Saturday, August 17, 2013

విశ్వనాధం 2 (శృతి నీవు గతి నీవు)

శృతి నీవు గతి నీవు..... మళ్ళీ మొదలెట్టాడు రా బాబోయి అనుకోకండి. ఈ శృతి పుస్తకంలో శృతి కాదు. విశ్వనాథ్ గారి గురించి మనకు తెలిసిందే కదా...., ఏది ఒక పట్టానా ఒప్పుకోడు... ఏదో సినిమాలో వినట్టున్నది కదూ... సరే నేరుగా అస్సలు విషయానికి వచ్చేద్దాము. గత శీర్షికల్లో సాగర సంగమం గురించి ప్రస్తావించాను. ఆ సినిమా నృత్యాన్ని ఇతివృత్తముగా వచ్చిన సినిమా అయితే విశ్వనాథ్ గారు సంగీతాన్ని ఇతివృత్తముగా తీసిన మరొక గొప్ప సినిమా "స్వాతి కిరణం". ఆ మాటకొస్తే ఆయన తీసినవన్నీ గొప్ప సినిమాలే కదా!!

చినప్పుడే ఈ సినిమాను చూసినట్టు నాకు చాలా బలంగా గుర్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే నా జ్ఞాపక శక్తి మీద నాకున్న నమ్మకం కాదు. ఆ సినిమాలో మమ్ముట్టి గారి పేరు, నా పేరు అచ్చు తేడా లేకుండా ఒకటే గనుక . " ఆ అయితే ఏంటి?? " అని మీరు విసుక్కోవటంలో అస్సలు తప్పు లేదు. " సురేష్, నరేష్, వంశీ, శశీ,  వినయ్, అజయ్, విష్ణు, వేణు, రాము, రాజు " ఇలాంటి పేర్లు చాలా సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. అంతెందుకు నా తరగతిలో, ఉన్న 60 మందిలో ఇద్దరు రాజేషులు, ముగ్గురు 'కోటీ'లుఉండేవారు. (అరడజను మంది అనుషాలు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయం). మరి నా లాంటి అరుదైన పేర్లు గల వ్యక్తులు కూడా అరుదుగానే ఉంటారు. చాలా మందికి నా పేరు మొదటి సారి అర్ధం గాక రెండో సారి అడుగుతుంటారు. అలాంటిది నా పేరు ఇంకో మనిషికి కూడా ఉంది (అందులోనూ సినిమాలో పాత్రకి) అని తెలిసే సరికి, ఆ సినిమా వచ్చినపుడల్లా తప్పక చూసే వాడిని. కాకపొతే పూర్తి సినిమా చూసే అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదు (ఎప్పుడూ ఇవ్వలేదు).

నా సోది ఆపి సినిమాలోకి వస్తే, ఆ కధ అంతా మనకు తెలిసిందే. మనిషి 'అహం' వల్ల ఎంత దెబ్బ తింటాడో చూపించారు విశ్వనాథ్ గారు. నా పేరు పాత్రకి, అందునా పద్మశ్రీ ని సైతం నిరాకరించే పాత్రకి పెట్టారని ఆనందపడ్డా, కాని అది అభావార్ధక పాత్రకి (అర్ధం కాలేదు కదూ, నెగటివ్ క్యారెక్టర్ కి తెలుగు అర్ధం) పెట్టారని తెలిసి బాధ పడ్డాను. ఆ సినిమాలో మమ్ముట్టి, రాదిక గార్ల నటన గురించి చెప్పేదేముంది? ఇక ఆ కుర్రవాడు (అప్పట్లో) మంజునాథ్ కూడా  వారిరువురికి పోటీగా చేసాడు (విశ్వనాథ్ గారు చేయించారు). మొన్నీ మధ్యన ఏమైపోయాడా అనుకున్న ఈ కుర్రాడిని  మన టివి 9 వాళ్ళు వెతికి పట్టుకున్నారు కూడాను. 

ఇక సినిమా గురించి ముఖ్యంగా గుర్తొచ్చేది మామ మహదేవన్ గారి సంగీతం. తమన్న్ అంత గొప్పగా కాకపోయినా ఏదో బాగానే పాటలు స్వర పరిచారు.  వాణీ జయరామ్ గారికి జాతీయ ఉత్తమ గాయని పురస్కారం ఈ సినిమాలో పాడిన పాటకు దక్కింది. కాకపోతే నంది మాత్రం ఈ సినిమాకు దక్కలేదు (బహుశా అదే సంవత్సరం ఇంకా మంచి సినిమాలు వచ్చాయేమో, నేను చిన్నపిల్లాడిని కదా అప్పట్లో, అందుకని గుర్తులేదు). 

ఆ తరువాత చెప్పుకోవాల్సింది పాటల్లో సాహిత్యం. ఈ పాటల్లో వెన్నెల ఉన్నది, సుందరమూ ఉన్నది. కానీ నాకు అన్నింటికంటే ఎక్కువ నచ్చిన పాట, నారాయణ రెడ్డి గారు రాసిన "శృతి నీవు గతి నీవు" (శృతి అన్న పేరు ఉన్నందుకు కాదు). సినారె గారి గొప్పతనం, సరళమైన పదాలతో కూడా అద్భుతంగా రాస్తారు. అందుకు ఈ పాటే చక్కని ఉదాహరణ. మొదటి చరణంలో 

"నీ పదములొత్తిన పదము, ఈ పదము నిత్య కైవల్య పధము" 

నా కవి హృదయానికి తోచినంతలో పై వాఖ్యంలో మొదటి సారి వాడిని "పదము" అంటే అమ్మవారి కాలి పాదము, రెండో పదము అంటే పదాలు అని. అర్ధం కాలేదు కదా!! "తల్లీ! నీ పాదాలను నా పదాలతో పూజిస్తే, అదే మాకు మోక్ష ద్వారము" అని. ఇలా పాటంతా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రెండో చరణం చివర్లో 

"నీ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం"

అని చాలా చక్కగా ముగించారు.  ఇంత జ్ఞానము ఉంది కాబట్టే రెడ్డిగారికి జ్ఞాన పీఠం దక్కింది. మంచి వంకాయలు, ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ ఉండగానే మంచి గుత్తి వంకాయ కూర అవ్వదు. "ఎలా వండాలో, ఏవేవి ఎంతెంత వేయాలో తెలిసిన వంట వాడు ఉంటేనే మంచి కూర అవుతుంది. మనం కుడా లొట్టలేసుకొని తినచ్చు. సినిమాకి దర్శకుడు కుడా అలాంటివాడే (పోలిక బాగోలేక పోయినా సర్దుకోండి). ఇన్ని మంచి వాటిని కలిపి సినిమాగా మనకు అందించిన విశ్వనాథ్ గారికి మరొక్క సారి ధన్యవాదాలు తెలియజేస్తూ.... సెలవు...

( ఏదో సరదాకి రాశాను, తప్పులుంటే తెలియజేయిండి) 

Monday, July 15, 2013

ముఖం పుస్తకం 2

ముఖం పుస్తకం గురించి కొన్ని ముచ్చట్లు ఇది వరకు ఒక శీర్షికలో రాశాను, మరి కొన్ని ముచ్చట్లు ఈ శీర్షికలో ......

ముఖం పుస్తకం అనగానే ముందుగా మనకు ముఖ్యమైనది ముఖ చిత్రం.  ఇటీవల ముఖం పుస్తకంలో, అమ్మాయిలు ముఖం పుస్తకంలో వాడే ముఖ చిత్రాల మీద ఒక హాస్యభరితమైన చిత్రాన్ని చూశాను. దానిని చూసిన తరువాత నాకెందుకో దీని మీద ఒక టపా రాయాలనిపించింది. ఇప్పుడు ఆ ముఖ చిత్రాల గురించి కాసేపు ఏడుద్దాము.

ముందుగా మనిషి జీవితంలో పలు దశలు ఉన్నాయి. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృదాప్యం అని చినప్పుడు చదువుకున్నాము. అలానే ముఖం పుస్తకంలో కూడా వివిధ దశలు ఉన్నాయనమాట. అవేమిటో ఒకొక్కటి చూద్దాము.

బిటెక్ బాబులు : దాదాపు కాలేజీ కుర్రోళ్ళు అంతా సామాజిక న్యాయం కోసం తెగ పోరాడుతుంటారు. కాబట్టి వీళ్ళ ముఖ చిత్రం దాదాపు, వీళ్ళ సామాజిక వర్గ అగ్ర కధానాయికుడి చిత్రమే ఉంటుంది. ఇంజనీరింగు అయ్యి ఉద్యోగం వచ్చే దాక, బాబు చిత్రమే ఉంటుంది. ఉద్యోగం వచ్చాక కూడా చిత్రం మార్చలేదంటే, కుర్రాడికి ఇంకా కుర్ర తనం పోలేదని అర్ధం చేసుకోవాలి. ఇంకొంతమంది దేశ భక్తులు, తమ సామాజిక వర్గ రాజకీయ నాయకుడి చిత్రం పెట్టుకుంటారు. దేశ భక్తులు అని ఎందుకు అన్నానంటే, వీళ్ళకి దేశ భక్తీ మిక్కిలి ఎక్కువ. వాళ్ళ నాయకుడు పదవిలోకి వస్తే దేశం విపరీతంగా బాగు పడుతుందని బలంగా నమ్ముతారు గనుక వీళ్ళని దేశ భక్తులు అనటంలో తప్పే లేదు.

సాఫ్టోళ్ళు : అంటే నా బోటి వాళ్ళు అనమాట!! కెమేరా  దొరికితే చాలు, కళ్ళజోడు పెట్టి ఒక చిత్రం, తీసి ఇంకో చిత్రం, నిలుచొని ఒకటి, కూలబడి ఒకటి ఇలా రక రకాల భంగిమలలో ముఖ చిత్రాలు మారుస్తుంటారు. కొత్తగా ఉద్యోగం వచ్చాక, కొత్తాఫీసులో దిగిన చిత్రాలు పెడతారు. ముఖ్యంగా పైన అమ్మాయిలతో కలిసి దిగిన చిత్రాలు మాత్రం మర్చిపోకుండా ప్రచురిస్తారు. ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా, తప్పక చిత్రాలు దిగి, ముఖం పుస్తకంలోకి ఎగుమతి చేస్తారు. విదేశాలకు వెళ్తే ఆ సంగతి చెప్పనక్కరలేదు. అక్కడ పిచ్చి మొక్కల ప్రక్కన నిలబడి దిగినా బాగానే ఉంటుంది.

పెళ్లి కుమారులు / కొత్తగా పెళ్లి అయినోళ్ళు :  వీళ్ళ గురించి ఎక్కువ చెప్పినా బాగుండదు.  పెళ్లి చిత్రాలు పదే పదే మార్చి పెడుతుంటారు. కొందరైతే వాళ్ళ ప్రేమానురాగాలను ముఖం పుస్తకంలో చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్యోనతను చూసి ఒక్కోసారి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది కూడానూ. అప్పుడప్పుడు వైవాహిక జీవితం గురించి గొప్ప గొప్ప సామెతలన్నీ ప్రచురిస్తుంటారు.

పిల్లల తండ్రులు : పెళ్లి అయ్యాక, పిల్లలు పుట్టాక, కొన్ని రోజుల వరకు పిల్లల ఫొటోలు పెడతారు (అమ్మాయిలు చో చ్వీట్ అని వ్యాఖ్యలు రాయటం గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకోండి), మా అనిల్ అన్న దానికి ఇటీవల ఉదాహారణ. 

ఆ తరువాత : నాకు తెలిసి ఆ తరువాత ముఖం తుడుచుకొనే అంత ఖాళీ ఉండదు, ఇంకా  ముఖం పుస్తకం చూసేంత ఖాళీ ఎక్కడ ఉంటుంది??

గూడాచారులు : ప్రతి దానికి మినహాయింపు ఉన్నట్టు, ఇక్కడ కూడా మినహాయింపు బాపతు ఉన్నారు. ముఖం పుస్తకంలో ఉంటారు, కానీ ఫొటో పెట్టటానికి మాత్రం ఎందుకో భయపడుతుంటారు. ఒక్క లైక్ ఉండదు, ఒక్క షేర్ ఉండదు. కానీ జరిగేదంతా గమనిస్తూనే ఉంటారు. 

