చిన్నప్పటి నుండి సినిమా పాటలే ఎక్కువగా వినే వాడిని. శాస్త్రీయ సంగీతం అంటే కొంత ఆశక్తి ఉన్నప్పటికీ ఆ పాటలు విన్నది తక్కువే. ఎప్పుడైనా టీవీలో విన్నా కానీ విసుగు పుట్టేది. పాడిన లైనే పాడీ, పాడీ విసిగిస్తారేంటో అనుకునే వాడిని. బాల మురళి కృష్ణ గారి గొంతు వింటే, అస్సలు నచ్చేది కాదు. బహుశా బాల సుబ్రహ్మణ్యానికి బాగా అలవాటు పడిన చెవులు కావటం మూలాన అనుకుంటా!!
ఇది ఇలా ఉండగా, నారాయణ స్వామిగారు ప్రతి శుక్రవారం నాడు, ముఖ పుస్తకంలో "శుక్కురారం సంగీత తీర్ధం" అన్న పేరుతో, వారినికి ఒక శాస్త్రీయ సంగీతానికి సంభందించిన పాటనో, కృతినో ( ఆ రెండింటికి తేడా ఏంటని అడక్కండి) పరిచయం చేసే వారు. ఆ పాటకు సంభందించి యుట్యూబ్ లంకేతో సహా ప్రచురించే వారు. వారం వారం ఆ పాటలు వింటూ ఉండే వాడిని. మొదట్లో ఏమంతగా నచ్చేవి కాదు. "గాడిదకు ఏమి తెలుసు గంధపు చెక్కల వాసన" అని తెలుసుకోవటానికి చాలా రోజులే పట్టింది.
కొన్ని పాటలు విన్న వారం తరువాత కూడా నోటిలో నానుతూ ఉండేవి. మెల్లగా ఆ పాటలు వినటం ఎక్కువై పోయింది. సుబ్బలక్ష్మి గారివి, మంగళంపల్లి వారివి ఇలా యుట్యూబ్ లో ఒక దాని తరువాత ఇంకొకటి విన్నాను. అస్సలు ఈ పాటలన్నింటిలో ఏవి చాలా గొప్పవి అని అడిగితే, త్యాగరాజు వారి కీర్తనలు అద్భుతం, అందులోను "పంచ రత్న కీర్తనలు" ఇంకా అద్భుతం అని తెలిసింది. త్యాగారాజంటే ఆ కాలంలో, మన తమన్ అంత గొప్ప సంగీత విద్వాంసుడట!! ( సచిన్ టెండూల్కర్ కి, సందులో క్రికెట్ ఆడేవాడికి పోలిక పెట్టినట్టు ఉన్నదని నాకు కూడా తెలుసు, నా వెటకారాన్ని అర్ధం చేసుకొని తిట్టరని ఆశిస్తున్నాను)
అస్సలు ఈ పంచ రత్న కీర్తనలు ఏంటి అని వెతికితే తెలిసింది, ఇవి మొత్తం ఐదు పాటలు. నాలుగు తెలుగులో ఉంటే, ఒకటి సంస్కృతంలో స్వరపరిచారు త్యాగరాజస్వామి వారు. త్యాగరాజుగారు పుట్టింది మా జిల్లాలోనే అని తెలుసుకొని చాలా ఆనందపడ్డాను. యుట్యూబ్ లో వెతికి అవి విన్నాను. వింటూనే ఉన్నాను. నిజంగా ఒక్కో కీర్తన ఒక్కో రత్నం కంటే విలువైనవి. ఈ సంగీత జ్ఞానం లేని నా లాంటి వాడికే ఇంతలా నచ్చితే, సంగీతం వచ్చిన వాళ్ళు, బహుశా ఈ కీర్తనలు రెండు సార్లు పాడుకుంటేనే కడుపు నిడుతుంది కాబోలు. మీరు ఇప్పటికీ నాకు మల్లే వినని వారైతే మీకోసం
ప్రతి సంవత్సరం "త్యాగరాజ ఆరాధనోత్సవాల"లో ఈ పంచ రత్నాలను ప్రత్యేకించి పాడతారట. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఆయన తెలుగులో చేసిన కీర్తనలను, తెలుగువాళ్ళకన్నా, తమిళనాడులో తమిళులు ఎక్కువగా సాధన చేస్తారట!! ఈ పాటల కోసం వాళ్ళు తెలుగుని నేర్చుకొని మరీ పాడతారని తెలిసి ఆశ్చర్యపోయాను. నేను సంగీతం ఎందుకు నేర్చుకోలేదా అని తెగ బాధపడిపోతున్నాను. అదృష్టం బాగుండి, బాగా సంగీతం నేర్చుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఉచితంగా, తేలికగా సంగీతం నేర్చుకుంటాను. ఇలా నాకు సంగీతం మీద ఇష్టం పెరగటానికి కారణం అయిన నారాయణ స్వామి గారికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్
అని 'ఏనుగు లక్ష్మణ కవి' గారు అన్నారు. దాని అర్ధం నీచులు పని మొదలే పెట్టరు, మధ్యములు మధ్యలో వదిలేస్తారు, ధీరులు ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యాన్ని చేరేదాకా ఊరుకోరు అని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే..., సొంత డబ్బా కోసం. ఇది నేను రాస్తున్న వందో శీర్షిక. ఇంకో విశేషం ఏంటంటే ఇవాల్టితో నేను బ్లాగటం మొదలు పెట్టి మూడు సంవత్సరాలు అయ్యింది. 100 శీర్షికలు, 54000 పైగా వీక్షకులతో ముందుకు పోతున్నందుకు ఆనందంగా ఉంది. పై పద్యంలో చెప్పినట్టు నీచ మానవుడను ఐతే మాత్రం కాదు. మధ్యముడినో లేక ధీరుడినో తెలియాల్సి ఉంది. వంద రాసినందుకు ఆనందిస్తూ, ఇంకా రాయాలని ఆకాంక్షిస్తూ.......