ఎవరైనా గుంటూరు మిర్చి అంటారు, వీడేమో గుంటూరు అంటున్నాడు, టమోటాలు అంటున్నాడేంటా అని అనుమానం కలుగుతున్నది కదూ??? నేను చెప్పబోయేది, తినే టమోటాలు గురించి కాదు, తినిపించే టమోటాల గురించి. పరిచయం ముగించి పాయింటుకొస్తే, మొన్నామధ్య గుంటూరు వెళ్ళాను. ఏ పని మీద వేళ్ళానని అనుమానపడకండి. పని పాట లేకనే వెళ్ళాను.
వెళ్ళినోడిని ఊరుకుంటే ఏ గొడవా ఉండేది కాదు. సరే కవులకు కూడా ఆకలేస్తుంది కాబట్టి, గుంటూరులో ఎక్కడ తింటే బాగుంటుందా అని అలోచిస్తూ ఉంటే, " అరండల్ పేట్ లో క్రొత్తగా ఒక హోటల్ ప్రారభించారు, వెళ్దాము" అని బావగారు అనటంతో, సరేనని బయలుదేరి వెళ్ళాము. ఆ హోటల్ పేరే "టమోటాలు".
హోటల్ పేరు టమోటాలేంటి అని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ లో "చిల్లీస్" అనే పేరుతో హోటల్ ఉండగా లేనిది, "టమోటా" పేరుతో హోటల్ ఉంటే తప్పా అని నేను ప్రశ్నిస్తున్నాను. చిల్లీస్ ఎక్కువేంటి? టమోటా తక్కువేంటి? అవీ ఎర్రవి , పచ్చవి ఉంటాయి. ఇవి కూడా ఎర్రవి పచ్చవి ఉంటాయి.
పేరులోనే టమోటా ఉన్నదాయే, బయట పేరు కూడా ఎర్రటి అక్షరాలతో "టమోటాలు" అని ఆంగ్లంలో రాసున్నది. రంగు బాగానే ఉన్నది, రుచి, చిక్కదనం ఎలా ఉంటాయో అనుకుంటూ లోపలికి వెళ్ళాము. బల్లలు కూడా ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు, మళ్ళీ ఒకటి ఎరుపు ఉన్నాయి. మొన్న వినాయక చవితికి ఈ "టమోటాలు" ప్రారంభించారు అని తెలిసింది. వినాయక చవితి కాబట్టి హోటల్ పేరు "ఉండ్రాళ్ళు" అని పెడితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. వినాయకుల వారి ఆశీస్సులు కూడా విపరీతంగా ఉండేవి. బహుశా కొత్తగా హొటల్ తెరవటం మూలన అనుకుంటా, ఇంకా ఆ సున్నాల వాసన గుభాలిస్తున్నది. క్రొత్తగా ప్రారంభించారు గనుక మనం ఉత్సాహపరచాలి అని సద్భావంతో అక్కడే తినటానికి నిర్ణయించుకున్నాము.
కాకపోతే చిన్న అనుమానం, "టమోటాలు" అని రాశాడు, మనం తినే పదార్ధాలు అన్నీ ఉంటాయా? లేక కేవలం టమోటా పప్పు, పచ్చడి లాంటివే ఉంటాయా అని. ఆ ఆనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, విషయ సూచిని (మెనూ) తీసుకు వచ్చారు. మేము మంచూరియా చెప్పాము. గోబీ మంచూరియా తీసుకు రమ్మంటే, ముష్టి మంచూరియా తీసుకొచ్చాడు. అది ఎలా ఉందో చెప్పటం కుదరదు, తినాల్సిందే. గోబీతో కొడితే గూబ గుయ్యమనేట్టు చేశాడు. అదేంటి అని అడిగితే, గోబీ మంచూరియా ఇలానే ఉంటుందని చెప్పాడు!!
అక్కడితో ఆపేసి వెళ్ళిపోదాం అనుకన్నప్పటికీ, పూర్తిగా తిని చూస్తే తప్ప ఇంకో సారి రావాలో లేదో నిర్ణయించుకొవచ్చు అనుకొని అక్కడే తినేశాము. ఏమేమి తిన్నామనేది మాత్రం చెప్పను. దిష్టి తగిలితే ఎవడు రెస్పాన్సిబుల్?? మొత్తానికి పర్వాలేదనిపించాడు. ఇక్కడే కధలో కీలక ట్విస్టు. ఇంత తక్కువ స్థలంలో పెట్టారేంటో అనుకుంటుండగా ఒక వార్త తెలిసింది. సదరు టమోటాలు ప్రారంభించిన చోట, ఇది వరకు ఒక సాఫ్ట్ వేర్ కంపేనీ అద్దెకు ఉండేదని. అది నష్టాలతో మూసివేయటంతో, సాఫ్ట్ వేర్ కి బదులుగా టమోటాలు కాశాయి అని. గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టమోటాలు ఒకసారి రుచి చూడండి