నేను గమనించినంతలో క్లుప్తంగా చెప్పాను. ఇవన్నీ ప్రక్కన పెడితే, ముఖం పుస్తకంలో ప్రచురించే వాటిల్లో భలే తమాషాలు ఉంటాయి. దాని మీద ఏకంగా ఇంకో శీర్షిక రాయచ్చు. ఉదాహరణకు మొన్న ఒక చిత్రం చూశాను. ఆంగ్లంలోఎధాతదంగా మీ కోసం, "I fear the day that technology will surpass our human interaction. The world will have a generation of idiots" అని ఐన్ స్టీన్ చెప్పారంట!!! ఆ పెద్ద మనిషి చెప్పింది నిజమే. మనుషుల మధ్య టెక్నాలజీ వల్ల దూరం పెరిగింది అని, మరి ఆ పోస్టు ప్రచురించిన వాడు చేసే పని కూడా అదే కదా!! 24 గంటలు ముఖం పుస్తకంలో ముఖం పెట్టి కూర్చున్నది కాక, మళ్ళీ ఐన్ స్టీన్ ఏదో అన్నాడని తెగ భాద పడిపోవటం దేనికి. ఆ విషయం తెలిసినప్పుడు, ముఖం పుస్తకం మూసుకొని నిద్రపోవచ్చు కదా !!!

Friday, June 28, 2013

తెలుగు పద్యమా? నా తలకాయా?

చిన్నప్పుడు పద్యం నేర్చుకోవటం అనేది చాలా చిరాకుగా ఉండేది. ఉన్న నాలుగు పాదాలని, నలభై సార్లు, అప్పటికీ కంఠస్తము కాకపోతే నాలుగు వందల సార్లు చదివి మరీ పిడి వేయాల్సి వచ్చేది. కొన్ని పద్యాలు ఇట్టే వచ్చేసేవి, కొన్ని ఆట్టే ఇబ్బంది పెట్టేవి. వేమన శతకం, సుమతీ శతకం, సుభాషిత రత్నాలు, ఇప్పుడు గుర్తు లేవు కానీ, అప్పట్లో బాగానే చదవాల్సి వచ్చింది.

అందరూ లెక్కల్లో వందకు వంద మార్కులు రావాలి, లెక్కలు వస్తేనే ఇంజనీర్ అవ్వగలం అని ఒకటికి పది సార్లు చెప్పే వారు. బడిలో చెప్పింది చాలక, ఇంటికి వచ్చాక సాయంత్రం పూట, ఇంకో గంట, కుదిరితే రెండు గంటలు మళ్ళీ లెక్కలు చెప్పించేవారు. అంతెందుకు, మీ జీవితం మొత్తంలో ఎంసెట్ ర్యాంకు ఎంతా? అని అడిగే వాళ్ళు ఉంటారు కానీ, ఎప్పుడైనా, ఎవ్వరైనా (తల్లి తండ్రులతో సహా), తెలుగులో ఎన్ని మార్కులు అని ఎప్పుడైనా అడిగారా? (నన్ను మాత్రం ఎవ్వరూ అడగలేదు)

ఇప్పుడు నాకో సంగతి గుర్తుకు వస్తున్నది. ఎనిమిదో తరగతిలో అనుకుంటా, ఒక ప్రక్క మా తెలుగు పంతులుగారు, కీ.శే. పాండు రంగారావు గారు, పాఠం చదువుతూ, నోట్స్ రాసుకోమని చెప్పారు. అంతా గురువుగారు చెప్పింది రాసుకుంటూ ఉంటే, నా స్నేహితుడు అజయ్, నేను, చెప్పింది రాయకుండా, "ఆంగ్ల పద వినోదం" ఆడుతూ కూర్చున్నాము. కాసేపటికే ఇద్దరం గురువుగారికి దొరికిపోయాము. "ఆంగ్ల పద వినోదం", అందునా తెలుగు తరగతిలో, మాస్టారుకి మండి పోయింది. ఇద్దరినీ ఇరగదీసి వదిలిపెట్టారు. 
 
ఆ తరువాత తరువాత, పద్యం అంటే ఇష్టం, పద్యం నేర్చుకోవాలి అన్న ఆతృత పెరిగాయి. క్లిష్ట సమాసాలలో ఉండే పద్యాలను గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే గొప్పగా ఉండేది. ఆ తరువాత గురువుగారు గణ విభజన చక్కగా నేర్పించారు. ఏదో రావాల్సిన మార్కుల కోసం చదివకుండా, సరదాగా చదవటంతో, ఎంతో కొంత ఇప్పటికీ గుర్తుంది. అస్సలు ఒక పద్యంలోని పాదానికి గణ విభజన చేసి, ఆ పద్యం ఏ చందస్సులో ఉందో తెలుసుకోవటమే గగనం అయ్యేది. అలాంటిది స్వంతంగా ఒక పద్యం రాయటం అంటే మాటలా? పద్యం రాయటమే అనుకుంటే, అవధానాలలో అప్పటికప్పుడు పద్యం చెప్పటమంటే......

యుట్యూబ్లో అవధానం చూస్తుంటే, అందులో చెప్పిన పద్యం అర్ధం చేసుకోవటానికే  అరగంట పట్టింది. అలాంటిది ఆశువుగా అర నిముషంలో అవధానులవారు పద్యం చెప్తుంటే, ఆశ్చర్యమేసింది. అలా చెప్పాలంటే ఎంత ధారణ కావాలి? ఎంత నేర్పు కావాలి? జావా ఏముంది, కుక్కని అమీర్ పెట్ లో అప్పగిస్తే, నాలుగు నెలల్లో నేర్పుతారు. అదే మనకు(నాకు) సరిగ్గా రావటం లేదు, ఇంక తెలుగేమి వస్తుంది, నా తలకాయి. నా లాంటి కోతులు కుక్క, ముక్క, చెక్క, రెక్క అని ప్రాసతో నాలుగు ముక్కలు రాసేసుకొని, మాకు మేమే అదేదో గొప్ప కవిత్వము అనుకొని మురిసి పోతుంటాము (ఇది ఎవ్వరినీ ఉద్దేశించి అన్న మాటలు కావు, కేవలం నా అభిప్రాయం మాత్రమే). 

ఇంకొన్ని రోజులు పోతే గొడవే ఉండదు. తెలుగు వచ్చిన వాడే ఉండడు., ఇంక అవధానం చేసే వారు ఉన్నా అది అర్ధం చేసుకునే వాళ్ళు అస్సలే ఉండరు. పొరపాటున ఎవరితో అయినా 'అవధానం' అని అంటే, "అవయవ దానమా? చచ్చాక చేస్తాములే పో" అని అంటారేమో. చాదస్తం అంటే అనండి కానీ, నాకు మళ్ళీ చందస్సు పూర్తిగా నేర్చుకోవాలని ఉంది. మొన్న మా పిన్నిగారి అమ్మాయికి ఛందస్సు నేర్పే భారాన్ని నా భుజాలపై వేశారు. నాకు వచ్చిందేదో, తనకు ఎక్కించటానికి ప్రయత్నించాను. ఖర్మ ఏంటంటే తెలుగు ఛందస్సుని ఆంగ్ల పదాలతో నేర్పాల్సి రావటం. తప్పు పిల్లలది కాదు. చక్కగా చెప్పేవాళ్ళు ఉంటే, ఆనందంగా నేర్చుకుంటారు. 

"శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు" అంటారు, అదేంటో నా పేరులో అనంతం అయితే ఉంది కానీ, నాకున్న దరిద్రాలకి ఒక్క ఉపాయం కూడా తట్టటంలేదు, క్షణం తీరిక దొరకటం లేదు. ఎలాగోలా మొదలు పెట్టాలి. నాకు నేర్పించాలి అని ఎవ్వరికైనా అనిపిస్తే నేర్పించగలరు. లేదు, ఇలా నేర్చుకోవచ్చు అని సలహాలు ఏమైనా ఉంటే తప్పక ఇవ్వగలరు. చచ్చే లోపు ఒక్క తెలుగు పద్యం రాయాలి అని బతుకుతూ........  సెలవు