Thursday, September 19, 2013

చవితి పందిరి

పైన శీర్షిక పేరు చదవగానే అర్ధం అయ్యి ఉంటుంది, ఇవాళ నేను దేనిని ఖండించబోతున్నానో. చిన్నప్పుడు ఊర్లో వినాయక చవితి పందిర్లు వేసేవారు. ఆ పందిర్ల దగ్గర పాటల పోటీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. దేవుడి దయ వల్ల, కొన్ని చోట్ల డాన్సు బేబీ డాన్సు లాంటివి కూడా జరిగేవి. వినాయకుని పందిరి అని చెప్పి పద్దతిగా, ఒక అన్నమాచార్య కీర్తనను ఆరున్నర శృతిలో(ఏంటో ఈ పేరు లేకుండా శీర్షిక పూర్తి అవ్వటం లేదు) సాధన చేసి పోటీలకు వెళ్ళేవాడిని. తీరా పోటీలో అన్నమాచార్య కీర్తనలకన్నా "ఆకలేస్తే అన్నం పెట్టే" పాటలకే బహుమతులు వచ్చేవి.

కట్ చేస్తే, నేను అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్లో కూడా వినాయకుని ప్రతిష్ట జరిగింది. పాతికిళ్ళు ఉండే అపార్ట్మెంటుకు ముగ్గురితో కూడిన ఒక "వినాయక చవితి కమిటీ" ఏర్పాటు చేశారు. ముందుగా అందరి దగ్గర చందాలు పోగు చేసి, ఒక వినాయక విగ్రహాన్ని తీసుకు వచ్చారు (మట్టి విగ్రహం తేవటం కొంచెం సంతోషకరమైన విషయం). రోజుకో అంతస్తు చొప్పున ఐదు రోజులు పూజలు చేయాలని వాటాలేసుకున్నారు. మొదటి రోజు అంతా ప్రశాంతంగానే జరిగింది.

రెండో రోజు ఉదయాన్నే ఆఫీసుకని బయలుదేరి అపార్ట్మెంట్ బయటకి వచ్చాను. "అంతా రామ మయం .." అని పాట వినపడింది. పందిరి అన్నాక ఆమాత్రం పాటలు ఉండాలిలే అనుకునే లోపు, ఆ పాట అయిపోయి, ఆ తరువాత పాట మొదలైంది. వినాయకుడు తొండంతో చెవులు మూసుకున్నాడు. "చాలు చాలు చాలు, సరసాలు చాలు చాలు" అనే పాట పొద్దునే మొదలయ్యింది. వాచ్ మెన్ "శ్రీ రామదాసు" పాటల క్యాసెట్టు పెట్టేసి ఎటో పోయాడు. ఆ పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కొని పాటలు ఆపే సరికి, దాదాపు ఆ పాట పూర్తి అయ్యింది. దానితో వినాయకుడు శాంతించి, "నీకు నీలాపనిందలు మాత్రమే కాదు, తప్పు చేసినా నిందలు ఉండవు" అని వరమిచ్చాడు.

ఒక్కో రోజు రెండు మూడు రకాల ప్రసాదాలు పెట్టారు. మొదటి రోజున "వెజిటబుల్ బిర్యానీ" చంపేశారు. రెండో రోజు "చక్కెర పొంగలి", "సమోసా" ఉన్నాయి అని చెప్పటంతో ఆరున్నరకల్లా వెళ్లి కూర్చున్నాను. ఏడున్నర కల్లా పంతులుగారు పంచ విదిలించి ప్యాకప్ చెప్పేశారు. అందరూ ప్రసాదాలకు పరుగులు పెట్టారు. ఇక్కడే కధలో కీలక ట్విస్టు. ఇవాళ ఒక అరగంట పాటు సంగీత విభావరి అని కమిటీ వారు చెప్పటంతో నిరాశ చెందారు. పక్కనే ఉన్న సంగీత పాఠశాల నుండి ఒక బృందము వచ్చింది. అమ్మాయిలు అందంగా చీరలు కట్టి, ముఖమంతా మేకప్ కొట్టి పాడటం మొదలు పెట్టారు. ఆపార్ట్మెంట్లో ఒక పెద్ద మనిషి వచ్చి, ప్రసాదాలు కానిస్తే, తింటూ పాటలు వినచ్చు కదా అని ఉచిత సలహా ఒకటి విసిరేశారు. కమిటీ వారు కుదరదన్నారు.

పాటలు మొదలయ్యాయి. మైక్ పని చేయటం ఆగిపోయింది. వాళ్ళు పాడుతున్న పాటలకన్నా వాళ్ళ చేతులతో వేసే తాళం శబ్దం ఎక్కువ వినపడింది. దానితో ఆడవాళ్ళంతా వాళ్ళల్లో వాళ్ళు, సీరియళ్ళ గురించి, చీరల గురించి, మగవాళ్ళు సీమంధ్ర సమ్మె గురించి, డాలరు విలువ గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. నేను మాత్రం ఆ పాడే వాళ్ళకు దగ్గరగా కూర్చొని పాటలు వినే ప్రయత్నం చేశాను (నిజం నమ్మండి). నేను వింటున్నాని, వాళ్ళు హిందీ పాటలోకి దిగారు. ఆ దెబ్బకు "సింధూరం" సినిమా చూశాక త్రివిక్రమ్ గారు (4:00 దగ్గర నుండి వీడియో చూడండి) నడిచినట్టు, నేను కూడా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చేశాను.

ఇంత జరుగుతున్నా అపార్ట్మెంట్ లో చిన్న పిల్లలు మాత్రం శ్రద్దగా పాటలు విన్నారు. ఆహా ఎంత మంచి పిల్లలు, శ్రద్దగా వింటున్నారు అనుకున్నా . కానీ ఆ శ్రద్ద వెనక ఒక మతలబు ఉందని అర్ధం కాలేదు. ఆ పాటల వాళ్ళు ముగించిన రెండు క్షణాలకు ఆ పిల్ల గుంపంతామైక్ మీద పడి, ఇష్టం వచ్చినట్లు కేకలు వేశారు. అర్ధం కాని కొత్త తెలుగు సినిమా పాటలన్నీ వినాయకునికి విన్నవించారు. వినాయకుడు విని తరించాడు.  ఇక నిమజ్జనం గురించి, ప్రసాదం అందలేదని ఏడ్చే వాళ్ళ గురించి, మా డబ్బులకు లెక్క చెప్పమనే వాళ్ళ గురించి రాయాలంటే ఈ శీర్షిక, నా ఓపిక సరిపోవు. ఇంకో శీర్షికలో దాని గురించి తప్పక ఖండిస్తా. అంతవరకూ .....12 comments: