Wednesday, February 22, 2012

పరుగే బంగారమాయనా

అమెరికాలో డాక్టర్ చదవాల్సిన నా స్నేహితుడు, అద్దంకిలో ఉదయాన్నే ఆదుర్దాగా ఐదు గంటలకే లేచి, అటు ఇటు పరిగెట్టటం మొదలెట్టాడు. సూర్య భగవానుడు నడినెత్తి మీదకి వస్తేకానీ లేవని, ఆ మహాత్ముడిని పరగడపున చూసేసరికి, ఒక్కింత ఆశ్చర్యమేసింది. ఇంతకీ వీడు ఎందుకు పరిగెడుతున్నాడు? ప్రకృతి ఏమైనా పిలుస్తుందా అనుకుంటే, ఆ సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిని ఇంట్లోనే అఘోరిస్తాడు, తప్పించి ఇలా బజారున పడడు. అయితే వీడిని పిలుస్తుంది ప్రకృతి కాక మరేమిటి?

నాలో ఆతృత మొదలయ్యి, వాడిని చాటుగా వెంబడించటం మొదలుపెట్టా. శివాలయం వైపు వడివడిగా వెళ్ళటం మొదలు పెట్టాడు. రాత్రులు దయ్యాల చిత్రాలు చూసి, భయపడి భక్తి పెరిగిందేమో, శివాలయం దారి పట్టాడు అనుకుంటే, మనోడికి స్నానం చేసే అలవాటు కాదు సరి కదా, పన్నెండు కొడితే కాని పళ్ళు అయినా తోమడు. అలాంటప్పుడు గుళ్ళోకి వెళ్ళటానికి శాస్త్రాలు ఒప్పుకోవు కదా అనుకోనేలోపే రామాలయం దాటేసాడు. హమ్మయ  దేవుడికి ఏమి కాలేదు అని ఊపిరి పీల్చుకున్నాను. పైన శివాలయం వైపుకి వెళ్ళాడు అని చెప్పి, కింద రామాలయం దాటాడు అని రాశాను. ఇది ఎంత మంది గమనించారో???

సరే శివాలయం దాటి, నేరుగా గుండ్లకమ్మ నది వైపు వాడి ఓదార్పు యాత్రను మరల్చాడు. చేసేది సంవత్సరానికి ఒకసారి, కాస్త బాగా చేయాలి, అందుచేత నదిలోకి వెళ్తున్నాడేమో అనుకోవటానికి లేదండోయ్. నదిలో కాళ్ళు కడుక్కోవటానికే నీళ్ళు లేవు. వీడు పుట్టాక మా ఊర్లో వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలా ఆలోచించే లోపు, గాంధి బొమ్మ ప్రక్క వీదిలోకి తిరిగాడు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం.

ఆ వీదిలోకి మాములుగా అయితే చచ్చినా వెళ్ళేవాడు కాదు. ఆ వీదిలో మనోడి అత్తగారిల్లు ఉంది. ఈ డాక్టరు గారిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ అత్తకి పిచ్చి. వీడి మరదలకి వీడంటే పిచ్చి. వీడికి ఆ విషయం గుర్తొస్తే పెరుగుతుంది పిచ్చి. పాపం అత్త కూతురికి అందం తప్ప అన్నీ ఎక్కువే. అత్త కంట పడకుండా , దూకుడులో మహేష్ పరిగెత్తినట్టు పరిగెత్తాడు. వాడితో పాటు నేను కుడా నా వేగాన్ని పెంచాను.

