Friday, March 23, 2012

శ్రీనందననామ సంవత్సర శుభాకాంక్షలు

"ఎన్నాళ్ళో వేచిన ఉదయం" అనట్టు, మొత్తానికి సచిన్ నూరు వందలు పూర్తి చేయటంతో దేశమంతా ఊపిరి పీల్చుకుంది. ముఖంపుస్తకంలో చెప్పినట్టు పెట్రోలు ధరతో పోటీ పడి చివరికి పెట్రోలుకన్నా ముందే వంద పూర్తి చేశాడు. నిన్నటి దాకా సచిన్ని తిట్టిన చానళ్ళు అన్నీ, వంద కొట్టేసరికి దేవుడు అని పోగిడాయి. మొత్తంగా చెప్పాలంటే వందకు ముందు బరువు, వంద కొట్టాక  ప్రభువు అనమాట.

ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం తప్పినా, రెండో సంవత్సరంలో చేరతాము కదా. అలానే మనోళ్ళు క్రికెట్లో ఒకటి రెండు సిరీస్లు ఓడినా, క్రికెట్ చూడటం మానలేము కదా. ఆ క్రికెట్ మ్యాచ్ మధ్యలో "ఎయిర్ టెల్" వాణిజ్య ప్రకటనలు చూస్తున్నాను. మీకు గుర్తుంటే, అందులో ఒక జంట ఇంట్లో ఎప్పుడూ ఫోను మాట్లాడుకుంటూనే ఉంటారు. భార్య పాపం ఎప్పుడూ భర్తని, "నీది మంచి ఫోను కాదు, నా దాంట్లో నెట్వర్క్ బాగుంటుంది, ఎంత సేపు మాట్లాడినా ఉచితమే, లిఫ్ట్లో నీ ఫోను పనిచేయదు" అని ఎప్పుడూ నస పెడుతూనే ఉంటుంది.  నాకే గనక అలాంటి పెళ్ళాం ఉంటే, వెంటనే విడాకులు ఇచ్చేయాలి అన్నంత కోపం వస్తుంది. 

స్నేహితుడి పెళ్లి కోసమని భీమవరం వెళ్ళాను. నాకు చాలా మంది స్నేహితులు చెప్పారు, ఉభయ గోదావరి జిల్లాలు, ఆ జిల్లాలోని పొలాలు చాలా అందంగా ఉంటాయి అని. చాలా చిత్రాలలో చూసి నేను కుడా చాలా అందమైన ప్రదేశం అనుకుని వెళ్లాను. కాని చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే "అందం" అనే పదం అస్సలు సరిపోదు. అంత అద్భుతంగా ఉన్నాయి. వీలు దొరికితే మళ్లీ మళ్లీ వెళ్ళాలని ఉంది.

దారి వెంట కారులో వెళ్తుంటే, నున్నని రహదారులు, ఆ రహదారులను ఓదారుస్తూ, వాటి వెంట పారే కాలువలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, పచ్చని వరి పైర్లు., తాటి చెట్లు, వాటి కల్లు  ఇలా ఒకటేమిటి ప్రతిదీ అధ్బుతమే. మా ఊరి రహదారులు కుడా అంత అందంగా ఉంటె ఎంత బాగుంటుందో అనిపించింది. మా ఊరి రహదారుల వెంట పేడ ముద్దలు తప్ప పైరులు తక్కువ.

చూస్తూ చూస్తూ అప్పుడే శ్రీఖర నామ సంవత్సరం కుడా అయిపోయింది. మొన్ననే దేశం నలుమూలల నుండి పెద్ద పెద్ద పండితులు నా దగ్గరకు వచ్చి, "రామానంద స్వామి, వచ్చే సంవత్సరానికి ఏ పేరు పెడితే బాగుంటుందో మీరే చెప్పాలి" అని తెగ బతిమిలాడారు. వాళ్ళని ఇబ్బంది పెట్టటం ఎందుకని, సరే నా పేరు మీద ఏదో ఒకటి పెట్టుకోండి అని అన్నాను. "అదేదో మీరే సెలవివ్వండి స్వామి" అని వాళ్ళన్నారు. రామానందలో నుండి నంద అనే పదం తీసి "నందన" నామ సంవత్సరం అని పెట్టుకోపోండి అని చెప్పి పంపేశాను. కాబట్టి కొత్త సంవత్సరం పేరు "శ్రీ నందననామ" సంవత్సరం అనమాట.

