దేవుడిని చూశాను. అవును ఇవాళ నేను దేవుడిని చూశాను. ఊహ తెలిసిన రోజునుండి కలలు కంటున్నరోజు, రానే వచ్చింది. క్రికెట్ అనేది ఒక మతమైతే, ఆ మతానికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవుడినే ఈ రోజు నేను కళ్ళారా చూశాను . నాకు చిన్నప్పటి నుండి, ఇద్దరిని చూడాలనే కోరిక ఉంది. ఒకటి గాన గంధర్వుడిని, రెండు క్రికెట్ దేవుడిని. ఈ రోజుతో ఆ రెండు కోరికలు తీరాయి.
నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో, మా ఊరి పంచాయితీ కార్యాలయం ముందు, మహానుభావుడు ఘంటసాల గారి విగ్రహం పెట్టాలన్న మంచి ఆలోచన కొంత మందికి వచ్చింది. అనుకున్నదే తడవుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒక చేతిలో తంబురా (నాకు తెల్సినంతలో దానిని తంబురా అనే అంటారు), ఇంకొక చేతిని పైకి లేపి, గాన మాధుర్యాన్ని కురిపిస్తూ, కూర్చొని ఉన్న ఘంటసాల వారి విగ్రహం, చాలా అందంగా, సాక్షాత్తు ఆయనే కూర్చొని పాడుతున్నడా అనట్టు ఉంటుంది. పక్క ఊరి తాగుబోతులు ( మా ఊర్లో తాగేవాళ్ళు అస్సలు లేరు, నిజం) ఆ విగ్రహాన్ని చూస్తే , అక్కడే నిలబడి విగ్రహాన్ని పాట పాడమని గొడవకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి (కొంచం ఎక్కువ చేసి చెప్పినట్టు ఉన్నా, ఆ బొమ్మ మాత్రం అధ్బుతం).
ఆ విగ్రహాన్ని ఆవిష్కరించటానికి సాక్షాత్తు బాలూగారే వస్తున్నారని తెలిసి, నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ రోజు రానే వచ్చింది. బాలూ గారు విగ్రహం ఆవిష్కరించి, మా ఊరిలోని కళాసాగర్ ప్రాంగణంలో జరిగే సంగీత విభావారికి వచ్చారు. ఇసుకేస్తే రాలని జనం. అప్పటికే బాలుగారు నాకు చాలా బాగా తెలుసు గనుక, బాలు గారు వేదికను అలంకరించగానే ఆయనను గుర్తుపట్టాను. నా కళ్లను నేను నమ్మలేకపోయాను. బాలూ ఫారు శంకరాభరణం చిత్రంలో "శంకరా నాదశరీరాపరా..." అనే పాడటం, నేను జన్మలో మర్చిపోలేను. నా చెవుల తుప్పు వదిలిందా అన్న అనుభూతి కలిగింది.
ఇంక ఇవాళ్టి విషయానికి వస్తే, సచిన్ ని వీలైనంత దగ్గర నుండి చూడాలని వెళ్లాను. నేనే కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళల్లో మూడొంతులు ఆ సచ్చినోడిని చూడటానికి వచ్చినవాళ్ళే. ఆటగాళ్ళు అందరూ మైదానంలోకి వచ్చినా, మేమందరం సచిన్ కోసం వెతుకుతూనే ఉన్నాము. ఇంతలో ఆటగాళ్ళు బయటకి వచ్చే ద్వారం దగ్గర హడావుడి పెరగటంతో, అందరి కళ్ళతో పాటుగా గొంతులు కూడా పెద్దవి అయ్యాయి. "సచిన్ .... సచిన్ " అంటూ అరుపులతో మారుమోగి పోయింది. ఒక్కొక్కళ్ళ ముఖాలు ఆ మైదానంలో ఉన్న దీపాలకన్నా వెలిగిపోయాయి. అదృష్టం కొద్దీ సచిన్ మైదానంలో ఉన్నంత సేపు మేము ఉన్నచోటుకి దగ్గరగా పొలం చేశాడు (మీ బాషలో ఫీల్డింగ్).
దేవుడు అన్ని వందల ఆటలు ఆడినా, మా అరుపులను విని అప్పుడప్పుడు వెనకకు తిరిగి మాకు చేతులు ఊపి ఉత్సాహపరిచాడు. అలా మొత్తం లెక్కపెడితే 12 సార్లు నాకు(నాకు ఒక్కడికే అని నా భావన) చెయ్యి ఊపాడు. రైనా,కోహ్లి, సెహ్వాగ్ ఇలా అందరు ఊపారు (చేతిని). కానీ పొగరు బట్టిన సుడిగాడు మాత్రం ఎవరినీ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని పారా రాజేష్ తో చెప్తే, "ఎన్నని చస్తాడురా వాడు మాటుకూ, సారధి అంటే సామాన్యమైన విషయం కాదు కదా , అందరినీ చూసుకోవాలి కదా" అని అన్నాడు. నిజమే కదా, పాపం ధోని. ఇంతలో వరుణుడి పుణ్యమా అని మధ్యలోనే ఆట ఆగిపోయింది.
అలా నా జీవితంలో ఒక గొప్ప కోరిక ఇవాళ తీరింది అన్న తృప్తితో, ఆనందంతో ...... సెలవు.....
క్రికెట్ దేముడు అని పొగుడ్తూనే... 'సచ్చినోడు' అని రాయడం ఏమైనా బావుందా..నిజంగా సచిన్ క్రికెట్ దేముడే.. మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చిన ఇలాంటి మహానుభావుల్ని అవమాన పరచి మీ సంస్కారాన్ని బయట పెట్టుకోకూడదు..
ReplyDelete@voleti : సచిన్ + చిన్నోడు = సచ్చినోడు, ఎదో ప్రేమకొద్ది అలా రాశానే తప్పించి, నేను అవమానపరచటమా? అందునా సచిన్ ని, ఎంత మాట??, మీరు అపార్ధం చేసుకున్నారు.
Deleteదీనినే మనం నిందా స్తుతి అంటాం మన తెలుగు లో.
Deleteదేవుడిని "వాడు" "వీడు" అని అన్నట్టే ఇది కూడా అన్నమాట. కాబట్టి తప్పులేదు...
ధన్యవాదాలు గురువుగారు, నన్ను బాగా అర్ధం చేసుకున్నందుకు.
Delete