Friday, June 28, 2013

తెలుగు పద్యమా? నా తలకాయా?

చిన్నప్పుడు పద్యం నేర్చుకోవటం అనేది చాలా చిరాకుగా ఉండేది. ఉన్న నాలుగు పాదాలని, నలభై సార్లు, అప్పటికీ కంఠస్తము కాకపోతే నాలుగు వందల సార్లు చదివి మరీ పిడి వేయాల్సి వచ్చేది. కొన్ని పద్యాలు ఇట్టే వచ్చేసేవి, కొన్ని ఆట్టే ఇబ్బంది పెట్టేవి. వేమన శతకం, సుమతీ శతకం, సుభాషిత రత్నాలు, ఇప్పుడు గుర్తు లేవు కానీ, అప్పట్లో బాగానే చదవాల్సి వచ్చింది.

అందరూ లెక్కల్లో వందకు వంద మార్కులు రావాలి, లెక్కలు వస్తేనే ఇంజనీర్ అవ్వగలం అని ఒకటికి పది సార్లు చెప్పే వారు. బడిలో చెప్పింది చాలక, ఇంటికి వచ్చాక సాయంత్రం పూట, ఇంకో గంట, కుదిరితే రెండు గంటలు మళ్ళీ లెక్కలు చెప్పించేవారు. అంతెందుకు, మీ జీవితం మొత్తంలో ఎంసెట్ ర్యాంకు ఎంతా? అని అడిగే వాళ్ళు ఉంటారు కానీ, ఎప్పుడైనా, ఎవ్వరైనా (తల్లి తండ్రులతో సహా), తెలుగులో ఎన్ని మార్కులు అని ఎప్పుడైనా అడిగారా? (నన్ను మాత్రం ఎవ్వరూ అడగలేదు)

ఇప్పుడు నాకో సంగతి గుర్తుకు వస్తున్నది. ఎనిమిదో తరగతిలో అనుకుంటా, ఒక ప్రక్క మా తెలుగు పంతులుగారు, కీ.శే. పాండు రంగారావు గారు, పాఠం చదువుతూ, నోట్స్ రాసుకోమని చెప్పారు. అంతా గురువుగారు చెప్పింది రాసుకుంటూ ఉంటే, నా స్నేహితుడు అజయ్, నేను, చెప్పింది రాయకుండా, "ఆంగ్ల పద వినోదం" ఆడుతూ కూర్చున్నాము. కాసేపటికే ఇద్దరం గురువుగారికి దొరికిపోయాము. "ఆంగ్ల పద వినోదం", అందునా తెలుగు తరగతిలో, మాస్టారుకి మండి పోయింది. ఇద్దరినీ ఇరగదీసి వదిలిపెట్టారు. 
 
ఆ తరువాత తరువాత, పద్యం అంటే ఇష్టం, పద్యం నేర్చుకోవాలి అన్న ఆతృత పెరిగాయి. క్లిష్ట సమాసాలలో ఉండే పద్యాలను గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే గొప్పగా ఉండేది. ఆ తరువాత గురువుగారు గణ విభజన చక్కగా నేర్పించారు. ఏదో రావాల్సిన మార్కుల కోసం చదివకుండా, సరదాగా చదవటంతో, ఎంతో కొంత ఇప్పటికీ గుర్తుంది. అస్సలు ఒక పద్యంలోని పాదానికి గణ విభజన చేసి, ఆ పద్యం ఏ చందస్సులో ఉందో తెలుసుకోవటమే గగనం అయ్యేది. అలాంటిది స్వంతంగా ఒక పద్యం రాయటం అంటే మాటలా? పద్యం రాయటమే అనుకుంటే, అవధానాలలో అప్పటికప్పుడు పద్యం చెప్పటమంటే......

