Sunday, December 27, 2015

అందని చందమామ (సీతా రాముడు - 2)

నిన్న అతడు సినిమా చూస్తున్నానా.... అస్సలు ఆ సినిమా చూస్తున్నంత సేపు తివిక్రమ్ మీద ఈర్ష , అసూయలతో చూశాను. అస్సలు ఆ సంభాషణలు ఎలా రాశాడా అని. అలా మెచ్చుకుంటూ ఉండగానే ఒక పాట వచ్చింది. ఆ సినిమాలో పాటలు, మాటలకు ఏ  మాత్రం తీసిపోవు. ముఖ్యంగా ఆ పాట "సిరివెన్నెల గారు" రాసినది. ఆయన మాటల మాంత్రికుడు అయితే... ఈయన పాటల భేతాళుడు...

సాదారణంగా అందంగా ఉన్న అమ్మాయి వెంట అబ్బాయిలు పడుతుంటారు. ప్రేమించమని గొడవ చేస్తుంటారు. అలాంటిది, ఒక అమ్మాయి, అబ్బాయి వెంట పడి, ప్రేమించమనటం చాలా అరుదు (ఏదో నా లాంటి అబ్బాయిల వెనుక అమ్మాయిలు తిరుగుతూ ఉండే వాళ్ళు.  అది గతం, పెళ్ళికి ముందు. ఇప్పుడు అంతా అయిపోయింది). సరే ఇంక పాట విషయానికి వస్తే.... ఒక అమ్మాయి, అబ్బాయిని ప్రేమించమని వెంటపడి మరీ అడిగే  సన్నివేశం. "నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన" లాంటి పాటలు శాస్త్రిగారు చాలానే రాశారు. ఉదాహరణకు వర్షం సినిమాలో "కోపమా నా పైన, ఆపవా ఇకనైనా" అనే పాట కూడా అదే కోవకు చెందినది. కానీ అలాంటి వాటన్నింటిలో నాకు నచ్చిన పాట "నువ్వు నాకు నచ్చావు" సినిమాలోది.  పాట మొత్తం పాప ప్లీజ్.... అనటం, బాబు నో అనటం.

"ఒక్క సారి చెప్ప లేవా, నువ్వు నచ్చావని" అని పాప, బాబుని అడిగే పాట. గుండె గుప్పెడే ఉన్నా, దాని ఊహ ఉప్పెనంత ఉంటుంది. అలాంటి దానిని ఒదిగి ఉంచకుండా వదిలేయి, ప్రేమించేయి " అని పల్లవిలో ప్రాధేయ పడుతుంది.  దానికి పాపం హీరో, "నా మానాన నేను మాడిపోయిన మసాలా దొశ తింటుంటే..." అని M S నారాయణ అతడు సినిమాలో అనట్టు "నిదుర పోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి?" అని అంటాడు.

మనిషి జీవితం అందమైన అబద్దం. అబద్దం అనేది లేకుండా రోజు గడవటం కష్టం అయిపొయింది (నా లాంటి వాళ్ళు మినహాయిస్తే ). అస్సలు ఈ అబద్దం అనేది మనకు గోరు ముద్దల దగ్గర నుండే మొదలు అవుతుంది. "చందమామ రావే, జాబిల్లి రావే" అని పాటతో పిల్లలకు ప్రతి తల్లి గోరు ముద్దలు తినిపిస్తుంది (ఈ రోజులల్లో గోరు ముద్దలు లేవు,  పాటలు లేవు. చేతిలో ఒక ఐపాడ్ లాంటి పలక ఒకటిచ్చి అన్నం తినిపిస్తున్నారు ఎంచక్కా,అది వేరే విషయం). చందమామ రాదని తల్లికి తెలుసు. అలా అని చెప్పి పిల్లలని పిలవద్దు అంటామా? అలాగే ప్రేమ కూడా, అందదు అని తెలిసినా ప్రేమించక తప్పదు అని హీరో అంటాడు.
అడ్డమైన కలలు వస్తున్నాయని నిద్రపోవటం మానేస్తామా? నిద్ర ఎంత సహజమో, ప్రేమ కూడా అంతే సహజం అంటూ అమ్మాయి మనస్సులో భావాన్ని అద్భుతంగా రాశారు శాస్త్రి గారు. "కలలన్నవి కలలని నమ్మనని, అవి కలవని పిలువకు కలవమని..." కలలు నిజాలు కావు, అవి ఉన్నాయని నన్ను నమ్మించే ప్రయత్నం చేయకు అని హీరో అంటాడు., పాటల్లో కౌంటర్ వేయటం అనేది శాస్త్రిగారికే చెల్లింది

అందమైన హరివిల్లులతో, వంతెనేసి చిరు జల్లులతో, చుక్కలన్ని దిగి వస్తుంటే, కరిగిపోని దూరం ఉందా?  అందమైన హరివిల్లులతో , ఆకాశం నుండి భూమికి నిచ్చెన వేసినట్టు, చినుకులు చుక్కలు లాగా దిగి వస్తుంటే ఎంతో దూరం కూడా కరిగిపోయింది, మన మధ్య దూరం కూడా అలానే కరగాలి. మనస్సుంటే మార్గం ఉంది కదా అని అమ్మాయి అంటే.....

