికి పోలేదు. ఆ గంట చదవలేదు., అంతకన్నా ఎక్కువ మార్కులు కుడా రాలేదనుకోండి., అది వేరే విషయం. అలా మొదలైన నా ఆరంభశూరత్వ మహాప్రస్థానం నేటికీ,  ఓదార్పు యాత్రలా, అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 

నేను పాడిన పాటలు విన్న చాలామంది, సంగీతం నేర్చుకోమని సలహా ఇస్తేనూ, ప్రేక్షకుల కోరిక, ఒత్తిడి మీదట, సంగీతం నేర్పమని మా బామ్మగారిని అడిగాను. కరాటే మాదిరి కర్నాటక సంగీతాన్ని కుడా తొడ మీద చేతులు అటు ఇటు తిప్పి, ఒక వారం, నా శక్తి కొలది ఆదరించాను. సరే., పాపం బాల సుబ్రహ్మణ్యం బ్రతుకుదెరువు కోసం పాడుకుంటున్నాడు., అతనికి ఇబ్బంది ఎందుకులే అని మానేశాను.

ఆ తరువాత కొంత కాలానికి కంప్యూటర్ కోర్సు చేరాను. నా ఊపు చూసి, రాబోయే కాలానికి కాబోయే చంద్ర బాబు అని మా వీధిలో అందరు అనుకున్నారు. ఆనవాయితీ చెడకుండా ఆ కంప్యూటర్ని కుడా కంపు పట్టించి వదిలేశా.

సంవత్సరం క్రితం కుడా, నేను పనిచేసిన కార్యాలయంలో ఒక ఈత కొలను ఉండేది. కార్యాలయంలో పని చేసే వారందరూ ఉచితంగా, విచ్చలవిడిగా ఈదవచ్చు  అని చెప్తేను., వెయ్యి రూపాయలు పోసి., ఈదటానికి వాడే దుస్తులు కుడా కొన్నా. ఇంతకుముందు వారం రోజులు ఉన్న ఆరంభ శూరత్వం, నా వయసుతో పాటు తగ్గి, రెండు రోజులకే ఈత మీద సీత కన్ను పడింది.

ఇవన్నీ ఒక ఎత్తు, "తిండి కలిగితే కండ కలదోయ్., కండ కలవాడేను మనిషోయ్" అని ఆ మహానుభావుడు చెప్పిన మాటలు విని స్ఫూర్తి పొంది, ఎలాగూ చిన్నప్పుడు కరాటే చేసిన శరీరం కదా, ఆ ధృడత్వాన్ని కాపాడుకోవటానికి వ్యాయామశాల (జిమ్) చేరాను. రోజూ ఉదయాన్నే లేవటం, బలవర్ధకమైన ఆహారం తినాలి అంటేను, మొలకెత్తిన గింజలు లాంటివి తినటం లాంటి అకృత్యాలు ఎన్నో చేశాను. పట్టుమని పది రోజులు కాకుండానే మానేశాను. అలా ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి వ్యాయామశాలలో చేరటం., వారం పదిరోజులకి ఏదో ఒక కారణం చేత మానేయటం., అలవాటైపోయింది. 

ఇలా చెప్పుకుంటూ పొతే ఒకటా రెండా? నెలకొకటి చప్పున జరుగుతూనే ఉంటాయి. నేను ఈ బ్లాగు రాయటం మొదలుపెట్టినప్పుడు కూడా, నా ఆరంభశూరత్వాన్ని చిన్నప్పటి నుంచి గమనిస్తున్న నా స్నేహితులు అన్నారు, "ఈ ముచ్చట ఎన్ని రోజులులే., దొంగ నిరాహార దీక్షల మాదిరి, మహా అయితే ఒక నాలుగు ఐదు రాసి ఆపేస్తావు" అని. మరి చూడాలి., ఈ నా నస మీకింకా ఎన్ని రోజులు ఉంటుందో??

Sunday, January 8, 2012

జానకి నా ప్రియసఖి

మనలో 'అంజలి అంజలి పుష్పాంజలి' అనే పాట విననివారుండరు . నేను విన్నప్పుడు అందులో చాలా పదాలు నాకు అర్ధం కాలేదు. లాభం లేదని ఆలస్యం చేయకుండా ఆ పాటను పాడు చేసి మళ్లీ రాశాను. నా శక్తి కొలది పాటను పాడు చేశాను. కాకపోతే అంజలి అనే అమ్మాయితో నాకు పరిచయం లేదు. ఎవరి మీద రాయాలి అని ఆలోచిస్తుంటే, రాముడికి సరి అయిన జోడి జానకి కదా అనిపించింది., అందుకని జానకి మీద పాట రాశాను.

పల్లవి :
బాబు ||
  జానకి జానకి నా ప్రియసఖి --- (2)
నిను వదిలి పోలేనే ఏనాటికి
నీతోనే నేనుంట ముమ్మాటికి
నా ప్రాణం వదిలేస్త నీ మాటకి
                      నువ్వు పల్లవవ్వాలి నా పాటకి...      ||జానకి||

ఎందుకు నీ పేరునే పదే పిలుస్తుందని
నా పెదవి అడిగిందిలా, ఈ చిన్ని మనసుని
ఎందుకు నీ కోసమే పదే వెతుకుతుందని
కనురెప్ప అడిగిందిలా నా కంటి పాపని

ఎదలో నీ రూపం మెదలినది
ప్రతి అడుగు నీ వైపే కదిలినది
జానకి జానకి నీకిక దాసుని

నీ బుగ్గలో ఉన్న ఆ సొట్టకి
నీ నడుములో ఉన్న ఆ ఒంపుకి
నీ కురులలో ఉన్న ఆ నలుపుకి
                   నీ కళ్ళతో చేసే ఆ మాయకి.....          ||జానకి||

పాప||
గుండెలో నా ప్రేమనే ఎలా తెలుపాలని
ఎదుటనే ఉన్నా మరి మాటే రాదని
చల్లని ఈ గాలిలో నిను చేరాలని 
వెచ్చని కౌగిళ్లలో ఒదిగుండాలని

వలచా నువ్వే నా సర్వమని
మదిలో నీ ప్రేమే పదిలమని  
జానకి జానకి నీకిక ప్రేయసి

నా మనసులో ఉన్న నీ బొమ్మకి
నా తోడు నీవేలే ఈ జన్మకి
నా ముద్దు మురిపాలు నీ చెంతకి
                     నీ చిలిపి చిరునామా ఈ జానకి     ||జానకి||

బాబు||
జాబిల్లికైనా సరే మచ్చొకటి ఉందని
నీ అంత అందం మరి లేనే లేదని
వేసవిలో వానలా నువ్వొస్తావని 
వేచాను నీరాకకు నిదురే మాని 

వేసే ప్రతి అడుగు నీ వైపే 
   వచ్చే ప్రతి తలపు నీ వలపే    
                          జానకి జానకి జాగిక దేనికి      ||నిను వదిలి||