యుట్యూబ్లో అవధానం చూస్తుంటే, అందులో చెప్పిన పద్యం అర్ధం చేసుకోవటానికే  అరగంట పట్టింది. అలాంటిది ఆశువుగా అర నిముషంలో అవధానులవారు పద్యం చెప్తుంటే, ఆశ్చర్యమేసింది. అలా చెప్పాలంటే ఎంత ధారణ కావాలి? ఎంత నేర్పు కావాలి? జావా ఏముంది, కుక్కని అమీర్ పెట్ లో అప్పగిస్తే, నాలుగు నెలల్లో నేర్పుతారు. అదే మనకు(నాకు) సరిగ్గా రావటం లేదు, ఇంక తెలుగేమి వస్తుంది, నా తలకాయి. నా లాంటి కోతులు కుక్క, ముక్క, చెక్క, రెక్క అని ప్రాసతో నాలుగు ముక్కలు రాసేసుకొని, మాకు మేమే అదేదో గొప్ప కవిత్వము అనుకొని మురిసి పోతుంటాము (ఇది ఎవ్వరినీ ఉద్దేశించి అన్న మాటలు కావు, కేవలం నా అభిప్రాయం మాత్రమే). 

ఇంకొన్ని రోజులు పోతే గొడవే ఉండదు. తెలుగు వచ్చిన వాడే ఉండడు., ఇంక అవధానం చేసే వారు ఉన్నా అది అర్ధం చేసుకునే వాళ్ళు అస్సలే ఉండరు. పొరపాటున ఎవరితో అయినా 'అవధానం' అని అంటే, "అవయవ దానమా? చచ్చాక చేస్తాములే పో" అని అంటారేమో. చాదస్తం అంటే అనండి కానీ, నాకు మళ్ళీ చందస్సు పూర్తిగా నేర్చుకోవాలని ఉంది. మొన్న మా పిన్నిగారి అమ్మాయికి ఛందస్సు నేర్పే భారాన్ని నా భుజాలపై వేశారు. నాకు వచ్చిందేదో, తనకు ఎక్కించటానికి ప్రయత్నించాను. ఖర్మ ఏంటంటే తెలుగు ఛందస్సుని ఆంగ్ల పదాలతో నేర్పాల్సి రావటం. తప్పు పిల్లలది కాదు. చక్కగా చెప్పేవాళ్ళు ఉంటే, ఆనందంగా నేర్చుకుంటారు. 

"శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు" అంటారు, అదేంటో నా పేరులో అనంతం అయితే ఉంది కానీ, నాకున్న దరిద్రాలకి ఒక్క ఉపాయం కూడా తట్టటంలేదు, క్షణం తీరిక దొరకటం లేదు. ఎలాగోలా మొదలు పెట్టాలి. నాకు నేర్పించాలి అని ఎవ్వరికైనా అనిపిస్తే నేర్పించగలరు. లేదు, ఇలా నేర్చుకోవచ్చు అని సలహాలు ఏమైనా ఉంటే తప్పక ఇవ్వగలరు. చచ్చే లోపు ఒక్క తెలుగు పద్యం రాయాలి అని బతుకుతూ........  సెలవు 

36 comments:

  1. తెలుగు బ్లాగులు మొదలెట్టి నప్పుడు ఇప్పుడూ మీరున్న స్థితిలోనే ఉన్నవారు కనీసం అరడజను మంది ధారాళంగా చందోబద్ధ పద్యాలు రాసే స్థితికి వచ్చారు. బోలెడు ఆసక్తి, కొంచెం పట్టుదల, మరికాస్త సాధన కంటే ఎక్కువ ఏమీ అవసరంలేదు. పద్యం రాయడంలో మెళుకువలకోసం కంది శంకరయ్య మాస్టారిని గానీ చింతా రామకృష్ణ మాస్టారిని గానీ సంప్రదించండి.

    ఒక చిన్న సవరణ: అవధానంలో ధారణ అంటే పద్యాన్ని సృష్టించడం కాదు. అవధానం చివర్లో పృఛ్ఛకులకు చెప్పిన పద్యాలన్నీ వరసగా తప్పు లేకుండా ఒక్క ధారగా అప్పగించడాన్ని ధారణ అంటారు.

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తాను గురువుగారు

      Delete
  2. ఈ మధ్య నాకూ ఇలానే అనిపించి నా బ్లాగు లో తెలుగు ఛందస్సు తెలుగు లోనే రాద్దామని మొదలుపెట్టా. విడుదల చేద్దామనుకునే లోగా "వీడెవడు రా అమెరికా వాడు పసుపు మీద పేటెంటు పట్టేసినట్లు, ఛందస్సు బ్లాగు లో పెట్టేడు" అనుకుంటారేమో నని ఆగా.

