"పెళ్ళంటే నూరేళ్ళ మంట.... " అని ఎవరు అన్నారో కానీ, అది అక్షర సత్యం. ఆ మంట జీవితానికి సరిపడా వంట చేసి పెడుతుంది, జీవితానికి సరిపోయే వెలుగుని ఇస్తుంది!!!!!
"మొత్తానికి కవిగాడి పెళ్లి కుదిరింది" అని స్నేహితులు అంటున్నారు. ఆ కవిగాడిని నేనే.., ఆ పెళ్ళీ నాకే (నేను కవిని ఎప్పుడు అయ్యానో..., ఇప్పుడు అనవసరం). ఇప్పటికీ చాలా రోజుల తరువాత నన్ను కలిసిన పెద్ద వాళ్ళు, "ఇప్పుడు ఏమి చదువుతున్నావు బాబు?" అని నన్ను అడుగుతూ ఉంటారు (దాని అర్ధం, నేను ప్రతి తరగతిలోనూ తప్పుతాను అని కాదు). అలాంటి నాకు, అప్పుడే పెళ్లి అనే సరికి ఆశ్చర్యం వేస్తున్నది. ఎంత ఆశ్చర్యం అంటే, సాక్షిలో చంద్ర బాబు గారినీ, ఈనాడులో జగన్ అన్నని పొగిడినంత ఆశ్చర్యంగా ఉందంటే నమ్మండి.
"పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ" అన్నారు ఆచార్య ఆత్రేయ గారు. ఎందుకు వేడి ఎక్కదు ? ఎండాకాలంలో పెళ్లి పెట్టుకుంటే. విజయవాడలో అందునా ఏప్రిల్ ఎండల్లో పెళ్లి చేసుకోవటం, నా జీవితంలో నేను చేయబోతున్న మొదటి సాహసం. ఏప్రిల్ 18, శుక్రవారం నాడు ముహూర్తం నిశ్చయించారు. ఐదు రోజుల పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి, మీరు సోమవారం నుండే సెలవలు పెట్టి మరీ రావాల్సిందిగా విజ్ఞప్తి.