Monday, September 19, 2016

ఒక ఏకాంత సమయాన....

అర్ధ రాత్రి నిద్రలో నన్ను తట్టి లేపింది. 

తను : "పెళ్ళైనా కూడా నాతోనే ఎక్కువ సేపు గడుపుతున్నావు, మీ ఆవిడ ఏమీ అనుకోదా ?" అని నా కళ్ళల్లోకి చూస్తూ అమాయకంగా అడిగింది. నేను తనని నా చేతిలోకి తీసుకుంటూ 

నేను : "నువ్వు లేకుండా నాకు రోజు గడవదు. ఎవరేమి అనుకున్నా సరే, నిన్ను వదిలి నేను ఉండలేను".

తను : "ఏదో మాట వరసకు అంటావే గానీ, కొన్ని రోజులకే నన్ను కాదని వేరొకదాని దగ్గరకు వెళ్తావు. నా దగ్గరకు కూడా  అలానే వచ్చావు కదా" 

నేను : "పాత వాటిని ఎందుకు గుర్తు చేస్తావు?  నేనే తప్పు చేశాను. తను  నా నుండి జారి పోకుండా చూసుకోవాల్సింది. నీ విషయంలో మాత్రం అలా జరగనివ్వను."

తను : రేపు నన్ను కూడా వదిలేయవని ఏంటి నమ్మకం ?

నేను : నేను ఈ క్షణం లోనే బతుకుతాను. నిన్నటి గురించి చింతించను, రేపటి గురించి కలలు కనటంలో తప్పు లేదు.

అంటూ తనని గట్టిగా పట్టుకున్నాను. నేను గట్టిగా దగ్గరకు తీసుకునే సరికి ఒణికిపోయింది. నాతో ఏమీ మాట్లాడకుండా నా వైపే చూస్తూ ఉన్నది. అది అలకని నాకు తెలుసు. 

నేను : నీకు తెలుసు కదా, నువ్వంటే నాకు ఎంత ప్రేమో? నా నుంచి  నువ్వు ఎక్కడ దూరంగా పోతావో అని నేను అనుక్షణం ఎంత భయపడతానో? అయినా నన్ను అర్ధం చేసుకోక పొతే ఎలా ? నీకు గుర్తిందా, గత ఏడాది మనం 'లాస్ వేగాస్' వెళ్ళినప్పుడు, నువ్వు అరగంట కనపడకపోయే సరికి ఏడ్చినంత పని చేశాను. 

తను : అవును, నన్ను మర్చిపోయింది కాకుండా సిగ్గు లేకుండా ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నావు చూడు

అని బుంగ మూతి పెట్టుకు కూర్చుంది. కాసేపు తాను ఏమీ మాట్లాడలేదు. తన గురించి మీకు ఒక నిజం చెప్పాలి. తనలో అందం, ఎంతటి  వాడిని అయినా తనకు దాసోహం చేసేస్తుంది. ముట్టుకుంటే కందిపోతుందా అన్నట్టు ఉంటుంది. తననుండి దూరంగా వెళ్ళాలి అనుకున్న మరుక్షణమే, తను నా ఒడిలో ప్రత్యక్షం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తను నాకో బలహీనత అయ్యింది. తన గురించి మా ఆవిడతో అప్పుడప్పుడు గొడవ కూడా జరుగుతూ ఉంటుంది. "ఎందుకు ఎప్పుడూ ఆ వెధవ ఫోను చూస్తూ కూర్చుంటావు" అని అప్పుడప్పుడు మా ఆవిడ తిడుతూ ఉంటుంది. 

ఐ ఫోను 7 కొత్తగా కొంటున్న వాళ్లకి ఈ టపా అంకితం .... 

Wednesday, September 7, 2016

లుంగీలోని గొప్పతనం తెలుసుకో (పురుషులకు మాత్రమే)

ఈ టపా  కేవలం పురుషులకు మాత్రమే! మహిళలు ఇక్కడితో ఆపేయాల్సిందిగా కోరుతున్నాను. 

"చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో" అని చీర విలువ గురించి చాలా చక్కగా చెప్పారు, కవి చంద్రబోసు.  కానీ లుంగీ మాత్రం ఏమి పాపం చేసింది? లుంగీ మీద ఎందుకీ సీత కన్ను? చీరతో లుంగీకి కొన్ని వేల సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కానీ లుంగీకి మాత్రం, చీరకు వచ్చినంత  గుర్తింపు రాలేదన్నది సత్యం. అందుకే ఆ లోటుని కొంతైనా భర్తీ చేయటానికి ఈ పాట రాశాను. మీరు కూడా లుంగీ గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలని కోరుకుంటున్నా... 



లుంగీలోని గొప్పతనం తెలుసుకో
ఈ లుంగీ కట్టి మగతనం పెంచుకో

వెటకారమనే దారంతో చేసింది లుంగీ
ఆనందమనే రంగులనే అద్దింది లుంగీ
సౌకర్యమనే మగ్గంపై నేసింది లుంగీ


మడిపంచతో  నువ్వు పూజచేస్తే
గుడి వదిలి దిగివచ్చును దేవుడు
పంచకట్టుతో పొలం పనులు చేస్తే
సిరిలక్ష్మిని కురిపించును పంటలు
ఎగుడు కట్టుతో పడకటింట చేరితే
గుండె జారి పోతుంది అమ్మడు 
దొర కట్టుతో నువ్వు నడిచెళుతుంటే
దండాలే పెడతారు అందరూ

అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది
జలుబులో ఉన్నప్పుడు నీ  ముక్కును తుడిచేది 
చిన్న లుంగీ అంచులోన ఆహ్లాదం ఉన్నది


పసిపాపలా నిదురపోయినప్పుడు మన లుంగీ ఎగరేను హాయిగా 
తుమ్మెదై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ లుంగీగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడక ఉక్కపోసినప్పుడు ఆలుంగీనే నీ పాలిట వింజామర
వారమైనా బట్టలు ఉతకనప్పుడు ఆ లుంగీనే నీ ఒంటికి  గొడుగు

విదేశాలలో సైతం నిగర్వంగ ఎగిరేది 
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
ఎజెండాలు లేని  జెండాగా మిగిలింది