Thursday, April 21, 2011

అంతర్జాలంలో అరవోళ్లు

"చదవేస్తే ఉన్న మతి పోయింది", ఈ సామెత ఎప్పుడోకప్పుడు మీరంతా వినే ఉంటారు. నాకు అస్సలు ఈ సామెతకు అర్ధం తెలియక, మా హరీష్ ని అడిగితే ఈ విధంగా చెప్పాడు. అనగనగా ఒక పల్లెటూరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడు ఏమి చదువుకోని మొద్దు. ఇంకొకడు బడికెళ్లే బుద్ధిమంతుడు. అదే ఊరిలో ఒక రహదారి ఉంది. పల్లెటూరిలో రహదారులు సాదారణంగా ఎందుకు వాడతారు? పొలాలకి బర్రెలను తోలటానికి అనేది మనకు తెల్సిన విషయమే. ఒక రోజు స్నేహితులిద్దరూ సాయంకాలం ఆ రహదారి వెంబడి వెళ్తున్నారు. పచ్చని పొలాల మధ్యన నల్లని రహదారి, చల్లని గాలి. ముందు మొద్దోడు, వెనుక చదువుకున్నవాడు వెళ్తున్నారు. బర్రెలు వెళ్ళే దారులలో సహజంగా ఏముంటాయి? పేడ ఉంటుంది, ఇది కూడా మనందరికీ తెల్సిన విషయమే. ముందు చూసుకోకుండా మన మొద్దోడు పేడని తొక్కాడు. వెంటనే " ఛీ, ఛీ వెధవ పేడ అని కాలును ఒక గట్టుకి రుద్దాడు", ముందుకు వెళ్ళాడు. ప్రపంచకప్ ఫైనల్లో సచిన్, సెహ్వాగ్ ఒకే రకం బంతికి అవుట్ అయినట్లు, వెనకనున్న మన మేధావి గారు కూడా అదే పేడ తొక్కారు. వెంటనే దానిని తాకి వాసన చూస్తుంటే ముక్కుకి అంటుకున్నది. "ఎందుకు రా అలా చేశావ్?" అని అడిగితే, "ఏదైనా విషయాని క్షుణ్ణంగా పరిశీలించాలి అని బడిలో చెప్పారు రా", అని సమాధానం ఇచ్చాడుట!!!! చదవేస్తే ఉన్న మతి పోవటం అంటే ఇదే మరి.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చదువుకోవద్దు అని చెప్పటం నా ఉద్దేశం కాదు. కొంత మందికి బుద్ధి లేదో, లేక నిజంగానే చదవేస్తే ఉన్న మతి పోయిందో తెలియదు. నాకు కొన్ని ఉత్తరాలు(mails) అంతర్జాలంలో( తెలుగులో దీనినే Internet అంటారు) వస్తూ ఉంటాయి. ఉదాహరణకు


Fwd: FW: Hope ITS NOT FAKE!!!!!!​!!!!!!!

Please do not take this for a junk letter. Bill Gates is sharing his fortune. If you ignore this you will repent later. Microsoft and AOL are now the largest Internet companies and in an effort to make sure that Internet Explorer remains the most widely used program, Microsoft and AOL are running an e-mail beta test.

When you forward this e-mail to friends, Microsoft can and will track it (if you are a Microsoft Windows user) for a two week time period.

For every person that you forward this e-mail to, Microsoft will pay you $245.00, for every person that you sent it to that forwards it on, Microsoft will pay you $243.00 and for every third person that receives it, you will be paid $241.00. Within two week! s, Microsoft will contact you for your address and then send you a cheque

బిల్ గేట్స్ కి మెదడు లేక, డబ్బులు ఎక్కువ అయ్యి, ఇలాంటివి అన్నీ చేస్తున్నాడా? ఇలా అయితే, ఇంకా ఈ ఉద్యోగాలు మానేసి 24 గంటలు ఇలాంటివి పంపిస్తే చాలు కదా అనే ఆలోచన వచ్చింది నాకు. ఇంకో ఉదాహరణ చూద్దాం.,

