Sunday, November 27, 2011

పెళ్లాలు అంటే????

మా కార్యాలయంలో ఒక సోదరుడు, నాలుగు నెలల క్రితం, పొరపాటున పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు లాక్కో లేక, పీక్కో లేక అల్లాడుతున్నాడు. రోజు ఉదయాన్నే ఏడింటికి కార్యాలయానికి వచ్చి, పని లేకపోయినా, ఏ అర్ధరాత్రో కాని ఇంటికి చేరటం లేదు. అదేంటని అడిగితే, "కాలం కలిసి రాక, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే, అప్పుడు నీకే అర్ధం అవుతుందిలే తమ్ముడు" అని చెప్తుంటాడు.

ఒక రోజు ముఖం నీరసంగా, రోజిటికంటే చిరాకుగా, దిగాలుగా కార్యాలయానికి వచ్చాడు. సరే మనిషి బాగా దిగాలుగా ఉన్నాడు కదా, కాస్త ఊరట కలిగిద్దాం అని, కాఫీ తాగిద్దామని తీసుకెళ్ళాను. కూర్చొని కాఫీ చేతులో పట్టుకుని, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏంటి సంగతి అని అడిగితే, పెళ్లి చేసుకోవటం ఎంత పొరపాటో, చేసుకుంటే ఎంత బాదపడాల్సి వస్తుందో చెప్తూ, పనిలో పని, నన్ను మాత్రం పెళ్లి చేసుకోవద్దు అని సలహా ఇచ్చాడు.

ఇంతలో ఆ ప్రక్కనే ఉన్న టి.విలో ఒక పాట చూసి, అతని ముఖం ఎర్రగా అయ్యింది. ఆవేశంతో ఊగిపోయాడు. అది గోపీచంద్, ప్రియమణి కలిసి నటించిన "గోలీమార్" అనే హిందీ పేరుతో వచ్చిన తెలుగు చలన చిత్రం. "మగాళ్ళు అంటె మాయగాళ్లె, ప్రేమంటె ఏమిటో తెలీదే" అనే పాట వింటుంటే, అతనున్న పరిస్థితిలో ఆ మాత్రం కోపం రావటం సహజం. ఆ పాట రాసినతని దగ్గరి నుంచి, ఆ చలన చిత్రం చూసిన వాళ్ళందరిని తిట్టటం మొదలు పెట్టాడు. బావ కళ్ళల్లో ఆనందం కోసం హత్యలు చేస్తున్న ఈ రోజులలో, నాతో పాటు పని చేసే, ఆ అన్న కళ్ళల్లో ఆనందం కోసం ఏదైనా చేయాలి అనిపించి, అదే పాటను మార్చి రాశాను. అది ఇప్పుడు మీ ముందుకు తీసుకు వస్తున్నాను.

అతి ముఖ్య మనవి: ఏదో సరదాకి ఈ పాట రాశాను. అస్సలు నేను రాసినదానిలో ఎంత నిజం ఉందో తెలియదు, ఎందుకంటే నాకింకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఈ మాత్రం దానికి, మహిళా సంఘాలని, గృహ హింస చట్టాలని, టివి9ని, దయ చేసి ఇందులోకి లాగకండి.

పల్లవి||
పెళ్లాలు అంటే పిశాచాలే, మంచి అంటే ఏమిటో తెలీదే,
బుఱ్ఱంత భోంచేస్తూ ఉంటారే!! వీళ్ళు కూడా ఇంతే!!
ఆడాళ్ళ ధ్యాసంత సొమ్ము మీదే, గమ్ముగా గంటైన ఉండరంతే,
ఆడాళ్ళ మెదడు ఆవగింజంతే, వీళ్ళు కూడా ఇంతే .....

చరణం||
కాస్తంత ప్రశాంతత కోరుకుంటాం, కూసంత టైమిస్తే పారి పోతాం,
పెళ్ళాల పోరేంటో, పిచ్చేంటో, మాటేంటో, నడకేంటో, ఏమో ఏంటో
మీకు నచ్చినట్టు మేము నడిచినా, మా జీతమంతా పోసి ఇచ్చినా ఇదింతే., వీళ్ళు కూడా ఇంతే
||పల్లవి||
చరణం||
చెప్పిన చోటుకల్లా తీసుకెళ్తూ ఉంటాం. అడ్డమైనవన్నీ కొనిస్తూ ఉంటాం.
పెళ్ళాల సుత్తేంటో, నస్సేంటొ, కస్సేంటో, బుస్సేంటో, ఏమో ఏంటో
మీతో ఏడడుగులు వేసినా, ఎన్ని వేల సార్లు అలా వేసినా, మీరింతే

మళ్లీ చెప్తున్నాను, మహిళా సంఘాలని, గృహ హింస చట్టాలని, టివి9ని, దయ చేసి ఇందులోకి లాగకండి.

Friday, November 18, 2011

జీవిత సారం 4 ("ప" గుణింతం)

యువనేత మీద రాసిన శీర్షిక చదివి, ఒక అజ్ఞాత, యువనేత వీరాభిమాని నాకో వాఖ్య పంపాడు. "నీకెందుకురా రాజకీయాల గురించి, ఎప్పటి లాగా నీ డబ్బా కొట్టుకో, మా యువనేత గురించి కాదు" అని పంపాడు. నేను రాసిన దానికి, పాపం అతని మనోభావాలు దెబ్బ తినట్టు ఉన్నాయి. నా శీర్షికలలో నా డబ్బా కొట్టుకోక, ఊర్లో వాళ్ళందరినీ పొగడటానికి, సన్మానం చేయటానికి ఇదేమన్నా రవీంద్ర భారతినా?? ఏదైతేనేం, ఆ అజ్ఞాత యువనేత అభిమానికి నా ప్రగాడ ఓదార్పు తెలియజేస్తూ ఈ శీర్షిక మొదలు పెడుతున్నాను.

దరిద్రపు చలన చిత్రాలు, అని మనం అప్పుడప్పుడు తిట్టుకుంటాం కానీ, వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకి, కధానాయిక పాపని పట్ట పగలు, నడి రోడ్డులో, నలుగురు ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు మన కధానాయకుడు అమెరికాలో ఉన్నపటికీ, అరనిముషంలో అద్దంకి వచ్చి కధానాయిక పాపని కాపాడి, గీతలో(లైన్లో) పెడతాడు. కధానాయకుడు వచ్చి కాపాడతాడని మనకి కూడా తెలుసు. అయినప్పటికీ పిచ్చి ముఖాలు వేసుకుని మన కధానాయకుడి కోసం ఎదురు చూస్తామా! లేదా! 

జీవితం కూడా అంతే. కొన్ని జరగక ఆగవని మనకు తెలుసు, అవి జరిగేదాకా మనం చూస్తూ ఉంటాము. కొన్ని జరగవని తెలుసు, అయినా ప్రయత్నిస్తాం. కధానాయకుడు కాపాడతాడని తెలుసు, కానీ ఎలా కాపాడతాడు అనేది మనం చూసే అంశం. అలానే మనం పెరిగి, పెద్దయ్యి, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, పెంచి ., ఏదో ఒక రోజుకి పోతాం.  అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు, అని మనకు తెలుసు. కానీ ఎలా పుట్టి ఎలా పెరిగి ఎలా చచ్చాం అనేది ముఖ్యం. అందుకే రామానంద స్వామి ఏమంటాడంటే "జీవితం అనేది "ప" గుణింతం. పుట్టుక అనే 'పు'తో మొదలు అయ్యి పాడె అనే 'పా'తో ముగుస్తుంది". ఇంకా విడమర్చి చెప్పాలంటే కడుపులో పిండంతో మొదలుపెట్టి తద్దినపు పిండంతో అయిపోతుంది(కాస్త నాటుగా అనిపించినా, ఇది కాదనలేని సత్యం).      

ఈ మధ్య స్నేహితులు, చుట్టాలు అంతా పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. అంత వరకు బాగానే ఉంది. కానీ కొంత మంది వెటకారంగా, " నీకేమి రా? మాటలతో అమ్మాయిలని పడేస్తావ్! ఎంత మంది అమ్మాయిలని దారిలో పెట్టావ్?" అని ఏడిపించుకు తింటున్నారు. నేను అన్ని చదువు చదువుకోలేదు, అని చెప్పినా వినటంలేదు. నేనేదో ఇక్కడ అమ్మాయిలని పడేసే వ్యాపరం పెట్టినట్టు హింసిస్తున్నారు. నేను ఎంత తిన్నా లావు రాను, వాళ్ళకు ఎంత చెప్పినా సిగ్గు రాదు అని వదిలేశా!!   మా మల్లి మామ కుడా "నీకేమి రా నాగచైతన్య అంత అందంగా ఉంటావు" అంటాడు. మా సుబ్బన్న చెప్పినట్టు, యవ్వనం పవర్ ప్లేలో ఉనప్పుడు పంది కుడా అందంగా ఉంటుంది. ఆఖరికి మా నాన్న కూడా, నేను పెద్ద జేఫ్ఫాని అని నిశ్చయించుకునట్టున్నాడు. అందుకే ఈ మధ్య పదే పదే చెప్తున్నాడు, "నాకు చెప్పి పెళ్లి చేసుకోవద్దురా! నేను చెప్పినప్పుడు, చెప్పిన అమ్మాయిని చేసుకో!" అని.  

మన ముఖ్యమంత్రి గారి మాటలయినా అప్పుడప్పుడు అర్ధం అవుతాయేమో కానీ, అమ్మాయిలు ఎవరిని ఇష్టపడతారో మాత్రం తల నేలకేసి బాదుకున్న అర్ధం కాదు. ఒకడు అంటాడు, బాగా ఎత్తున్న అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇష్టం అని. ఆరడుగులున్న వాడిని అడిగితె, అమ్మాయిలకి తెల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం అని. సరే తెల్లగా ఉన్నోడిని అడిగితె, అమ్మాయిలు బాగా జుట్టు ఉన్నవాడిని ఇష్టపడతారు అని. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడిని అడిగితే, వాడు కూడా ఇంకేదో కారణం చెప్తున్నాడు. సరే, ఈ విషయం మీద కూలంకుషంగా, ఇంకో శీర్షికలో ఖండించుకుందాం. అంతవరకూ ఆశీస్సులు..