ముఖం పుస్తకం గురించి కొన్ని ముచ్చట్లు ఇది వరకు ఒక శీర్షికలో రాశాను, మరి కొన్ని ముచ్చట్లు ఈ శీర్షికలో ......
ముఖం పుస్తకం అనగానే ముందుగా మనకు ముఖ్యమైనది ముఖ చిత్రం. ఇటీవల ముఖం పుస్తకంలో, అమ్మాయిలు ముఖం పుస్తకంలో వాడే ముఖ చిత్రాల మీద ఒక హాస్యభరితమైన చిత్రాన్ని చూశాను. దానిని చూసిన తరువాత నాకెందుకో దీని మీద ఒక టపా రాయాలనిపించింది. ఇప్పుడు ఆ ముఖ చిత్రాల గురించి కాసేపు ఏడుద్దాము.
ముందుగా మనిషి జీవితంలో పలు దశలు ఉన్నాయి. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృదాప్యం అని చినప్పుడు చదువుకున్నాము. అలానే ముఖం పుస్తకంలో కూడా వివిధ దశలు ఉన్నాయనమాట. అవేమిటో ఒకొక్కటి చూద్దాము.
బిటెక్ బాబులు : దాదాపు కాలేజీ కుర్రోళ్ళు అంతా సామాజిక న్యాయం కోసం తెగ పోరాడుతుంటారు. కాబట్టి వీళ్ళ ముఖ చిత్రం దాదాపు, వీళ్ళ సామాజిక వర్గ అగ్ర కధానాయికుడి చిత్రమే ఉంటుంది. ఇంజనీరింగు అయ్యి ఉద్యోగం వచ్చే దాక, బాబు చిత్రమే ఉంటుంది. ఉద్యోగం వచ్చాక కూడా చిత్రం మార్చలేదంటే, కుర్రాడికి ఇంకా కుర్ర తనం పోలేదని అర్ధం చేసుకోవాలి. ఇంకొంతమంది దేశ భక్తులు, తమ సామాజిక వర్గ రాజకీయ నాయకుడి చిత్రం పెట్టుకుంటారు. దేశ భక్తులు అని ఎందుకు అన్నానంటే, వీళ్ళకి దేశ భక్తీ మిక్కిలి ఎక్కువ. వాళ్ళ నాయకుడు పదవిలోకి వస్తే దేశం విపరీతంగా బాగు పడుతుందని బలంగా నమ్ముతారు గనుక వీళ్ళని దేశ భక్తులు అనటంలో తప్పే లేదు.
సాఫ్టోళ్ళు : అంటే నా బోటి వాళ్ళు అనమాట!! కెమేరా దొరికితే చాలు, కళ్ళజోడు పెట్టి ఒక చిత్రం, తీసి ఇంకో చిత్రం, నిలుచొని ఒకటి, కూలబడి ఒకటి ఇలా రక రకాల భంగిమలలో ముఖ చిత్రాలు మారుస్తుంటారు. కొత్తగా ఉద్యోగం వచ్చాక, కొత్తాఫీసులో దిగిన చిత్రాలు పెడతారు. ముఖ్యంగా పైన అమ్మాయిలతో కలిసి దిగిన చిత్రాలు మాత్రం మర్చిపోకుండా ప్రచురిస్తారు. ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా, తప్పక చిత్రాలు దిగి, ముఖం పుస్తకంలోకి ఎగుమతి చేస్తారు. విదేశాలకు వెళ్తే ఆ సంగతి చెప్పనక్కరలేదు. అక్కడ పిచ్చి మొక్కల ప్రక్కన నిలబడి దిగినా బాగానే ఉంటుంది.
పెళ్లి కుమారులు / కొత్తగా పెళ్లి అయినోళ్ళు : వీళ్ళ గురించి ఎక్కువ చెప్పినా బాగుండదు. పెళ్లి చిత్రాలు పదే పదే మార్చి పెడుతుంటారు. కొందరైతే వాళ్ళ ప్రేమానురాగాలను ముఖం పుస్తకంలో చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్యోనతను చూసి ఒక్కోసారి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది కూడానూ. అప్పుడప్పుడు వైవాహిక జీవితం గురించి గొప్ప గొప్ప సామెతలన్నీ ప్రచురిస్తుంటారు.
పిల్లల తండ్రులు : పెళ్లి అయ్యాక, పిల్లలు పుట్టాక, కొన్ని రోజుల వరకు పిల్లల ఫొటోలు పెడతారు (అమ్మాయిలు చో చ్వీట్ అని వ్యాఖ్యలు రాయటం గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకోండి), మా అనిల్ అన్న దానికి ఇటీవల ఉదాహారణ.
ఆ తరువాత : నాకు తెలిసి ఆ తరువాత ముఖం తుడుచుకొనే అంత ఖాళీ ఉండదు, ఇంకా ముఖం పుస్తకం చూసేంత ఖాళీ ఎక్కడ ఉంటుంది??
గూడాచారులు : ప్రతి దానికి మినహాయింపు ఉన్నట్టు, ఇక్కడ కూడా మినహాయింపు బాపతు ఉన్నారు. ముఖం పుస్తకంలో ఉంటారు, కానీ ఫొటో పెట్టటానికి మాత్రం ఎందుకో భయపడుతుంటారు. ఒక్క లైక్ ఉండదు, ఒక్క షేర్ ఉండదు. కానీ జరిగేదంతా గమనిస్తూనే ఉంటారు.