Thursday, January 19, 2012

ఆరంభ శూరత్వం

ఆంధ్రులు ఆరంభశూరులు అని ఎక్కడో చదివాను. నాకు మాత్రం, ఆ నానుడి నన్ను చూసే వచ్చిందేమో అనిపిస్తుంది. ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే., ఒకసారి మనసేసుకొని ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లి వచ్చాను. అప్పుడు నా అనుమానానికి బలం చేకూర్చే ఎన్నో సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి. వివరాలలోకి వెళితే...

నాకు అప్పుడు ఎనిమిదేళ్ళు ఉంటాయనుకుంటా, కరాటే నేర్చుకుంటే కండలు తిరుగుతాయి అని, ఇంట్లో గొడవ చేసి మరీ కరాటే చేరాను. నా ఉత్సాహం చూసి, కరాటే నేర్చుకునేవాళ్ళు వాడేటువంటి దుస్తులు కుడా కుట్టించారు. ఇక చూడండి, ఏది కనిపిస్తే దానికేసి చేతులు గుద్దటం, తన్నటం చేసేవాడిని. 

అలా క్రమం తప్పకుండ ఒక వారం రోజుల పాటు నేర్చుకున్నానంటే నమ్మండి. ఎనిమిదో రోజు నాకనిపించింది, ఆ కరాటే చేసే గంట కుడా చదివితే ఇంకా మంచి మార్కులు వస్తాయి కదా అని. అప్పటి నుంచి మళ్లీ కరాటే జోలికి పోలేదు. ఆ గంట చదవలేదు., అంతకన్నా ఎక్కువ మార్కులు కుడా రాలేదనుకోండి., అది వేరే విషయం. అలా మొదలైన నా ఆరంభశూరత్వ మహాప్రస్థానం నేటికీ,  ఓదార్పు యాత్రలా, అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 

నేను పాడిన పాటలు విన్న చాలామంది, సంగీతం నేర్చుకోమని సలహా ఇస్తేనూ, ప్రేక్షకుల కోరిక, ఒత్తిడి మీదట, సంగీతం నేర్పమని మా బామ్మగారిని అడిగాను. కరాటే మాదిరి కర్నాటక సంగీతాన్ని కుడా తొడ మీద చేతులు అటు ఇటు తిప్పి, ఒక వారం, నా శక్తి కొలది ఆదరించాను. సరే., పాపం బాల సుబ్రహ్మణ్యం బ్రతుకుదెరువు కోసం పాడుకుంటున్నాడు., అతనికి ఇబ్బంది ఎందుకులే అని మానేశాను.

ఆ తరువాత కొంత కాలానికి కంప్యూటర్ కోర్సు చేరాను. నా ఊపు చూసి, రాబోయే కాలానికి కాబోయే చంద్ర బాబు అని మా వీధిలో అందరు అనుకున్నారు. ఆనవాయితీ చెడకుండా ఆ కంప్యూటర్ని కుడా కంపు పట్టించి వదిలేశా.

సంవత్సరం క్రితం కుడా, నేను పనిచేసిన కార్యాలయంలో ఒక ఈత కొలను ఉండేది. కార్యాలయంలో పని చేసే వారందరూ ఉచితంగా, విచ్చలవిడిగా ఈదవచ్చు  అని చెప్తేను., వెయ్యి రూపాయలు పోసి., ఈదటానికి వాడే దుస్తులు కుడా కొన్నా. ఇంతకుముందు వారం రోజులు ఉన్న ఆరంభ శూరత్వం, నా వయసుతో పాటు తగ్గి, రెండు రోజులకే ఈత మీద సీత కన్ను పడింది.

ఇవన్నీ ఒక ఎత్తు, "తిండి కలిగితే కండ కలదోయ్., కండ కలవాడేను మనిషోయ్" అని ఆ మహానుభావుడు చెప్పిన మాటలు విని స్ఫూర్తి పొంది, ఎలాగూ చిన్నప్పుడు కరాటే చేసిన శరీరం కదా, ఆ ధృడత్వాన్ని కాపాడుకోవటానికి వ్యాయామశాల (జిమ్) చేరాను. రోజూ ఉదయాన్నే లేవటం, బలవర్ధకమైన ఆహారం తినాలి అంటేను, మొలకెత్తిన గింజలు లాంటివి తినటం లాంటి అకృత్యాలు ఎన్నో చేశాను. పట్టుమని పది రోజులు కాకుండానే మానేశాను. అలా ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి వ్యాయామశాలలో చేరటం., వారం పదిరోజులకి ఏదో ఒక కారణం చేత మానేయటం., అలవాటైపోయింది. 