అంతులేని అల్లరితో, అలుపు లేని అలజడితో, 24 గంటలు అదే పనిగా  కెరటాలు ఎగిరి పడుతూ ఉంటే, నాకోసమే అని ఆకాశం పడిపోతుందా? మన ప్రేమ కూడా అంతే, కలవటం కుదరదు అని అబ్బాయి అంటాడు. ప్రేమ గురించి , ఒకటి అనుకూలంగా , ఇంకొకటి వ్యతిరేకంగా , ఇంత  చక్కగా రాయటం మా సీతారాముడికే చెల్లింది. మీరు కూడా ఆ పాటను ఇక్కడ ఒకసారి వినండి





Sunday, November 29, 2015

మీలో ఎవరు కోటీశ్వరులు?

"మీలో ఎవరు కోటీశ్వరులు" మళ్ళీ వచ్చేసింది. అందరి సంగతేమో కానీ, నాగార్జున గారు మాత్రం ఇంకా కోటీశ్వరులు అవుతున్నారేమో అనిపిస్తుంది. "చిన్న బ్రేక్ , చిటికెలో వచ్చేస్తాను" అని చెప్పి ప్రకటనలు చింపేస్తున్నాడు. ఏదో మాట వరసకు చిటికెలో వస్తాను అన్నారు కదా అని చిటికెలు వేస్తూ కూర్చుంటే వేళ్ళు పడిపోవటం ఖాయం.  మొదటి అయిదారు ప్రశ్నలు వీజీగానే ఉన్నాయి కానీ, పోను పోను కష్టంగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే..., సరదా కోసం  
  
మొదటి ప్రశ్న: 
నాగార్జున గారి ఇంటి పేరు ఏంటి?
A. అక్కినేని  B. నందమూరి C. దగ్గుబాటి D. అల్లు 

రెండవ ప్రశ్న :
నాగార్జున గారికి ఎంత మంది పిల్లలు 
A. ఇద్దరు B. నలుగురు C. ఆరుగురు D. ఏడుగురు 

ఐదవ ప్రశ్న :
నాగార్జున, నాగేశ్వరరావు, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ఏంటి?
A. మనం B. ఆరెంజ్  C. సూపర్ D. అతడు 

పదో ప్రశ్న :
నాగార్జునగారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు 
A. 65 B. 100 C. 150 D. 200

పన్నెండో ప్రశ్న :
నాగార్జునగారి 50వ సినిమా వంద రోజుల ఫంక్షన్ ఎక్కడ జరిగింది 
A. హైదరాబాద్  B. విజయవాడ C. గుంటూరు D. ఎక్కడా జరగలేదు (సినిమా అంతగా ఆడలేదు)

కోటి రూపాయల ప్రశ్న:
నాగార్జునగారు మధ్యాహ్నం భోజనంలోకి ఏమి తీసుకున్నారు 
A. అన్నం B.  చపాతి C. పండ్లు D. కార్తీక మాసం కాబట్టి ఉపవాసం ఉన్నారు 
 

Saturday, October 3, 2015

గీతా పాఠం ( సీతా రాముడు - 1 )

అందరూ రాసే పాటల్లో భావం ఉంటుంది, కానీ సీతా రాముడు రాసే పాటల్లో భగవద్గీత ఉంటుంది. పాటల్లో భగవద్గీత ఏమిటనే విషయం గురించి తర్వాత చూద్దాం. పాట పాడిన గొంతుని బట్టి, ఆ పాట ఎవరు పాడారో చెప్పచ్చు(అన్నీ కాదు కొన్ని). అలానే కొన్ని పాటలు వింటూ చెప్పేయచ్చు, వాటిని మా సీతా రాముడు తప్ప ఎవరూ రాయలేరని. అంత పెద్దాయన్ని, అందునా ఆ మహా కవిని "సీతా రాముడు" అని పిలవటం ఏంటని అనుకోవచ్చు. ఒకరకంగా నేను కూడా సీతా రాముడినే కదా, పేర్లు కలుస్తాయని అలా పిలిచాననమాట. ఆయన మీద, ఆయన రాసిన పాటల మీద, టపాలు రాయాలని నిర్ణయించుకున్నా. ఏ....  త్రివిక్రమ్ పొగిడితేనే వింటారా? నేను పొగిడితే చదవరా?

