Saturday, April 2, 2011

మామిడి టెంక

అనగనగ ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. రాజుకి ఎంత మంది కొడుకులనేది మనకు అనవసరం., అ రాజుగారికి ఒక రోజు మామిడికాయ తినాలనిపించింది. నా లాంటి గొప్ప మహర్షి ఒకతను ఆయన రాజ్యంలో ఉండే వాడు. రాజుగారు వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాడు. తన కోరికను చెప్పాడు. ఆ మహర్షి తానూ తినగా మిగిలిన మామిడి టెంకను రాజుకి ఇస్తూ "నాయనా! ఈ మామిడి టెంకను ఒక వారం రోజులు బాగా ఎండ పెట్టి, తర్వాత దానిని ఈశాన్యం దిశగా, బావికి దగ్గరగా నాటు" అని చెప్పాడు.రాజుగారు మామిడి టెంకను కళ్లకు అద్దుకుని, "మహాప్రసాదం స్వామి"అని చెప్పి తన ఉద్యానవనానికి చేరాడు. కాని రాజుకి మాత్రం మామిడి కాయ మీద ప్రేమ సచిన్ చేసిన పరుగులు పెరిగినట్టు పెరిగింది. అందుకని ఆ టెంక తొందరగా ఎండాలని, పొయ్యి మీద పెట్టి బాగా వేయించాడు. అది పూర్తిగా ఎండిపోయిన దాక వేయించాడు. ఆ తరువాత బావి పక్కన చక్కగా నాటాడు. కాని ఏమి లాభం? అది ఎంతకీ మొలకెత్తలేదు. అలా పొయ్యి మీద వేయిస్తే భావిలో నాటినా మొలకెత్తదు.

చిన్నతనంలో మా కశ్యాపురంలో, ఎండాకాలం, రాత్రి ఏడింటికే అన్నం తినేసి, ఆరు బయట దోమతెరలో పడుకుని, ఆకాశంలోని చుక్కలు చూస్తున్నప్పుడు,మా బామ్మకి ఒక వైపునేను, ఇంకోవైపు చెల్లి హయిగా పడుకుని ఉన్నప్పుడు ఆమె చెప్పిన కధ. ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే., మా ఊర్లో కొత్తగా ఒక బడి పెట్టారు. ఒకటో తరగతి నుంచే ఐ.ఐ.టి చెప్తారంట! మా శ్రీనివాసుకి ఐదేళ్ళు నిండలేదు. వాడిని ఆ బడిలో వేశారు. ఆంగ్లం ఎంత బాగా మాట్లాడుతాడు అనుకుంటున్నారు? ఎ ఫర్ ఆపిల్ నుంచి నాకు రాని ఆంగ్లం కూడా నేర్పించేశారు. పరీక్షలకి ఒక వారం ముందే హాల్ టికెట్ కూడా ఇచ్చారు. ఒకటో తరగతికి హాల్టికెట్???

పరీక్షలు అయిపోయిన తరువాత మార్కులు కూడా ఎనభై శాతానికి పైగా వచ్చాయి. అయినా వాడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే "ఆ రాజేషుగాడికి నాకన్నాఎక్కువ మార్కులు వచ్చాయి, అన్నా" అని చెప్పాడు. నాకు అప్పుడు మా బామ్మ చెప్పిన కధ గుర్తొచింది. పిల్లలని చూస్తె నాకు ఆ మామిడి టెంక గుర్తొచింది. గొప్ప చదువులు చదవాలంటే చిన్నపాటి నుంచే మంచి పునాది ఉండాలని తల్లి తండ్రుల తాపత్రయం సహజం. కాని, మరీ ఇలా ఒకటో తరగతి నుంచే రుద్దితే, పెద్దైతే నా లాగా శీర్షికలు రాసుకోటానికి తప్ప, ఎందుకూ పనికి రారని నా అభిప్రాయం.

ఇలాంటి కష్టాలు చిన్నప్పటి సంది నాకూ అలవాటే. మా చుట్టాల పిల్లలందరూ పని ,పాటా లేనట్టు తెగ చదివి, మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు. ఇక ఇంట్లో " వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయి రెండింటికే లేచి చదువుతుంది," ఇలా తిట్టని రోజంటూ లేదు.

నా ప్రాణం తీయటానికే అన్నట్టు, నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. అమాయకపు మొహం ఒకటి వేసుకుని, నాతోపాటే చదువు వెలగబెట్టేవాడు. ఎత్తిన తల దించకుండా, పుస్తకం తప్ప, ఇంకో ప్రపంచం లేదు అనట్టు ఉండేవాడు. మా అమ్మ,నాన్న నన్ను చూడటానికి ఒంగోలు వచినప్పుడల్లా "వాడిని చూసి చదవరా!!" అని ఎంతో పుత్రోత్సాహం ప్రదర్శించే వాళ్ళు. నేను మాత్రం "ఈ పెద్దోళ్ళున్నారే, మా పిల్లలకి ఏమి కావాలో అస్సలు అర్ధం చేసుకోరు" అని ఉదయకిరణ్ లాగా బాద పడే వాడిని. ఇంకో పక్క, నాకన్నా వాడికి ఎక్కువ మర్కులోస్తాయని మా పద్దు పిన్ని, రావని మా మల్లిగాడు పందాలు కాసుకున్నారు. కలియుగంలో న్యాయం ఒంటికాలు మీదనే నడుస్తుంది కాబట్టి, చివరకి వాడికే ఎక్కువ మార్కులు వచ్చాయ్. నా జైత్రయాత్ర కొనసాగిస్తూ ఎంసెట్లో వేలల్లో వచ్చిన ర్యాంకును, ఎ బ్యాంకులో వేయాలో అర్ధం కాలేదు., అంత ఎక్కువ చదివాడు కాబట్టే పాపం వాడికి ఒంగోలు లో ఇంజనీరింగ్ చదివే అవకాసం రాలేదు.

ఇక ఇంజనీరింగ్ విషయానికి వస్తే., మొదటి సంవత్సరం రెండు పరీక్షలు తప్పాను. ఇక నా పరిస్తితి చూడాలీ., మురికి కాలువలోనుంచి మూసి నదిలో పడట్టు అయింది. అప్పుడు అర్ధం అయింది నాకు, కత్తులు లేకుండా యుద్దానికి, కాపీలు లేకుండా పరీక్షలకి వెళ్లకూడదు అని. ఎలాగోలా మొదటి మూడు సంవత్సరాలు పూర్తి చేశాను. అదేంటో నాకు తప్ప ప్రతి కుక్కకి ఏదో ఒక ఉద్యోగం వచ్చేది. కొంతమందికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చాయి. నాకు ఉద్యోగం రానందుకు ఒక బాధ అయితే, " వాడికి విప్రోలో వచ్చిందట కదరా" అని చుట్టుపక్కల వాళ్ళ ఏడుపు., ఏదో దేవుడు దయవల్ల, చచ్చిచెడి  రాజుగారి కార్యాలయంలో నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఈ విదంగా చెప్పుకుంటూ పొతే ఒకటా? రెండా? ఎన్నో ఎదురు దెబ్బలు తింటే కానీ., ఇంజనీరింగ్ పూర్తి అవ్వలేదు.    

No comments:

Post a Comment