అది 1992 అనుకుంటా,రంగు చొక్కాలు తొడుకున్న వాళ్ళు టి.వి లో ఏదో ఆట ఆడుతున్నారు. మా పెదనాన్న మూర్తిగారు, అదే పనిగా చూస్తూ, తిడుతూ ఉన్నాడు. "అస్సలు ఏంటా ఆట? ఏమా గోలా?" అని అడిగాను. దానిని క్రికెట్ అంటారని చెప్పాడు. నేను కూడా చూడటం మొదలు పెట్టాను. ఒకతను, కరెక్టుగా బ్యాటుకు రెండింతలు ఉన్నాడో లేడో? నిలబెట్టిన పుల్లల మధ్యన, అటు ఇటు తెగ పరిగెడుతున్నాడు. "ఎవరతను అంత ఇదిగా పరిగెడుతున్నాడు పుల్లల మధ్యన" అని పెదన్నాన్నను అడిగాను. అతనేరా 'సచిన్' అంటే అని చెప్పాడు. ఎందుకో అతను ఆడుతుంటే అలానే చూస్తూ ఉండాలి అనిపించింది.
ఆ తర్వాత ఎప్పుడు క్రికెట్ వచ్చినా, నా కళ్ళు ఆ బుడ్డోడి మీదనే ఉండేవి. ఎందుకో అమితమైన అభిమానం పెరిగిపోయింది అతగాడంటే. కొన్ని రోజులకి కర్ర బిళ్ళా, గొలీల నుండి క్రికెట్ మీదకుమనస్సు మళ్ళిన రోజులు వచ్చాయి. మా ఊర్లో ఉన్న ఫ్యాన్సీ షాపులు అన్నీ తిరిగి, ఒక బ్యాటు కొనుక్కోని ఆడటం మొదలు పెట్టాము. సచిన్ లాగే నిలబడటం, అతని లాగే ఆడాలని ప్రయత్నించటం, చివరికి అవుట్ అవ్వటం.
కాలంతో పాటు సచిన్ బ్యాటు కూడా మారిపోయింది. మా వీది చివరన ఉండే "సితార ఫ్యాన్సీ" షాపు వాడిని, MRF బ్యాటు తెమ్మని ఎన్ని రోజులు విసిగించానో, నాకే గుర్తులేదు. నా బాధని గమనించిన మా నాన్న, ఒక చెక్కతో బ్యాటు చేయించి ఇచ్చాడు. దానికి రంగు పూసి, దాని మీద MRF అని అందంగా రాసి, ఆరబెట్టి, ఆడుకుంటే తప్ప మనస్సు శాంతించలేదు.
మెల్లగా అభిమానం కాస్త, పిచ్చిగా మారింది. స'చిన్నోడి' ఫోటో ఎక్కడ కనపడితే అక్కడ దానిని కత్తిరించి దాచిపెట్టటం, అలా కత్తిరించిన వాటన్నింటినీ, వారంలో ఒక రోజు కూర్చొని, ఒక పుస్తకంలో అతికించటం. అలా అతికించిన పుస్తకాన్ని పదే పదే చూసుకోవటం, ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతున్నది. బూస్టు తాగితే బలం వస్తుందో, రాదో నమ్మకం లేకపోయినా, కేవలం "Boost is the secret of my energy" కోసం, రోజు అదే తాగటం కూడా అయ్యింది.
సచిన్ బ్యాటింగ్ కోసం, నాకు ఎన్ని సార్లు కడుపు నొప్పి వచ్చిందో నాకే గుర్తులేదు. అదేంటో నేను చూస్తే, సచిన్ అవుట్ అవుతాడని మా నాన్నకి గట్టి నమ్మకం. "నువ్వు చూడద్దు రా, చూస్తే వెంటనే అవుట్ అవుతాడు" అని ఎప్పుడూ అంటూ ఉండే వారు. దేవుడి దయ వల్ల, మా నాన్న నాలుక మీద మచ్చలు లేక పోవటంతో, మనోడు కూడా అవుటవ్వకుండా ఆడేవాడు అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ అవుటయితే, నేను టి. వి ఆపేలోపే "సచిన్ అవుటయ్యాడుగా, ఇంక పోయి చదువుకో" అనేవారు.
