Thursday, December 22, 2016

నువ్వు ... నువ్వు ...కొవ్వే... నువ్వు

లవ్వు , నవ్వు లేని మనిషి ఉంటాడేమో కానీ, కొవ్వు లేని మనిషి ఉండడు. అస్సలు ఏమీ చేయకుండానే వచ్చేది ఈ కొవ్వు. ఈ కొవ్వును, దాని ద్వారా వచ్చే బరువును ఎలా తగ్గించుకోవాలో అని, తెగ ఇబ్బంది పడిపోతుంటాం. Gym కి వెళ్ళటం, ఉపవాసాలు ఉండి కడుపు మాడ్చుకోవటం లాంటివి చేస్తూ ఉంటాం. డబ్బులు కట్టి జిమ్ వెళ్ళటమే ఒక ఎత్తు ఐతే, ఈ మధ్య అంత కన్నా వింత ఒకటి చూశా. ముందు మనం $500 కట్టి చేరాలి. మండలం రోజుల్లో, వాళ్ళు చెప్పినంత బరువు తగ్గితే, మన డబ్బులు మనకు వెనక్కి ఇచ్చేస్తారుట! మన మీద ఎంత నమ్మకం ఉంటే అలాంటివి పుట్టుకు వస్తాయి. ప్రతి సంవత్సరం, జనవరి ఒకటిన New year జరుపుకున్నా, జరుపుకోకపోయినా, resolution అన్న పేరుతో అందరం Gymల వైపు పరుగులు పెడతాం. కొవ్వు మానదు కానీ, మనం మానేస్తాము, అది వేరే విషయం. అలాంటి కొవ్వుని తలుచుకుంటూ, ఈ పాట పాడుకుంటూ ఇలా కానిచ్చేద్దాం.

ఎంత కొవ్వు ఎక్కి కొట్టుకోక పొతే మాత్రం, నేను ఇంత మంచి పాటను ఖూనీ చేస్తాను చెప్పండి.

నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ  (2)

నాలోనే కొవ్వు, నాతోనే కొవ్వు, నా చుట్టూ కొవ్వు, నేనంతా కొవ్వు
నా నడుము పైన కొవ్వు ,నా మెడవంపున కొవ్వు, నా గుండె మీద కొవ్వు, ఒళ్ళంతా కొవ్వు
చేతుల్లో కొవ్వూ... చెంపల్లో కొవ్వు... చంపేసే కొవ్వూ
నిద్దర్లో కొవ్వూ... పొద్దుల్లో కొవ్వు... ప్రతి నిమిషం కొవ్వూ
నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ 

చరణం : 1

నా మనసును వేధించే బద్దకమే కొవ్వు, నా వయసును మార్చేసే మాయే ఈ కొవ్వు
పైకే బరువనిపించే ఆకారం కొవ్వు, బైట పడాలనిపించే పిచ్చిదనం కొవ్వు
నా ప్రతి యుద్దం నువ్వు  నా పస్తే నువ్వు,  నా ఉప వాసం నువ్వూ ... కొవ్వూ
మెత్తని జామే తెచ్చే తొలి జిగురే కొవ్వు, నచ్చే కష్టం నువ్వు  ... నువ్వు ... కొవ్వూ

నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ 

చరణం : 2

నా సిగ్గును రెట్టించే కౌగిలివే కొవ్వు, నా వన్నీ దోచుకునే ఆకలివే కొవ్వు
ముని పంటితొ నే తింటే మిగిలేదీ కొవ్వు, నా నడకను మార్చేసే మొదరష్టానివి కొవ్వు
తీరని దాహం నువ్వూ నా మోహం నువ్వూ, తప్పని స్నేహం నువ్వూ ... కొవ్వూ
తీయని లడ్డే చేసే అన్యాయం కొవ్వూ, చాలా సులభం నువ్వు ... కొవ్వూ ...

నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ 

చరణం : 3

ఏమార్చేస్తు కొవ్వు మురిపిస్తుంటే కొవ్వు, నే కొరుకోని నా మరోఖర్మ కొవ్వు
భయపెట్టిస్తూ కొవ్వు కవ్విస్తుంటే కొవ్వు, నాకే తెలియని నా ముద్దు పేరు కొవ్వు
నా కోపం నువ్వు ఆక్రోశం నువ్వు, నేనంతే కొవ్వూ ...
నా పంతం కొవ్వు నా సొంతం కొవ్వు,నా అంతం కొవ్వూ ...

నువ్వు... నువ్వు... కొవ్వే...  నువ్వు
నువ్వు... నువ్వు... కొవ్వూ (2)

6 comments:

  1. కొవ్వు అంతలా ఉందా భయ్యా! హహహ

    ReplyDelete
  2. ఈ ఒక్క పేరడీతో మీకొక వీర క్రొవ్వుమానిగా మారిపోయాను.

