అందరూ రాసే పాటల్లో భావం ఉంటుంది, కానీ సీతా రాముడు రాసే పాటల్లో భగవద్గీత ఉంటుంది. పాటల్లో భగవద్గీత ఏమిటనే విషయం గురించి తర్వాత చూద్దాం. పాట పాడిన గొంతుని బట్టి, ఆ పాట ఎవరు పాడారో చెప్పచ్చు(అన్నీ కాదు కొన్ని). అలానే కొన్ని పాటలు వింటూ చెప్పేయచ్చు, వాటిని మా సీతా రాముడు తప్ప ఎవరూ రాయలేరని. అంత పెద్దాయన్ని, అందునా ఆ మహా కవిని "సీతా రాముడు" అని పిలవటం ఏంటని అనుకోవచ్చు. ఒకరకంగా నేను కూడా సీతా రాముడినే కదా, పేర్లు కలుస్తాయని అలా పిలిచాననమాట. ఆయన మీద, ఆయన రాసిన పాటల మీద, టపాలు రాయాలని నిర్ణయించుకున్నా. ఏ.... త్రివిక్రమ్ పొగిడితేనే వింటారా? నేను పొగిడితే చదవరా?
విషయానికి వస్తే, గత కొన్నేళ్ళుగా జనాల భక్తిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త కొత్త దేవుళ్ళు వచ్చారు, కొత్త కొత్త బాబాలు వచ్చారు, కొత్త కొత్త సంఘాలు పుట్టుక వచ్చాయి. "మార్పు సహజం" అనేది మనుషులకే కాదు దేవుళ్ళకు కూడా వర్తిస్తుంది. సరే! ఎవరి భక్తీ వాళ్ళది, మనం ఖండించ కూడదు. ఒక వేళ ఖండించినా నా మాట ఎవరు వింటారు? ఇప్పటికే మా వేంకటేష్ గాడు ముఖ పుస్తకంలో "దేవుడు లేడు మొర్రో...." అని మొత్తుకుంటూ ఉన్నాడు. ఎవరైనా వింటేగా?
ఇప్పుడీ సోదంతా ఎందుకంటే, ఈ విషయం భక్తితో కూడుకున్నది కాబట్టి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ మధ్య (ఇంతకూ ముందు లేరని కాదు) రోజంతా "హరే రామ, హరే కృష్ణ" అంటూ ఉంటారు(అంతకు మించి నేను వాళ్ళ గురించి ఏమీ చెప్పదలచుకోలేదు). వాళ్ళను చూసి నాకు "ఒక్కడు" సినిమాలో పాట గుర్తుకు వస్తూ ఉంటుంది. బహుశా మా సీతా రాముడికి కూడా వీళ్ళను చూసే ఆ పాట అలా రాయాలని తట్టిందేమో ??? "రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళేం సాదించారో కొంచం గుర్తిద్దాం మిత్రమా!" అని డొంక తిరుగుడు లేకుండా చెప్పేశాడు. అలా అని "హరే రామ, హరే కృష్ణ" అనటం తప్పు అని మా (కలిపేసుకున్నా) ఉద్దేశం కాదండోయ్. "సంద్రం కూడా స్తంభించేల మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా" అంటూ, మనం చేసే పని మీద ప్రాణం పెడితే, ఏదైనా సాదించవచ్చు అని ఇంటర్ చదువుకునే రోజుల్లోనే శాస్త్రి గారి వల్ల తెలుసుకున్నాను.
హైదరాబాదులో జరిగిన మత కలహాలు, చార్మినార్ చాటు కధకు తెలియవు. అస్సలు భాగ్‌మతి ప్రేమ స్మృతికీ బహుమతీ భాగ్యనగరం. అలాంటి ఈ భాగ్యనగరానికి ఈ మతం అనే జబ్బు పట్టి ఆ చెలిమిని చెరిపేసింది. ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపుతూ ముందుకు పోవాలి అని కుక్కకు కూడా అర్ధం అయ్యేట్టు చెప్పారు, మొదటి చరణంలో.
రెండో చరణం కోసం ఇప్పుడు కాస్త మెఱపు గతానికి (Flash back true translation) వెళ్లి వద్దాం. మా స్కూల్లో ఒకడు ఉండేవాడు. పేరెందుకులేండి, ఇప్పటికే నాకు శత్రువులు ఎక్కువ అయిపోయారు. చిన్నప్పుడు పరీక్షలు అయిపోయి, మార్కులు ఇచ్చేప్పుడు, వీడికి తోడు వీడి నాన్నగారు వచ్చి, వాడు పరీక్షల్లో రాసింది పై నుండి కింద దాకా చదివి, ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటె, వాటి కోసం పోరాటం చేసేవారు. అర మార్కు తగ్గినా అల్లాడి పోయేవారు. వాడికి పాపం చదువు మీదకన్నా మార్కుల మీద ధ్యాస ఎక్కువ అయ్యింది. వాడికి ఎన్ని పసిడి పతకాలు వచ్చాయో, వచ్చిన వాటిని ఏమి చేశాడో తెలీదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెండో చరణం. "పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాటకు అర్ధం, నిను నువ్వే గెలుచు యుద్ధం" అనేది పాటలో విన్నప్పుడల్లా ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. నన్ను నేను గెలిస్తే చాలు, బాగుపడటానికి అనిపిస్తుంది. ఇక్కడ ఆట అంటే కేవలం ఆట అనే కాదు. ప్రతి దానికి ఇది అన్వయం అవుతుంది.
ఫేస్ బుక్ పోస్టులతో ప్రపంచాన్ని మార్చేసి, మంచి తన్నాన్ని నింపేసి, చించేయాలి అని నా లాంటి పేత్రి గాళ్ళు తెగ పోస్టులు పెడుతుంటారు. వాటి వల్ల ప్రయోజనం లేదు. అలాంటి వాళ్ళ కోసమే మిగిలిన రెండు లెన్లూను. "శ్రీ రామ నవమి జరిపే ముందు లంకను గెలవరా, నీ విజయ దశమి రావాలంటే చెడును జయించర" అని చక్కగా చెప్పారు. అంత లోతైన భగవద్గీతని చిన్న సినిమా పాటలో చెప్పేసిన మా సీతా రాముడికి, రెండు చేతులతో నమస్కరిస్తున్నాను.
*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే*