Friday, February 14, 2014

ప్రేమికుల రోజు జల్సాగా

ఈ పోస్టు చదివే ముందు ఈ వీడియోను చూడండి . లేకపోతె అర్ధం కాకపోవచ్చు

స్నేహితుడు : ఇవాళ valentine's day తెలుసా
నేను : తెలుసు, అయితే ఏంటి?
స్నేహితుడు: చస్తున్నాను రా!!! ఇవాళ నా girl friend కి ఏదో ఒక gift ఇవ్వాలి, బండి మీద బయటకి తీసుకెళ్ళాలి
నేను : తీసుకెళ్ళు
స్నేహితుడు : నీకేమిరా, ఏ భజరంగ్ దళ్ వాళ్ళు చూస్తే spot లో పెళ్లి చేస్తారు. మా ప్రేమికుల కష్టాలు, బ్రహ్మచారివి నీకేమి తెలుసు రా?

నేను: కష్టాలా? ఏంట్రా అన్నావ్, అవి కష్టాల్రా? ఖరీదైన bike లో తిరుగుతూ, వెనక lover ని ఎక్కించుకొని హైదరాబాదులో పార్కులన్నీ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు పెట్టి ఒకళ్ళకొకళ్ళు gifts ఇచ్చుకొనే మీకు valentine's day కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయో, valentines day కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. ఇవాళ నువ్వు విను

ఒక అమ్మాయితో మాట్లాడాలంటేనే నాలుగు గంటలు ఆలోచించే మనుషులున్నారని నీకు తెలుసా?  -నాకు తెలుసు

సినిమాలంటే అబ్బాయిలతోనే వెళ్లాలని, అమ్మాయితో వెళ్ళటం అంటే అది పెళ్లి అయ్యాకే సాధ్యం అన్న విషయం నీకు తెలుసా? - నాకు తెలుసు

అమ్మాయిలతో తిరగాల్సిన వయస్సులో, సరైన అమ్మాయి దొరక్క యువకులు అల్లాడి పోతున్నారని నీకు తెలుసా?

పిల్ల కోసం మాట్రిమోనిల వైపు, పెళ్లి కోసం అమ్మానాన్నల వైపు చూసే అభాగ్యులు ఈ సమాజంలో, నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజంలో బ్రతికున్నారని తెలుసా నీకు ??

పెళ్లి చూపులు అయిపోయిన అరగంటకే అమ్మాయికి నువ్వు నచ్చలేదు అని చెప్తే, ఆ భాద ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా -- నేను అనుభవించాను

కంటికి కనిపించే ప్రతి అందమైన అమ్మాయి, భుజాలు పట్టుకొని దగ్గరకు లాగుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా?

మనల్ని ఒక అమ్మాయి ప్రేమించాలంటే మన దగ్గరున్న పేరు, డబ్బు సరిపోవు,  అమ్మాయిలకు దూరంగా వీటన్నింటినీ వదిలేసి దూరంగా వెళ్లి సన్యాసులలో కాలవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా?

కాషాయం నిన్ను ఎప్పుడైనా come on అన్నట్టు అనిపించిందా?

తాళి కట్టక పోయినా తేలికగా బ్రతకగలము అని నీకు ఎప్పుడైనా అనిపించిందా
నాకు అనిపించింది, అందుకే బ్రహ్మచారిగా ఉన్నాను

ఇక్కడ valentine day కష్టాల గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. నీకు లేదు, ఖచితంగా నీకు లేదు......

అమ్మాయి ప్రేమకు నోచుకోని, అభాగ్యులారా...... ఈ టపా మీకు అంకితం.... క్షమించాలి, మనకు అంకితం
మీరు కూడా ఈ కష్టాలు పడుంటే... మీ స్నేహితులతో ఈ పోస్టు పంచుకోండి......


Wednesday, February 12, 2014

సాఫ్ట్‌వేరులం మేము సాఫ్ట్‌వేరులం

చాలా రోజుల తర్వాత ఒక పాట రాశాను. అది కూడా మా సాఫ్ట్ వేరుల మీద రాయటం సంతోషంగా ఉంది. కాకపోతే పాట చాలా చిన్నదనే కొంచం భాదగా ఉంది. సినిమాలల్లో తరచూ మా వాళ్ళని కమేడియన్ గా, వెకిలిగా చూపిస్తూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. సినిమాలల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా మందికి మా సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ఎందుకో కడుపు మంట. మంట ఒకటే అయినా దానికి కారణాలు మాత్రం అనేకం.

కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు, ఎవడి వృత్తి వాడికి గొప్ప. ప్రతి దాంట్లో కష్ట పడితేనే ఫలితం ఉంటుంది. మాకేదో వారానికి ఐదు రోజులే పని, రెండు రోజులు సెలవలు అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అస్సలు ప్రపంచంలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు? మేము. రైల్ టికెట్ దగ్గర నుంచి, రాకెట్ల దాకా మా సాఫ్ట్ వేర్ వాడని ప్రదేశం ఏదీ లేదు. అలాంటి మమ్మల్ని ఎవడైనా ఏమైనా అంటే, కత్తులతో కాదురా, కోడ్ తో చంపేస్తాం.

సరే ఇక పాట విషయానికి వస్తే, గబ్బర్ సింగ్ సినిమాలో తాగుబోతుల మీద రాసిన పాటను మార్చి రాశాను. పాట రాశాను కదా అని సాఫ్టువేరోళ్ళం, తాగుబోతులు ఒకటేనా అని ఎవరైనా అన్నారో...... బాగుండదు చెప్తున్నా.... 


సాఫ్ట్ వేరులం మేము సాఫ్ట్ వేరులం 
any time మాకు మేమే గొప్ప వీరులం --- (2)

5 days work చేస్తాం, weekend enjoy చేస్తాం 
మళ్ళీ monday వచ్చేదాక malls అన్నీ దున్నేస్తాం 

సాఫ్ట్‌వేరంటే ఎందుకంత చులకన ? మీరు మాలా పని చేయలేరు గనకనా?
లైఫ్ ఇంత made easy ఎందునా? మేం సాఫ్ట్ వేర్ కోడ్ రాయటం వల్లన 

ప్రగతికింక సాఫ్ట్ వేరే నిచ్చనా, పోయేదేమి లేదు మీరు ఏడ్చినా గీడ్చినా  


వర్ధిల్లాలి వర్ధిల్లాలి సాఫ్ట్ వేర్ వర్ధిల్లాలి

త్వరలోనే ఈ పాటను సాఫ్ట్ వేర్ జాతి గీతంగా ప్రకటించాలని కోరుకుంటున్నాను 

Saturday, December 14, 2013

శునకానందం

చిన్నప్పుడు మా ఇంట్లో ఒక కుక్క ఉండేది. దాని పేరు 'రాజు'. కుక్క పేరు 'రాజు' ఏంటి అనుకుంటున్నారా? అడవికి రాజు ఎవరు? సింహం. గ్రామానికి సింహం ఎవరు? కుక్క. మరి కుక్కకి 'రాజు'అని పేరు పెడితే తప్పేంటి?? అది చచ్చిపోయి ఇవాల్టికి సరిగ్గా 20 సంవత్సరాలు అయ్యింది. 'రాజు' ఆల్సేషనూ కాదు, సెన్సేషనూ  కాదు. 24 గంటలూ ఇంటి బయట తిరుగుతూ ఉండేది. సాటి కుక్కలతో ఆడుకోవటానికి కూడా వెళ్ళేది కాదు.రోజూ మా బామ్మ, నాకు అన్నం పెట్టాక, దానికి కూడా అన్నం పెట్టేది.

కాకపోతే రాజులోని ప్రత్యేకత ఏంటంటే? రాత్రుళ్ళు మనకి తెలిసిన వాళ్ళు వస్తే బాగా అరిచేది, తెలియని వాళ్ళు వస్తే, అరవటం కాదు కదా, కనీసం మొరిగేది కూడా కాదు. నాకు ఊహ తెలిసే సరికే అది బాగా ముసలి కుక్క కావటంతో, కొన్నాళ్ళకు చనిపోయింది. ఇందాకేదో తమాషాగా అన్నాను తప్పించి, అది చనిపోయిన రోజు నిజానికి నాకు గుర్తు లేదు. ఎన్నని గుర్తుంచుకుంటాము? అస్సలే నా జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అందుకే అప్పుడప్పుడు రాసిన దాని గురించే మళ్ళీ మళ్ళీ రాస్తుంటాను.  నాకు మాత్రం కుక్కలంటే మహా భయం. అవి కరుస్తాయని ఒక కారణం అయితే, కరిస్తే పత్యం ఉండాల్సి రావటం ఇంకో కారణం. 

రెండేళ్ళ తరువాత, ఒక చిన్న కుక్క పిల్లని ఎవరో తీసుకు వచ్చి ఇచ్చారు, పెంచుకోమని. అది డాబర్ మాన్ జాతికి చెందినది అని చెప్పారు. దాని జాతిలోనే మాన్ అని ఉంది కదా అని మానవత్వంతో దానిని పెంచాలని నిర్ణయించుకున్నాను. నాలుగు రోజుల తరువాత తెలిసింది, నేను పెట్టే తిండి దానికి చాలదని, ఇంకా బలమైన ఆహారం పెట్టాలని, కుదిరితే మాంసాహారం పెట్టాలని. ఇంట్లో అందరం శాకాహారులం అయ్యుండి, అదొక్కటే మాంసాహారం ఎందుకని దానిని వేరెవరికో ఇచ్చేశాను.  ఆ తర్వాత, ఇప్పటి వరకు మళ్ళీ కుక్కల జోలికి వెళ్ళలేదు. 

నా స్నేహితుడొకడికి కుక్కలంటే ప్రాణం. ఇంట్లో నా అంత ఎత్తు కుక్కని పెంచుకుంటున్నాడు. నేను వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా, వెంటనే వచ్చి నాకటం మొదలుపెడుతుంది. నాకు మాత్రం చచ్చే చిరాకుగా, భయంగా ఉంటుంది. నా స్నేహితుడు మాత్రం దానిని బాగా ముద్దు చేస్తాడు. వాళ్ళ అన్యోన్యతను చూసి అప్పుడప్పుడు నేను కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది. దాని కల్ముషం లేని ప్రేమ చూస్తే (దూరం నుంచి) ముచ్చట వేసేది. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కలు చనిపోతే, ఎంతో విల విలలాడి పోయేవాడు. పాపం దిగులుతో రెండు రోజులు భోజనం కూడా చేసేవాడు కాదు. దాని అంత్యక్రియలు కూడా బాగా జరిపించే వాడు. కుక్క, కుక్క చావు చావకుండా చూసేవాడు. నిజమే, కొంత మంది మనుషులు కుక్క చావు చచ్చారు అంటారు కదా, అలానే ఆ కుక్క మనిషి చావు చచ్చింది అనమాట!!!

మా ఇంటి ప్రక్కన శ్రీను, చక్రి అని ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. చిన్నోడు శ్రీనుకి 4 ఏళ్ళు, పెద్దోడు చక్రికి 6 ఏళ్ళు. పిల్లలు గొడవ చేయటంతో వాళ్ళ నాన్న ఒక చిన్న కుక్క పిల్లని ఇంటికి తీసుకు వచ్చాడు. నాలుగు రోజులు బాగానే జరిగింది. ఐదో రోజు చిన్నోడు ఉన్నట్టుండి ఏడుపుకి లేచాడు. వాడిని ఓదార్చటం ఎవ్వరి వల్లా కాలేదు. స్పెషలిస్ట్ ని పిలుద్దాము అనుకొనే లోపు, "కుక్క కరిచింది" అని ఏడుస్తూ చెప్పాడు. అది ఊర కుక్క  అయినప్పటికీ ఊరికే కరవదు కదా అని అనుమానం వచ్చింది. "ఎందుకు కరిచింది రా?" అని గట్టిగా అడిగితే, "దాని తోక అటూ ఇటూ ఊగుతున్నదని, ఒక సారి లాగాను. మళ్ళీ తోక ఊపింది. ఈ సారి ఇంకా గట్టిగా లాగాను, కరిచింది" అని ఏడుస్తూ చెప్తుంటే మా అందరికీ నవ్వు ఆగలేదు. 

చివరగా, చిన్నప్పుడు ఒక పద్యం చదివినట్టు గుర్తు "కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి " అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సింహాసనం మీద కుక్కని కూర్చోబెడితే, కనీసం విశ్వాసంతో అయినా మంచిగా పని చేస్తుందేమో!!!