సంవత్సరం అంటే గుర్తొచ్చింది, మొన్న మల్లి మామకి ఫోను చేస్తే, టి.వి.9 ని, నా అంత బాగా బూతులు రాక పోవటంతో , నన్ను అడిగి మరీ బండ బూతులు తిట్టాడు. తీరా విషయం ఏమిటంటే, "ఒక రోజు ఆ ఛానల్ లో 2012  లొ కలియుగం అంతం అవుతుంది, ప్రళయం వస్తుంది అని చెప్పటం విని, ఎలాగూ ప్రళయం వస్తుంది కదా, ఇంకొక సంవత్సరమే కదా అని పెళ్లి చేసుకున్నాను రా, రెండు రోజులు క్రితం అదంతా ఉత్తిదే, ఇప్పుడప్పుడల్లా ప్రళయం లేదు, అని చెప్పాడు. అందుకే నాకు అంత కోపం వస్తున్నది"  అని చెప్పాడు. తన కోపంలో కుడా న్యాయం ఉంది మరి. పెళ్ళికి ముందు జాంపండు లాగా ఉండేవాడు. పెళ్లి అయ్యాక జీడిపప్పు అయ్యాడు.  అందుకనే నేను ఎవరి మాటలు వినకుండా 2012 లో కలియుగానికి అంతం కాకపొతే, అప్పుడు 2013 లో నా సుఖానికి అంతం(పెళ్లి) అని నిర్ణయించుకున్నా.

"శ్రీ నందననామ" సంవత్సరంలో చదువుకునే వాళ్ళకి మార్కులు రావాలని, చదువు అయిపోయిన వాళ్లకి ఉద్యోగాలు రావాలని. ఉద్యోగాలు వచ్చిన వాళ్లకు పెళ్లి కావాలని, పెళ్లి అయిన వాళ్ళకు ప్రశాంతత కలగాలని, కోరుకుంటూ, ఈ సంవత్సరానికి సెలవు తీసుకుందాం. పనిలో పనిగా నాలుగు ముక్కలు రాశాను. చదివి  తరించండి.

వీడింది 'శ్రీఖర'తో  సంభందం
మొదలవుతోంది నందనంతో అనుభందం
సదా ఉండాలి ఈ ఏడు ఆనందం 
దినమొక పండుగ చందం

ఈ సంవత్సరమయినా, "హ్యాపి ఉగాది", "ఉగాది బ్రింగ్స్ పాస్పరౌస్, మట్టి,మశానం" అని కాకుండా చక్కగా తెలుగులో శుభాకాంక్షలు తెలుపుతారని ఆశిస్తూ..... సెలవు.
 

3 comments:

  1. హహహ! శుభాకాంక్షలు ఇలా కూడా చెప్పచ్చా ;) సోడా (సొంత డబ్బా) ఎక్కువయినట్టు లేదూ!!! మా ఊరి దరిదాపుల దాకా వచ్చి మా ఊరు రాకుండా వెళ్తారా? హన్నా!!! చదువుకునే వాళ్ళకి మార్కులు రావాలని మీరు కోరుకున్నారో లేదో మా సెం మార్క్స్ చేతిలో పెట్టారు! బాగుందండీ! నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ నూతన సంవత్సరం మట్టినీ, మశానాన్నీ కాకుండా మంచినీ, ఆనందాన్నీ తీసుకురావాలని కోరుకుంటూ ........

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారు. మీ ఊరికి నన్ను పిలవకుండా, పైగా నన్నే ఎందుకు రాలేదు అంటారా??? దీని పైన నెను సుప్రీం కొర్టుకి వెళ్తా

      Delete
  2. This time 2 lines....
    Chaduvukunna vallaki markulu raavalani, chaduvu aipoina vallaki udyogalu raavalani, udyogalu unnavallaki pelli kaavalani... :D

    Ugadi brings prosperous matti mashanam... hahaha...

    --JB

    ReplyDelete