నా పుట్టిన రోజున ఇప్పటి వరకు కేకు కోయని నేను, సచిన్ పుట్టిన రోజున, స్నేహితులతో కలిసి కేకు కోసి ఆనందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సచిన్ సెంచరీ చేస్తే, ఆ రోజు అంతా పండగ చేసుకోవటం, తక్కువకే అవుటయితే, పరీక్ష తప్పిన దానికన్నా ఎక్కువ బాధ పడటం. వీటన్నింటినీ మించి, సచిన్ సంస్కారం, నడవడిక ఇవన్నీ చూసి, అతన్ని ఇంకా ఆరాధించాను.
సచిన్ ని ఎవడైనా ఏదైనా అంటే విపరీతమైన కోపం రావటం, తరువాత తిట్లు రావటం, దాని వల్ల సమస్యలు రావటం ఇవన్నీ కూడా మామూలు అయ్యాయి. అలా కొంత మందితో మాట్లాడటమే మానేశాను కూడా (ఇప్పుడు అర్ధం అయిందా? నా గోల శాశ్వతంగా తప్పించుకోవాలంటే ఏమి చేయాలో). అస్సలు జీవితంలో ఒక్కసారి బ్యాటు పట్టుకోవటం రాని వాడు కూడా సచిన్ గురించి తక్కువగా మాట్లాడే వాడే, నరికెయ్యాలి అన్నంత కోపం ఇప్పటికీ, అప్పుడప్పుడు వస్తుంది.
సచిన్ ని ఎవడైనా ఏదైనా అంటే విపరీతమైన కోపం రావటం, తరువాత తిట్లు రావటం, దాని వల్ల సమస్యలు రావటం ఇవన్నీ కూడా మామూలు అయ్యాయి. అలా కొంత మందితో మాట్లాడటమే మానేశాను కూడా (ఇప్పుడు అర్ధం అయిందా? నా గోల శాశ్వతంగా తప్పించుకోవాలంటే ఏమి చేయాలో). అస్సలు జీవితంలో ఒక్కసారి బ్యాటు పట్టుకోవటం రాని వాడు కూడా సచిన్ గురించి తక్కువగా మాట్లాడే వాడే, నరికెయ్యాలి అన్నంత కోపం ఇప్పటికీ, అప్పుడప్పుడు వస్తుంది.
దాదాపు పాస్ వర్డ్లు అన్నీ, సచిన్ పేరు మీదనే పెట్టుకోవటం, తోచనప్పుడల్లా అతని పాత వీడియోలు చూడటం, అతని రికార్డులను పదే పదే చదవటం., అదొక ఆనందం. అలాంటిది సచిన్ ఇంక క్రికెట్ ఆడటం లేదు అని తెలిసి జీర్ణించు కోవటం కొంచం కష్టమే. ఎప్పుడో ఒకప్పుడు ఈ రోజు వస్తుందని తెలుసు, కానీ వచ్చేసిందే అన్న బాధ.... వెంటనే 'భారత రత్న' వచ్చింది అన్న చిన్న ఆనందం.
ప్రస్తుతానికి, ముఖ పుస్తకంలో కనిపించిన సచిన్ ఫోటోకల్లా, లైక్ కొట్టటం, సచిన్ చివ్వరగా చెప్పిన మాటల్ని పదే పదే వింటూ బాధ పడటం చేస్తున్నాను. ఈ పోస్టు రాస్తున్నప్పుడు కూడా రెండు చుక్కలు అలా రాలి కీబోర్డు మీద పడ్డాయి. సచిన్ క్రికెట్ నుండి అయితే వెళ్ళాడు కానీ, మనస్సుల లోనుంచి వెళ్ళలేదు. నా కంప్యూటర్, సెల్ల్ ఫోన్లనుండి, ముఖ పుస్తకంలోని కవర్ పేజీలనుండి , పాస్ వర్డ్ ల నుండి మాత్రం ఎప్పటికీ ఉంటాడు. క్రికెట్ లో సచిన్ బదులు ఇంకొకళ్ళు వస్తారేమో, సచిన్ రికార్డులని కొన్నింటిని బద్దలు కొడతారేమో, కానీ ఇంకో సచిన్ మాత్రం ఎప్పటికీ రాడేమో.....
ఈ శీర్షికని ఇంతకన్నా వివరంగా రాయాలని ఉన్నా, రాయలేక ఇక్కడితో ఆపేస్తున్నాను