    ReplyDelete
    Replies
    1. ఆగటం ఎందుకండి? మనం తగ్గే సమస్యే లేదు, మీరు కానివ్వండి

      Delete
  3. bagunnadi kani nadi adeparisthi...
    manaku manchi rojulu vastayane asatho...

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిద్దాం, ప్రయత్నిద్దాం, పద్యం రాసే వరకు ప్రయత్నిద్దాం

      Delete
  4. ఒక్కటి ఏమి ఖర్మ..వంద రాయాలని ఆశిస్తూ.......

    ReplyDelete
  5. padyalu aithe ardhame kavu. Oka chinna kadha aina rayalani naa jeevitha korika. Kani naku antha drusyam unnattu ledu. Meeku good luck - I think u can do it. Okati matram garva paduthunannu. 12 years pravasam lo unna, India lo maa age group (entha ani adagakandi) kante bagane telugu matlada galanu, rayagalanu kooda.

    ReplyDelete
    Replies
    1. సుభద్ర గారు: మనకు అంత దృశ్యం లేదు నిజమే, కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా అవుతుంది. నేనే చేయగలను అన్నప్పుడు, మీరు ఖచ్చింతంగా చేయగలరు.

      Delete
  6. /* ఇంకొన్ని రోజులు పోతే గొడవే ఉండదు. తెలుగు వచ్చిన వాడే ఉండడు
    చాలా బాగా చెప్పారు! మొన్నొకసారి ఆఫీసులో నలుగురం తెలుగు వాళ్ళం మాట్లాడుకుంటున్నాము, ఈ లోపల ఇంకో తెలుగువాడు వచ్చి ‘ఏమిటి, అందరూ హడావుడి చేస్తున్నారు’ అన్నాడు. నేను ‘ఏమీలేదు, ఏదో పిచ్చాపాటీ!’ అన్నా! అతను ‘ఏమిటీ , పిజ్జా పార్టీ నా’ అన్నాడు. ఖర్మ ఏమిటంటే అది అతనికే కాక అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. వాళ్లకి ‘పిచ్చాపాటి’ అంటే విడమరిచి చెప్పేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. మన మాతౄభాష పరిస్థితి ఇలా ఉంది.

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారు: మీకు మొన్నొకసారి మాత్రమే, నాకు రోజుకు నాలుగు సార్లు ఆ పరిస్తితి ఏర్పడుతుంది

      Delete
  7. తెలుగులో మార్కులు ఎన్ని ? :P

    ReplyDelete
    Replies
    1. త్వరలో 50000 తాకబోతున్నది

      Delete
    2. Ok..got it...ippudu 45987 :)

      Delete
    3. ఈ గ్రాస్పింగ్ చూస్తేనే, కుళ్ళు వచ్చేస్తోంది, చికెన్ తినను కానీ, లేదంటే రాత్రికి డిన్నర్లో కోడిని బదులు నిన్ను కోసుకొని తినేస్తా...,

      Delete
  8. మీ టపా చదివాక మనసంతా ఏదో చెప్పలేని దిగులుతో నిండిపోయింది!

    ReplyDelete
    Replies
    1. అంతేనండి,నాకు కూడా ముందు దిగులు, తర్వాత భాద, ఆ తర్వాత ఏడుపు, ఆ తర్వతా ఈ పోస్టు వచ్చాయి, పద్యం రావటానికి మాత్రం ఇంకొంత సమయం పడుతుంది.

      Delete
  9. కం//
    బుడిబుడి నడకల బుడతలు
    పడిలేస్తూ నడచినటుల వదలక మీరూ
    తడబడుచు మొదలిడిన బో
    లెడు పద్యములల్లగలరు లీలగ త్వరలో

    మేమందరమూ ఇలా మొదలు పెట్టినవాళ్లమే... ధైర్యే సాహసే పద్యం :-)

    ReplyDelete
    Replies
    1. అందరూ ధైర్యం చెప్తున్నారే తప్పించి, అస్సలు ఎలా మొదలెట్టాలో చెప్పటంలేదు., అదే నా భాద

      Delete
    2. అబ్బయి రాము మరీ అంత బాధపడమాక, కొన్నేళ్ళ క్రితం నేనూ పద్యాలు రాయాలి అని మాహా తహతహలాడాను, ధైర్యం చాలా లేదు, ఇట్టా కాదు అని, ఎదో ఒకటి వ్రాసి పడేసి (మరీ చేతికొచ్చింది గీకి కాదులే, ఏదో ఒక ఊహకి, నాకు తోచినట్టు చందస్సు అవేమి పట్టింపులు లేకుండా) ఓ పదిమందికి మెయిల్ చేసా, అప్పుడు పప్పు శ్రీనివాసరావు గారు, ఆ పద్యాన్నే భావం చెడకుండా, పదాలు మార్చి పంపాక చదివితే బానే ఉన్నట్టు అనిపించింది.