ఇలా చెప్పుకుంటూ పొతే ఒకటా రెండా? నెలకొకటి చప్పున జరుగుతూనే ఉంటాయి. నేను ఈ బ్లాగు రాయటం మొదలుపెట్టినప్పుడు కూడా, నా ఆరంభశూరత్వాన్ని చిన్నప్పటి నుంచి గమనిస్తున్న నా స్నేహితులు అన్నారు, "ఈ ముచ్చట ఎన్ని రోజులులే., దొంగ నిరాహార దీక్షల మాదిరి, మహా అయితే ఒక నాలుగు ఐదు రాసి ఆపేస్తావు" అని. మరి చూడాలి., ఈ నా నస మీకింకా ఎన్ని రోజులు ఉంటుందో??

21 comments:

  1. అబ్బ!
    మీకు తెలీకుండానే మీరు ఒకటి మాత్రం సాధించారు మాస్టారు!
    "వంద శాతం తెలుగు(ఆంధ్ర)దనం"

    ReplyDelete
  2. Hahahahaa... Sooper mama...

    "Molakethina ginjalu laantivi thinadam lanti aakruthyalu enno chesanu..." :D

    ReplyDelete
    Replies
    1. @ అజ్ఞాత : ధన్యవాదాలు మామా

      Delete
    2. peru cheppadam maricha.. -Jayanth!

      Delete
    3. @jayanth: @జయంత్: నాకు తెలుసు, ఆ ఆగంతకుడివి నువ్వే అని.

      Delete
    4. @జయంత్: శీర్షిక లొని ఒక వాక్యాన్ని రాసి బాగుంది.. హైలైట్ అనేది నువ్వేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..:)

      Delete
    5. Haha.. Mana madhya taragathi anubandhalu, aapyayathalu marichipolenivi...

      --JB

      Delete
    6. పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, బండారి వ్యాఖ్యలు రాసినప్పుడు నాకు, కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది

      Delete
  3. నేనూ అంతే. సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్!!

    ReplyDelete
    Replies
    1. @సూర్య: ఎంతైనా ఆంధ్రులం కదా!!!

      Delete
  4. bAgaA cheppAru

    ReplyDelete
  5. college lo vunnapudu okasari physics lecturer, nenu na frnd physics practicals andari kante mundu velli chesthunte "meeku arambhasurathvam ekuva" annaru... appudu thittaro pogidaro sariga ardham avaledu...ippudu baga ardham ayyindi..:D

    ReplyDelete
    Replies
    1. ఇంతకీ మిమ్మల్ని తిట్టినట్టా? పొగిడినట్టా?

      Delete
  6. మీ నసలో కూడా మాంచి పస ఉందండీ;)
    అందుకే అన్నారేమో పెద్దలు ఏ పనయినా నిరాటంకంగా మండలం రోజులు చేస్తే కచ్చితంగా జయం వరిస్తుంది అని! అన్ని రోజులు ఆరంభ శూరత్వం లేకుండా చేయాలంటే ఎంత బలీయమయిన కోరిక ఉండాలి? అప్పుడే కదా మరి అనుకున్నది నెరవేరేది!
    అన్నట్టు మీ ఈ శూర లిస్టులో పేరడీల గురించి ప్రస్తావించలేదేమి చెప్మా?

    ReplyDelete
    Replies
    1. రసఞ గారు: నా నసలోని పస మీకు నచ్చినందుకు ధన్యవాదాలు

      Delete
  7. బాగుంది సార్. ఇది అరంభశూరత్వంకాదుగదా!

    ReplyDelete
    Replies
    1. కాకూడదనే కోరుకుంటున్నాను

      Delete