ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్ర పోయేలోపు, కనీసం ఒక్క పాట అయినా వినని వారు ఉండరనుకుంటా!!! పాట... ప్రతి గుండెనీ కదిలించగల శక్తి పాటకు ఉన్నది. అది ఆనందం అయినా, విషాదం అయినా, వికారం అయినా, మన కలలు సాకారమైనా.., ప్రతి దానికి ఓ పాట, ఆ మాటకొస్తే ఒక్కో సందర్భానికి చాలా పాటలే పాడుకోవచ్చు. పాడుకున్నోడికి పాడుకున్నంత.
నాకు తెలిసినంతలో ఇప్పుడు మన సాఫ్టోళ్ళందరికీ అప్రైసల్ సమయం. సంవత్సరం అంతా నానా చాకిరీ చేసేది, పై అదికారుల దగ్గర వినయంగా నటించేది ఈ అప్రైసల్ కోసమే. మనిషికి సంతృప్తి అనేది ఉండదు కాబట్టి, అప్రైసల్ లో ఏమి జరిగినా ఏడుపు ముఖం మాత్రం ఖాయం. కానీ సంవత్సరం పొడుగునా, అంతలా ప్రేమించిన అప్రైసల్ దొరక్కపోతే ఏ పాట వినాలి? ఏ పాట పాడుకోవాలి అని అలోచించే వాళ్ళకి, నేను సమర్దించే పాట ఒకటి ఉన్నది. ఆ పాట వింటూ మనసారా ఏడవండి.
అప్రైసల్ని మీ ప్రేమ అనుకొని, మేనేజరు ప్రేయసి అనుకుని ఈ పాట వినండి. ఆ భావనతో మీరు ఆ పాటను వింటే, ప్రతి పదానికి ఏడవటం మాత్రం ఖాయం...
"ప్రేమ లేదని, ప్రేమించ రాదనీ, సాక్ష్యమే నీవనీ, నన్ను నేడు చాటనీ... ఓ ప్రియా జోహారులూ ...... "
ఈ పాట అంటే నాకు ప్రాణం. ఎన్ని వందల సార్లు విని ఉంటానో. ఎంత వద్దు అనుకున్నా, ఈ పాటని మార్చి రాయకుండా ఉండలేక పోయాను. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి, అప్రైసల్ రాక అల్లాడుతున్న వాళ్ళందరికీ ఈ పాటని అంకితం చేస్తున్నాను. మిగిలిన వాళ్ళు అస్సలు ఇంక చదవకపోవటమే మంచిది. ఈ పాటను కూనీ చెయాల్సి వచ్చినందుకు భాద పడుతూ ., ఆచార్య ఆత్రేయ గారికి క్షమాపణలు చెప్పుకుంటూ....
హైక్ రాదని, అప్రైసల్ లేదని.., సాక్ష్యమే నేనని ..,నువ్వు నేడు చాటనీ... ఓ సారూ... జోహారులూ --- (2)
చరణం:
జీతం పెంచక పోతే పనికింక రానని,
కూలి వానికైనా కొంత హైకుందని,
ధరల మంట అంటుకుంటె ఆరిపోదని,
జీతం పెంచితే నీసొమ్మేం పోదని
ఉసురు తీసి నట్టుగా నీవుంటివీ
ఎదుగు బొదుగు లేనె లేక నేనుంటిని.....
చరణం:
ఒళ్ళు మరచిపోయి పని చేయాలని
చేయ లేకపోతే మానేయాలని
తెలిసి కూడ మానలేని సాఫ్టు వేరుని
గుండె పగిలి పోవు వరకు నన్ను పాడని
ఎందుకూ సరిపోనీ జీతాలతో, నెల నెలా, విల విలా రోధించని ...