      ఇక అప్పుడు తెలిసింది ఏమనగా, పద్యాలు రాయాలి అన్నచో పదాలు తెగ తెలిసుండాలి, దానికి పాత కావ్యాల దగ్గిరనుంచి మొదలెట్టి ఎంత ఎక్కువగా చదివితే అంత వొకాబులరీ పెరుగుతుంది, రెండోది చేతననట్టు ఏదో ఒక ఆలోచన పట్టుకొని పద్యం రాసి బ్లాగులో పెట్టు, చదువరులు వచ్చి చక్కగా సలహాలు సూచనలు ఇస్తారు, ఇలా మెల్లగా మొదలెట్టడమే.

      అన్నిటికన్నా ముఖ్యం మన తప్పులని ఎటువంటీ ఈగోలు లేకుండా అంగీకరించడం, మన తప్పులు అందరికన్నా మనకే బాగా తెలుస్తాయి.

      Delete
    3. నా సమస్యల్లా అదే, మీరు చదవాలి అన్నారు, కానీ ఏమి చదవాలో చెప్పలేదు (మరీ ఎక్కువ అడుగుతున్నానేమో.,)

      Delete
    4. పాత కావ్యాలు :-)
      ఎక్కడో ఎందుకు మన తెలుగు రామాయణ మహాభారతాల దగ్గిరే మొదలు పెట్టొచ్చు, శ్రీనాధుని కావ్యాలు, భాగవతం ఇలా దొరికినవన్నీ చదివేయడమే, వేమన పద్యాలు, అన్నమాచార్యుని కీర్తనలు చదువుతూ ప్రతి పదానికీ అర్ధం తెలుసుకో మొదలెట్టడానికి సరిపోతుంది.

      Delete
    5. చదవుతాను సరే, అర్ధం అవ్వాలి కదా? ఈత రాని వాడిని తీసుకుపోయి హిందూ మహా సముద్రంలో పడేసినట్టు, ఎంత తేలికగా చెప్పేశారు

      Delete
    6. ఎందుకు చక్కగ ప్రతిపదార్ధ తాత్పర్యలతో వివరిస్తూ వ్రాసిన బోలెడు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కదా, ఇక నిఘంటువులు గట్రా కుడా ఉండానే ఉన్నాయి, మెల్లగా నేర్చుకోవచ్చు, మొదట్లో కష్టంగా ఉన్నా, మెల్లగా అలవాటు అవుతుంది, ఒక 2-3 నెలల్లో పద్యాలు వ్రాసెయ్యొచ్చు.

      Delete
    7. వ్యాకరణం, చందస్సు నేర్చుకోవటానికి ఏమైనా మంచి పుస్తకం ఉన్నదా అని

      Delete
    8. అది నాకు తెలియదు మరి, కొత్తపాళి(నారాయణస్వామి) మాష్టరుని కాని, తాడేపల్లి గారికి కాని తెలియొచ్చు.

      Delete
  10. పద్యాలు వ్రాయడానికి థియరీ మరీ ఎక్కువ అక్కర్లేదండీ. గురువు/లఘువు అంటే ఏమిటో ముందు తెలిస్తే చాలు.
    నారాయణస్వామిగారు చెప్పినట్టు ముందొక రకమైన పద్యాన్ని నిర్ణయించుకోండి. అన్నిటికన్నా తేలిక ఆటవెలది. వేమన పద్యాలు నోటికి కొంత బాగానే వస్తాయి కాబట్టి అది సులువు. నడక పట్టుకోండి (పది పద్యాలు బుఱ్ఱలో తిరిగితే నడక తెలుస్తుంది). అదే నడకలో మీరూ పద్యం కట్టడానికి ప్రయత్నించండి. ముందు నడక సరిగా వస్తే, తర్వాత యతులు వగైరా చూసుకోవచ్చు.