ఆ దారిన పరిగెడుతూ పరిగెడుతూ 'దడ' చిత్రం ప్రదర్శిస్తున్న చిత్రాలయం కనిపించటంతో దడ పుట్టి కుడి ప్రక్క సందులోకి తిరిగాడు. దడ చిత్రం చూసిన ప్రభావం, ఆ దరిదాపులకు వెళ్ళాలన్నా భయమాయే. ఆ ముందుకు వెళ్తే వంద సంవత్సరాలనాటి బావి ఒకటి ఉంది. నిన్న సాయంత్రమే నా బ్లాగు చదువుతాను అని చెప్పాడు. కొంపతీసి అది చదివి, జీవితం మీద విరక్తి పుట్టి బావిలో దూకి చస్తాడేమో అనుకున్నా. కానీ వీడు చంపే రకం కానీ చచ్చే రకం కాదు. అందుకే వీడిని మా ఊరి మెహర్ రమేష్ అంటారు. కాకపోతే వారు చిత్రాలతో చంపితే వీరు చేష్టలతో చంపుతారు. 

ఇలా వీదుల వెంట పరిగెట్టే బదులు ఏ గుడిలోనో ప్రదక్షణం చేస్తే కనీసం పుణ్యం అయినా దక్కేది. "నిప్పు త్రొక్కిన  కుక్కలా ఎంత సేపు పరిగెడతావురా, నాకు కూడా కాళ్లు నొప్పులు పుడుతున్నాయి" అని అనుకుంటుండగా ఊరి పొలిమేర దాటబోతున్నాడు. కొంపతీసి సమాజం మీద ద్వేషం పుట్టి, అది కసిగా మారి, అఘోరాలతో మమేకం అవ్వటానికి, స్మశానాన్ని వేదికగా చేసుకున్నాడా అనుకునే లోపు, ఎందుకో బుద్ధి మార్చుకొని తిరిగి ఊరి మీద పడ్డాడు.

ఓపిక నశించి, పరిగెత్తుకుంటూ వాడి దగ్గరకు పోయి, "ఏమైందిరా, ఈ పరుగుకి ఏ ప్రారబ్ధం కారణం?" అని అడిగాను. విషయం ఏంటంటే., సుశీల.., ఆ పాప అంటే మనోడికి ప్రాణం. పది పన్నెండు సంవత్సరాల ప్రేమ. మొన్న పనికిమాలిన పద్నాలుగో తారీఖు నాడు., చివరికి తన ప్రేమను వ్యక్తం చేశాడు. డాక్టర్ల చేతిరాతే కాదు శరీరతీరు కుడా అందంగా ఉండదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. తినటం చదవటం తప్ప ఇంకొకటి తెలియకపోవటం చేత మనోడికి బాన పొట్ట ఏర్పడింది. నుంచుంటే వాడి కాళ్లు వాడు చూసుకొని పది సంవత్సరాలు అయ్యింది. ఆ కారణం చేత ఆ అమ్మాయి కాదన్నది. ఎలాగైనా సరే వాడి కాళ్ళ మీద వాడు నిలబడి, అలా నుంచొని వాడి కాళ్లని తనివి తీరా చూసుకోవాలని వాడి ఆశట!! ఆరు పలకల దేహం రాకపోయినా అందమైన రూపు రావాలని వాడి ప్రయత్నం. చూడాలి ఏమి జరుగుతుందో.  

4 comments:

  1. paniki maalina padnalugo thareeku entra babu... hahahahaahaaa....

    "Aaa ammaiki andam thappa anni ekkuve.." :D.. Anni ante?? :P

    --Jayanth

    P.S - Nenu okappudu ilaage parigethanu.. chivariki telsindi entante parigethithe aayasam tarvata aakali followed by potta tappa inkemi raadu!

    ReplyDelete
    Replies
    1. అందం తప్ప మిగితావన్నీ అంటే., చదువు, డబ్బు ఇలాగనమాట. నువ్వు కుడా పరిగెత్తాను అంటున్నావు, ఎవరి కొసం పరిగెత్తావేంటి?

      Delete
    2. Potta ki gandi kodadamani parigetha! ;)

      Delete
    3. అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిని ఇంట్లో అఘోరించవా ఏంటి? పచ్చని పొలాలని పాడు చేయటానికే పుట్టావు నువ్వు.,

      Delete