    అలాగే, ’’క్రొవ్వేరా అన్నింటికీ మూలం, ఆ క్రొవ్వు కరిగించుకొనుటే ఏనుగు గున్నల ధర్మం‘‘
    అని లక్ష్మీనివాసం చిత్రంలోని ‘‘ధనమేరా అన్నింటికీ మూలం’’ అనే పాటను కూడా ఖూనీ చేయవలసినదిగా మనవి.
    ..... శ్రీనివాసుడు

    ReplyDelete
    Replies
    1. పల్లవి మొదలు పెట్టేశారుగా, చరణాలు కూడా పూర్తి చేసేయండి

      Delete
  3. అంత దృశ్యం లేదండీ.
    మాదంతా మేధా క్రొవ్వు. ఇది విశ్లేషణలు, వ్యాఖ్యలకే తప్ప కవితా సృజనకు పనికిరాదు.

    కనీసం అనుసృజనకైనా ఉపయోగపడదు.
    అందుచేత, ఆ గీతాఖూనీ కార్యక్రమాన్ని మీ కీబోర్డు స్కంధాలపైనే పెడుతున్నాను.

    ...శ్రీనివాసుడు

    ReplyDelete
  4. "సరసి" అన్న పేరుతో కార్టూన్లు వేసే సరస్వతుల రామనరసింహం గారి కార్టూన్ ఒకటి లీలగా గుర్తొస్తున్నది. "సాయీ సన్నం స్లిమ్మింగ్ క్లినిక్" అని ఆ కార్టూన్లోని స్లిమ్మింగ్ సెంటర్ పేరు.
    అది చదివిన పిదప నాలో వచ్చిన ఆలోచనలు.

    మీ పాటని దేశవిదేశాల్లోని ఒబేసిటీ అండ్ స్లిమ్మింగ్ సెంటర్లలో, జిమ్ముల్లో ప్రార్థనాగీతంగానో, అనుసంధానగీతంగానో, బోధనాగీతంగానో చేయవలసిందని ఇందుమూలంగా నేను డిమాండ్ చేస్తున్నాను.

    ప్రార్థనాగీతంగా అయితే రోజూ ఈ గీతాన్ని పాడిన తరువా మాత్రమే స్లిమ్మింగ్ సెంటర్ లేదా కార్యక్రమాలు ప్రారంభించాలి.
    అనుసంధాన గీతంగానయితే సమావేశాల్లో ఆలపించవచ్చు.

    బోధనాగీతంగా అయితే (ఇది కచ్చితంగా అమలుపరచాల్సిందేనని ఒక వీర తెలుగు భాషాభిమానిగా డిమాండ్, ఈ దెబ్బతో తెలుగు భాషకి కూడా అమితంగా సేవ చేయవచ్చు, ఇంగ్లీషు రాక్, పాప్, మ్యూజిక్ తోనేగాక మన తెలుగు పాటలతో కూడా వ్యాయామాలు సాధ్యమేనని నిరూపించవచ్చు) వ్యాయామాలు, వర్క్ అవుట్ల సమయంలో ఆలపించవచ్చు. ఈ గీతాన్ని ఆ చిత్రగీతంలో మ్యూజికల్ ఇంపోజ్ చేసి, దాని ఆధారంగా రకరకాల కదలికలని కొరియోగ్రాఫ్ చేసి, సన్నార్థులచే మూవ్ మెంట్స్ కసరత్తులు చేయించవచ్చు.

    నువ్వూ.... చేయి పైకి లేపు.
    నువ్వూ.... చేయి క్రిందకి దించు.
    క్రొవ్వే..... కాలు పైకి లేపు
    క్రొవ్వూ....కాలు క్రిందకి దించు
    ....ఇలా పాడుకుంటూ ఆ కసరత్తులు చేయవలసి వుంటుంది.

    ఇంత సృజనాత్మక సామాజిక పరివర్తనని తెస్తున్న మీ గీతాన్ని మరొక్కసారి అభినందిస్తూ....
    మీ అభిమానులు
    స్వామి క్రొవ్వేశ్వర భారతి, స్వామి క్రొవ్వానంద సరస్వతి ( మా బొజ్జల్లో చేరిన వీశెల వీశెల క్రొవ్వుని కూడా మీ గీతాలాపనకు అనుగుణంగా అంగాంగాన్ని కదిలిస్తూ తగ్గించుకునే ప్రయ్నతం చేస్తామని హామీ యిస్తున్నాము)

    నిజానికి ఈ పాటను పాడుకుంటూ వచ్చే నవ్వుకే క్రొవ్వు తగ్గిపోవచ్చు.

    క్రొవ్వూ... క్రొవ్వూ... మేమే క్రొవ్వూ....
    నవ్వూ... నవ్వూ... నవ్వే నవ్వూ...

    ReplyDelete
    Replies
    1. మీరు ఈ మధ్య కాలంలో, తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ లు ఎక్కువగా చూస్తున్నట్టు ఉన్నారు. 'పొగడటం మొదలు పెడితే నాకంటే పొగిడే వాడు ఎవడూ లేడు' అన్నట్టు పొగుడుతున్నారు... కానివ్వండి

      Delete