I know you don't like to forward mails. I am really sorry to bother you. If you have a heart and like to help a family, please forward this mail. Every time you forward this it will add 5 cents per email ID to AOL and they will deposit it into my bank account. This will help me save my husband

ఇలాంటి వాటిని పని గట్టుకోనో, లేక పని లేకనో తెలియదు కాని పంపుతూనే ఉంటారు. పోనీ ఏమి చదువుకోని వాళ్లనుకుంటే, b.tech, m.tech చదివిన మహానుభావులు ఎక్కువగా ఇవి పంపిస్తున్నారు. ఇలాంటివి పంపిస్తే, పంపించే వాళ్ళకి నీరసం, చదివే వాళ్ళకి చికాకు తప్ప ఏమి రావు అని వీళ్లకి ఎప్పటికి అర్ధం అవుతుందో?

ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకొంత మంది ఒక బాబా చిత్రం పెట్టి, "ఇది షిర్డీ నుండి వచ్చిన ఉత్తరం, ఇది పది మందికి పంపితే మీ పెళ్లి అవుతుంది, పంపకుండా వదిలేస్తే పిండాకూడు అవుతుంది" అని పంపిస్తారు. ఉదాహరణకు

Please send 10 copies and see what happens in 4 days. This chain letter comes from SHIRDI . You will definitely receive some good news in 48 hours!!!! Otherwise 20 years of bad luck. this is very serious.

నిన్ననే మన అమీర్పేట్ దుకాణంలోకి షిర్డీ సాయి బాబా వచ్చి కొత్త Sony Vaio 15" 1' లాప్ టాప్ కొనుక్కొని వెళ్ళాడు. దానితో ఫోటో దిగి, "భక్తులారా, ఈ మెయిల్ అందరికి పంపండి, శుభం కలుగుతుంది " అని చెప్పాడు. పని,పాట లేకపోతే నాలాగా శీర్షికలు రాసుకోవాలిగానీ, ఈ ఉత్తరాలన్నీ పంపటమేంటో!! ఇలా పంపి పంపి, డబ్బులు రాక, కాలం కలిసి రాక, ఇంకా ఇలాంటివి పంపుతూ ఉండే వాళ్లకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వీలుంటే ఒక ఓదార్పు యాత్ర చేసి వీళ్ళందరికీ పెరుగన్నం పెట్టాలన్న ఆలోచన కూడా నాకు ఉంది. ఇలా పంపే వాళ్ళందరిని నా శీర్షిక చదవమని చెప్పండి. అప్పుడైనా కాస్త బుద్ది వస్తుందేమో??? ఒక వేళ నిజంగా అలా ఉత్తరాలు పంపి మీకు డబ్బులు వచ్చుంటే, నన్ను పెద్ద మనసుతో క్షమించి, ఆ వివరాలు నాకు చెప్తే, నేను ఈ ఉద్యోగం మానేసి, ఆ ఉత్తరాలు పంపే వ్యాపారం పెట్టుకుంటా..,


ముఖ్య గమనిక : శీర్షిక గురించి ఇరవై మందికి చెపితే మీరు అనుకున్నది ఇరవై నెలల్లో జరుగుతుంది, నిర్లక్ష్యం చేసి మీరు చెప్పటం మరచి పోయారా ఇరవై రోజుల్లో జరుగుతుంది. జాగ్రత్త సుమీ !!! :)

Monday, April 18, 2011

ఐదో పాట.,

పాట ఆమిర్ ఖాన్ నటించిన 'ఫనా' చిత్రంలోని "చాంద్ శిఫారీష్"
పల్లవి||

మనసు మాయ చేసే మంత్రం ప్రేమ.,
వయసు వేడెక్కించే వ్యవహారం ప్రేమ...,
ఓ..... నా లోనే ఉంది నాకే తెలియంది, ప్రేమ ఏమో మాయ?
మతి పోగొడుతుంది, మాయేదో చేసింది, ఏమ్చేయను అయ్యో రామా!!
వయసు రుసరుస వరసేన్దమ్మ, వయ్యారి వివరించమ్మా !!!.......||నా లోనే||

చరణం
||

మనసులో ఉంది చెవినెయ్యాలి, మాటరాకున్నదే,
కళ్లెదుటే ఉంది కాంచన శిల్పం, కదలనీకున్నదే,
ఎందుకొచ్చింది నానా హైరానా, ఏకమవ్వాలనా?........||నా లోనే||

చరణం
||
సంపంగి సొగసున్న చిన్నదానా, సరిగమలే నేర్పించనా,
నెమలి నడుమున్న నెరజానా, నీ తోడు నేనవ్వనా,
అందుకుంట నీ అధరామృతమే , అందాల అప్సరా !!!........||నా లోనే||

Tuesday, April 5, 2011

శ్రీఖర నామ సంవత్సర శుభాకాంక్షలు

      ముందుగా అందరికి శ్రీఖరనామ సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన ఏడాది ఎన్నో మధుర జ్ఞాపకాలు నింపింది. పోయిన ఏడాది ఉగాది సమయానికి నా m.tech మొదటి సంవత్సర పరీక్షలు మొదలు  అయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రాస్తున్న పరీక్షలు. b.tech నాలుగు సంవత్సరాలు లిఖిత, అంకమ్మరావు ఇద్దరు పాపం, నాకు ఏ అనుమానం వచ్చినాగానీ  పరీక్ష రాసేటప్పుడే చెప్పేవారు. ఇప్పుడు పరీక్ష మధ్యలో ఏది అయినా గుర్తుకు రాక పొతే ఎవరు చూపిస్తారు? అని చాలా భయమేసింది. కాని వికృతి నామ సంవత్సరం నాకు మహా బాగా కలిసి వచ్చింది. పరీక్షలు అన్నీ ఎవరి దగ్గరా చూడకుండానే, చాలా బాగా రాసేశాను. ఇలా పరీక్షలు అయిపోయాయో లేదో, వెంటనే ఒకప్పుడు లింగరాజు గారి సంస్థ నుండి పిలుపు వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకే  మా శ్రీరామాచంద్ర ప్రపంచ ప్రసిద్ది పొందాడు. ఇంకా ఇదే ఏడాదిలో హరీష్, మల్లి మామ ఇద్దరూ  బెంగుళూరులో స్థిరపడ్డారు. రాసిన పరీక్షలు అన్నింటిలో ఉత్తీర్ణత సాధించాను. సంవత్సరం ఆసాంతం హాయిగా గడిచి పోయింది. సరిగ్గా ఏడాది ఇంకో రెండు రోజులలో ముగుస్తుందనంగా మన వాళ్ళు క్రికెట్లో జగజ్జేతలుగా ఆవిర్భవించారు. 

       ఇక రేపు ఉగాది పరవదినం అనగా ముందు రోజు రాత్రి., ఆ ఏడాది జరిగిన సంఘటనలు అన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. రాబోయే సంవత్సరం ఎలా ఉండాలో అని రకరకాల ఊహలు నా మదిలో మెదిలాయి. అలా అలొచిస్తూ అలొచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. ఉగాది రోజు, ఉదయం ఆరు గంటలకు ముందే లేచాను.  అప్పటికే నా ఫోనులో అరడజను సంక్షిప్త సందేశాలు ఉండటాన్ని గమనించాను. నా మిత్రులు నా మీద ప్రేమతో అర్ధరాత్రే నాకు సందేశాలు పంపారు. షేక్ స్ఫేరే కి కూడా అర్ధం కాని ఆంగ్లంలో నాకు చక్కగా ఉగాది శుభాకాంక్షలు పంపారు. అచ్చ తెలుగు పండుగ, అందున సంవత్సరాది నాడు, ఆంగ్లంలో, అది కూడా అర్ధరాత్రి సందేశాలు చూసి నాకు చిరాకేసింది. కుక్కతోక వంకర, ఎలుకతోక నలుపు, తెలుగు సినిమా కధలు, వీళ్ల బుద్ధి మారవని నాలో నేనే తిట్టుకున్నాను. 

      ప్రొద్దున్నే నల్లకుంటలోని శంకరుని ఆలయానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మనసు చాల ప్రశాంతంగా ఉంటుంది. పండగ రోజు అందరికి దేవుడు గుర్తొస్తాడు కాబట్టి అందమైన అమ్మాయిలు  ఇంకా అందంగా తయారు అయ్యి గుడికి వచ్చారు. వాళ్ళని చూస్తే, పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఇంకో పక్క అక్కడ అర్చక స్వాములను చూస్తే నేను కూడా సన్యాసం తీసుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో రెండూ కుదరవు అని బాదేసింది. అక్కడ తీర్ధ ప్రసాదాలు తీసుకుని, ప్రక్కనే ఉన్న మా అన్నగారింటికి వెళ్ళాను. సాయంత్రం దాకా  మా  అన్నగారి అబ్బాయి, అభిరాముతో ఆడుతూ సమయమే తెలియకుండా పోయింది. మొత్తానికి వికృతి  నామ సంవత్సరంలాగానే, ఖరనామ సంవత్సరంకుడా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను.    

Saturday, April 2, 2011

మామిడి టెంక

అనగనగ ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. రాజుకి ఎంత మంది కొడుకులనేది మనకు అనవసరం., అ రాజుగారికి ఒక రోజు మామిడికాయ తినాలనిపించింది. నా లాంటి గొప్ప మహర్షి ఒకతను ఆయన రాజ్యంలో ఉండే వాడు. రాజుగారు వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాడు. తన కోరికను చెప్పాడు. ఆ మహర్షి తానూ తినగా మిగిలిన మామిడి టెంకను రాజుకి ఇస్తూ "నాయనా! ఈ మామిడి టెంకను ఒక వారం రోజులు బాగా ఎండ పెట్టి, తర్వాత దానిని ఈశాన్యం దిశగా, బావికి దగ్గరగా నాటు" అని చెప్పాడు.రాజుగారు మామిడి టెంకను కళ్లకు అద్దుకుని, "మహాప్రసాదం స్వామి"అని చెప్పి తన ఉద్యానవనానికి చేరాడు. కాని రాజుకి మాత్రం మామిడి కాయ మీద ప్రేమ సచిన్ చేసిన పరుగులు పెరిగినట్టు పెరిగింది. అందుకని ఆ టెంక తొందరగా ఎండాలని, పొయ్యి మీద పెట్టి బాగా వేయించాడు. అది పూర్తిగా ఎండిపోయిన దాక వేయించాడు. ఆ తరువాత బావి పక్కన చక్కగా నాటాడు. కాని ఏమి లాభం? అది ఎంతకీ మొలకెత్తలేదు. అలా పొయ్యి మీద వేయిస్తే భావిలో నాటినా మొలకెత్తదు.

చిన్నతనంలో మా కశ్యాపురంలో, ఎండాకాలం, రాత్రి ఏడింటికే అన్నం తినేసి, ఆరు బయట దోమతెరలో పడుకుని, ఆకాశంలోని చుక్కలు చూస్తున్నప్పుడు,మా బామ్మకి ఒక వైపునేను, ఇంకోవైపు చెల్లి హయిగా పడుకుని ఉన్నప్పుడు ఆమె చెప్పిన కధ. ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే., మా ఊర్లో కొత్తగా ఒక బడి పెట్టారు. ఒకటో తరగతి నుంచే ఐ.ఐ.టి చెప్తారంట! మా శ్రీనివాసుకి ఐదేళ్ళు నిండలేదు. వాడిని ఆ బడిలో వేశారు. ఆంగ్లం ఎంత బాగా మాట్లాడుతాడు అనుకుంటున్నారు? ఎ ఫర్ ఆపిల్ నుంచి నాకు రాని ఆంగ్లం కూడా నేర్పించేశారు. పరీక్షలకి ఒక వారం ముందే హాల్ టికెట్ కూడా ఇచ్చారు. ఒకటో తరగతికి హాల్టికెట్???

పరీక్షలు అయిపోయిన తరువాత మార్కులు కూడా ఎనభై శాతానికి పైగా వచ్చాయి. అయినా వాడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే "ఆ రాజేషుగాడికి నాకన్నాఎక్కువ మార్కులు వచ్చాయి, అన్నా" అని చెప్పాడు. నాకు అప్పుడు మా బామ్మ చెప్పిన కధ గుర్తొచింది. పిల్లలని చూస్తె నాకు ఆ మామిడి టెంక గుర్తొచింది. గొప్ప చదువులు చదవాలంటే చిన్నపాటి నుంచే మంచి పునాది ఉండాలని తల్లి తండ్రుల తాపత్రయం సహజం. కాని, మరీ ఇలా ఒకటో తరగతి నుంచే రుద్దితే, పెద్దైతే నా లాగా శీర్షికలు రాసుకోటానికి తప్ప, ఎందుకూ పనికి రారని నా అభిప్రాయం.

ఇలాంటి కష్టాలు చిన్నప్పటి సంది నాకూ అలవాటే. మా చుట్టాల పిల్లలందరూ పని ,పాటా లేనట్టు తెగ చదివి, మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు. ఇక ఇంట్లో " వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయి రెండింటికే లేచి చదువుతుంది," ఇలా తిట్టని రోజంటూ లేదు.

నా ప్రాణం తీయటానికే అన్నట్టు, నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. అమాయకపు మొహం ఒకటి వేసుకుని, నాతోపాటే చదువు వెలగబెట్టేవాడు. ఎత్తిన తల దించకుండా, పుస్తకం తప్ప, ఇంకో ప్రపంచం లేదు అనట్టు ఉండేవాడు. మా అమ్మ,నాన్న నన్ను చూడటానికి ఒంగోలు వచినప్పుడల్లా "వాడిని చూసి చదవరా!!" అని ఎంతో పుత్రోత్సాహం ప్రదర్శించే వాళ్ళు. నేను మాత్రం "ఈ పెద్దోళ్ళున్నారే, మా పిల్లలకి ఏమి కావాలో అస్సలు అర్ధం చేసుకోరు" అని ఉదయకిరణ్ లాగా బాద పడే వాడిని. ఇంకో పక్క, నాకన్నా వాడికి ఎక్కువ మర్కులోస్తాయని మా పద్దు పిన్ని, రావని మా మల్లిగాడు పందాలు కాసుకున్నారు. కలియుగంలో న్యాయం ఒంటికాలు మీదనే నడుస్తుంది కాబట్టి, చివరకి వాడికే ఎక్కువ మార్కులు వచ్చాయ్. నా జైత్రయాత్ర కొనసాగిస్తూ ఎంసెట్లో వేలల్లో వచ్చిన ర్యాంకును, ఎ బ్యాంకులో వేయాలో అర్ధం కాలేదు., అంత ఎక్కువ చదివాడు కాబట్టే పాపం వాడికి ఒంగోలు లో ఇంజనీరింగ్ చదివే అవకాసం రాలేదు.

ఇక ఇంజనీరింగ్ విషయానికి వస్తే., మొదటి సంవత్సరం రెండు పరీక్షలు తప్పాను. ఇక నా పరిస్తితి చూడాలీ., మురికి కాలువలోనుంచి మూసి నదిలో పడట్టు అయింది. అప్పుడు అర్ధం అయింది నాకు, కత్తులు లేకుండా యుద్దానికి, కాపీలు లేకుండా పరీక్షలకి వెళ్లకూడదు అని. ఎలాగోలా మొదటి మూడు సంవత్సరాలు పూర్తి చేశాను. అదేంటో నాకు తప్ప ప్రతి కుక్కకి ఏదో ఒక ఉద్యోగం వచ్చేది. కొంతమందికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చాయి. నాకు ఉద్యోగం రానందుకు ఒక బాధ అయితే, " వాడికి విప్రోలో వచ్చిందట కదరా" అని చుట్టుపక్కల వాళ్ళ ఏడుపు., ఏదో దేవుడు దయవల్ల, చచ్చిచెడి  రాజుగారి కార్యాలయంలో నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఈ విదంగా చెప్పుకుంటూ పొతే ఒకటా? రెండా? ఎన్నో ఎదురు దెబ్బలు తింటే కానీ., ఇంజనీరింగ్ పూర్తి అవ్వలేదు.