ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో "రావికాము" అని నా స్నేహితుడు ఒకడు ఉండే వాడు. స్నేహితుడు అనటం కన్నా తోటి విద్యార్ది అంటే బాగుంటుంది. మంచి తెలివిగల్లవాడు. దిక్కుమాలిన తెలివితేటలు వాడి సొంతం. పుస్తకాలతో తప్ప మనుషులతో పెద్దగా మాట్లాడాడు. ఒక వేళ ఎవరితోనైనా మాట్లాడాడు అంటే, అది ఖచ్చితంగా చదువుకి సంభందించిన విషయమే అయ్యి ఉంటుంది.
మాకు పాఠం చెప్పే వారందిరికీ వీడంటే ప్రాణం. వాడికేదైనా జ్వరం వచ్చి బడికి రాకపోతే ఆ రోజు పాఠం చెప్పటం ఆపేశేవారు. అందరూ వాడిని మరో అబ్దుల్ కలాం అనుకునేవారు! ఇలా పగలనకా రాత్రనకా చదివితే మార్కులు రాక మాయరోగం వస్తుందా? మొదటి సంవత్సరం పరీక్షలలో, అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి.
రెండవ సంవత్సరంలో అందరూ కొత్తగా మొదటి సంవత్సరం చేరిన పిల్లల్ని పరిచయం చేసుకొని ఆట పట్టిస్తూ ర్యాగింగ్ చేస్తుంటే, వీడు మాత్రం, వాళ్ళకు చదువులో వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తుండేవాడు. అందరూ సినిమాలు చూస్తుంటే, వీడు సి/సి++ చూసేవాడు . అందరూ వచ్చే పోయే అమ్మాయిలను చూస్తుంటే వీడు అర్థమాటిక్స్ చూసేవాడు. అందరూ స్వాతి, సాక్షి చదువుతుంటే, వీడు శాటిలైట్ గురించి చదివేవాడు, అందరూ పేకాట ఆడుతుంటే వీడు పేపర్ ప్రశెంటేషన్ చేస్తుండేవాడు. చదువు జీవితంలో ఒక భాగమే తప్ప చదువే జీవితం కాదురా అని వాడికి ఎన్ని సార్లు చెప్పినా వాడు మారలేదు.
ఇక మూడో సంవత్సరం వచ్చేసరికి వీడిలో కొంచం మార్పు వచ్చింది. తనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలని, ఒక నలుగురు అమ్మాయిలని ఎంచుకొని వాళ్ళకే పంచటం (జ్ఞానం) మొదలు పెట్టాడు. పొద్దస్తమానం వాళ్ళతోనే మాట్లాడటం, జ్ఞానాన్ని పంచటంతో, తనకి జన జీవన స్రవంతిలో ఉన్న ఆ కొద్ది అనుభందం కుడా తెగిపోయింది.
ఇలా నాలుగు సంవత్సరాలు చదివినందుకు బంగారు పతకం రాక పోయినప్పటికినీ, బంగారు బాతు లాంటి ఒక కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. మొన్నా మధ్యన ఎవరో స్నేహితుడు చెప్పాడు, "రావికాము హైదరబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు రా, వీలు అయితే కలువు" అని. పోనిలే ఎంతైనా నాలుగేళ్ళు కలిసి చదివాము కదా అని దూరవాణి పరికరంతో పలకరించా, కాని అటు నుంచి సరిగ్గా సమాధానం రాలేదు. నేనేదో వాడి దయా దాక్షణ్యాల మీద బ్రతుకుతున్నట్టు మాట్లాడాడు. నాకు వేలకువేలు అప్పు ఇచ్చిన గుప్తాగారు కుడా నాతో ఎప్పుడు అలా మాట్లాడలేదు.
మొన్నామధ్య ఇంజనీరింగ్ స్నేహితులందరం మరలా ఒకసారి కలుద్దాం అనుకుని, జయప్రకాష్ అనే స్నేహితుడు రావికాముకి ఫోను చేసి, అందరం కలుద్దాం అంటే, నాకు అంత సమయంలేదు. పూనే-హైదరాబాద్ తిరుగుతూ ఉంటాను కుదరదు అని అన్నాడు. ఎంత జీతం వస్తుంది రా అని అడిగితే, తెలుగు చిత్రాల కధానాయికని వయస్సు అడిగినట్టు మాట దాటేశాడే తప్ప విషయం చెప్పలేదు. బహుశా అప్పు అడుగుతామేమో అని భయపడుంటాడు., ఎదవ!! "సరే రా, ఏ రోజు కలుద్దామో ఫోను చేస్తాం, వీలయితే కలువు" అని జయప్రకాష్ అన్నదానికి, " కాళీగా ఉంటేనే ఫోనులో మాట్లాడతాను, లేదంటే లేదు" అని చెప్పాడట. వీడిని బతిమిలాడే బదులు, బాలయ్య బాబుని బతిమిలాడితే, మనకు సినిమా కోసం డేట్స్ ఇస్తాడేమో.
ఈ శీర్షికని వేదికగా చేసుకుని నేను చెప్పొచ్చేది ఏంటంటే? "ఒరేయ్ రావికాము, కనీసం ఈ శీర్షిక చదివిన తర్వాత అయినా జన జీవన స్రవంతిలో కలువురా!! మన స్నేహితులందరికీ నిన్ను క్షమించేంత గొప్ప మనస్సు ఉంది. నీ రాక కోసం ఎదురు చూస్తూ....."
ఇట్లు,
నీ స్నేహితులు కావాలనుకుంటున్న ఒకప్పటి నీ తోటి విద్యార్దులు,