విషయానికి వస్తే, గత కొన్నేళ్ళుగా జనాల భక్తిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త కొత్త దేవుళ్ళు వచ్చారు, కొత్త కొత్త బాబాలు వచ్చారు, కొత్త కొత్త సంఘాలు పుట్టుక వచ్చాయి. "మార్పు సహజం" అనేది మనుషులకే కాదు దేవుళ్ళకు కూడా వర్తిస్తుంది.  సరే! ఎవరి భక్తీ వాళ్ళది, మనం ఖండించ కూడదు. ఒక వేళ ఖండించినా నా మాట ఎవరు వింటారు? ఇప్పటికే మా వేంకటేష్ గాడు ముఖ పుస్తకంలో  "దేవుడు లేడు మొర్రో...." అని మొత్తుకుంటూ ఉన్నాడు. ఎవరైనా వింటేగా?

ఇప్పుడీ సోదంతా ఎందుకంటే, ఈ విషయం భక్తితో కూడుకున్నది కాబట్టి.  నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ మధ్య (ఇంతకూ ముందు లేరని కాదు) రోజంతా  "హరే రామ, హరే కృష్ణ" అంటూ ఉంటారు(అంతకు మించి నేను వాళ్ళ గురించి ఏమీ చెప్పదలచుకోలేదు). వాళ్ళను చూసి నాకు "ఒక్కడు" సినిమాలో పాట గుర్తుకు వస్తూ ఉంటుంది. బహుశా మా సీతా రాముడికి కూడా వీళ్ళను చూసే ఆ పాట అలా రాయాలని తట్టిందేమో ??? "రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళేం సాదించారో కొంచం గుర్తిద్దాం మిత్రమా!" అని డొంక తిరుగుడు లేకుండా చెప్పేశాడు. అలా అని  "హరే రామ, హరే కృష్ణ" అనటం తప్పు అని మా (కలిపేసుకున్నా)  ఉద్దేశం కాదండోయ్. "సంద్రం కూడా స్తంభించేల మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా" అంటూ, మనం చేసే పని మీద ప్రాణం పెడితే, ఏదైనా సాదించవచ్చు అని ఇంటర్ చదువుకునే రోజుల్లోనే శాస్త్రి గారి వల్ల తెలుసుకున్నాను. 

హైదరాబాదులో జరిగిన మత కలహాలు, చార్మినార్ చాటు కధకు తెలియవు. అస్సలు భాగ్‌మతి ప్రేమ స్మృతికీ బహుమతీ భాగ్యనగరం. అలాంటి ఈ భాగ్యనగరానికి ఈ మతం అనే జబ్బు పట్టి ఆ చెలిమిని చెరిపేసింది. ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపుతూ ముందుకు పోవాలి అని కుక్కకు కూడా అర్ధం అయ్యేట్టు చెప్పారు, మొదటి చరణంలో. 
 
రెండో చరణం కోసం ఇప్పుడు కాస్త మెఱపు గతానికి (Flash back true translation) వెళ్లి వద్దాం. మా స్కూల్లో ఒకడు ఉండేవాడు. పేరెందుకులేండి, ఇప్పటికే నాకు శత్రువులు ఎక్కువ అయిపోయారు.   చిన్నప్పుడు పరీక్షలు అయిపోయి, మార్కులు ఇచ్చేప్పుడు, వీడికి తోడు వీడి నాన్నగారు వచ్చి, వాడు పరీక్షల్లో రాసింది పై నుండి కింద దాకా చదివి, ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటె, వాటి కోసం పోరాటం చేసేవారు. అర మార్కు తగ్గినా అల్లాడి పోయేవారు. వాడికి పాపం చదువు మీదకన్నా మార్కుల మీద ధ్యాస ఎక్కువ అయ్యింది. వాడికి ఎన్ని పసిడి పతకాలు వచ్చాయో, వచ్చిన వాటిని ఏమి చేశాడో తెలీదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెండో చరణం.  "పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాటకు అర్ధం, నిను నువ్వే గెలుచు యుద్ధం" అనేది పాటలో విన్నప్పుడల్లా ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. నన్ను నేను గెలిస్తే చాలు, బాగుపడటానికి అనిపిస్తుంది.  ఇక్కడ ఆట అంటే కేవలం ఆట అనే కాదు. ప్రతి దానికి ఇది అన్వయం అవుతుంది.

ఫేస్ బుక్ పోస్టులతో ప్రపంచాన్ని మార్చేసి, మంచి తన్నాన్ని నింపేసి, చించేయాలి అని నా లాంటి పేత్రి గాళ్ళు తెగ పోస్టులు పెడుతుంటారు. వాటి వల్ల ప్రయోజనం లేదు. అలాంటి వాళ్ళ కోసమే మిగిలిన రెండు లెన్లూను. "శ్రీ రామ నవమి జరిపే ముందు లంకను గెలవరా, నీ విజయ దశమి రావాలంటే చెడును జయించర" అని చక్కగా చెప్పారు. అంత లోతైన భగవద్గీతని చిన్న సినిమా పాటలో చెప్పేసిన మా సీతా రాముడికి, రెండు చేతులతో నమస్కరిస్తున్నాను. 

*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే*