ప్రపంచంలో ఉద్యోగాలు అన్నింటి కన్నా ప్రమాదకరమైన ఉద్యోగం ఏంటి?(నాతో కలిసి పని చేయటం కాకుండా?). నాకు తెల్సి దీనికి సమాధానం, బస్సు డ్రైవర్, అతన్నే తెలుగులో "సారధి" అంటారు. మిగితా ఉద్యోగాలన్నింటిలో, ఎప్పుడైనా అలసట అనిపిస్తే, ఒక పది నిముషాలు కునుకు తీయచ్చు. అదే ఉద్యోగం చేస్తూ చేస్తూ, బస్సు సారధి ఒక్క కునుకు తీస్తే...., ఊహించండి, ఎంతటి ప్రమాదం అయినా జరగచ్చు.
శుక్రవారం సాయంత్రం, కూకట్ పల్లి నుండి అద్దంకి వెళ్ళాలని టికెట్ తీసుకున్నాను. దీపావళి సమయం అవ్వటంతో రద్దీ కొంచం ఎక్కువగా ఉంది. పదిన్నరకు బస్సు అయినప్పటికీ, పని పాటా లేకపోవటంతో, పది గంటలకే బస్టాండ్ కి వెళ్ళాను. ఏ అర్ధరాత్రో అయితే కానీ రాని బస్సు, నేను వెళ్ళేసరికి సిద్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఐ.ఆర్.సి.టి.సిలో టికేట్టు దొరికినంత సంబరమేసింది.
బస్సు అయితే ఉంది కానీ, అందులో జనం ఎవ్వరూ లేరూ. కాసేపటికి డ్రైవర్ వచ్చాడు. నా టికెట్ చూపించాను. రాత్రంతా ఎలాగూ కూర్చోవటం తప్పదని, బయటే నిలబడ్డాను. ఇంతలోనే అక్కడ ఎక్కాల్సిన మిగిలిన జనం కూడా వచ్చేశారు. బస్సు కదులుతుండగా ఎక్కి లోపలకి వెళ్ళబోతుంటే, డ్రైవర్ అమాయకపు చూపులు నా వీపును తడిమినట్టు అనిపిస్తేను, నేను కూడా చూశాను. బలపం పోగొట్టుకున్న బడికెళ్ళే బడుద్దాయిలాగా ముఖం పెట్టి, "అమీర్పేట్ కి ఎటు వెళ్ళాలి?" అని అడిగాడు.
అమీర్ పేటకి ఎటు వెళ్ళాలి అని అడుగుతున్నాడు? అద్దంకి చేరుస్తాడో,ఆంధ్ర ప్రదేష్ దాటిస్తాడో అని భయమేసింది. "కండక్టర్ కి కూడా తెలియదా?" అని అడిగాను. "కండక్టరు అనే వాడు ఉంటే కదా? నేను ఒక్కడినే" అని చెప్పాడు. (సింహాలే కాదు డ్రైవర్లు కూడా ఈ మధ్యన సింగిల్ గా వస్తున్నారెమో ?) చేసేది లేక ద్వారం దగ్గర ఉండే కుర్చీలో కూర్చున్నాను. " అమీర్ పేట నుంచి అయినా దారి తెలుసా??" అని అడిగాను. హైదరాబాద్ దాటిందాకా దారి తెలియదని చల్లగా చెప్పాడు. ఇక, ఆ పూటకి ఆ బస్సుకి నేనే కండక్టర్ అయ్యాను. మంత్రసాని పని ఒప్పుకున్నాక ...... తప్పదు కదా " అనట్టు, ఆగిన ప్రతి చోటా, బస్సులో ఎంత మంది ఎక్కాలో సరి చూసుకుంటూ, రాని వాళ్ళకి ఫొన్లు కూడా చేశాను. అప్పుడు తెలిసొచ్చింది, కండక్టర్ అవసరం ఏంటో.
చిన్నప్పుడు నేను బడికి వెళ్ళాలంటే, బస్సులో పది కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడిని. మాకు అందరికీ ఉచిత పాసులు ఉండటం చేత, మమల్ని ఎక్కించుకోనేవారు కాదు. సాయంత్రం బడి ముందు బస్సు కోసం గంట సేపు నిలబడితే, తీర వచ్చిన బస్సు, ఆగకుండా వెళ్ళిపోయేది. బస్సు ఆపనందుకు మొదట్లో డ్రైవర్ల మీద చాలా కొపం వచ్చేది. కానీ కొన్ని రోజులకు గమనించినది ఏంటంటే? బస్సుకు డ్రైవర్ అనేవాడు సారధి కాదు, కేవలం బస్సుకి, కండక్టర్కి మధ్య వారధి మాత్రమె అని, నిజమైన సారధి కండక్టర్ అని. అతను ఎక్కడ చెప్తే, డ్రైవర్ బస్సు అక్కడ ఆపాలి అని. కష్టపడి బస్సు నడిపేది ఒకళ్ళయితే, పెత్తనం ఇంకొకళ్ళదా? అని జాలి పడేవాడిని.
ముగించే ముందు, చాలా రోజుల తర్వాత ఈ రామానంద స్వామి చెప్పేది ఏంటంటే, సంసారం అనే బస్సులో మొగుడు సారధి(డ్రైవర్) అయితే, పెళ్ళాం సాధించె కండక్టర్ లాంటిది. కండక్టర్ చెప్పినట్టు సారధి విని తీరాలంతే.