    కొంచెం పెద్ద పద్యం వ్రాయాలంటే, సులువుగా ఉండేది మత్తకోకిల. దీని నడక:
    "మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల కోకిలా"
    "ఊకదంపుడు ఊకదంపుడు ఊకదంపుడు దంపరా"

    తానాల భాషలో చెప్పాలంటే:
    "తాన తానన తాన తానన తాన తానన తాననా" అన్నది నడక.

    ఈ లింకులు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి:
    http://telugupadyam.blogspot.in/2008/03/blog-post_08.html
    http://telugupadyam.blogspot.in/2008/09/blog-post_20.html
    http://telugupadyam.blogspot.in/2008/04/blog-post_19.html

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కామేశ్వరరావు గారు. మరీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుందేమో అని ఇన్ని రోజులు ఆగాను. అందుకే చందస్సు చక్కగా అర్ధం చేసుకోగలిగే పుస్తకం ఏదైనా ఉంటే, ముందు కొంత ఙానం సంపాదించాలి అనుకున్నాను. మత్త కోకిల, ఆట వెలది, చిన్నప్పుడు విన్నట్టు గుర్తుంది కానీ, ఇప్పుడు గుర్తులేవు. మీరు చెప్పిన విదంగా ప్రయత్నిస్తాను.

      Delete
  11. >>నా సమస్యల్లా అదే, మీరు చదవాలి అన్నారు, కానీ ఏమి చదవాలో చెప్పలేదు

    చెప్పడం మరిచాను. ఏవిటి చదవాలి అన్నది మీ అభిరుచిబట్టి ఉంటుంది. పై వ్యాఖ్యలో చెప్పినట్టు ముందు థియరీతో మొదలుపెట్టక్కర లేదు. పద్యాలే ఎక్కువగా చదివి, వాటి అందాలని చవిచూసి, కంఠస్థం చేస్తే మంచిది - మీకు నచ్చే పద్యాలు. నాకయితే కరుణశ్రీ పద్యాలు నోటికి బాగా పట్టి చదువుకోడానికి తీయగా హాయిగా ఉంటాయి. వాటితో మొదలుపెట్టవచ్చు. ముందు కొంచెం తేలికగా అర్థమై, మన కాలానికి చెందిన పద్యాలను చదవడం మొదలుపెడితే, మరొకరి సహాయం అంతగా అవసరం ఉండదు. రామాయణ భారతాలవంటివి మెల్లగా తర్వాత చదవవచ్చు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కామేశ్వరరావు గారు, మీ బోటి వారి సహకారంతో, తెలుగుని మరింత ఎక్కువ నేర్చుకుంటాను

      Delete
  12. చాలా ఆలస్యంగా , మనశ్శాంతికి మందు కనుక్కున్నాను, (ఇంకేంటీ మీ బ్లాగే)
    మనం కొద్ది రోజులు పోయినతర్వాత కేవలం తెలుగే మాట్లాడదాం, అప్పుడయితే ఎవ్వరికీ రాదు, అందుకే నేనిప్పుడే M.A తెలుగు చేసి కూర్చున్నా.మీ బ్లాగ్ చదవటానికి సెలవు పెట్టానటే నేనెంత వీరాభిమానినో మీకు కదా.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమాగారూ, మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు

      Delete
  13. నేను ఒకసారి ప్రొడక్షన్ రిలీజ్‌కి రాత్రంతా మేలుకుని ఉండటానికి వికీలో ఛందస్సు చదవటం మొదలుపెట్టా. ఇక్కడే http://te.wikipedia.org/wiki/%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81

    చివరికొచ్చేసరికి ఇదీ ఫలితం:

    చక్కెర పొంగలి ఆవడ
    చిక్కని పాయసము తేనె చెఱుకులు ఫలముల్
    మొక్కుకు మాత్రమె సామికి
    మక్కువ తీర్చుకొను జిహ్వ మనదే మురళీ

    పద్యం నడక నేర్చుకోవటానికి గణవిభజన చూస్తే సరిపోతుంది. కానీ పద్యాలు ఎక్కువగా చదవటం పదాలు, భావాలు ఎంపికకు ఉపయోగపడుతుంది. ఇది నా అభిప్రాయం

    ReplyDelete
    Replies
    1. mee comment lo chala information undi Murali gaaru

      Delete